క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గూడూరు, జనవరి 18 : జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టామని, అందులో భాగంగానే డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ప్రణాళికలు సిద్ధం చేశామని జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం సూళ్లూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్ ఏర్పాట్లు పరిశీలించడానికి వెళుతూ మండల కేంద్రమైన చిల్లకూరు పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో జాతీయరహదారిపై గుర్తుతెలియని వాహనాల కారణంగా రోడ్డుప్రమాదాలు అధికమవుతున్నట్లు తమశాఖ గుర్తించిందన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం కావలి నుంచి తడ వరకు నిఘా నేత్రాలను (సీసీ కెమెరాలు) ఏర్పాటు చేస్తున్నామన్నారు. వీటి ద్వారా రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. మరీ ముఖ్యంగా జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల నివారణకు మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై చర్యలకు ప్రణాళికలు సిద్ధం చేశామని, అందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా ప్రతి రోజూ ప్రతి పోలీస్‌స్టేషన్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేస్తున్న సందర్భంగా రోడ్డు ప్రమాదాలు చాలావరకు తగ్గినట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో ప్రత్యేక పరికరాలను ఉపయోగిస్తూ ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా తమ సిబ్బంది కేసులు నమోదు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల కారణంగా జాతీయరహదారిపై రోడ్డు ప్రమాదాలు 80శాతం మేరకు తగ్గినట్లుగా ఆయన వివరించారు. అలాగే నెల్లూరు జిల్లాను నేరరహిత జిల్లాగా మార్చడానికి, నేరాలు తగ్గుదలకు ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామన్నారు. ఆయా ప్రాంతాల్లో రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామన్నారు. తమ సిబ్బంది రాబోయేది ఎన్నికల సమయం కాబట్టి జిల్లా వ్యాప్తంగా పనితనాన్ని మెరుపరుచుకునే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. సూళ్లూరుపేటలో నిర్వహించబోయే ఫ్లెమింగో ఫెస్టివల్‌కు తమశాఖ సిబ్బంది భారీ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మరీ ముఖ్యంగా జిల్లాలో నేరాలు తగ్గేందుకు తమ శాఖ సిబ్బంది ఎనలేని కృషి చేస్తున్నట్లు తెలిపారు. చిల్లకూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో రికార్డులు, పోలీస్‌స్టేషన్ ఆవరణ పరిశీలించామని, గూడూరు డివిజన్‌లో పోలీసు అధికారులు, సీఐలు, చిల్లకూరు ఎస్సై పనితీరు మెరుగ్గా ఉందన్నారు. తమ శాఖ సిబ్బంది కష్టపడి పనిచేస్తే మెరుగైన ఫలితాలు సాధిస్తామని ఎస్పీ తెలిపారు. ఎస్పీ వెంట గూడూరు ఇన్‌చార్జి డీఎస్పీ బాలసుందరం, గూడూరు రూరల్ సీఐ వంశీధర్, చిల్లకూరు ఎస్సై శ్రీనివాసరావు ఉన్నారు.

ఫ్లెమింగో ఫెస్టివల్ పనులు అడ్డుకున్న మత్స్యకారులు
తడ, జనవరి 18 : తడ మండలం భీములవారిపాళెం పడవల రేవు వద్ద ఫ్లెమింగో ఫెస్టివల్ పనులను మత్స్యకారులు అడ్డుకున్నారు. ఈ నెల 20, 21, 22 తేదీలలో ఫ్లెమింగో ఫెస్టివల్ జరగనుంది. ఈ నేపథ్యంలో భీములవారిపాళెం పడవల రేవు వద్ద ప్రతి ఏటా బోటు షికారు ఏర్పాటు చేసేవారు. ఈ నేపథ్యంలో బోటు షికారు కోసం ప్రభుత్వ అధికారులు షామియానాలు వేసేందుకు వాహనం ద్వారా రాగా ఆ లారీని మత్స్యకారులు అడ్డగించారు. తమకు గత ఏడాది రావాల్సిన బకాయిలు చెల్లిస్తే గాని ఫ్లెమింగో ఫెస్టివల్ పనులు జరగనివ్వమని లారీని వెనుతిరిగేలా చేశారు. దీంతో ప్రభుత్వాధికారులు మత్స్యకారులతో వారికి రావాల్సిన బకాయిలను శుక్రవారం సూళ్లూరుపేటలో అందచేస్తామని నచ్చచెప్పినట్లు సమాచారం. నాయుడుపేట మున్సిపల్ సిబ్బంది ద్వారా పడవల రేవుకు వెళ్లే మార్గంలో రోడ్డుకు ఇరువైపులా చెట్లు నరకడంతో పాటు రోడ్డు మరమ్మతు పనులు చేపట్టారు. దీంతో గ్రామస్థులు ఆ పనులు అడ్డుకునేందుకు వెళ్లగా ఎంతో దూరం నుంచి వచ్చిన కార్మికులను ఎందుకు అడ్డుకోవాలని నచ్చచెప్పడంతో నాయుడుపేట మున్సిపల్ కార్మికుల చేత చెట్లు నరికే కార్యక్రమం చేపట్టారు.

