క్రైమ్/లీగల్

ఎలుగుబంట్ల దాడిలో యువకులకు తీవ్ర గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, ఆగస్టు 11: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జలాల్‌పూర్‌లోని హజ్రత్ సయ్యద్‌షాదుల్లా హుస్సేనీ దర్గా(బడాపహాడ్)ను దర్శించుకునేందుకు వచ్చిన నలుగురు యువకులు అనుకోని రీతిలో ఎలుగుబంట్ల బారినపడి తీవ్రంగా గాయపడ్డారు. వారిలో జహంగీర్ అనే యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్‌కు చెందిన జహంగీర్ మరో ముగ్గురు మిత్రులతో కలిసి బడాపహాడ్ దర్గాను దర్శించుకునేందుకు శనివారం ఇక్కడికి వచ్చారు. గుట్టపై కొలువైన షాదుల్లా హుస్సేనీ బాబాను మిత్రుల బృందం దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం దర్గా నుండి దాదాపు కిలోమీటరు దూరంలో గుట్ట పై భాగానే్న అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న వజూ కా పహాడ్‌ను సైతం దర్శించుకునేందుకు వీరు నలుగురు కాలినడకన వెళ్తున్నారు. ఈ సందర్భంగా ఐదు ఎలుగుబంట్ల సమూహం ఒక్కసారిగా వీరిపై దాడికి దిగింది. ఊహించని ఈ హఠాత్ పరిణామానికి జహంగీర్, ఇతర మిత్రులు హతాశులయ్యారు. అప్పటికే ఎలుగుబంట్లు జహంగీర్‌ను లక్ష్యంగా చేసుకుని అతనిపై విరుచుకుపడ్డాయి. తల భాగంతో పాటు ఇతర శరీర భాగాల్లో లోతైన గాయాలు చేశాయి. తేరుకున్న మిత్రులు సమీపంలో చేతికందిన కర్రలతో ఎలుగుబంట్లను తరిమే ప్రయత్నం చేయగా, వారిని కూడా గాయపర్చాయి. అయినప్పటికీ మిత్రులు వాటిని కర్రలతో బెదిరించడంతో ఎట్టకేలకు అటవీ ప్రాంతంలోకి పారిపోయాయి. బతుకుజీవుడా అంటూ ముగ్గురు మిత్రులు తీవ్రంగా గాయపడిన జహంగీర్‌ను తీసుకుని దర్గా ప్రాంతం వద్దకు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న తోటి భక్తులు హుటాహుటిన 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి, క్షతగాత్రులను నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. జహంగీర్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ సంఘటనతో బడాపహాడ్ పుణ్యక్షేత్రంతో పాటు పరిసర ప్రాంత ప్రజల్లోనూ భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
కాగా, పక్షం రోజుల క్రితమే నిజామాబాద్ జిల్లా కేంద్రానికి ఆనుకుని ఉండే డిచ్‌పల్లి మండలం ధర్మారం గ్రామంలో ఎలుగుబంట్లు హల్‌చల్ సృష్టించిన విషయం విదితమే. సమీప అటవీ ప్రాంతం నుండి వచ్చిన రెండు ఎలుగుబంట్లు గ్రామంలో స్వైర విహారం చేస్తూ ఐదుగురిని గాయపర్చాయి. ఓ ఎలుగుబంటి పురాతన ఇంటి ఆవరణలో గల పొదల్లో నక్కి కూర్చోగా దానిని పట్టుకునేందుకు హైదరాబాద్‌లోని జూలాజికల్ పార్కుకు చెందిన రెస్క్యూ టీంను పిలిపించాల్సి వచ్చింది. ప్రత్యేక బృందం ఇక్కడికి చేరుకుని గంటల తరబడి శ్రమించిన మీదట అతికష్టం మీద ఎలుగుబంటిని బంధించి జూకు తరలించారు. ఈ సంఘటనను మర్చిపోకముందే తాజాగా బడాపహాడ్‌లో భక్తులపై ఎలుగుబంట్లు దాడి చేయడం కలకలం సృష్టిస్తోంది. ఎలుగుబంట్లు సమూహంగా తిరుగుతూ మనుషులపై దాడులు చేస్తున్నందున వాటి బారి నుండి రక్షణ కల్పించేందుకు అటవీ శాఖ అధికారులు తగు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఇదివరకు వంట చెరుకు, తునికాకు సేకరణ కోసం దట్టమైన అటవీ ప్రాంతంలోనికి వెళ్లిన వారిపై అడపాదడపా ఎలుగులు దాడి చేసే సంఘటనలు జరిగేవని, ప్రస్తుతం జనావాసాల మధ్యకు వచ్చి దాడులు చేస్తున్నాయని ప్రజలు భయాందోళన చెందుతున్నారు.