క్రైమ్/లీగల్

మరో వారం గడువు ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 8: ఇంటర్మీడియట్ జవాబుపత్రాల మూల్యాంకనం కొనసాగుతోందని, ఇంకా పూర్తి కాలేదని, వివరాలు అందించేందుకు మరో వారం రోజులు గడువు ఇవ్వాలని బోర్డు అధికారులు బుధవారం నాడు హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. బోర్డు కౌన్సిల్ డీఎల్ పాండు ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ బెంచ్ ముందు తమ వాదనలు వినిపించారు. దాంతో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ఇంటర్ బోర్డుకు మరో వారం రోజుల పాటు గడువు ఇస్తూ మే 15వ తేదీన తదుపరి విచారణ చేపట్టనున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా పిటీషనర్ తరఫున న్యాయవాది సీ దామోదర్‌రెడ్డి గ్లోబరీనా సాఫ్ట్‌వేర్ కంపెనీనీ సైతం ప్రతివాదిగా చేర్చాలన్న విజ్ఞప్తిని బెంచ్ అంగీకరించింది. గ్లోబరీనా సంస్థపై వచ్చిన ఆరోపణలను ఆ సంస్థ వచ్చే విచారణ తేదీ నాటికి సిద్ధమై హైకోర్టుకు రావల్సి ఉంటుంది. ఫలితాల రీ వెరిఫికేషన్ కొనసాగుతోందని, తుది దశకు వచ్చిందని, ఒకటి రెండు రోజుల్లో ఫలితాలను ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని బోర్డు అధికరాలు పేర్కొన్నారు. అయితే రీ వెరిఫికేషన్ పూర్తి వివరాలను కోర్టుకు వెల్లడించేందుకు మరికొంత గడువు కావాలని కోరింది. ఇంటర్మీడియట్ ఫలితాల్లో జరిగిన పొరపాట్లకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి విద్యార్థులు, తల్లిదండ్రులు, యువజన సంఘాలు, రాజకీయ పార్టీలు ఉవ్వెత్తున ఉద్యమాలు చేశారు. దానికి తగ్గట్టే కొన్ని భయంకరమైన పొరపాట్లను బోర్డు చేయడంతో వాటన్నింటి గురించి తెలుసుకున్న తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో కూడా ఇలాంటి పొరపాట్లే జరిగి ఉంటాయని భావించి తమ నిరసన తెలిపారు. ఉద్యమాలకు తలొగ్గిన ప్రభుత్వం బోర్డులో లోపాలను గుర్తించేందుకు త్రిసభ్య కమిటీని నియమించింది. త్రిసభ్య కమిటీ సైతం లోపాలను నిర్థారించడంతో ఉద్యమాలు పతాకస్థాయికి చేరుకున్నాయి. మరో పక్క బాలల హక్కుల సంఘం గౌరవాధ్యక్షుడు అచ్యుతరావు హైకోర్టులో ప్రజాహిత పిటీషన్‌ను దాఖలు చేశారు. పిల్‌ను స్వీకరించిన హైకోర్టు దానిపై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఇంటర్ బోర్డు మూల్యాంకనంలో పొరపాట్లు జరిగాయా లేదా అన్నది చూసేందుకు ఫెయిలైన అభ్యర్ధులందరికీ ఉచితంగానే పున: పరిశీలన, పున: గణన చేపట్టడంతో పాటు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల దరఖాస్తు గడువును పెంచింది. మరో పక్క పరీక్షలను సైతం వారం రోజుల పాటు వాయిదా వేసింది. ఈ క్రమంలోనే బుధవారం నాడు మరో మారు ఈ పిటీషన్‌పై విచారణ జరగ్గా బోర్డు ఇంకో వారం గడువు కావాలని కోరడంతో అందుకు బెంచ్ ఆమోదం తెలిపింది. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ తర్వాత బోర్డు నివేదిక రూపొందించి ఈ నెల 15న హైకోర్టు మందుంచనుంది.