సంపాదకీయం

హిల్లరీ వైపే మొగ్గు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గతంలో ఎన్నడూ లేనంత ఉత్కంఠ, వివాదాలకు అమెరికా అధ్యక్ష ఎన్నికలు కేంద్రంగా మారాయి. అమెరికా చరిత్రను తిరగరాసి తొలి మహిళా అధ్యక్షురాలిగా శే్వత సౌధాన్ని హిల్లరీ అధిరోహిస్తారా? లేక వివాదాలే చిరునామాగా మారిన కాకలు తీరిన వ్యాపారవేత్త డొనాల్డ్ ట్రంప్ అనూహ్య రీతిలో విజయాన్ని సాధిస్తారా? అన్నది సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. మూడోసారి కూడా డెమొక్రటిక్ పార్టీయే అధికారంలోకి వస్తుందా ? లేక విజయపథంలో పరుగులు పెడుతున్న హిల్లరీ దూకుడుకు కళ్లెం వేసి రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ నెగ్గుకొస్తారా? అన్నది ఇప్పటికిప్పుడే చెప్పలేని పరిస్థితి. రాబోయే ఫలితం స్పష్టంగా కళ్లకు కడుతున్నప్పటికీ.. చివరి క్షణంలో పరిణామాలను, ముఖ్యంగా కొత్తగా వచ్చే ఓటర్లు తీసుకోబోయే నిర్ణయాన్ని ఇప్పటికిప్పుడే అంచనా వేయలేం. కారణం.. మొత్తం 50 రాష్ట్రాల్లో ఈ రెండు పార్టీలకు గణనీయమైన ఓటు బ్యాంకు ఉంది. అభ్యర్థి ఎవరన్నదానితో నిమిత్తం లేకుండా పార్టీ విధేయతలే ప్రామాణికంగా నవంబర్ 8న జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ఓటింగ్ జరుగుతుందని చెప్పడానికీ సందేహించాల్సిన అవసరం లేదు. ప్రైమరీలతో మొదలైన ఈ ఎన్నికల ప్రక్రియ చరమాంకానికి చేరుకోనున్న తరుణంలో రంగంలోని ఇద్దరు అభ్యర్థులు తమ బలాన్ని చాటుకోవడంలోనే కాదు, ప్రత్యర్థి బలహీనతల్ని ఎండగట్టడంలోనూ తలమునకలయ్యారు. అయితే.. ట్రంప్ కంటే హిల్లరీ మొదటి నుంచీ ఆధిక్యతను కనబరుస్తూనే రావడం వల్ల ప్రస్తుతం ఆమె విజయానికే అన్ని విధాలుగా సానుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హిల్లరీ అనుకూల వాతావరణం ఇంతగా బలపడటానికి డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద ప్రకటనలే చాలా వరకూ కారణమయ్యాయి. ఓ సారి ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడటం, మరోసారి మహిళల్ని కించపరిచేలా వ్యవహరించడం ఇలా.. తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతున్న ట్రంప్ తనకు ఉన్న అనుకూల వాతావరణాన్ని కూడా దెబ్బతీసుకుంటున్నారని చెప్పడం అతిశయోక్తి ఏమీ కాదు.
అసలు ట్రంప్‌కు ఎందుకు నామినేషన్ ఇచ్చామా అంటూ రిపబ్లికన్లూ ఒక దశలో తల పట్టుకున్న పరిస్థితీ తలెత్తింది! కానీ, హిల్లరీతో దాదాపు సమానంగా దేశ ప్రజలు ట్రంప్‌కు మద్దతు ఇవ్వడంతో ఆయనే్న అధ్యక్ష ఎన్నికల్లో తమ అభ్యర్థిగా నిలబెట్టక తప్పని పరిస్థితి రిపబ్లికన్‌లకు ఏర్పడటం విచిత్రం.
అభ్యర్థిత్వం ఖరారుకు అవసరమైన డెలిగేట్ల మద్దతు కూడా ట్రంప్‌కు లభించడంతో ఏమీ చేయలేని పరిస్థితి వారికి తలెత్తింది. ఇరు పార్టీల అభ్యర్థుల మధ్య జరిగిన మూడు కీలక డిబేట్‌లలోనూ హిల్లరీదే పైచేయి అయింది. దాంతో అమెరికా తొలి మహిళా అధ్యక్షురాలిగా ఆమె పట్లే మెజార్టీ ప్రజలు మొగ్గు చూపే అవకాశం ఉందన్న విశే్లషణలూ వెల్లువెత్తుతున్నాయి. ఒక దశలో ట్రంప్ వైపు మొగ్గు చూపిన ఇండో అమెరికన్లు సైతం ఇప్పుడు ఆయన కంటే హిల్లరీనే మిన్న అన్న అభిప్రాయానికి వచ్చేశారు. తాము వేయబోయే ఓటు ట్రంప్‌కు వ్యతిరేకమే తప్ప హిల్లరీకి అనుకూలం కాదన్న వారి అభిప్రాయాల్ని లోతుగా పరిశీలిస్తే.. హిల్లరీ నాయకత్వం పట్ల కూడా అమెరికాలోని భిన్న వర్గాల ప్రజల్లో ఏకాభిప్రాయం లేదన్న వాస్తవం కళ్లకు కడుతోంది. అమెరికా అధ్యక్ష పదవిని ఎవరు చేపట్టినా వారి బాధ్యత అనంతంగా, అపరిమితంగానే ఉంటుంది. కేవలం దేశాధ్యక్ష బాధ్యతలకే పరిమితం కాకుండా సర్వసైన్యాధ్యక్షుడిగా కూడా అధినేత వ్యవహరించాల్సి ఉంటుంది. ఇలాంటి తరుణంలో హిల్లరీని మెజార్టీ ప్రజలు అంగీకరిస్తారా.. ఆమె సమర్థత పట్ల పూర్తి విశ్వాసాన్ని కనబరుస్తారా అన్నదీ స్పష్టం కాని విషయమే! అయినప్పటికీ కూడా హిల్లరీ తన ఆధిక్యతను పెంచుకోవడం ట్రంప్‌ను నిలువరించడంలో ఆమె సాధించిన విజయాలకు సంకేతం. ఎక్కడా నోరుజారకుండా.. ట్రంప్ మాదిరిగా వ్యతిరేకతను పెంచుకోకుండా ఎక్కడ ఎంత అవసరమో అంతే మాట్లాడుతూ రిపబ్లికన్ అభ్యర్థికి చెక్ పెడుతూనే వచ్చారు. పరస్పర విమర్శలు వ్యక్తిగత స్థాయికి చేరుకోవడం అన్నది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కొత్తేమీ కాదు. ముఖ్యంగా ట్రంప్‌కు సంబంధించి రోజువారీగా వెలుగు చూస్తున్న వీడియోలన్నీ నిన్న మొన్న ఆయన అన్న మాటలు కాదు. అవన్నీ కొన్ని సంవత్సరాల క్రితానివే! అయితే అవన్నీ వివాదాస్పద వీడియోలే కావడం వల్ల ట్రంప్ వ్యక్తిత్వానే్న కాకుండా, దేశాధ్యక్షుడిగా ఆయనకు ఉన్న అర్హతలను కూడా సందేహించాల్సిన పరిస్థితి తలెత్తుతోంది.