నిత్య పెళ్లికొడుకు అరెస్ట్
నెల్లూరు కలెక్టరేట్, జనవరి 18: ప్రేమ పేరుతో యువతులను మోసగిస్తూ మోజు తీరాక వారిని వంచనకు గురి చేస్తున్న ఘరానా మోసగాడిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. జిల్లా కేంద్రం నెల్లూరులోని బాలాజీనగర్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నగర డిఎస్‌పి ఎన్‌బిఎం మురళీకృష్ణ కేసు వివరాలు వెల్లడించారు. జిల్లాలోని ఇందుకూరుపేట మండలం రావూరుకు చెందిన తాటిచెట్ల వాసు గతంలో సీసీ కెమెరాలు అమర్చే పని చేసేవాడన్నారు. వ్యవసనాలకు బానిసై యువతులను మోసగిస్తూ వారి నుంచి సులభంగా నగదు పొందేవాడన్నారు. ఈ క్రమంలో వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారించగా పలు నేరాలకు పాల్పడినట్లు తెలిసిందన్నారు. గతంలోనే జిల్లాలోని సైదాపురం మండలంలో ఇతనిపై డెకాయిట్ కేసు నమోదై ఉందన్నారు. పెళ్లి పేరుతో వరంగల్‌కు జిల్లా కె సముద్రం ప్రాంతానికి చెందిన గీతారాణిని నిందితుని సొంత ప్రాంతంలోని గంగమ్మ గుడిలో వివాహం చేసుకున్నాడన్నారు. మోజు తీరాక సదరు మహిళను హింసకు గురి చేయటంతో ఆ యువతి కె సముద్రంలో ఫిర్యాదు చేసిందన్నారు. ఆ కేసు దర్యాప్తు కొనసాగుతుండగానే జిల్లాలోని ఇందుకూరుపేటకు చెందిన మరో మహిళతో సహజీవనం కొనసాగించాడన్నారు. అనంతరం నగరంలోని ఇంకో మహిళను వాట్సాప్, ఫేస్‌బుక్ ద్వారా ట్రాప్‌లోకి లాగాడన్నారు. ఆమెతో ప్రేమ నటిస్తూ రూ.12 లక్షల వరకు నగదు తీసుకుని మోసం చేశాడన్నారు. ఇతనిపై వరంగల్ జిల్లాలోని సముద్రం పోలీసుస్టేషన్‌తో పాటు జిల్లాలోని సైదాపురం, చిన్నబజారు, బాలాజీనగర్‌లలో కేసులు నమోదయ్యాయన్నారు. ఇలాంటి ఘరానా మోసగాళ్ల పట్ల యువతులు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ సూచించారు. సమావేశంలో సిఐ, ఎస్‌ఐ పోలీసులు తదితరులు పాల్గొన్నారు.

మంచుదుప్పట్లో బస్సు బోల్తా
ఆత్మకూరు రూరల్, జనవరి 18 : పొగ మంచు కారణంగా లారీని తప్పించబోయి పంట పొలాల్లోకి బస్సు దూసుకెళ్లిన సంఘటన ఆత్మకూరు మండలం వాశిలి జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుఝామున చోటుచేసుకుంది. 43 మందితో నంద్యాల డిపో బస్సు నెల్లూరు వెళ్తుండగా మార్గం మధ్యలో పొగ మంచు కారణంగా లారీని తప్పించబోయి పొలాల్లోకి బస్సు దూసుకెళ్లి బోల్తాకొట్టింది. దీంతో బస్సులోని 13 మందికి గాయాలు కాగా సమీపంలోని సంగం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలు కాగా నెల్లూరుకు తరలించారు. ఈ ఘటనలో డ్రైవర్ చాకచక్యంగా పక్కకు తప్పించడంతో ఎవరికీ ప్రాణాపాయం లేదు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ నరేష్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు.