క్రైమ్/లీగల్

బడికి వెళ్లిన వారు అదృశ్యం.. ఆపై జల సమాధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్: విద్యా బుద్ధులు నేర్చుకునేందుకు బడికి వెళ్లిన ముగ్గురు చిన్నారుల నిండు ప్రాణాలను మొరం గుంత బలిగొంది. మొరంమట్టి కోసం 20 అడుగుల వరకు లోతుగా తవ్విన గుంతలో జారిపడిన విద్యార్థులు జల సమాధి అయ్యారు. ఈ సంఘటనను తీవ్రంగా పరిగణిస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు. ఈ విషాదకర ఘటన నిజామాబాద్ నగర శివారులోని నాగారం ప్రాంతంలో శనివారం వెలుగులోకి వచ్చింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. నాగారంలోని 50క్వార్టర్స్ ప్రాంతానికి చెందిన శేక్ అజర్(9), శేక్ సోహైల్(9), అర్బాజ్‌ఖాన్(10)లు స్థానికంగానే ఉన్న ప్రభుత్వ ఉర్దూ మీడియం పాఠశాలలో చదువుతున్నారు. అజర్, సోహైల్‌లు మూడవ తరగతి, అర్బాజ్ నాల్గవ తరగతిలో ఉన్నారు. ఎప్పటిలాగే శుక్రవారం ఉదయం బడికి వెళ్లిన వీరు ముగ్గురు, నమాజుకు వెళ్తామని క్లాస్ టీచర్‌ను అనుమతి అడిగి మధ్యాహ్నం సమయంలో పాఠశాల నుండి వెళ్లారు. సాయంత్రం అయినప్పటికీ వారు ఇళ్లకు చేరుకోలేదు. చీకటి పడే వరకు వేచి చూసిన విద్యార్థుల తల్లిదండ్రులు అర్ధరాత్రి వరకు గాలింపులు జరిపినా ప్రయోజనం లేకుండాపోయింది. ఈ క్రమంలోనే బడి నుండి బయటకు వెళ్లి అదృశ్యమైన చిన్నారులు నాగారం ప్రాంతంలోనే తవ్విన మొరం గుంతలో శవాలై కనిపించారు. శనివారం ఉదయం అటువైపుగా వెళ్లిన స్థానికులకు ముందుగా ఓ విద్యార్థి మృతదేహం మొరం గుంతలో పైకి తేలియాడుతూ కనిపించింది. దీంతో అతనితోనే వెళ్లిన మిగతా ఇద్దరు చిన్నారులు కూడా ఇదే మొరం గుంతలో పడి మృతి చెంది ఉంటారని అనుమానించిన స్థానికులు, కుటుంబీకులు పోలీసులకు సమాచారం అందించారు. సుమారు ఇరవై అడుగుల లోతు కలిగి, ఇటీవల కురిసిన భారీ వర్షానికి నిండుగా నీటితో నిండిఉన్న గుంతలో నుండి చిన్నారులను శవాలను వెలికి తీసేందుకు తీవ్రంగానే శ్రమించాల్సి వచ్చింది. అగ్నిమాపక శకటాన్ని రప్పించి గుంతలోని నీటిని ఖాళీ చేయించగా, మిగతా ఇద్దరు చిన్నారుల శవాలు కూడా పైకి వచ్చాయి. అయితే వీరి మృతి పట్ల స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతుల ఒంటిపై దుస్తులు యథాతథంగా ఉండడంతో వారు ఈత కోసం గుంతలో దిగలేదని, కావాలనే ఎవరైనా చంపి గుంతలో పడవేసి ఉంటారని అనుమానాలు వెలిబుచ్చుతున్నారు. అయితే మొరం గుంత లోతుగా ఉందనే విషయం తెలియకుండా అందులో దిగేందుకు ప్రయత్నించిన సందర్భంగా ఒకరి తరువాతగా ఒకరు నీటిలో మునిగి మృతి చెంది ఉంటారని పోలీసులు పేర్కొంటున్నారు. రెండు రోజుల క్రితం ఇదే గుంతలో ఓ వృద్ధుడు సైతం పడి మృతి చెందాడని స్థానికులు చెబుతున్నారు. ఈ విషయం ఎలా ఉన్నప్పటికీ, బడిలోనే ఉండాల్సిన విద్యార్థులను బయటకు వెళ్లేందుకు అనుమతించడం వల్లే వారు మొరం గుంతలో పడి మృతి చెందారని ఆరోపిస్తూ విద్యార్థుల కుటుంబీకులు, స్థానికులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. విద్యార్థులు తిరిగి బడికి రాకపోయినప్పటికీ, ఈ విషయాన్ని ఉపాధ్యాయులు తమకు సమాచారం అందించలేదని వారి తల్లిదండ్రులు వాపోయారు. మొరం గుంత తవ్విన వారితో పాటు, పాఠశాల ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని సంఘటన స్థలం వద్ద ధర్నా చేశారు. అధికారులు వచ్చి తమకు హామీ ఇచ్చేంత వరకు మృతదేహాలను తీసుకెళ్లనివ్వమని పట్టుబట్టారు. ఈ సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత తలెత్తగా, పోలీసులు వారిని నచ్చజెప్పి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఆ తరువాత కూడా స్థానికులు ఐదవ టౌన్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని ఠాణా ఎదుట నిజామాబాద్ - బాన్సువాడ ప్రధాన రహదారిపై కొద్దిసేపు రాస్తారోకో చేశారు. అదనపు డీసీపీ శ్రీ్ధర్‌రెడ్డి, నిజామాబాద్ ఏసీపీ శ్రీనివాస్‌కుమార్, ఐదవటౌన్ ఎస్‌ఐ జాన్‌రెడ్డి తదితరులు స్థానికులను సముదాయించి ఆందోళన విరమింపజేశారు.
జరిగిన సంఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో శాంతించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఏసీపీ శ్రీనివాస్‌కుమార్ తెలిపారు.
చిత్రం... మొరం గుంతలో పడి మృతి చెందిన చిన్నారులు అజర్, సోహైల్, అర్బాజ్