క్రైమ్/లీగల్

విజయవాడ గోశాలలో 110 గోవులు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 10: విజయవాడ నగర శివారు కొత్తూరు తాడేపల్లిలో గో సంరక్షణ సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న గోశాలలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఒకదాని తరువాత మరొకటిగా 110 గోవులు మృత్యువాత పడగా, వందలాది గోవులు కొనఊపిరితో విలవిలాడుతున్నాయి. గోవుల మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. రాత్రి గోవులు తిన్న దాణాలో ఎరువుల మోతాదు ఎక్కువై విషపూరితంగా మారి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. గోశాల ప్రాంగణమంతా హృదయ విదారకంగా మారింది. ఓ వైపు గో ప్రేమికులు రకరకాల అనుమానాలతో మండిపడుతుండగా, కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్, మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, జాయింట్ కలెక్టర్ మాధవీలత శనివారం ఉదయం ఆగమేఘాలపై సంఘటనా స్థలానికి చేరుకుని కొన ఊపిరితోఉన్న వందలాది గోవులకు వైద్య చికిత్సలు జరిపిస్తున్నారు. మరో వైపు సంచార పశు వ్యాధినిరోధక ప్రయోగశాల వాహనంతో పెద్ద సంఖ్యలో సిబ్బంది అక్కడికి చేరుకుని చనిపోయిన గోవులకు పోస్టుమార్టం జరిపించి సమీపంలో పెద్ద గొయ్యి తవ్వించి మృతి చెందిన గోవులను అందులో పూడ్చేస్తున్నారు. విద్రోహ చర్యగా పలువురు ఆరోపిస్తుంటే విషపూరితమైన పశుదాణా
దీనికంతటికీ కారణంగా మరికొందరు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్ర పశు, మత్స్య మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణారావు గోవుల మృతిపై తీవ్రంగా స్పందించారు. భారీ సంఖ్యలో గోవులు మృతి చెందటం పట్ల ఆయన విచారం వ్యక్తం చేసి, తక్షణమే శాఖాపరమైన విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మోపిదేవి మాట్లాడుతూ శాఖాపరంగా విచారణ జరిపించి నివేదిక అందిన తర్వాత గోవుల మృతికి కారకులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో గోవులను రక్షించేందుకు ప్రభుత్వపరంగా చర్యలు తీసుకుంటామని, తక్షణం గోశాలలో ఉన్న గోవుల పరిస్థితిపై పశు సంవర్థక శాఖ అధికారులతో తనిఖీలు జరిపిస్తామన్నారు. భారీ సంఖ్యలో గోవుల మృతి వెనుక ఏమైనా కుట్ర దాగి ఉందా.. లేక అనారోగ్యంతో మృతి చెందాయా.. కలుషిత విషపూరిత దాణా వల్ల మరణించాయా.. అనే కోణాల్లో తమ శాఖాధికారులు విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తారని మంత్రి మోపిదేవి తెలిపారు. 1927లో కేవలం 40 గోవులతో దుర్గగుడి సమీపంలో గో సంరక్షణ సంఘం నేతృత్వంలో గోశాల ఏర్పాటైంది. తరువాత 2014లో కొత్తూరు తాడేపల్లి ప్రాంతంలో ఏడెకరాల స్థలంలో ఏర్పాటైన ప్రస్తుత గోశాలను అప్పటి కేంద్ర మంత్రి ఎం వెంకయ్య నాయుడు ప్రారంభించారు. ప్రస్తుతం ఇందులో 1600 వరకు గోవులు ఉన్నాయి. అనునిత్యం గో ప్రేమకులెందరో వచ్చి గోమాతలకు పూజలు చేసి వెళ్తుంటారు. ఏదిఏమైనా పోస్టుమార్టం నివేదిక వెల్లడి అయితేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి.