సంపాదకీయం

‘ప్రచార’ వ్యయంపై మీమాంస...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నికల ఖర్చును ప్రభుత్వం భరించాలన్న ప్రతిపాదన ఇప్పటిది కాదు. దశాబ్దుల తరబడి రాజ్యాంగవేత్తలు, రాజనీతిజ్ఞులు, రాజకీయవేత్తలు, మేధావులు ఇలా ప్రభుత్వం ఎన్నికల ఖర్చును భరించడం - స్టేట్ ఫండింగ్ ఆఫ్ ఎలక్షన్స్ - గురించి తరచు విశే్లషణలు చేస్తూనే ఉన్నారు. దశాబ్దులుగా కొనసాగుతున్న ఈ చర్చ కొలిక్కి రాకపోవడానికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వ రాజకీయ నిర్వాహకులకు ఈ విషయంపైన ధ్యాస లేకపోవడం. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ప్రభుత్వం ఎన్నికల ఖర్చును భరించాలని కోరినవారు అధికారగ్రస్తులైన వెంటనే ఆ సంగతిని విస్మరించడం దశాబ్దుల ప్రహసనం. ప్రభుత్వాన్ని ప్రస్తుతం నిర్వహిస్తున్న భారతీయ జనతాపార్టీ వారు, ప్రభుత్వమే ఎన్నికల ఖర్చును భరించాలని కోరుతుండడం హర్షణీయం! ఎన్నికల నిర్వహణ ఖర్చును ప్రభుత్వమే భరిస్తోంది. కానీ వివిధ రాజకీయ పక్షాల తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థుల ప్రచార వ్యయాన్ని కూడ ప్రభుత్వమే భరించాలన్నది ‘ప్రభుత్వం నిధులివ్వడం’ - స్టేట్ ఫండింగ్! ఇలా ప్రభుత్వమే అభ్యర్థుల ప్రచార వ్యయాన్ని కొన్ని చిన్న ప్రజాస్వామ్య దేశాలలో భరిస్తున్నప్పటికీ పెద్ద ప్రజాస్వామ్య దేశాలలో రాజకీయ పక్షాలు మాత్రమే తమ అభ్యర్థుల ప్రచార ఖర్చులను భరిస్తున్నాయి. మనదేశంలో కూడ ఇదే వ్యవస్థ కొనసాగుతోంది! ఈ ప్రచార వ్యయం కోసం రాజకీయ పక్షాలు భారీగా నిధులను సేకరిస్తున్నాయి. దీనివల్ల నల్లడబ్బు భారీగా చెలామణిలోకి వస్తోంది! ఎందుకంటే దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ‘చెక్కులు’ తదితర ‘బ్యాంకుల’ మాధ్యమంగా కంటె నగదు రూపంలోనే ఎక్కువ మొత్తాలను విరాళాల రూపంలో సేకరిస్తున్నాయి. సమాచారం పొందే హక్కుల చట్టం - రైట్ టు ఇన్‌ఫర్‌మేషన్ యాక్ట్ - ఆర్‌టిఐ అమలులోకి వచ్చిన తరువాత కూడ రాజకీయ పక్షాలు ఆదాయ వ్యయాల గురించి పారదర్శకత విస్తరించలేదు. ఎందుకంటె ‘సమాచార చట్టం’ రాజకీయ పక్షాలకు వర్తింపచేయరాదని దాదాపు అన్ని రాజకీయ పక్షాలవారు కోరుతున్నారు! ఈ వ్యవహారం న్యాయస్థానాల పరిశీలనలో ఉంది! ఏమయినప్పటికీ రాజకీయపక్షాలు తమ అభ్యర్థుల ఎన్నికల ప్రచార వ్యయాన్ని పూర్తిగా భరించలేవన్నది బహిరంగ రహస్యం. పార్టీ టిక్కెట్టు పొందుతున్న అభ్యర్థులు స్వయంగా తమ ఎన్నికల ప్రచార వ్యయాన్ని భరించుకుంటున్నారన్నది జనమెరిగిన వాస్తవం. అందువల్ల అభ్యర్థులు తమ పలుకుబడి ప్రాతిపదికగ భారీగా విరాళాలను దండుకుని ఖర్చుపెడుతున్నారు. ఇలా దండిన విరాళాల వివరాలను ఆయా అభ్యర్థులు తమ ‘పార్టీ’కి ఏ మేరకు తెలియజేస్తున్నారన్నది కూడ ‘పారదర్శకత’కు నోచుకోని వ్యవహారం!
