క్రైమ్/లీగల్

రెండు నెలల పసికందు విక్రయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోకవరం, ఆగస్టు 3: తూర్పుగోదావరి జిల్లా గోకవరం ఆర్టీసీ డిపోలో రెండు నెలల పాప కిడ్నాప్‌కు గురైందని పాప తల్లి తీవ్ర స్వరంతో హంగామా చేయడంతో ఆర్టీసీ డిపోలో ఉన్న ప్రయాణీకుల్లో తీవ్ర అలజడి నెలకొంది. రెండు నెలల పాప ఏ విధంగా కిడ్నాప్‌కు గురైందని ప్రశ్నిస్తే తాను బాత్‌రూమ్‌కు వెళ్ళి వస్తానని చెప్పి డిపోలో ఉన్న గుర్తుతెలియని మహిళకు పాపను అప్పగించానని తెలిపింది. బాత్‌రూమ్‌కు వెళ్ళి వచ్చేసరికి పాపతో పాటు ఆమె పరారైందని చెప్పింది పాప తల్లి. అది నిజం అనుకుని డిపోలోని ఆర్టీసీ కార్మికులతో పాటు ప్రయాణీకులు పాపకోసం విచారణ చేయడం మొదలు పెట్టారు. అదే సమయంలో డిపోలో ఉన్న కంట్రోలర్ వెంటనే 100 నెంబర్‌కు ఫోన్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. డిపో మేనేజర్ ఉప్పాడ దేముడుబాబు సమక్షంలో పాపను ఎవరు కిడ్నాప్ చేశారని పాప తల్లిని పోలీసులు తమదైన శైలిలో విచారించారు. అంతే.. అప్పటివరకు తన పాపను ఎవరో ఎత్తుకుపోయారని, కిడ్నాప్ చేశారని చెప్పిన పాప తల్లి పోలీసులు ప్రశ్నలకు అసలు విషయం చెప్పుకొచ్చింది. గంగవరం మండలం దోనేపల్లి గ్రామానికి చెందిన శారపు చిలకమ్మకు నలుగురు ఆడపిల్లలు. తరువాత కూడా పాప పుట్టింది. పాపకు ఆరోగ్యం బాగోకపోవడంతో తన రెండు నెలల పాపను తీసుకుని గత నెల 2వ తేదీన కాకినాడ ప్రభుత్వాసుపత్రికి వెళ్ళింది. ఆసుపత్రిలో పనిచేస్తున్న కాకినాడకు చెందిన చెన్న రేణుక చిలకమ్మకు పరిచయం అయ్యింది. ఆమె ద్వారా ఆసుపత్రిలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న కేతా కృష్ణవేణి కూడా చిలకమ్మకు పరిచయం అయ్యింది. చిలకమ్మకు నలుగురు ఆడపిల్లలు ఉన్నారని తెలుసుకున్న వారు పాపను పిల్లలు లేనివారికి ఇస్తే కొంత సొమ్మును ఇస్తారని ఆశ చూపడంతో చిలకమ్మ అందుకు అంగీకరించింది. కాకినాడకు చెందిన కేతా సింహాద్రి అనే ఆమెకు నలుగురు కోడళ్లున్నారు. వీరిలో 3వ కోడలికి పిల్లలు లేరని, ఆమెకు పిల్లలు కావాలని, పాపను ఆమెకు ఇస్తే కొంత సొమ్ము ఇస్తారని చెప్పగా అందుకు పాప తల్లి చిలకమ్మ అంగీకరించింది.
చిలకమ్మ తన రెండు నెలల పాపను ఆసుపత్రి నుండి తీసుకువచ్చిన తరువాత ఈ నెల 2వ తేదీన వారికి సమాచారం అందించింది. పాపను తీసుకునేందుకు గోకవరం ఆర్టీసీ డిపోకు రావాలని చెప్పడంతో కాకినాడకు చెందిన కేతా సింహాద్రి, ఆమె నాలుగో కోడలు కేతా కృష్ణవేణి (సూపర్‌వైజర్), ఆసుపత్రిలో పనిచేసే చెన్న రేణుక కలిసి ఈ నెల 2వ తేదీన గోకవరం ఆర్టీసీ డిపోకు వచ్చి చిలకమ్మకు రూ. 50 వేలు ఇచ్చి పాపను తీసుకుని వెళ్ళిపోయారు. విషయం తెలియడంతో గోకవరం ఎస్సై పి చెన్నారావు కేసు నమోదుచేసి పాపను కొనుగోలు చేసిన కాకినాడకు చెందిన సింహాద్రి, చెన్న రేణుక, కేతా కృష్ణవేణిలతోపాటు పాప తల్లి చిలకమ్మను శనివారం అరెస్టుచేసి కోర్టుకు తరలించారు. పాపను కాకినాడలోని చైల్డ్‌లైన్‌కు తరలించినట్లు ఎస్సై చెన్నారావు తెలిపారు.