క్రైమ్/లీగల్

ఉద్యోగాల పేరుతో మోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ (గచ్చిబౌలి), జనవరి 25: భారత్‌తో పాటు గల్ఫ్ దేశాల్లోని ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలిప్పిస్తామని నిరుద్యోగులను నట్టేట ముంచేసిందో సంస్థ. ఏకంగా నకిలీ ఇంటర్వ్యూల జరిపి అందినంత దండుకున్నారు. స్వదేశంలోనే కాదు, అరబ్ దేశాల యువకులూ మోసపోయారు. లక్షా నాలుగు వేల మంది నిరుద్యోగుల నుంచి 74 కోట్ల రూపాయలు వసూలు చేసిన నకిలీ జాబ్ ఫ్రాడ్ సంస్థకు చెందిన 14 మందిని పోలీసులు అరెస్టు చేశారు. సంస్థ సీఈఓతో కలిపి 14 మందిని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేయడంతో పాటు సంస్థ ఖాతాలలో ఉన్న రూ. 23లక్షలు సీజ్ చేసినట్లు పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు.
గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్ శనివారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో సీపీ నిందితుల వివరాలను వెల్లడించారు. అజయ్ కోల్లా అనే వ్యక్తి ఎంటెక్ చదివి 2010లో విజ్‌డమ్ ఐటీ సర్విసెస్ ఇండియా ప్రయివేటు లిమిటెడ్, విజ్‌డమ్‌గల్ఫ్ జాబ్ పేరుతో ఏర్పాటుచేశారు. ఆర్‌ఓసీ అనుమతి తీసుకుని మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలో కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. సయ్యద్ మజిహర్ (ట్రెనింగ్ లీడర్), రోహిత్- గల్ఫ్ ఆపరేషన్ హెడ్‌గా, బస్వరాజ్, గోపీనాథ్, రాజేష్, శుభమ్ కుమార్ సింగ్, సామ్రాట్ పాందుగులను గల్ఫ్ హెచ్‌ఆర్ మేనేజర్లుగా, నికిత జైన్, మధురీ వేపూరి కన్యూమర్‌సేల్స్ డివిజన్ గల్ఫ్ హెడ్‌లుగా, కార్తీక్, శామికాంత్ కన్జూమర్ సెల్స్ ఇండియా హెడ్‌లుగా, రవి కిరణ్ ఆపరేషన్ ఇండియా హెడ్, శ్రీకాంత్ టీమ్ లీడర్లుగా ఏర్పాటు చేసుకున్నారు. వీరితోపాటు 240 మంది టెలికాలర్‌లను ఏర్పాటు చేసుకుని రోజూ నిరుద్యోగులకు ఫోన్లు చేయించి మోసాలకు పాల్పడుతున్నారు. 2010 నుండి చాలారోజులు అయ్యప్ప సొసైటీలో సంస్థను నడిపారు. గత రెండు సంవత్సరాల క్రితం సైబర్ టవర్ 7వ అంతస్తుకు కంపెనీని మార్చినట్లు సీపీ వెల్లడించారు.
ఇండియాకు, గల్ఫ్‌కు ప్రత్యేక కన్యూమర్ టీమ్‌లను ఏర్పాటుచేసి వారికి విదేశీయుల తరహాలో ఆంగ్లంలో మాట్లాడే విధంగా తర్ఫీదు ఇచ్చినట్లు తెలిపారు. ఇండియాలో 3లక్షల 59 వేలు, గల్ఫ్‌లో లక్షా 74 వేలు ఉద్యోగాలున్నట్లు వెబ్ సైట్‌లో పెట్టడం వలన 2కోట్ల 85 లక్షల మంది నిరుద్యోగులు కంపెనీ వెబ్ సైట్‌లో తమ పేర్లను నమోదు చేసుకున్నారని వివరించారు. ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో సంస్థకు సంబంధించిన దరఖాస్తులో పొందుపరచిన వివరాలు ఇచ్చిన ఫోన్ నెంబర్లతో పాటు చదువు, ఆభ్యర్థి స్కిల్స్ ఆధారంగా టెలికాలర్లతో ఫోన్‌లు చేయించి మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. 40 రకాల ఉద్యోగాలకు సంబంధించిన స్కిల్స్ తెలిసిన నిపుణులు తమ వద్ద ఉన్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు. సేకరించిన డేటాను ఇతరులకు విక్రయించడం వలన మోసాలు కూడా జరుగుతున్నాయని వివరించారు. సదరు సంస్థ చాలామంది నిరుద్యోగులను మోసం చేసిందని అనేకమంది వెబ్ సైట్‌లో పోస్టులు పెట్టారని వివరించారు.
ఇండియాలో రోజుకి 20వేలు, గల్ఫ్‌లో 3వేల మంది సదరు సంస్థ వెబ్‌సైట్‌లో తమ పేర్లను నమోదు చేసుకున్నారని అందులో రెండు వేల మందిని ఎంపిక చేసుకుని టెలికాలర్ల ద్వారా ఫోన్‌లు చేయించి మోసం చేస్తున్నట్టు వెల్లడించారు. రేజ్యూమ్ బాగుందని, తప్పక ఉద్యోగం వస్తుందని గల్ఫ్ దేశాల్లో అవకాశాలు చాలా ఉన్నాయని నమ్మిస్తారు. అనంతరం పలు కంపెనీలు మీపై ఆసక్తి చూపుతున్నాయని, అయితే రెజ్యూమ్ మార్చాలి కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుందని అంటారు. ప్రపంచ వ్యాప్తంగా 25 యూఏఈ దేశాల్లో ఉద్యోగాలిప్పిస్తామని నమ్మించేవారని తెలిపారు. విదేశీయులైతే 150 నుండి 1500 యూఎస్ డాలర్లు, ఇండియన్స్ నుండి రెండు వేల నుండి లక్ష రూపాయల వరకు వసూలు చేస్తున్నట్లు సీపీ వెల్లడించారు. అభ్యర్ధిని నమ్మించేందుకు ఫేక్ హెచ్‌ఆర్‌లతో ఇంటర్వ్యూలు చేయడం, నకిలీ జాయినింగ్ ఆదేశాలు ఇచ్చేవారని సీపీ చెప్పారు. రావన్ జనరల్ పెట్రోలియం పేరుతో ఇంటర్వ్యూలు చేసి మోసాలకు పాల్పడ్డారని అన్నారు. నిరుద్యోగుల నుండి రావల్సిన డబ్బు పొందిన తరువాత ఫోన్ లేపకపోవడం, సమాధానం చెప్పకపోవడంతో పాటు నిత్యం ఎంగేజ్ వచ్చేవిధంగా చేసేవారని తెలిపారు. వెబ్‌సైట్‌లో పేరు నమోదు చేసుకున్నవారికి ఎవరికీ ఉద్యోగాలు రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించారని చెప్పారు. మొదట ఏడుకొండలు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేసినట్లు సీపీ తెలిపారు. సంస్థకు చెందిన బ్యాంకు ఖాతాలో ఉన్న 23లక్షల రూపాయలను ఫీజ్ చేసినట్లు సీపీ చెప్పారు. నిందితులపై 420, 66 ఐటీ ఐ యాక్ట్ కేసులు నమోదు చేసినట్లు సీపీ సజ్జనార్ వివరించారు. కేసు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేసిన సైబర్ క్రైం పోలీసులను సీపీ అభినందించారు. కార్యక్రమంలో క్రైం డీసీపీ జానకీ షర్మిల, సైబర్ క్రైం ఏసీపీ శ్రీనివాస్‌తోపాటు సిబ్బంది పాల్గొన్నారు.