క్రైమ్/లీగల్

కాకినాడ సీపోర్టులో.. కుప్పకూలిన రెండు భారీ క్రేన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ సిటీ, డిసెంబర్ 29: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సీపోర్టులో శనివారం ఉదయం రెండు భారీ క్రేన్లు కుప్పలకూలిన ఘటనలో ఒక కార్మికుడు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం శనివారం ఉదయం కార్మికులు విధుల్లో ఉండగా చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో పోర్టులో విధి నిర్వహణలో ఉన్న కొందరు కార్మికులు క్రేన్లు కుప్పకూలుతుండగా వీడియో చిత్రీకరించి ఆ వివరాలను మీడియోకు విడుదల చేశారు. దీంతో ప్రమాద విషయం వెలుగులోకి వచ్చింది. సీపోర్టులో ఓ భారీ క్రేన్ రిపేర్లకు గురికావడంతో నిపుణులు ఆ క్రేనుకు రిపేర్లు చేస్తున్నారు. అదే సమయంలో పోర్టులో కార్మికులు ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉన్నారు. అయితే రిపేర్లు నిర్వహిస్తున్న క్రేను ఒక్కసారిగా కుప్పకూలి దాని పక్కనే ఉన్న క్రేన్‌పై పడింది. దీంతో రెండు క్రేన్లు ఒక్కసారిగా కూలిపోయాయి. ఆ సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న కార్మికులు ప్రాణాలను రక్షించుకునేందుకు పరుగులు తీశారు. కొద్దిసేపటి అనంతరం కార్మికులు కుప్పకూలిన అక్కడకు చేరుకుని పరిశీలించగా క్రేన్ల శిధిలాల కింద పడి వట్టిపల్లి లక్ష్మణకుమార్ (35) అనే కార్మికుడు మృతిచెంది ఉండటాన్ని గుర్తించారు. మరికొందరు గాయాలతో ఉండటాన్ని గుర్తించి వారిని అంబులెన్స్‌లో హుటాహుటిన కాకినాడ రూరల్ పరిధిలో ఉన్న కార్పొరేట్ అసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుడు పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన వ్యక్తి అని తెలిసింది. ప్రమాదం జరిగిన విషయం వెలుగులోకి రాగా మీడియా ప్రతినిధులు సీపోర్టుకు చేరుకుని పోర్టులోకి అనుమతించాలని సీపోర్టు అధికారులను కోరినా వారు అనుమతించలేదు. పోర్టులో పెను ప్రమాదం చోటుచేసుకున్నప్పటికీ సీపోర్టు యాజమాన్యం ప్రమాద విషయాన్ని స్థానిక పోలీసులకు సైతం తెలియజేయకపోవడంతో విమర్శలకు తావిచ్చింది. మధ్యాహ్నం రెండు గంటల అనంతరం మీడియా ప్రతినిధులను లోనికి అనమతించారు.
కాకినాడ పోర్టు సీఐ బి రాజశేఖర్ ప్రమాద విషయం తెలుసుకుని సీపోర్టుకు చేరుకున్నారు. బాధితుల్లో ఒకరు ఐసీయూలో చికిత్స పొందుతుండగా మరో ఇద్దరు బాధితులకు చికిత్స అందజేస్తున్నారు. మిగిలిన ఏడుగురికి వైద్యులు ప్రాథమిక చికిత్స అందజేశారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ఈ ప్రమాదంపై పోర్టు సీఐ రాజశేఖర్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
మృతునికి రూ. 15 లక్షలు నష్టపరిహారం
కాగా ప్రమాదం కారణంగా మృతిచెందిన కార్మికునికి 15 లక్షల రూపాయలు నష్టపరిహారంగా అందజేస్తున్నట్టు కెఎస్‌పిఎల్ ఛైర్మన్ కెవి రావు తెలిపారు. గాయపడిన పదిమందికి రెండు లక్షల రూపాయలు వంతున అందజేయడంతోపాటు, ఉచితంగా చికిత్స అందిస్తామన్నారు. అంతే కాకుండా వారు తిరిగి విధుల్లోకి చేరే వరకు వేతనాన్ని చెల్లిస్తామని ప్రకటించారు. ఈ సంఘటనపై విచారణ జరిపించనున్నట్టు ఆయన తెలిపారు.
చిత్రం..కుప్పకూలిన క్రేన్ల శిధిలాలు (ఇన్‌సెట్‌లో) ప్రమాదంలో మృతి చెందిన లక్ష్మణ కుమార్