ఎన్నికలలో పోటీ చేస్తున్న వారిలో కొందరు దండిన విరాళాలలో కొంత భాగం ఖర్చుపెట్టి మిగిలిన సొమ్మును వ్యక్తిగత ఆస్తిగా మార్చుకుంటున్నారన్న ఆరోపణలు వినపడుతున్నాయి. అందువల్ల ప్రధాన రాజకీయ పక్షాల అభ్యర్థులుగా టిక్కెట్లను పొందినవారు ఎన్నికల్లో గెలిచినప్పటికీ, ఓడినప్పటికీ ప్రచారం కోసం వసూలు చేసిన సొమ్ములో కొంత మిగిల్చుకుంటున్నారన్నది నిరాకరించలేని నిజం... అందరు అభ్యర్థులు ఇలా వెనకేసుకోకపోవచ్చు! కానీ ‘పారదర్శకత’ లోపించిన కారణంగా ‘గుమ్మడికాయ దొంగలెవరో’ స్పష్టం కావడంలేదు! స్వతంత్రంగా పోటీ చేస్తున్న అభ్యర్థులకు పార్టీల నామమాత్రపు సహాయం కూడ అందడం లేదు కాబట్టి వారికి మరింత ఎక్కువ విరాళాలను పోగుచేసుకోవడం అనివార్యం అవుతోంది. ఈ మొత్తం ప్రహసనంలో పార్టీలు అభ్యర్థులు ఆధికారికంగా ప్రచారం కోసం పెడుతున్న ఖర్చుకంటె అనధికారంగా, రహస్యంగా పెడుతున్న ఖర్చు ఎక్కువగా ఉంటోంది. ఈ అనధికార వ్యయంలో అత్యధిక శాతం ‘కార్యకర్తల’ను, ‘వోటర్ల’ను కొనడానికి వినియోగమవుతోంది! బ్రహ్మాండమైన ప్రచార సభలకు ‘హాజరవుతున్న’ వారిలో అత్యధికులు ‘కిరాయి’ జనమన్నది బహిరంగ రహస్యం. సభకు హాజరు కావడానికి, ప్రదర్శనలో పాల్గొనడానికి, ఊరేగింపులో కొనసాగడానికి ఒక్కొక్క కిరాయి కార్యకర్తకు రోజుకింత అని అభ్యర్థులు వారి ప్రతినిధులు ముట్టచెప్పుతున్నారట! లేనట్టయితే తమ పని పనివల్ల లభించే వేతనాన్ని మానుకుని ప్రచార సభలలో ప్రచార యాత్రలలో ఎవరు పాల్గొంటారు? అని ‘అభిజ్ఞులు’ అనభిజ్ఞులకు వివరిస్తున్నారు. వోటు వేసినందుకు గౌరవనీయ వోటర్లలో చాలామందికి అభ్యర్థులు డబ్బులిస్తూనే ఉన్నారు.
