క్రైమ్/లీగల్

కోడికత్తి కేసు నిందితుడికి 25 వరకు రిమాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జనవరి 11: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసు విచారణ విజయవాడకు చేరింది. అనేక పరిణామాల అనంతరం కేసు రాష్ట్ర పోలీసుల నుంచి జాతీయ దర్యాప్తు సంస్ధ (ఎన్‌ఐఏ) చేతుల్లోకి వెళ్లాక అధికారులు విచారణ ముమ్మరం చేశారు. దీనిలో భాగంగా ఈ కేసులోని నిందితుడు జనపల్లి శ్రీనివాసరావును ఎన్‌ఐఏ అధికారులు విశాఖపట్నం నుంచి తీసుకువచ్చి శుక్రవారం విజయవాడలోని ప్రత్యేక కోర్టు మెట్రోపాలిన్ సెషన్స్ జడ్జి న్యాయస్ధానంలో హాజరుపరిచారు. విశాఖ ఎయిర్‌పోర్టు లాంజ్‌లో జగన్‌పై కోడి కత్తి దాడి అనంతరం ఈ కేసులో నిందితునిగా శ్రీనివాసరావును స్ధానిక పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కేసు
దర్యాప్తు ఎన్‌ఐఏ చేతిలోకి వెళ్లిన క్రమంలో అధికారుల విఙ్ఞప్తి మేరకు కేసు పత్రాలు విశాఖ కోర్టు నుంచి విజయవాడలోని ఎన్‌ఐఏ కోర్టుకు బదిలీ అయ్యాయి. మరోవైపు విశాఖ జైలులో ఉన్న శ్రీనివాసరావు రిమాండు గడువు కూడా ముగియడంతో కేసు దర్యాప్తుకు సంబంధించి న్యాయపరమైన చర్యలు పూర్తి చేసిన ఎన్‌ఐఏ అధికారులు నిందితుడు శ్రీనివాసరావును విశాఖ నుంచి తీసుకువచ్చి మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టు ఇన్‌ఛార్జి ఫ్యామిలీ కోర్టులో హాజరుపరిచారు. దీంతో ఈనెల 25వ తేదీ వరకు రిమాండు గడువు పొడిగిస్తూ న్యాయమూర్తి ఆదేశించారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ కోర్టుకు తీసుకువచ్చిన అధికారులు కోర్టు ఆదేశాలతో నగరంలోని జిల్లా జైలుకు తరలించారు. నిందితుడు శ్రీనివాసరావుకు జిల్లా జైలులో ప్రత్యేక బ్యారక్ కేటాయించారు.
కాగా కేసులో పూర్తి సమాచారాన్ని రాబట్టేందుకు నిందితుడిని విచారించాల్సి ఉన్నందున తమ కస్టడీకి ఇవ్వాలంటూ ఎన్‌ఐఏ అధికారులు కోర్టును కోరారు. ఎన్‌ఐఏ తరఫు న్యాయవాది కోర్టులో ఈమేరకు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు వినిపించేందుకు నిందితుడు శ్రీనివాసరావు తరుఫు న్యాయవాది కోర్టుకు హాజరుకాలేదు. అయితే ఎన్‌ఐఏ దాఖలు చేసిన పిటిషన్‌పై జరిగిన విచారణలో నిందితుడు శ్రీనివాసరావు ఎన్‌ఐఏ అధికారుల కస్టడీకి అంగీకారం తెలిపాడు. తాను విచారణకు సహకరిస్తానని న్యాయమూర్తికి తెలియచేశాడు. దీంతో ఎన్‌ఐఏ విఙ్ఞప్తితో వారం రోజులపాటు కస్టడీకి అనుమతి ఇస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో శ్రీనివాసరావును శనివారం ఉదయం 10 గంటలకు విజయవాడ జిల్లా జైలు నుంచి తమ కస్టడీకి తీసుకోనున్నారు. అనంతరం అతన్ని ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించిన మీదట తమ విచారణకు తరలించనున్నారు.