క్రైమ్/లీగల్

32 నాటు తుపాకులు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, డిసెంబర్ 26: జిల్లాలో పలు చోట్ల దాడులు నిర్వహించి 32 నాటు తుపాకులను స్వాధీనం చేసుకోవడంతో పాటు, పలు చోట్ల చోరీలకు పాల్పడుతున్న తమిళనాడుకు చెందిన ముఠాను, జిల్లాలో రాగి వైర్ల కోసం వ్యవసాయ పొలాల వద్ద ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేస్తున్న గ్యాంగ్‌ను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ వెల్లడించారు. బుధవారం చిత్తూరులో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రానున్న సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అక్రమ తుపాకులను ఏరివేయడానికి స్పెషల్ పార్టీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ పార్టీకి వచ్చిన సమాచారంతో జిల్లాలోని అటవీ సరిహద్దు ప్రాంతాల్లో అక్రమంగా దాచి ఉంచిన 32 నాటు తుపాకులను స్వాధీనం చేసుకొన్నట్లు పేర్కొన్నారు. గుడిపాల మండలం చిత్తపార అటవీ ప్రాంతంలో దాచి ఉంచిన 10 నాటు తుపాకులను, యాదమరి మండలం భూమిరెడ్డిపల్లి సమీపంలోని కౌండిన్య అడవిలో 12, తవణంపల్లి మండలం ఎర్రకొండకు అడవి ప్రాంతంలో దాచి ఉంచిన పది నాటు తుపాకులను స్వాధీనం చేసుకొన్నట్లు వివరించారు. గతంలో కూడా స్పెషల్ డ్రైవ్‌తో పలు ప్రాంతాల్లో నిల్వ ఉంచిన తుపాకులను స్వాధీనం చేసుకున్నామని, అటవీ సరిహద్దు ప్రాంతాల్లో నేటికీ వేట కోసం కొందరు అక్రమంగా నాటు తుపాకులు కల్గి ఉన్నట్లు సమాచారం వచ్చిందన్నారు. దీంతో జిల్లాలో అక్రమ తుపాకులను ఏరివేడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. లైసెన్స్ లేకుండా తుపాకులు కల్గి ఉండటం చట్టరీత్యా నేరమన్నారు. అక్రమంగా తుపాకులు కల్గి ఉంటే అటువంటి వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని ఎస్పీ హెచ్చరించారు.
చోరీ ముఠా అరెస్టు
ఇంటి తాళాలు పగుల గొట్టి చోరీలకు పాల్పడుతున్న తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఇద్దరిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ. 1.75లక్షల విలుల చేసే బంగారు, వెండి నగలను, రూ. 20 వేల నగదును స్వాధీనం చేసుకొన్నట్లు ఎస్పీ తెలిపారు. తమిళనాడు వాలాజికి చెందిన బాలాజీ (38), వేలూరుకు చెందిన శివం (29)లు జిల్లాలో పలు చోట్ల చోరీలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న వీరిని మంగళవారం కల్లూరు సమీపంలో వల పన్ని పట్టుకొన్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఈ ఏడాది వీరు ఇరువురు కల్లూరులోని వైన్ షాపులో చొరబడి రూ. 48వేల నగదును, గుడిపాల మండలం చీలాపల్లిలోని వెంకటేష్‌కు చెందిన ఇంటి తాళాలు పగుల గొట్టి బీరువాలో ఉన్న బంగారు, వెండి నగలు, రూ. 36వేల నగదును, ఐరాల మండలం వైస్ గేట్‌లోని చాముండేశ్వరి ఆలయం హుండీ పగులగొట్టి అందులో ఉన్న కొంత నగదుతో పాటు అమ్మవారి విగ్రహానికి ఉన్న బంగారు, వెండి అభరాణాలు, పాకాల మండలం గట్టుపల్లికి చెందిన రామ్మూర్తి ఇంటిలోకి చొరబడి సుమారు 20 గ్రాములు బంగారు నగలను దోచుకెళ్లినట్ల ఎస్పీ వివరించారు. వీరిపై తమిళనాడులో కూడా అనేక కేసులు ఉన్నాయని, బాలాజీ కోసం తమిళనాడు పోలీసులు గాలిస్తున్నారని, ఇతనిపై పీడీ యాక్టు పెట్టడానికి తమిళనాడు పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు తెలిపారు. వీరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు చెప్పారు.
విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేస్తున్న ముఠా అరెస్టు
జిల్లాలో రాగి వైర్ల కోసం వ్యవసాయ పొలాల వద్ద విద్యుత్ శాఖకు చెందిన ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేస్తున్న ఆరుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి భారీ మొత్తంలో కాపర్, అల్యూమినియం కేబుల్ వైర్లను స్వాధీనం చేసుకొన్నట్లు ఎస్పీ వివరించారు. జిల్లాలో ఇటీవల విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసి అందులోని రాగి వైర్లను అపహరించి వివిధ ప్రాంతాల్లో విక్రయిస్తూ సొమ్మ చేసుకుంటున్నారని, దీని వల్ల రైతులు అనేక ఇబ్బందులకు గురయ్యేవారని, ఈ విషయంపై పలు పోలీసుస్టేషన్లలో అనేక కేసులు నమోదైనట్లు ఆయన తెలిపారు. ఈ ముఠాను పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేయగా దొంగలించిన రాగి వైర్లను విక్రయించడానికి వెళుతున్న ఈ ముఠా సభ్యులైన పూతలపట్టు మండలం అండ్రవారిపల్లికి చెందిన రాజాబాబు, నవీన్, పెనుమూరు మండలం రాజేండ్ల గ్రామానికి చెందిన చిన్నబ్బ, పెద్దబ్బ, బాబు, సురేష్‌లను అరెస్టు చేసి వారి వద్ద నుంచి భారీ మొత్తంలో ట్రాన్స్‌ఫార్మర్ల వైర్లను స్వాధీనం చేసుకొన్నట్లు వెల్లడించారు. వీరిపై జిల్లాలో పలు పోలీసు స్టేషన్లలో 22 కేసులు నమోదు అయినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసులు ఛేదించిన పోలీసు సిబ్బందికి రివార్డులను అందజేసారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ సుప్రజ, చిత్తూరు డీఎస్పీ సుబ్బారావు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.