క్రైమ్/లీగల్

లోకాయుక్తగా జస్టిస్ లక్ష్మణరెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (లీగల్) : రాష్ట్ర విభజన అనంతరం తొలిసారిగా లోకాయుక్తను నియమించారు. పూర్వపు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీ లక్ష్మణరెడ్డిని ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆంధ్రరాష్ట్ర లోకాయుక్తగా ఐదేళ్లపాటు లక్ష్మణరెడ్డి కొనసాగనున్నారు. ఈ మేరకు గవర్నర్ ఉత్తర్వులను గెజిట్ నోటిఫికేషన్ ద్వారా వెలువరించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల లోకాయుక్త చట్టాన్ని సవరించిన సంగతి విదితమే. దీని ప్రకారం హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి లేక పూర్వ న్యాయమూర్తిని లోకాయుక్తగా నియమించాలని నిబంధనలు సవరించారు. ఇందులో భాగంగా జస్టిస్ పీ లక్ష్మణరెడ్డి పేరును ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఖరారు చేయగా హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చాగారి ప్రవీణ్‌కుమార్ కూడా ఆమోదించారు. ప్రస్తుతం లోకాయుక్తకు ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, పార్లమెంటరీ కార్యదర్శులపై వచ్చే ఫిర్యాదులను పరిశీలించి విచారించే అధికారం ఉంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, చీఫ్ విప్, ప్రజా వ్యవహారాలకు సంబంధించి ప్రభుత్వం నియమించే ఏ అధికారిపైనైనా లోకాయుక్త విచారణ జరపవచ్చు. న్యాయమూర్తులు, న్యాయశాఖ
సర్వీసులకు సంబంధించిన అధికారులు, వ్యక్తులు దీని పరిధిలోకి రారు. ప్రజా వ్యవహారాలకు సంబంధించి అధికారులతో పాటు జెడ్పీ, మండల పరిషత్ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్‌లు, సభ్యులు, సర్పంచ్, ఉప సర్పంచ్, మేయర్, డిప్యూటీ మేయర్, వార్డు సభ్యులు, మున్సిపల్ చైర్‌పర్సన్, ఇతర సభ్యులపై వచ్చే ఫిర్యాదులన్నింటిపైనా లోకాయుక్త తన కొరడా ఝుళిపించవచ్చు. న్యాయశాఖతో పాటు ఏపీ అకౌంటెంట్ జనరల్, ఏపీపీఎస్‌సీ చైర్మన్, సభ్యులు, ఎన్నికల అధికారులు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఇతర సభ్యులను విచారించే పరిధి లోకాయుక్తకు ఉండదు. ఇలా ఉండగా అవినీతి, అధికార దుర్వినియోగం తదితర అంశాల్లో భారతదేశ ప్రతిపౌరుడు లోకాయుక్తను ఆశ్రయించవచ్చు. ఫిర్యాదిదారు తన పూర్తి వివరాలతో ఫారం-1,2 పూర్తిచేసి లోకాయుక్త రిజిస్ట్రారు పేరిట 150 రూపాయల ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఫిర్యాదు తప్పుడుదని తేలితే ఫిర్యాదిదారుడిని ప్రాసిక్యూషన్ చేసి గరిష్ఠంగా ఏడాది జైలు శిక్ష కూడా విధించవచ్చు.
చిత్రం... జస్టిస్ లక్ష్మణరెడ్డి