క్రైమ్/లీగల్

ఇన్‌ఫార్మర్ల నెపంతో ఇద్దరు యువకుల హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చర్ల, మార్చి 29: తెలంగాణ- చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టులు మరోసారి అలజడి సృష్టించారు. పోలీసు ఇన్‌ఫార్మర్లు అనే నెపంతో ఇద్దరిని దారుణంగా హతమార్చారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని పూసుగుప్ప గ్రామానికి చెందిన ఇర్పా లక్ష్మణ్(28) అలియాస్ భరత్ మావోయిస్టు పార్టీలో దళ సభ్యుడిగా పని చేసి లొంగిపోయాడు. అలాగే బీజాపూర్ జిల్లాకు చెందిన ఊసూరు మండలం కాంకేర్ పంచాయితీ చిన్నవూట్ల గ్రామానికి చెందిన సోడి అందాల్ అనే వ్యక్తి 2010లో మావోయిస్టు పార్టీలో చేరి 2017 వరకు పని చేసి పోలీసులకు లొంగిపోయాడు. అయితే వీరిని చర్ల సరిహద్దులోని పూజారికాంకేడ్‌కు సమీపంలో ఉన్న అడవిలో బుధవారం రాత్రి మావోయిస్టులు హతమార్చారు. పోలీసు ఇన్‌ఫార్మర్‌గా పని చేస్తూ కన్నతల్లి అయిన పార్టీకి ద్రోహం చేసేలా వీరు వ్యవహరించారని, అందుకే వీరిని హతమార్చామని మావోయిస్టులు సంఘటన ప్రదేశంలో లేఖ వదిలి వెళ్లారు. కొద్దిరోజుల క్రితం తడపల వద్ద జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన పోలీసులకు వీరు సమాచారం చేరవేసి తమకు తీరని ద్రోహం చేశారని, వారిని విచారించి ప్రజాకోర్టులో హతమార్చినట్లు మావోలు లేఖలో పేర్కొన్నారు. పూసుగుప్పకు చెందిన ఇర్పా లక్ష్మణ్ అలియాస్ భరత్ కొద్ది రోజుల క్రితం భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ అంబర్‌కిశోర్‌ఝా ఎదుట లొంగిపోగా అతనికి ప్రభుత్వం జీవనోపాధిగా రూ.లక్ష నగదును పునరావాసం కింద అందజేసింది. ఈ డబ్బుతో అతను కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు. జనజీవన స్రవంతిలో కలిసిన కొద్దిరోజుల్లోనే అతన్ని మావోయిస్టులు హతమార్చారు. సోడి అందాల్ కూడా కొంతకాలం క్రితం పోలీసులకు లొంగిపోయి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తరుణంలో మావోలు వారం రోజుల క్రితం కొత్తపల్లి గ్రామానికి మిర్చి కోతలకు వెళ్లిన ఇతన్ని తీసుకెళ్లి హతమార్చినట్లు సమాచారం. పోలీసు ఇన్‌ఫార్మర్లు అనే నెపంతో మావోయిస్టులు ఇద్దరిని హతమార్చడంతో ఏజెన్సీ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి.

చిత్రం..మావోల చేతిలో హతమైన లక్ష్మణ్, అందాల్