సంపాదకీయం

‘నిప్పు’కు చెదలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవినీతి చరిత్ర ఇలా పునరావృత్తం అవుతుండడం న్యాయవ్యవస్థకు మాత్రమే కాదు, రాజ్యాంగ వ్యవస్థకూ అప్రతిష్ఠ తెస్తున్న కళంకం.. అవినీతి ఆరోపణలకు గురైన అలహాబాద్ ఉన్నత న్యాయమూర్తి నారాయణ శుక్లా తన పదవికి రాజీనామా చేయకపోవడం ఈ పునరావృత్తి.. గతంలో కోల్‌కత హైకోర్టు న్యాయమూర్తి సౌమిత్ర సేన్, కర్నాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పి.డి. దినకరన్ పాల్పడిన అక్రమ ప్రక్రియకు నారాయణ శుక్లా పాల్పడుతుండడం ఈ పునరావృత్తి! అవినీతి ఆరోపణలు ప్రాథమికంగా ధ్రువపడిన వెంటనే ఆరోపణగ్రస్తులైన ఉన్నత న్యాయమూర్తులు తమ పదవులను త్యజించినట్టయితే వారిపట్ల సమాజానికి గౌరవం పెరుగుతుంది, న్యాయవ్యవస్థ పట్ల విశ్వాసం చెక్కుచెదరకుండా నిరంతరం కొనసాగుతుంది. కానీ ‘పట్టుకుని వేలాడినట్టు’గా ఉన్నత న్యాయమూర్తులు వ్యవహరించడం ‘న్యాయదేవత’కు విస్మయం కలిగిస్తున్న విపరిణామం. అవినీతిగ్రస్తమైన సౌమిత్ర సేన్ తన పదవికి రాజీనామా చేయాలని గతంలో సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి ఆదేశించారు. సౌమిత్ర సేన్ రాజీనామా చేయలేదు, మొండికెత్తాడు. చివరికి పార్లమెంటు తనను అభిశంసించడం ఖాయమని నిర్థారణ జరిగిన తరువాత ఆయన పదవీత్యాగం చేశాడు. పి.డి. దినకరన్ కూడా అభిశంసన తప్పదని తేలిన తరువాతే పదవి నుంచి వైదొలిగాడు. ప్రస్తుతం అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి నారాయణ శుక్లా ఇలా మొండికెత్తడం చారిత్రక పునరావృత్తి.. లక్నోలోని ఒక వైద్య కళాశాల యాజమాన్యానికి అ క్రమ ప్రయోజనం చేకూర్చడానికి నారాయణ శుక్లా యత్నించాడన్నది న్యాయవిచారణ సం ఘం వారు నిర్థారించిన నిజం. ఈ ‘అంతర్గత న్యాయ విచారణ సం ఘం’- ఇన్ హౌస్ క మిటీ- సర్వోన్నత ప్ర ధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఏర్పడింది. వైద్య కళాశాలకు అక్రమ ప్రయోజనం కల్పించడంలో నారాయణ శుక్లా సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాన్ని సైతం ధిక్కరించాడు.. అందువల్ల ఆయన పదవి నుంచి సగౌరవంగా తప్పుకుని ఉండాలి.. కానీ తప్పుకోలేదు. ఈ న్యాయమూర్తిని అభిశంసించడానికి పార్లమెంటులో తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని కోరుతూ ప్రధానమంత్రికి సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి ఉత్తరం రాయడం ఈ ప్రహసనంలో సరికొత్త పరిణామం. ఇలా ఉత్తరం రాసినట్లు వెల్లడైన తరువాతనైనా నారాయణ శుక్లా రాజీనామా చేయలేదు. ఆయనను విధులకు దూరంగా ఉంచాలని అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిర్ణయించాడట! ఆయనను ‘విచారణ’ బాధ్యతల నుంచి తప్పించారట! నారాయణ శుక్లా తొంబయి రోజులపాటు ‘సెలవు’ పుచ్చుకున్నాడట.. ఈ సెలవు గడువు ముగిసేలోగానైనా ఆయన తన పదవికి రాజీనామా చేస్తాడా?
లక్నోలోను ఇతర చోట్ల నడుస్తున్న వైద్య కళాశాలల్లో అక్రమాలు జరిగాయన్న కారణంగా 2017-18 విద్యా సంవత్సరంలో ఆయా కళాశాలల్లో విద్యార్థులను చేర్చుకోరాదని సర్వోన్నత న్యాయస్థానం గత ఏడాది ఆదేశించింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఏ హైకోర్టు కాని ఆదేశాలను జారీ చేయరాదని, ప్రవేశ అనుమతులను ఇవ్వరాదని కూడ సర్వోన్నత న్యాయస్థానం నిర్దేశించింది. కానీ లక్నోలోని ‘జీసీఆర్‌జీ’ స్మారక సంస్థ వారు నిర్వహిస్తున్న కళాశాలలో విద్యార్థులను చేర్చుకొనడానికి నారాయణ శుక్లా అధ్యక్షతన ఏర్పడిన ధర్మాసనం 2017 సెప్టెంబర్ ఒకటవ తేదీన అనుమతినిచ్చింది. అలహాబాద్ హైకోర్టుకు చెందిన ఈ లక్నో న్యాయపీఠం- బెంచ్-కు చెందిన ఈ ధర్మాసనంలోని మరో న్యాయమూర్తి పేరు వీరేంద్ర కుమార్. అర్హులైన అభ్యర్థులకు అనుమతులు నిరాకరించడం, అనర్హులైన వారి వద్ద భారీగా డబ్బు తీసుకుని వారికి ప్రవేశం కల్పించడం వంటి దుశ్చర్యలకు ఈ లక్నో కళాశాల, మరికొన్ని వైద్యశాలలు అనేక ఏళ్లుగా పాల్పడినట్టు నమోదైన అభియోగాలపై ‘కేంద్ర నేరపరిశోధక మండలి’- సీబీఐ- పరిశోధన జరిపింది. ఈ అవినీతి వ్యవహారంలో భాగస్వాములైన కొందరు ఐఎఎస్ అధికారులకు వ్యతిరేకంగా కూడ ఫిర్యాదులు నమోదయ్యాయి. కానీ ‘నాటకం’ కొనసాగుతున్న సమయంలో అంతర్ నాటకం వలే అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తులు సుప్రీం కోర్టును బాహాటంగా ధిక్కరించడమే విచిత్రమైన వ్యవహారం!
ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థల మనుగడ ప్రధానంగా స్వతంత్ర నిష్పాక్షిక స్వచ్ఛ న్యాయవ్యవస్థపై ఆధారపడి ఉంది. మన న్యాయవ్యవస్థ అంతర్జాతీయ గరిమను గడించింది. ప్రజాస్వామ్య వ్యవస్థల్లో అమెరికా అధ్యక్షుడు అత్యంత శక్తివంతుడని, మన సర్వోన్నత న్యాయస్థానం అత్యంత శక్తిమంతమైనదని రాజ్యాంగ కోవిదులు నిగ్గుతేల్చారు. రాజకీయ వేత్తలు, అధికారులు పాల్పడే అక్రమాల నుంచి దేశ ప్రజలకు రక్షణ కల్పిస్తున్నది న్యాయస్థానాలు మాత్రమే! ప్రజలకు న్యాయవ్యవస్థ రక్షణ ‘కవచం’! నేరస్థుల నుంచి, అవినీతి ప్రభావం నుంచి సామాన్య ప్రజలను కాపాడుతుంది. న్యాయస్థానాలు ‘దుర్భలస్య బలం రాజా..’ అన్నది తరతరాల భారతీయుల జీవన వాస్తవం. ‘శక్తిలేని వారిని కాపాడేది ప్రభుత్వం..’ ఈ విధిని ప్రజాస్వామ్య వ్యవస్థలలో నిర్వహిస్తున్నది న్యాయస్థానాలు. కాని ‘కంచె చేను మేస్తోంద’న్న అనుమానాలు ఇటీవలి కాలంలో పొడసూపడం మిక్కిలి దురదృష్టకరం. సర్వోన్నత న్యాయస్థానం సైతం తరచూ పొరపాట్లు చేస్తోందన్నది ధ్రు వపడిన నిజం. గవర్నర్లను వివాదాల్లో చేర్చరాదన్న రాజ్యాంగ నిబంధనకు వ్యతిరేకంగా సర్వోన్నత న్యాయస్థానం వారు గవర్నర్‌కు నోటీసులు పంపిన సందర్భాలున్నాయి. ఈ పొరపాట్లను సవరించుకోవడం హర్షణీయం.. కాని న్యాయమూర్తులు ఆర్థిక పరమైన అవినీతికి పాల్పడడమే అత్యంత ఆందోళన కలిగిస్తున్న విపరిణామం..
కోల్‌కత ఉన్నత న్యాయమూర్తి సౌమిత్రను 2011 ఆగస్టులో రాజ్యసభ అభిశంసించింది. న్యాయమూర్తిగా నియుక్తుడు కాక పూర్వం కొన్ని దావాలకు సంబంధించిన ఆస్తుల నిర్వాహకుడి- రిసీవర్-గా ఉండిన సమయంలో సౌమిత్ర సేన్ దాదాపు డెబ్బయి ఐదు లక్షల రూపాయలు కాజేశాడన్న ఆరోపణ ధ్రువపడింది. రాజీనామా చేయవలసిందిగా సౌమిత్ర సేన్‌ను అప్పటి సర్వోన్నత న్యాయమూర్తి బాలకృష్ణన్ 2008లో ఆదేశించారు. కాని సౌమిత్ర రాజీనామా చేయలేదు. రాజ్యసభ తనను అభిశంసించే వరకూ ఆయన ఆ ఆదేశాలను పాటించలేదు. లోక్‌సభ కూడా అభిశంసించడం ఖాయమని తేలిన తర్వాతనే ఆయన రాజీనామా చేశాడు. తమిళనాడులోని తిరువళ్లూర్ జిల్లాలో వందలాది ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా కాజేసిన కర్నాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడ సౌమిత్ర సేన్ పద్ధతిని పునరావృత్తం చేశాడు. రాజ్యాంగంలోని 217వ అధికరణం మేరకు పార్లమెంటు మూడింట రెండు వంతుల మెజారిటీతో అభిశంసిస్తే తప్ప రాష్టప్రతి కూడ హైకోర్టు న్యాయమూర్తులను తొలగింపజాలడు. న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తి పరిరక్షణ కోసం ఏర్పడిన ఈ రాజ్యాంగ నిబంధన- అవినీతిగ్రస్తులైన న్యాయమూర్తులు ఇలా ఏళ్ల తరబడి రాజీనామా చేయకుండా మొండికెత్తడానికి దుర్వినియోగం కావడం కాల వైపరీత్యం..