సంపాదకీయం

ఉగ్రభూతంపై ఉమ్మడి యుద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రచారం జరుగుతున్న స్థాయిలో ప్రభావం ఉండబోదన్నది ధ్రువపడనున్న వాస్తవం.. కానీ, బీభత్స వ్యతిరేక ఆర్భాటానికీ, ఆచరణకూ మధ్య అంతరం తగ్గిపోవడం గోవాలో జరిగిన ‘బ్రిక్స్’ ప్రభుత్వాధినేతల సమావేశంలో సంభవించిన ప్రధాన పరిణామం! పాకిస్తాన్ ప్రభుత్వాన్ని మరింత తీవ్రంగా ‘బ్రిక్స్’ కూటమి అభిశంసించడం ఈ పరిణామం. ‘బ్రిక్స్’- బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణ ఆఫ్రికా దేశాల కూటమి- ఇంత స్పష్టంగా పాకిస్తాన్ ప్రేరిత బీభత్సకాండను నిరసించడం ఇదే మొదటిసారి! గోవా సమావేశంలో పాల్గొన్న బ్రెజిల్ అధ్యక్షుడు మిచెల్ టెమర్, చైనా అధ్యక్షుడు ఝీ జింగ్ పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, దక్షిణ ఆఫ్రికా అధ్యక్షుడు జాకొబ్ జుమాతో కలసి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీభత్సకాండ- టెర్రరిజం-కు వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడం ఈ చారిత్రక పరిణామం. నరేంద్ర మోదీ మొత్తం ఐదు దేశాల ప్రభుత్వాధినేతల సమష్టి నిర్ణయాన్ని వెల్లడించారు. పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత బీభత్సకాండను అందువల్ల ‘బ్రిక్స్’ ఉమ్మడిగా నిరసించినట్టయింది. ‘గోవా ప్రకటన’ పత్రంలో కూడా ఇటీవల ‘బ్రిక్స్’ సభ్య దేశాలకు వ్యతిరేకంగా జరిగిన బీభత్సదాడులను తీవ్రంగా నిరసించారు. భారతదేశంపై ఇటీవల బీభత్సకారులు జరిపిన దాడులను ‘గోవా ప్రకటన’లో ప్రత్యేకించి పేర్కొనడం మన ప్రభుత్వ విధానానికి విజయం! మన దేశంపై దాడి చేసిన, చేస్తున్న జిహాదీ బీభత్సకారులను పాకిస్తాన్ ఉసిగొలుపుతోందన్నది జగమెరిగిన సత్యం. అందువల్ల భారత్‌కు వ్యతిరేకంగా జరిగిన బీభత్సకాండ- టెర్రరిజం-ను, ఉగ్రవాద- ఎక్స్‌ట్రీమిస్ట్- చర్యలను ఉమ్మడిగా నిరసించిన ఐదు దేశాలు ఈ దుశ్చర్యలను జరిపిస్తున్న పాకిస్తాన్‌ను తీవ్రంగా అభిశంసించినట్లయింది. అందువల్ల మన దేశానికి ఇది గొప్ప దౌత్య విజయం! 2014 జూలైలో బ్రెజిల్‌లోని షోర్బాతీఝా నగరంలో జరిగిన ‘బ్రిక్స్’ సమావేశంలో టెర్రరిజం గురించి పెద్దగా ప్రస్తావన జరగలేదు. మన ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలోను, అంతర్జాతీయ ద్రవ్యనిధి- ఐఎంఎఫ్- లోను సంస్కరణలను జరపాలన్న వాదాన్ని అపుడు తన ప్రసంగంలో ప్రముఖంగా ప్రస్తావించారు. టర్కీలోని అంతాలియా నగరంలో గత నవంబర్‌లో జరిగిన ఇరవై ప్రముఖ దేశాల కూటమి- జి-20- ప్రభుత్వాధినేతల సమావేశం సందర్భంగా ‘బ్రిక్స్’ ప్రభుత్వాధినేతలు విడిగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ‘బీభత్సకారులకు నిధులు లభించకుండా చర్యలు తీసుకోవాల’ని నరేంద్ర మోదీ సభ్య దేశాలను కోరారు. కానీ, ఇపుడు ‘సంయుక్త ప్రకటన’లో బీభత్సకాండను పురికొల్పుతున్న దేశాలను స్పష్టంగా అభిశంసించారు. ఇది ప్రధానంగా పాకిస్తాన్ ప్రభుత్వానికి ‘బ్రిక్స్’ నిరసన అన్నది ధ్వని..
