క్రైమ్/లీగల్

పేదల రక్తం పీల్చిన వడ్డీ వ్యాపారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 7: పేదలు, చిరుద్యోగుల బలహీనతలను ఆసరా చేసుకున్న ఓ వడ్డీ వ్యాపారి జలగలా వారి రక్తాన్ని పీల్చి పిప్పిచేసిన దారుణం గుంటూరు నగరంలో వెలుగు చూసింది. సంతకాలు చేసిన ఖాళీ ప్రామిసరీ నోట్‌లు, చెక్కులను స్వలాభానికి వాడుకుని ఇచ్చిన మొత్తానికి వందల రెట్లు వడ్డీ వేసి ముక్కుపిండి వసూలు చేస్తున్న వడ్డీ బకాసురుడిని పోలీసులు కటకటాల వెనక్కుపంపారు.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గుంటూరు నగరంలోని కొరిటెపాడు ప్రాంతానికి చెందిన కొండమడుగుల రత్నారెడ్డి కొత్తపేట పోలీసుస్టేషన్ పరిధిలోని రాజాగారితోటలో శ్రీ లక్ష్మీ గణపతి ఆంజనేయ ఫైనాన్స్ కంపెనీ నడుపుతున్నాడు. స్థానిక రైల్వేక్వార్టర్స్‌లో ఉంటున్న ఓ చిరుద్యోగి 2007లో ఏడాదికి నూటికి 2 రూపాయల వడ్డీ చొప్పున 10 వేల రూపాయలను అప్పుగా తీసుకుని ఖాళీ నోట్లపై సంతకాలు పెట్టి వడ్డీ వ్యాపారి రత్నారెడ్డికి ఇచ్చారు. అయితే వ్యాపారి నాలుగు రూపాయల చొప్పున వడ్డీ వసూలు చేసినప్పటికీ మొత్తం డబ్బును చిరుద్యోగి చెల్లించాడు. అయితే సంతకాలు చేసిన ప్రామిసరీ నోట్లను తిరిగి రైల్వే ఉద్యోగికి అప్పగించకుండా వేరొకరికి 4 లక్షల రూపాయలు అప్పుకు హామీ ఉన్నట్లు కోర్టుకు చూపి డిక్రీ పొంది నెలకు రూ. 10 వేలు చొప్పున 8,50,103 రూపాయలను అక్రమంగా వసూలు చేశాడు. దీనిపై బాధితుడు అర్బన్ ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణకు స్పందనలో ఫిర్యాదు చేయగా తక్షణం కేసు నమోదు చేసి విచారించాల్సిందిగా కొత్తపేట పోలీసులకు సూచించారు. దీనిపై సీఐ ఎస్‌వి రాజశేఖరరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. సంబంధిత వ్యాపారి ఫైనాన్స్ కంపెనీ, నివాసంపై ఆకస్మిక దాడులు నిర్వహించగా సంతకాలు చేసిన ఖాళీ ప్రామిసరీ నోట్‌లు, చెక్కులు, పాస్ పుస్తకాలు, విక్రయ దస్తావేజులు, ఏటీఎం కార్డులు పెద్ద ఎత్తున బయటపడ్డాయి. వివిధ వ్యక్తులకు చెందిన 225 ఏటీఎం కార్డులు, 38 మందికి చెందిన పాస్ పుస్తకాలు, సంతకాలు చేసిన 102 ప్రామిసరీ నోట్‌లు, సంతకాలు చేసిన 293 చెక్కులు, 20 విక్రయ దస్తావేజులు, 8 పట్టాదార్ పాస్ పుస్తకాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత వ్యాపారి ఏటా సుమారు 3 కోట్ల రూపాయలకు పైగా వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నప్పటికీ ఎటువంటి ఆదాయ పన్ను చెల్లించక పోవడాన్ని సైతం పోలీసులు గుర్తించారు. వెంటనే వ్యాపారి రత్నారెడ్డిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపారు.
దీనిపై అర్బన్ ఎస్పీ రామకృష్ణ మాట్లాడుతూ సమాజంలో ఇటువంటి ఫైనాన్స్ వ్యాపారులు అనేక మంది చిరుద్యోగులు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారిని, పేద ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని అధిక వడ్డీలు గుంజుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఎవరైనా బాధితులు ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే ఎంతటి వారిపైనైనా చర్యలు తప్పవని స్పష్టం చేశారు.