క్రైమ్/లీగల్

సర్కారు బడిలో విద్యుదాఘాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, అక్టోబర్ 25: విద్యార్థుల భావి జీవితానికి బాటలు వేయాల్సిన సర్కారు బడిలో, అస్తవ్యస్త పరిస్థితులు నెలకొని ఓ బాలుడి నిండు ప్రాణాలను బలిగొన్నాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోటగల్లిలో గల ఫులాంగ్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న అయాన్ ఖాన్ (11) అనే బాలుడు బడి ఆవరణలో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. అధికారులు, పాఠశాల నిర్వాహకుల నిర్లక్ష్య వైఖరి వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని స్థానికులు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించిన జిల్లా కలెక్టర్ ఎం.రామ్మోహన్‌రావు సమగ్ర విచారణ జరిపి నివేదిక అందించాలని నిజామాబాద్ ఆర్డీఓ వెంకటేశ్వర్లును ఆదేశించారు. శుక్రవారం చోటుచేసుకున్న ఈ విషాదకర సంఘటన వివరాలిలా ఉన్నాయి. అసద్‌బాబానగర్‌కు చెందిన సిరాజ్‌ఖాన్, నాజియా దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. ఆటోరిక్షా నడుపుతూ జీవనం కొనసాగిస్తున్న సిరాజ్‌ఖాన్ తన పిల్లలను కోటగల్లిలో గల ఫులాంగ్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదివిస్తున్నాడు. అతని మొదటి కుమారుడైన అయాన్‌ఖాన్ ఇదే బడిలో ఐదవ తరగతి చదువుతున్నాడు. రోజువారీలాగే సిరాజ్‌ఖాన్ తన పిల్లలను శుక్రవారం ఆటోరిక్షాలో బడి వద్ద విడిచిపెట్టి వెళ్లాడు. మధ్యాహ్నం భోజనం చేసిన అనంతరం విరామ సమయంలో అయాన్‌ఖాన్ బడి ఆవరణలో ఆడుకుంటున్నాడు. ఇటీవల కురిసిన వర్షాలకు బడి ఆవరణ అంతా బురదమయంగా మారింది. ఈ క్రమంలోనే అయాన్‌ఖాన్ ఆడుకుంటూ బురదలో జారిపడే సమయంలో నిలదొక్కుకునేందుకు వీలుగా చేతికందే ఎత్తులో వేలాడుతున్న విద్యుత్ సర్వీస్ కేబుల్ సపోర్టర్ (జీఐ వైర్)ను పట్టుకున్నాడు. పాఠశాలలో అస్తవ్యస్త విద్యుత్ వ్యవస్థ నెలకొని ఉన్న కారణంగా జీ.ఐ వైర్‌లోకి విద్యుత్ ప్రవాహం కొనసాగుతుండడంతో దానిని పట్టుకున్న అయాన్‌ఖాన్ కరెంట్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సమాచారం తెలుసుకుని పరుగుపరుగున బడికి చేరుకున్న బాలుడి తల్లిదండ్రులు, కుటుంబీకులు చిన్నారి మృతదేహాన్ని చూసి గుండెలవిసేలా రోదించారు. పాఠశాల నిర్వాహకులు, ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థి మృతి చెందాడని స్థానికులు ఆగ్రహం వెలిబుచ్చారు. బడికి విద్యుత్ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం వల్ల చాలారోజుల నుండి గోడలను ముట్టుకున్న సందర్భాల్లోనూ కరెంట్ షాక్ కొడుతోందని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇప్పటికే అనేక పర్యాయాలు పాఠశాల ఉపాధ్యాయుల దృష్టికి తెచ్చామని పేర్కొన్నారు. అయినప్పటికీ పరిస్థితిని చక్కదిద్దలేకపోయారని, ఈ విషయమై ట్రాన్స్‌కో సిబ్బంది కూడా సర్వీస్ కేబుల్‌ను మార్చే విషయంలో స్పందించలేదని ఆక్షేపించారు. చివరకు చిన్నారులకు సైతం చేతికందే ఎత్తులో ప్రమాదకరంగా ఉన్న సర్వీస్ వైర్‌ను కూడా సరి చేయించలేదని, ఈ అలసత్వమే అయాన్‌ఖాన్ ప్రాణాన్ని బలిగొందని ఆవేదన వెలిబుచ్చారు. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే విద్యార్థి మృతి చెందాడని ఆరోపిస్తూ పీడీఎస్‌యూ, ఎన్‌ఎస్‌యూఐ, ఏఐఎస్‌ఎఫ్ తదితర విద్యార్థి సంఘాలు పాఠశాల వద్ద ధర్నా నిర్వహించాయి. విషయం తెలుసుకుని బడి వద్దకు చేరుకున్న డీఈఓను బాధిత కుటుంబీకులు, స్థానికులు ఘెరావ్ చేసి గట్టిగా నిలదీశారు. పోలీసులు జోక్యం చేసుకుని వారిని శాంతింపజేశారు.
ఈ ప్రమాద సమాచారం తెలుసుకున్న కలెక్టర్ ఎం.రామ్మోహన్‌రావు, సంఘటనను తీవ్రంగా పరిగణిస్తూ సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆర్డీఓ వెంకటేశ్వర్లును ఆదేశించారు. శవ పంచనామా జరిపి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.