క్రైమ్/లీగల్

సల్మాన్‌కు ఐదేళ్ల జైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జోథ్‌పూర్: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్ కటకటాలపాలయ్యాడు. కృష్ణజింకలను వేటాడిన కేసులో అతడికి ఐదేళ్ల శిక్ష విధిస్తూ జోథ్‌పూర్ కోర్టు గురువారంనాడు తీర్పు చెప్పింది. ఇరవై ఏళ్లపాటు సాగిన ఈ కేసులో వెలువడిన తుది తీర్పు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. సల్మాన్‌కు జైలుశిక్షతోపాటు దీనితోపాటు రూ. 10వేల జరిమానా విధించిన కోర్టు సహనిందితులైన సినీనటులు సైఫ్ అలీఖాన్, టబు, సోనాలీబింద్రే, నీలమ్, స్థానికుడు దుష్యంత్ సింగ్‌లను నిర్దోషులుగా ప్రకటించింది. తీర్పు ప్రకటించిన వెంటనే సల్మాన్‌ను జోథ్‌పూర్ కేంద్ర కారాగారానికి తరలించారు. అత్యాచారం కేసులో జైలుపాలైన స్వయంప్రకటిత బాబా ఆశారాం బాపూను ఉంచిన రెండో నెంబర్ బ్యారక్‌కు సల్మాన్‌ను తరలించారు. బ్యారక్‌లవద్ద గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. కాగా తీర్పును రద్దు చేయాలని, బెయిల్ మంజూరు చేయాలన్న పిటిషన్‌పై శుక్రవారం ఉదయం 10.30 గంటలకు సెషన్స్ కోర్టులో విచారణ జరగనుంది. మూడేళ్లకు మించి శిక్షపడినందున పైకోర్టులో ఈ మేరకు పిటిషన్ వేయాల్సి వచ్చింది. 1998 నాటి కృష్ణ జింకల వేట కేసులో 20 ఏళ్ల తరువాత న్యాయస్థానం
గురువారం ఈ తీర్పు చెప్పింది. నల్లటి చొక్కా ధరించిన సల్మాన్ బొలెరో జీపులో కోర్టుకు వచ్చారు. అతడి సోదరీమణులు, కుటుంబ సభ్యులు తీర్పువిన్నవెంటనే కన్నీరుపెట్టారు. కృష్ణజింకలు, దుప్పులను వేటాడారని దాఖలైన వివిధ కేసులకు సంబంధించి సల్మాన్ ఇప్పటివరకు ఈ జైలులో ఉండాల్సి రావడం ఇది నాలుగోసారి. గతంలో 1998, 2006, 2007లో 18 రోజుల పాటు ఆయన ఈ జైలులో ఉండాల్సి వచ్చింది. కాగా తీర్పు చెప్పినపుడు కోర్టులోనే ఉన్న సల్మాన్‌ను ఆ తరువాత పోలీస్ జీపులో సెంట్రల్ జైలుకు తరలించారు. అతడు ప్రయాణించిన రెండు కిలోమీటర్ల పొడవునా రోడ్డుకు ఇరువైపూలా జనం, మీడియా ప్రతినిధులు కిక్కిరిసిపోయారు.
కృష్ణ జింకల వేటకు సంబంధించిన కేసు విచారణను మార్చి 28న పూర్తి చేసిన జోథ్‌పూర్ ట్రయల్ కోర్టు చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ దేవ్‌కుమార్ ఖత్రి తీర్పు రిజర్వు చేసింది. గురువారం దీనికి సంబంధించిన తీర్పును న్యాయమూర్తి వెల్లడించారు. ‘నిందితుడు సల్మాన్‌ఖాన్ అత్యంత ప్రజాదరణ కలిగిన నటుడు. అతడిని ఆరాధించేవారు లక్షల్లో ఉన్నారు. ఇలాంటి నేరానికి పాల్పడిన ప్రముఖుడిని శిక్షించకపోతే అభిమానులు అతడిని అనుసరించే ప్రమాదం ఉంది. అందువల్ల అతడి నేరాన్ని తీవ్రంగా పరిగణించి జైలుకు పంపుతున్నా’ అని న్యాయమూర్తి తన 200 పేజీల లిఖితపూర్వక తీర్పులో పేర్కొన్నారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం (1972)లోని 9/51 సెక్షన్ ప్రకారం ఈ కేసులో సల్మాన్‌ఖాన్‌ను దోషిగా ప్రకటించిన కోర్టు ఐదేళ్ల కారాగార శిక్షతోపాటు పది వేల రూపాయల జరిమానా విధించినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ తరపు న్యాయవాది మహిపాల్ బిష్ణోయ్ తెలిపారు. ఈ చట్టం ప్రకారం నిందితులకు గరిష్ఠంగా ఆరేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉండగా న్యాయమూర్తి ఖాన్‌కు ఐదేళ్ల శిక్ష విధించారు.
జోథ్‌పూర్‌కు సమీపంలోని కంకణి గ్రామంలో 1998లో జరిగిన ‘హమ్ సాథ్ సాథ్ హై’ సినిమా చిత్రీకరణకు వచ్చిన సల్మాన్, సహ నటులు సైఫ్ అలీఖాన్, టబు, సోనాలీ బింద్రే, నీలమ్‌లతో కలసి జిప్సీ వాహనంలో వెడుతూ రెండు కష్ణజింకలను కాల్చి చంపారన్నది అభియోగం. అంతరించిపోతున్న కృష్ణజింకల వేట వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం నేరం. ఈ కేసులో విచారణ ఎదుర్కొన్న సల్మాన్‌కు చివరకు దోషిగా తేలి శిక్షపడింది. ‘బెనిఫిట్ ఆఫ్ డౌట్’తో మిగిలిన నిందితులను నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది. న్యాయమూర్తి తీర్పు చెబుతున్నప్పుడు నిందితుల కుటుంబ సభ్యులు, కేసు దాఖలు చేసిన వాదులు కోర్టుకు హాజరయ్యారు. కృష్ణ జింకల పరిరక్షణకు పాటుపడుతున్న బిష్ణోయ్ గ్రామానికి చెందిన 28 మంది కోర్టును ఆశ్రయించారు. సల్మాన్ జిప్సీ వాహనంలో వెడుతూ కృష్ణజింకల సమూహంపై కాల్పులు జరిపిన రెండింటిని చంపారని వారు కోర్టుకు విన్నవించారు. కాగా తీర్పు అనంతరం వారు ఆనందం వ్యక్తం చేశారు. ‘నిందితుడు ఎంత గొప్పవాడైనా న్యాయస్థానంపై ప్రభావం చూపదన్న నిజం మరోసారి నిరూపితమైంది. మాకు న్యాయం జరిగింది’ అని పీపుల్ ఫర్ యానిమల్స్‌కు చెందిన గౌరీ వౌలేఖి అభిప్రాయపడ్డారు. కాగా సేవాకార్యక్రమాలు విస్తృతంగా చేపడుతున్న సల్మాన్‌కు ఇంత కఠిన శిక్ష విధించకుండా ఉండాల్సిందని, ఇది విచారకరమని, స్టార్ స్టేటస్ వల్లే అతడిని లక్ష్యంగా చేసుకున్నారని బాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు జయాబ్చన్ న్యూఢిల్లీలో వ్యాఖ్యానించారు. కాగా ఇది తనకు దిగ్భ్రాంతి కలిగించిందని బాలీవుడ్ నిర్మాత సుభాష్‌ఘయ్ వ్యాఖ్యానించారు.