క్రైమ్/లీగల్

మార్చ్‌కి అనుమతి లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 8: తమ డిమాండ్ల సాధన కోసం తెలంగాణ ఆర్టీసీ జేఏసీ తలపెట్టిన చలో ట్యాంక్‌బండ్‌కు అనుమతి లేదని తెలంగాణ రాష్ట్ర పోలీసు అదనపు డైరెక్టర్ జనరల్ (శాంతి భద్రతలు) జితేందర్ స్పష్టం చేశారు. శాంతి భద్రతలకు అటంకం కలిగిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన చలో ట్యాంక్‌బండ్ కార్యక్రమం సందర్భంగా, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక చెక్ పోస్టులను ఏర్పాటు చేసి కార్మికులు, మద్దతుదారులు హైదరాబాద్‌కు రాకుండా కట్టడి చేస్తున్నామని పేర్కొన్నారు. గత 35 రోజుల నుంచి జరుతున్న ఆర్టీసీ సమ్మె కారణంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలలోని బస్టాండ్, బస్ డీపోల వద్ద పోలీసు పికెట్‌లు కొనసాగుతున్నాయని తెలిపారు. శనివారం నిర్వహించతలపెట్టిన చలో ట్యాంక్‌బండ్‌కు ఎట్టిపరిస్థితుల్లో అనుమతించే ప్రసక్తిలేదని జితేందర్ తేల్చిచెప్పారు. గత రెండు రోజుల నుంచి హైదరాబాద్‌కు వచ్చే ప్రతి వాహనాన్నీ తనిఖీ చేస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో పాల్గొన్న రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డీజీపీ) ఎం.మహేందర్ రెడ్డి శాంతి భద్రతలపై దృష్టి సారించినట్టు చెప్పారు. డీజీపీ పోలీసు ఉన్నాతాధికారులతో సమావేశమై చలోట్యాంక్‌బండ్ సందర్భంగా శాంతి భద్రతలకు ఏలాంటి అటంకం కలుగకుండా ఉండేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన ఎస్పీలు, కమిషనర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి, ప్రతి వాహనాన్నీ క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతే అనుమంతించాలని వెల్లడించారు. కాగా, ఆర్టీసీ జేఏసీ చలో ట్యాంక్‌బండ్ పిలుపు నేపథ్యంలో శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి సారించి ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్టు జితేందర్ తెలిపారు. ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే, కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రాష్టవ్య్రాప్తంగా అన్ని జిల్లాలో పోలీసు బందోబస్తును ముమ్మరం చేశామని తెలిపారు. అన్ని జిల్లాలకు చెందిన ఏస్పీలు, ఆయా కమిషనరేట్‌ల కమిషనర్లను అప్రమత్తం చేసినట్లు జితేందర్ తెలిపారు. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ చుట్టుప్రక్కల ప్రాంతాలను పోలీసులు తమ పరిధిలోకి తీసుకున్నట్టు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ముందస్తు చర్యగా అనేక మంది రాజకీయ నాయకులను, ఆర్టీసీ జేఏసీ నేతల కదలికలపై నిఘాను ముమ్మరం చేసినట్టు తెలిపారు. చలో ట్యాంక్‌బండ్‌కు ప్రభుత్వ పరంగా ఏలాంటి అనుమతి లేదని, ఈ నేపథ్యంలో ట్యాంక్‌బండ్ వైపు ఎవ్వరూ వెళ్లరాదని ఆయన సూచించారు. ఇలావుంటే, డీజీపీ అదేశాల మేరకు హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ ఇతర పోలీసు ఉన్నతాధికారులతో కలిసి ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాలను సందర్శించి ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాట్లను సమీక్షించారు. ట్యాంక్‌బండ్ వైపు వచ్చేరోడ్లను బారికేడ్‌లతో మూసివేశారు. రాణిగంజ్, ఖైరతాబాద్, నాంపల్లి, అబిడ్స్, ఎల్‌బీ స్టేడియం, హిమత్‌నగర్ తదితర ప్రాంతాల్లో ప్రత్యేక పోలీసు చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. ఎట్టిపరిస్థితుల్లో ఆర్టీసీ జేఏసీ తలపెట్టిన చలో ట్యాంక్‌బండ్ కార్యక్రమాన్ని విజయవంతం కానివ్వబోమని పోలీసు అధికారులు స్పష్టం చేస్తున్నారు.
పోరు ఉధృతం
ఆర్టీసీ కార్మికులు సమ్మెను మరింత ఉధృతం చేశారు. మానవహారాలు, భిక్షాటనలు, అర్ధనగ్న ప్రదర్శనలతో హోరెత్తిస్తున్నారు. నిరసనలు, ఆందోళనలతో సెమ్మె కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మొండి వైఖరి విడనాడి, సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, ఆర్టీసీ జేఏసీతో వివిధ పార్టీలు ఆర్టీసీ కార్మికులకు తగిన న్యాయం జరుగాలని కోరుతూ మిలియన్ మార్చ్ తరహాలో శనివారం చలో ట్యాంక్‌బండ్ నిర్వహించేందుకు తలపెట్టింది. ఈ కార్యక్రమానికి కార్మిక సంఘాలతో పాటు రాజకీయ పార్టీలు కూడా పూర్తి మద్దతు తెలిపాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ చలో ట్యాంక్‌బండ్ కార్యక్రమాన్ని విజయవంతం చేసి తీరుతామని ఆర్టీసీ జేఏసీ ధీమా వ్యక్తం చేసింది. ప్రభుత్వం ఎన్ని అవాంతరాలను కల్పించినా వెనుకంజ వేసే ప్రసక్తి లేదని జేఏసీ నేతలు స్పష్టం చేస్తున్నారు.