ఈ ధ్వని అంతర్జాతీయంగా ప్రతిధ్వనించక మానదు! గత ఏడాది కంటె, రెండేళ్లకు పూర్వం కంటె బీభత్సకాండ పట్ల ‘బ్రిక్స్’ వ్యతిరేకత మరింతగా ప్రస్ఫుటించింది. ‘బ్రిక్స్’ గోవా సమావేశంలో ప్రధానంగా చర్చించిన మూడు అంశాలలో ‘బీభత్సకాండ’ అతి ముఖ్యమైనది. నరేంద్ర మోదీ వివరించిన ప్రకారం బీభత్సకాండను నిర్మూలించడం, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను మళ్లీ పట్టాలపై పరుగు తీయించడం, అంతర్జాతీయ సమాజ పరిపాలన- గ్లోబల్ గవర్నెన్స్- సమావేశంలో చర్చకు వచ్చాయట! మిగిలిన రెండు అంశాల విషయంలో చైనాతో మనకు పేచీ లేదు. కానీ, బీభత్సకాండ విషయంలో మాత్రం మనమూ చైనా పరస్పర విరుద్ధ విధానాలను అవలంబిస్తున్నాము. మన దేశంలోని ఉగ్రవాద మృగాలను ఉసి గొలుపుతున్న పాకిస్తాన్‌ను చైనా చంకనెత్తుకుని ఊరేగుతోంది. మసూద్ అఝార్ అనే కరడుగట్టిన నరమాంస భక్షకుడు మనదేశంలో అనేక బీభత్సకృత్యాలు జరిపాడు, జరిపించాడు. 2001లో పార్లమెంటు భవనంపై జరిగిన దాడి మొదలుకొని నిన్న మొన్న ఊరీలో మన సైనికులను దొంగచాటుగా దాడి చేసి హత్య చేయించడం వరకూ అనేకానేక రక్తపాతాలకు సూత్రధారి అఝార్. అతగాడు పాకిస్తాన్‌లో సురక్షితంగా ఉన్నాడు. అఝార్‌ను అంతర్జాతీయ బీభత్సకారుల జాబితాలో చేర్చడానికి ఐక్యరాజ్యసమితి చేస్తున్న ప్రయత్నాలను చైనా నిర్లజ్జగా అడ్డుకుంటున్నది. ‘అంతాలియా’ సమావేశం తరువాత రష్యా కూడా పాకిస్తాన్‌కు కొంత సన్నిహితం కావడం వెనుక చైనా హస్తం ఉంది, చైనా ప్రమేయం ఉంది. రష్యా అటు పాకిస్తాన్‌తో కలిసి సైనిక విన్యాసాలను నిర్వహించింది. ఇటు మనదేశంలో అత్యంత సాన్నిహిత్యాన్ని ప్రకటిస్తోంది. గోవాలో మనకు, రష్యాకు మధ్య డెబ్బయి రెండువేల కోట్ల రూపాయల విలువైన రక్షణ ఒప్పందం కుదరడం ఈ సాన్నిహిత్యానికి నిదర్శనం. అందువల్ల రష్యా పాకిస్తాన్ ప్రేరిత బీభత్సకాండను మనతో కలసి నిరసించడం ఆశ్చర్యం కాదు! మిగిలిన ‘బ్రిక్స్’ దేశాలతో కలసి బీభత్సకాండను నిరసించడానికి చైనా కూడా అంగీకరించడం మనకు లభించిన దౌత్య విజయం. ఇదీ ఎనిమిదవ ‘బ్రిక్స్’లో సంభవించిన ప్రధాన పరిణామం. ఆర్భాటానికీ, ఆచరణకు మధ్య అంతరం తగ్గిపోతోంది!
