క్రైమ్/లీగల్

కారులో ఊపిరాడక ఇద్దరు చిన్నారులు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జూలై 24: ఆడుకునేందుకు కారులోకి వెళ్లిన ఇద్దరు చిన్నారులు, డోర్ లాక్ కావడంతో అందులోనే చిక్కుబడిపోయి ఊపిరాడక మృతి చెందారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి కనిపించకుండాపోయిన బాలురు బుధవారం తెల్లవారుజామున కారు వెనుక సీట్లలో విగతజీవులుగా కనిపించారు. ఈ విషాద సంఘటన నిజామాబాద్ నగరంలోని మాలపల్లి ముజాహిద్‌నగర్‌లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం సమీప బంధువులైన మహ్మద్ యాసీన్, మహ్మద్ రషీద్ కుటుంబాలు ముజాహిద్‌నగర్‌లో ఉంటున్నాయ. యాసీన్ పెయింటర్ . అతని కుమారుడు మహ్మద్ బద్రుద్దీన్(5) అదే ప్రాంతంలోని ఉర్దూ మీడియం మోడల్ స్కూల్‌లో 1వ తరగతి చదువుతున్నారు. రషీద్ సైకిల్ రిపెయిరర్‌గా కొనసాగుతుండగా, అతని కుమారుడు మహ్మద్ రియాజ్(10) కూడా స్థానిక మోడల్ స్కూల్‌లోనే ఐదో తరగతి చదువుతున్నాడు.
మంగళవారం ఉదయం ఇద్దరూ బడికి వెళ్లి వచ్చారు. మధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో రియాజ్ వచ్చి ఆడుకుందామంటూ బద్రుద్దీన్‌ను తన వెంట తీసుకెళ్లాడు. వీరిద్దరు కలిసి ఇంటి సమీపంలోనే వసీమ్ అనే వ్యక్తి నిలిచి ఉంచిన కారు వద్దకు చేరుకున్నారు. కారు డోర్‌లు లాక్ చేసే ఉన్నాయ. దీంతో వెనక డోర్ నుంచి చిన్నారులు ఇద్దరూ కార్లోకి వెళ్లారు. వారు డోర్ వేసుకోగానే దానికి లాక్ పడిపోయింది. తిరిగి బయటకు వచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ డోర్లు తెరుచుకోకపోవడంతో వారు అందులోనే చిక్కుబడిపోయారు. కొద్దిసేపటి అనంతరం శ్వాస ఆడక కారులోనే మృతి చెందారు. వారెక్కడకు వెళ్లారో తెలియని కుటుంబీకులు వారి కోసం తీవ్రంగా గాలించినప్పటికీ ప్రయోజనం లేకుండాపోయింది. రాత్రి 7గంటల ప్రాంతంలో తమ పిల్లలు కనిపించడం లేదంటూ వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని పోలీసులు చిన్నారుల కోసం గాలింపులు జరుపుతున్న క్రమంలోనే, బుధవారం తెల్లవారుజామున కారు లోపల వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. వసీమ్ తెల్లవారుజామున తన వ్యక్తిగత పని నిమిత్తం వాహనాన్ని తీసుకెళ్లేందుకు కారు డోర్ తెరువగా, వెనుక సీట్లో ఇద్దరు చిన్నారులు విగతజీవులుగా పడి ఉండడాన్ని గమనించారు. దీంతో స్థానికులకు, పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న చిన్నారుల కుటుంబీకులు పిల్లల మృతదేహాలను చూసి గుండెలవిసేలా రోదించారు. అభంశుభం తెలియని చిన్నారులు ఆడుకునేందుకు కారు లోపలికి వెళ్లి మృతి చెందడంతో ముజాహిద్‌నగర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ సంఘటనపై పలువురు అనుమానాలు వ్యక్తం చేసినా, వారే కారులోకి వెళ్లిన దృశ్యాలు సీ.సీ కెమెరా ఫుటేజీలలో లభ్యమవడంతో పోలీసులు ప్రమాదవశాత్తు జరిగిన మరణాలుగా కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం చేయించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వపరంగా ఆదుకోవాలని స్థానికులు కోరారు.

చిత్రం... కారులో విగత జీవులుగా బద్రుద్దీన్, రియాజ్ మహ్మద్