ప్రభుత్వమే అభ్యర్థుల ఎన్నికల వ్యయం భరించడం ప్రజాస్వామ్యం మ రింతగా సమగ్రతను సంతరించుకొనడానికి తప్పక దోహదం చేస్తుంది! కానీ ఎన్నికల సంఘం - ఎలక్షన్ కమిషన్ - నిర్థారించిన ప్రచార వ్యయాన్ని మాత్రమే ప్రభుత్వం సమకూర్చుతుంది! కానీ ప్రస్తుతం నిర్ధారిత వ్యయానికి మించి అనేక రెట్లు ఖర్చుపెడుతున్న అభ్యర్థులు నిర్ధారిత వ్యయాన్ని ప్రభుత్వం సమకూర్చినంత మాత్రాన బుద్ధిమంతులైపోతారా? నిర్థారిత వ్యయాన్ని మాత్రమే వినియోగించుకుని విరాళాలను సేకరించడానికి స్వస్తి చెబుతారా? అన్నది ప్రశ్న! నిర్ధారిత వ్యయాన్ని ప్రభుత్వం అభ్యర్థులకు చెల్లించడం, లేదా నిర్ధారిత వ్యయాన్ని అభ్యర్థులు, పార్టీలు జనంనుండి విరాళాల రూపంలో సేకరించడం - ఈ రెండింటి మధ్య పెద్ద తేడాలేదు! ఒక పద్ధతిలో ఎన్నికల ప్రచార వ్యయాన్ని అభ్యర్థులకు విరాళాలను ఇచ్చే ప్రజలు భరిస్తారు. రెండవ పద్ధతిలో ప్రభుత్వం భరిస్తుంది. కానీ ఈ నిర్ధారిత వ్యయం కంటె ఎక్కువగా అభ్యర్థులు రహస్యంగా ఖర్చు పెట్టకుండా నిరోధించడానికి మార్గం ఏమిటి? ప్రధానంగా చర్చించవలసింది ఈ నైతికత గురించి, ఈ నిజాయితీ గురించి! ఇలా గరిష్ఠ పరిమితిని మించి ఖర్చుపెడుతున్న అభ్యర్థులు సొంత నల్లడబ్బును, ఇతర సంపన్నుల నల్లడబ్బును వినియోగిస్తున్నారు. ఈ అవినీతిని నిర్మూలించి అభ్యర్థుల్లో నిజాయితీని, నైతిక నిష్ఠను వికసింపచేయనిదే ప్రభుత్వం ప్రచార వ్యయాన్ని భరించడం వల్ల పన్నీరు బూడిదపాలు మాత్రమే అవుతుంది.
ఎన్నికల సంఘం నిర్ధారించిన ప్రచార వ్యయాన్ని అభ్యర్థులు కట్టుబడడం అందువల్ల ప్రధానమైన వ్యవహారం! ఈ నైతిక నిష్ఠను కలిగి ఉన్న అభ్యర్థులు రూపొందాలంటే విద్యార్థి దశలో వారికి నైతిక నిష్ఠను గురించి వ్యక్తిగత శీలం గురించి, జాతీయ శీలం గురించి సమాజంపట్ల, జాతిపట్ల తమకున్న కర్తవ్య నిష్ఠను గురించి బోధించాలి! ఇందుకోసం విద్యా పాఠ్య ప్రణాళికలో బోధన పద్ధతులలో విప్లవాత్మక పరివర్తన రావాలి! అలాంటి విద్యా పద్ధతుల ద్వారా సౌశీల్యాన్ని అలవరుచుకున్న విద్యార్థులు విద్యావంతులై, నిజాయితీపరులైన ఎన్నికల అభ్యర్థులు కాగలరు! ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులందరికీ ప్రభుత్వం ఎన్నికల ప్రచార వ్యయాన్ని సమకూర్చాలా? స్థానిక సంస్థలనుండి పంచాయతీ స్థాయి నుండి లోక్‌సభ స్థాయి వరకు అభ్యర్థుల సంఖ్య లక్షలలో ఉంది. ఎవరి ఖర్చు ప్రభుత్వం భరించాలి? జాతీయస్థాయిలో ప్రాంతీయ స్థాయిలో ఎన్నికల సంఘం వారి గుర్తింపు పొందిన రాజకీయ పక్షాల అభ్యర్థులకు మాత్రమే ఈ ప్రభుత్వం భరించే సూత్రాన్ని వర్తింపచేయాలా? స్వతంత్ర అభ్యర్థుల మాటేమిటి? విస్తృతమైన చర్చ ఇప్పుడైనా మొదలు కావాలి.