క్రైమ్/లీగల్

ఖలిస్తాన్ ఉగ్రవాది అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 13: కరడుకట్టిన ఉగ్రవాది, హంతకుడు, దోపిడీదారుడిని ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. నిషేధిత ఖలిస్థాన్ కమాండో ఫోర్సు ఉగ్రవాది, 1984లో జరిగిన ఆపరేషన్ బ్లూస్టార్‌లో భారత్ ఆర్మీ దళాల చేతిలో హతమైన జర్నైల్ సింగ్ బింద్రేవాలే అనుచరుడిని ఢిల్లీ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. బుధవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుర్‌సేవక్ సింగ్ (53) 50కి పైగా హత్యలు, దోపిడీలు, దాడులు చేయడంతో పాటు భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించేవాడు. ఖలిస్థాన్ కమాండో ఫోర్సు (కేసీఎఫ్)కు చీఫ్‌గా ఉండి ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్న పరంజిత్ సింగ్ పంజ్వాడ్ కేసీఎఫ్‌ను తిరిగి భారత్‌లో పునర్నిర్మించాలని యోచించి కేసీఎఫ్ సభ్యుడైన గుర్‌సేవక్ సింగ్‌ను ఆ మేరకు ఆదేశించాడు. దీంతో గుర్‌సేవక్ సింగ్ ఇప్పటికే భారత్‌లోని తీహార్, ఇతర జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న సంస్థ సభ్యులతో నిత్యం సంభాషణలు జరిపేవాడు. ఈ నేపథ్యంలో మంగళవారం ఒక వ్యక్తిని కలవడానికి వచ్చిన గుర్‌సేవక్ సింగ్‌ను ఢిల్లీ ఐఎస్‌బిటి క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. హత్యలు, దోపీడీలతో పాటు ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించాడన్న ఆరోపణలపై గురుసేవక్ సింగ్‌పై గతంలో 50కి పైగా కేసులున్నాయని అడిషనల్ కమిషనర్ (క్రైం) అజిత్ కుమార్ సింగ్లా తెలిపారు.
మొదటి నుంచీ ఉగ్రవాద నేపథ్యమే...
పంజాబ్‌లోని లుథియానా జిల్లాలోని రాయికోట్ గ్రామంలో రైతు కుటుంబంలో సింగ్ పుట్టాడు. సింగ్ అన్న స్వరణ్ సింగ్ 1980లో పంజాబ్‌లోని బింద్రన్‌వాలే గ్రూపు ఉగ్రవాద సంస్థలో సభ్యుడిగా ఉండేవాడు. దీంతో గుర్‌సేవక్ సింగ్ కూడా 1982లో ఉగ్రవాద సంస్థలో చేరాడు. 1984లో కేసీఎఫ్ అధినేత బింద్రన్‌వాలే ఆర్మీ చేతిలో హతమైన తర్వాత ఆయన అనుచరులు చాలామంది పాకిస్తాన్ పారిపోయారు. అయితే వారికి అక్కడ ఐఎస్‌ఐ మద్దతు ఇచ్చి ఉగ్రవాదంలో శిక్షణ ఇచ్చి వారిని భారత్ పంపడం ప్రారంభించింది. తర్వాత మన్వీర్ సింగ్ చెడ్డు నేతృత్వంలో మళ్లీ పురుడుపోసుకున్న కేసీఎఫ్‌లో చేరిన గుర్‌సేవక్ సింగ్ తన ఉగ్రవాద కార్యక్రమాలను కొనసాగిస్తూ వచ్చాడు. తన సహచరులతో కలిసి సింగ్ డజన్లకొద్దీ హత్యలు, దోపిడీల్లో పాలుపంచుకున్నాడు. జలంధర్‌లో హిందూసమాచార్ పత్రిక ఎడిటర్ రమేష్ చందర్ హత్యకేసులో సింగ్, ఆయన సహచరులు నిందితులు. అంతేకాకుండా పంజాబ్ పోలీసులు ఎనిమిది మందిని వీరు హతమార్చారు. 2004 వరకు 18 సంవత్సరాల పాటు తీహార్ జైలులో శిక్ష అనుభవించిన సింగ్ జైలులో ఉన్నప్పుడే పాకిస్తాన్ నుంచి ఏకే 47 తుపాకులను భారత్‌కు స్మగుల్ చేయాలని ప్రణాళిక వేశాడు. అయితే ఆ కుట్రను పోలీసులు ఛేదించారు. ఆ తర్వాత కూడా పలు కేసుల్లో పోలీసులు సింగ్‌ను 2014, 15, 16 సంవత్సరాలలో అరెస్టు చేశారు. తర్వాత 2017లో ఆయుధాల చట్టం కింద అరెస్టు అయ్యాడు. అయితే పాటియాల కోర్టులో ఆ కేసు విచారణకు హాజరు కాకుండా తప్పించుకుని పోవడంతో కోర్టు నాన్‌బెయిల్‌బుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. మంగళవారం ఒక అనుచరుడిని కలవడానికి వచ్చిన సింగ్‌ను ఢిల్లీ పోలీసులు మాటు వేసి పట్టుకున్నారు.