క్రైమ్/లీగల్

గోవిందుని కిరీటాల చోరీ ఇంటి దొంగల పనేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఫిబ్రవరి 3: టీటీడీ చరిత్రలో కలకలం సృష్టించిన తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయం ప్రాంగణంలోని శ్రీ కల్యాణవేంకటేశ్వర స్వామి, శ్రీదేవీ, భూదేవీలకు చెందిన మూడు కిరీటాలు అపహరణ వెనుక ఇంటి దొంగల హస్తం ఉన్నట్లు పోలీసులు, టీటీడీ భద్రతా సిబ్బంది అనుమానిస్తున్నారు. కాగా ఇప్పటికే ఆలయ ప్రధాన అర్చకుల నుంచి ఉపాలయాల్లో పనిచేసే అర్చకులను, పోటులో పనిచేస్తున్నవారిని కూడా విజిలెన్స్, పోలీలు క్షుణ్ణంగా విచారించారు. మరో సీసీ కెమెరాలో నమోదైన ఫుటేజీని కూడా వారికి చూపించి అపరచిత వ్యక్తిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా కిరీటాలు చిన్నవి కావడంతో ఆలయ పరిసర ప్రాంతాల్లోనే పడేశారా అనే కోణంలో ఈ కేసును దర్యాప్తు చేసిన బృందాలు ఆలయాన్ని జల్లెడపట్టి వెతికినా ఎలాంటి ఫలితం దక్కలేదు. కిరీటాలు అపహరించిన వ్యక్తి స్థానికంగానే ఉన్నాడా లేక మరెక్కడికైనా పారిపోయాడా అనే కోణంలో కూడా పోలీసులు దృష్టి సారిస్తున్నారు. ఇందులో భాగంగా రైల్వే స్టేషన్, బస్టేషన్ ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించినట్లు సమాచారం. కిరీటాలు అపహరించడానికి సాహసించిన వ్యక్తి ఆర్థిక కష్టాల్లో ఉండి వాటిని అధిగమించడానికి ఈ దుస్సాహసం తెగబడ్డాడా అనే అనుమానాలు కలుగుతున్నాయి. తాజా సంఘటనతో ఆలయంలో స్వామివార్లకు సంబంధించిన ఇతర ఆభరణాలు భద్రంగా ఉన్నాయా? లేదా? అని భక్తులు అనుమానిస్తున్నారు. ఇదిలావుండగా శనివారం సాయంత్రం 5.30 గంటలకు కల్యాణ వేంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులకు నైవేద్యం పెట్టిన అనంతరం కొంత సమయం తలుపులు మూస్తారు. ఆ సమయంలోనే ఈ చోరీ జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. కాగా కిరీటాల అపహరణతో కల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని ఆదివారం మూసివేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆలయంలో సంప్రోక్షణ చేయకుండా పూజలు నిర్వహించ కూడదు. ఈ నేపథ్యంలో సోమవారం సంప్రోక్షణన చేసి పూజలు యదాతధంగా చేసి, భక్తులను దర్శనానికి అనుమతించాలని నిర్ణయించారు. గమనించ దగ్గ విషయం ఏమిటంటే చోరీ జరిగిన ఆలయం ముందున్న సీసీ కెమేరా గత రెండు సంవత్సరాలుగా పనిచేయడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఐదు సంవత్సరాల క్రితం కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద టీటీడీ సీసీ కెమేరాలు ఏర్పాటు చేసినట్లు సమాచారం. రెండు సంవత్సరాలుగా సీసీ కెమేరాలు పనిచేయడంలేదు.
ఈ విషయాన్ని టీటీడీ భద్రతా సిబ్బంది కాని ఆలయ భద్రతాధికారులు కాని పట్టించుకున్న పాపాన పోలేదు. భగవంతుడని గుండెలో పెట్టుకుని చూడాల్సిన అర్చకుల నిర్లక్ష్యం కూడా ఈ సంఘటనలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. సుమారు రూ. 35 నుంచి 40 లక్షలు విలువచేసే మూడు కిరీటాల బరువు ఒక కేజీ 200 గ్రాములు ఉన్నట్లు అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. అయితే ఇవి పురాతనమైనవి కాదని 1998లో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలోని ఉత్సవ మూర్తులకు భక్తులు 2002లో మూడు కిరీటాలను విరాళంగా అందించారు.
వీటిని శ్రీ కల్యాణవేంకటేశ్వర స్వామి, శ్రీదేవి, భూదేవీలకు అలంకరించేందుకు తిరుమల శ్రీవారి ఆలయం నుంచి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలోని కల్యాణవేంకటేశ్వర స్వామి ఆలయానికి అందించినట్లు సమాచారం. కిరీటాల అపహరణ వెనుక ఆలయంలో పనిచేసే సిబ్బంది, అధికారులు, అర్చకుల నిర్లక్ష్యం అడుగడుగునా కనపడుతోంది. గోవిందునికి నైవేద్యం పెట్టి ఆపై కిరీటాలను కొట్టేసి నామం పెట్టారంటూ భక్తులు మండిపడుతున్నారు. టీటీడీ ఆలయాలకు పటిష్టమైన భద్రత కల్పిస్తున్నామని అధికారులు చెబుతున్నది ఉత్తుత్తిదేనని, వైఫల్యాలు ఇబ్బడి, ముబ్బడిగా ఉన్నాయని కిరీటాల అపరహరణతో మరోసారి రుజువైంది. గోవిందరాజ స్వామి వారి ఆలయంలో స్వామివారి ఆలయ ప్రాంగణంలో కల్యాణవేంకటేశ్వర స్వామి, ఆండాళ్ అమ్మవారు. పార్థిసారథి, పుండరీకవళ్లి ఉపఆలయాలు ఉన్నాయి. అలాగే గోవిందరాజ స్వామి ఆలయానికి ఎదురుగా మఠం ఆంజనేయ స్వామి, టీటీడీ పాత పరిపాలన భవనంలో అభయాంజనేయ స్వామి ఉప ఆలయాలున్నాయి. ప్రతి రోజు ఉదయం 9.30 గంటలకు, మధ్యాహ్నం 12.30 గంటలకు, సాయంత్రం 5.45 గంటలకు మూల విరాట్టుతోపాటు ఈ ఆలయాల్లో కూడా నైవేద్యం సమర్పించడం ఆనవాయితీ. ప్రతి ఉప ఆలయంలోను ముగ్గురు అర్చకులు పనిచేస్తారు. పోటులో పనిచేసే వ్యక్తి ఈ నైవేద్యంను తీసుకువచ్చి ఆయా ఆలయాల్లోని అర్చకులకు అందిస్తారు. అర్చకులు నైవేద్యం పెట్టి ఆయా దేవతామూర్తులు ప్రసాదం ఆరగించేందుకు తలుపులు మూస్తారు. కొంత సమయానికి ఆలయానికి ప్రసాదం తీసుకువచ్చిన పోటులోని వ్యక్తి నైవేద్యంగా పెట్టిన ప్రసాదాన్ని భక్తులకు వితరణ చేసేందుకు కౌంటర్‌కు అప్పగించే విధానం కొనసాగుతోంది. అయితే శనివారం సాయంత్రం 5.30 గంటల సమయంలో కల్యాణవేంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులకు నైవేద్యం సమర్పించేందుకు ఉండవలసిన ముగ్గురు అర్చకుల్లో ఇద్దరు గైర్హాజరయ్యారు. ఒక అర్చకుడు మాత్రమే అక్కడ ఉన్నట్లు సమాచారం. ఆ ఇద్దరు అర్చకులు అధికారుల అనుమతితో గైర్హాజరయ్యారా? లేక అనధికారికంగా గైర్హాజరయ్యారా అనే అంశంపై పోలీసులు, టీటీడీ నిఘా విభాగం సమాచారం ఆరా తీస్తోంది. ఆ సమయంలో అక్కడున్న అర్చకుడు నైవేద్యం పెట్టాడా? లేక ఆ బాధ్యతను ఇంకెవరికైనా అప్పగించి వెళ్లాడా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆలయం వద్ద ఉన్న సీసీ కెమెరాలు పనిచేయకపోయినా మరో ప్రాంతంతలో ఉన్న సీసీ టీవీలు పనిచేయడంతో పోలీసులు, టీటీడీ నిఘా విభాగం వాటిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఇందులో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా వడివడిగా వెడుతుండటాన్ని గుర్తించినట్లు తెలుస్తోంది. ఉత్సవ మూర్తులుకిరీటాలు చిన్నవి కావడంతో చిన్నపాటి సంచిలో కూడా వాటిని వేసుకుని పైన ఉత్తరీయాన్ని కప్పుకుని ఎవరికంటా పడకుండా ఎవరికీ అనుమానం రాకుండా వెళ్లే అవకాశాలున్నాయి. అయితే సీసీ కెమేరా ఫుటేజీలో పోలీసులు, విజిలెన్స్ సిబ్బంది గుర్తించిన వ్యక్తి ఎవరు, అతను ఆలయంలో పనిచేసే సిబ్బందికి పరిచయం ఉన్నవాడా? లేక అర్చకులకు పరిచయం ఉన్నవాడా? లేక అపరిచితుడా? అనే కోణంలో అర్బన్ ఎస్పీ అన్బురాజన్ నేతృత్వంలో దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు. ప్రస్తుతం టీటీడీ సీవీ ఎస్వోగా ఉన్న గోపీనాథ జెట్టి గతంలో తిరుపతి ఎస్పీగా పనిచేసిన అనుభవం ఉండటం ఈ పరిసరాలపై అవగాహన ఉండటం నేరస్తులను పట్టుకోవడంలో మరింత సులవుకానుంది. కాగా గోవిందరాజ స్వామివారి ఆలయంలో కిరీటాల అపరహరణ విషయం తెలుసుకున్న ఈఓ ఆదివారం ఆలయానికి వచ్చి అక్కడి పరిస్థితులను గమనించి అధికారులను, భద్రతా సిబ్బందిపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. అలయంలో అంతా బాగుందని భక్తులు నమ్ముతున్న క్రమంలో ఈ సంఘటన టీటీడీ అధికారులను కూడా ఇరకాటంలో పడేసినట్లుయ్యింది. ఈనేపథ్యంలో టీటీడీ అనుబంధ ఆలయాల పాలనా, సిబ్బంది నియామకంకు సంబంధించి ప్రక్షాళన చేసి సంస్కరించడానికి ఈఓ ఏకె సింఘాల్ దృష్టిపెట్టక తప్పని పరిస్థితి. ఇదిలా ఉండగా ఈ సంఘటనపై టీటీడీ ఈఓ పేరిట విడుదల చేసిన ప్రకటనలో మాత్రం సీసీ కెమెరాల వ్యవస్థ సక్రమంగా పనిచేస్తున్నాయని త్వరలోనే నింధితులను పట్టుకుంటామని తెలియజేశారు. కాగా ఆదివారం గోవిందరాజ స్వామివారి ఆలయాన్ని సందర్శించిన వారిలో అదనపు సీవీ ఎస్వో శివకుమార్ రెడ్డి, సీఈ చంద్రశేఖర్ రెడ్డి, ఎఫ్‌ఏ అండ్ సీఏఓ బాలాజీ, స్పెషల్ డిప్యూటీ ఈఓ వరలక్ష్మి, పోలీస్ అధికారులు ఉన్నారు.