‘అంతరం’ తగ్గింది కానీ, పాకిస్తాన్‌ను బీభత్స రాజ్యాంగ వ్యవస్థగా ప్రకటించి ఒత్తిడి తెచ్చేందుకు చైనా, రష్యా అంగీకరిస్తాయా? అన్నది ప్రశ్న. బ్రెజిల్, దక్షిణ ఆఫ్రికా దేశాల మాట ఎలా ఉన్నప్పటికీ చైనా, రష్యాలు ఇలా పాకిస్తాన్‌ను స్పష్టంగా నిలదీయగలిగినపుడు మాత్రమే పాకిస్తాన్ పాలకులు దారికి వస్తారు. బీభత్సకాండను సమర్థిస్తున్న వారు, బీభత్సకాండను ఉసిగొలుపుతున్న వారు- బీభత్సకారులతో సమానులన్నది ‘గోవా ప్రకటన’ స్ఫూర్తి. దీన్ని ఆమోదించిన చైనా పాకిస్తాన్ ప్రభుత్వాన్ని నిలదీయగలదా? సంయుక్త ప్రకటనలో బీభత్సకాండను అభిశంసించినప్పటికీ పాకిస్తాన్‌ను పేరుపెట్టి నిరసించినట్టు సమాచారం లేదు. పాకిస్తాన్‌ను పేరు పెట్టి నిరసించనందువల్ల మాత్రమే చైనా సంయుక్త ప్రకటనకు ఆమోదించిందా? ‘అవును బీభత్సకాండను, ఉగ్రవాదాన్ని, ఉన్మాద ప్రవృత్తి- రాడికలేజేషన్-ని మేము నిరసిస్తున్నాము.. భారత్‌పై ఇటీవల జరిగిన ఉగ్రచర్యలను అభిశంసిస్తున్నాము.. కానీ పాకిస్తాన్ ఈ చర్యలకు కారణమని మేము చెప్పలేదు, గోవా సంయుక్త ప్రకటనలో చెప్పలేదు’- అని చైనా ప్రభుత్వం అనడానికి వీలుంది! ఇలా మాట మార్చడం చైనా ప్రభుత్వానికి అలవాటు! ఉదాహరణలు కోకొల్లలు! రష్యా ‘బ్రిక్స్’ సమావేశానికి ముందుగానే ‘్భరత వ్యతిరేక ఉగ్రవాదాన్ని విడనాడవలసిందిగా’ పాకిస్తాన్‌కు సూచించింది. రష్యా రాయబారి అలెగ్జాండర్ కదకూయిన్ ఈ విషయం వారం క్రితమే స్పష్టం చేశారు. అందువల్ల చైనా విధానంలో మార్పు వస్తుందా? అన్నది వేచి చూడదగిన అంశం..
‘బ్రిక్స్’ దేశాల ఉమ్మడి ద్రవ్యనిధి గత ఏడాది ఏర్పడింది. ఈ సంవత్సరం కాలంలో ఈ ‘నిధి’ కలాపాలలో ప్రగతి కనిపించిదట. ఆ ప్రగతి ఏమిటన్న వివరాలు మాత్రం వెల్లడి కాలేదు. ‘బ్రిక్స్’ దేశాలలో వికసించిన సంప్రదాయ శాస్ర్తియ విజ్ఞానం గురించి అధ్యయనం చేయడానికి, ఈ ప్రాచీన విజానాన్ని వర్తమాన సమాజానికి అన్వయించడానికి వీలుగా, కార్యాచరణను రూపొందించడానికి వీలుగా ఒక సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేస్తారట! ఆర్థిక, పారిశ్రామిక ప్రగతి, పర్యావరణ పరిరక్షణకు విఘాతం కారాదన్నది ‘బ్రిక్స్’ ప్రకటనలో మరో ఆదర్శం. కానీ, వైరుధ్యాలు అంతర్జాతీయ కార్యాచరణలో నిహితమై ఉన్నాయి.. ‘బ్రిక్స్’లో కూడా...