అలాగని, హిల్లరీ అన్ని విధాలుగా ఈ పదవికి అర్హురాలనీ చెప్పే పరిస్థితి లేదు. ఈ-మెయిల్స్ కుంభకోణం మొదలుకుని.. ఆమె భర్త, మాజీ దేశాధ్యక్షుడు బిల్ క్లింటన్ నాటి ఉదంతాలూ హిల్లరీని వెంటాడుతున్నాయి.
అంటే రంగంలో ఉన్న ఇద్దరు అభ్యర్థులూ కూడా అన్ని విధాలుగా పునీతులేమీ కాదు. కానీ, వీరిలో ఎవరో ఒకర్ని ఎన్నుకోక తప్పని పరిస్థితి. 270 ఎలక్టోరల్ ఓట్లు సంపాదించగలిగే వ్యక్తికే అమెరికా అధ్యక్ష పీఠం దక్కుతుంది. ప్రతి రాష్ట్రంలోనూ ఈ ఓట్లు దాని జనాభా నిష్పత్తిలోనే ఉంటాయి. అందుకే అత్యిధిక జనాభా కలిగిన రాష్ట్రాలపై దృష్టి పెడితే.. అక్కడి ఓటర్లను ఆకర్షిస్తే అంతగానూ ఓట్లు పెరుగుతాయి కాబట్టి.. హిల్లరీ, ట్రంప్‌ల ఆశలన్నీ వీటిపైనేననడంలో ఎలాంటి సందేహం లేదు. పైగా పెద్ద రాష్ట్రాలన్నీ దాదాపుగా డెమొక్రాట్ లేదా రిపబ్లికన్ రాష్ట్రాలుగా ఇప్పటికే ముద్ర పడిపోయాయి కాబట్టి.. వీటి నుంచి కొత్తగా తమ వైపు ఓట్లను రాబట్టే అవకాశం హిల్లరీ, ట్రంప్‌లకు తక్కువే! దీని దృష్ట్యా ప్రచార తీవ్రతను బట్టి అభ్యర్థుల వైపు మొగ్గు చూపే చిన్న రాష్ట్రాలే ఇప్పుడు వీరికి పెద్ద దిక్కు అయ్యాయి. అంటే ఈ ఎన్నికల్లో అంతిమ ఫలితాన్ని తేల్చేది చిన్న రాష్ట్రాలే కాబట్టి అక్కడి ఓట్లను ఆకట్టుకోవడంలో నువ్వా నేనా అంటూ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ముఖ్యంగా ఫ్లోరిడా, ఓహియో రాష్ట్రాల ఫలితాలే తుది ఫలితాన్ని నిర్ణయించే అవకాశం ఉంటుంది. గత ఆరు అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చిన రాష్ట్రాలను హిల్లరీ నిలబెట్టుకుంటే దాదాపుగా ఆమె విజయం ఖరారైనట్టే! అయితే అది ఎంత మేరకు సాధ్యమవుతుంది.. వీటిలో ట్రంప్ రాబట్టుకోగలిగే ఓట్లెన్నన్నదీ కీలకం అవుతుంది. పూర్తిస్థాయిలో డెమొక్రటిక్ పార్టీ విజయానికే బలమైన పరిస్థితులు ఉండటం అన్నది ఇప్పటి వరకూ ఎన్నడూ జరుగలేదు. ఇందుకు హిల్లరీ సంయమనం దోహదం చేస్తే.. ట్రంప్ నోటిదురుసు మరింతగా ఆమెకు కలిసి వచ్చింది. దాదాపు ఏకపక్షంగా జరుగబోతున్న ఈ ఎన్నికల్లో ఎదో అద్భుతం జరిగితే తప్ప.. అందరి అంచనాలు, ఆకాంక్షలు, తలకిందులైతే తప్ప ట్రంప్ గెలిచే అవకాశం ఉండదన్నది అందరి మాట! రానున్న రెండు వారాల్లో పరిస్థితులు ఎలా మారతాయో ఇప్పుడే చెప్పలేం.. చిన్న రాష్ట్రాలు ఇవ్వబోయే పెద్ద తీర్పు ఎలా ఉంటుందో మరి!