క్రైమ్/లీగల్

ప.గో.లో ప్రేమోన్మాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోడూరు: ప్రేమోన్మాదం మరోసారి కట్టలు తెంచుకుంది... పెళ్లయ్యి, తండ్రి అవతారమెత్తి, నాలుగు పదుల వయసుకు దగ్గరలో ఉన్న ఓ వ్యక్తి ప్రేమ పేరుతో ఉన్మాదిలా మారి, రెచ్చిపోయాడు... రెండేళ్లుగా ప్రేమ పేరుతో వెంటపడుతూ, పెళ్లి చేసుకోమని వేధిస్తున్న ఒక విద్యార్థినిని కళాశాలకు వెళుతున్న సమయంలో కత్తితో తెగనరికాడు... అడ్డుకోబోయిన మరో వ్యక్తినీ గాయపరిచాడు... అప్పటికే పురుగుల మందు తాగివున్న నిందితుడిని, స్థానికులు బంధించారు... తల, భుజం, వీపుపై తీవ్ర గాయాలతో ప్రాణాపాయస్థితిలో ప్రస్తుతం బాధితురాలు చికిత్సపొందుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం కవిటం గ్రామంలో బుధవారం ఉదయం ఈ ఘాతుకం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం వివరాలిలావున్నాయి... పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడుకు చెందిన కొవ్వూరి తేజస్విని (22) పెనుగొండ కళాశాలలో ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చదువుతోంది. చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో పోడూరు మండలం కవిటం గ్రామంలోని అమ్మమ్మ నల్లమిల్లి జయలక్ష్మి, మేనమామ శ్రీనివాసరెడ్డి వద్ద
ఉండి తేజస్విని చదువుకుంటోంది. తల్లి, సోదరుడు పెంటపాడులో ఉంటారు. రోజూ ఇంటి నుండి సైకిల్‌పై కవిటం సెంటర్‌కు వచ్చి, అక్కడ సైకిల్ స్టాండులో ఉంచి, ఆర్టీసీ బస్సులో కళాశాలకు వెళుతుంది.
కాగా అదే గ్రామానికి చెందిన మేడపాటి సుధాకర్‌రెడ్డి (38) గత రెండేళ్లుగా ప్రేమిస్తున్నానంటూ తేజస్విని వెంటపడేవాడు. తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరంలోని ఒక పెట్రోలు బంకులో పనిచేసే సుధాకర్‌రెడ్డికి పెళ్లయి, కుమార్తె కూడావుంది. భార్యాభర్తల నడుమ వివాదాల కారణంగా కోర్టులో కేసు నడుస్తున్నట్టు సమాచారం. తన భార్యకు విడాకులిచ్చి, పెళ్లి చేసుకుంటానని తేజస్వినిని వేధించేవాడు. సుధాకర్‌రెడ్డి వేధింపులను తట్టుకోలేక తేజస్విని ఈ విషయాన్ని అమ్మమ్మ, మేనమామ దృష్టికి తీసుకెళ్లడంతో గ్రామ పెద్దలకు తెలిపారు. మూడు నెలల క్రితం పెద్దలు సుధాకర్‌రెడ్డిని మందలించి, ఇకపై తేజస్విని వెంటపడబోనని లేఖ రాయించారు. అప్పటి నుంచి కక్షపెంచుకున్న సుధాకర్‌రెడ్డి అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. బుధవారం ఉదయం కవిటం సెంటర్‌కు వచ్చిన తేజస్విని సైకిల్‌ను స్టాండులో ఉంచుతున్న సమయంలో అక్కడకు చేరుకున్న సుధాకర్‌రెడ్డి కత్తితో ఆమెపై దాడిచేశాడు. భయంతో ఆమె పక్కనే ఉన్న ద్వారంపూడి జనార్థన్‌రెడ్డి ఇంటి ఆవరణలోకి పరుగెత్తింది. అక్కడ తేజస్విని తల, భుజం, వీపుపై కత్తితో విచక్షణారహితంగా నరికాడు. దీనితో ఆమె రక్తపుమడుగులో కుప్పకూలిపోయింది. ఈ దారుణాన్ని గమనించిన జనార్థన్‌రెడ్డి ఇంట్లో అద్దెకుంటున్న బాలాజీరెడ్డి అనే వ్యక్తి సుధాకర్‌రెడ్డిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఈ సందర్భంగా బాలాజీ చేతికి గాయమయ్యింది. మొత్తానికి స్థానికులు సుధాకర్‌రెడ్డిని నిలువరించారు. అయితే అప్పటికే అతడి నోటి నుండి నురగలు వస్తుండటంతో పురుగులమందు తాగి వచ్చాడని గ్రహించారు.
కాగా దాడి సమాచారం అందుకున్న పోడూరు ఎస్సై సురేంద్రకుమార్, పాలకొల్లు రూరల్ సీఐ జి వెంకటేశ్వరరావు, నరసాపురం డీఎస్పీ నాగేశ్వరరావు హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన తేజస్వినిని పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం.
కాగా పురుగులమందు తాగి, అస్వస్థతకు గురైన సుధాకర్‌రెడ్డిని పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ అతడు కోలుకుంటున్నాడు. నిందితుడిపై నిర్భయ చట్టం, హత్యాయత్నం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పోడూరు ఎస్సై సురేంద్రకుమార్ తెలిపారు.

*చిత్రాలు.. పాలకొల్లు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న తేజస్విని
*నిందితుడు సుధాకర్‌రెడ్డి