సంపాదకీయం

మత్తెక్కని ప్రయాణం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ, ప్రాంతీయ మహాపథాల- హైవేస్- పక్కన మద్యం దుకాణాలు ఉండరాదని సర్వోన్నత న్యాయస్థానం నిర్దేశించడం ప్రయాణపు మత్తుదిగడానికి దోహదం చేయగలదు. మద్యం తాగి మత్తెక్కిన వారు వాహనాలు నడపడం వల్ల హైవేలపై ప్రమాదాలు పెరుగుతున్నాయన్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్, న్యాయమూర్తులు డివై చంద్రచూడ్, ఎల్.నాగేశ్వరరావులు చేసిన నిర్ధారణ నిరాకరింపజాలని నిజం. జాతీయ మహాపథాల- నేషనల్ హైవేస్-లోను, ప్రాం తీయ పథాల-స్టేట్ హైవేస్-లోను వాహనాలు నడిపే వారికి మద్యం దుకాణాలు కనిపించరాదన్నది సర్వోన్నత న్యాయమూర్తుల నిర్ధారణ. ప్రస్తుతం మహాపథాలకు ఇరువైపుల ఉన్న మద్యం దుకాణాలకు జారీ చేసిన అనుమతులను వచ్చే ఏడాది మార్చి ముప్పయి ఒకటవ తేదీ తరువాత పునరుద్ధరించడానికి వీలు లేదని న్యాయస్థానం వారు రాష్ట్ర ప్రభుత్వాలను, కేంద్రపాలిత ప్రాంతాలను గురువారం ఆదేశించడం ‘మత్తు’ నేరాలకు విరుగుడు కాగలదు. ఈ రహదారులకు ఇరువైపుల నెలకొని ఉన్న మద్యం వాణిజ్య ప్రకటనల ఫలకాల- బోర్డుల-ను, చదరపు చెక్కల- హోర్గింగ్స్-ను తక్షణం తొలగించాలని కూడా న్యాయస్థానం ఆదేశించింది. ఈ నిర్ణయం అమలులోకి వచ్చిన వెంటనే దేశంలోని మద్యం దుకాణాలలో దాదాపు సగం మూతపడడం ఖాయం. కానీ, తాగి వాహనాలను నడిపేవారి సంఖ్య ఎంతమేరకు తగ్గిపోతుందన్నది ప్రశ్నార్థకం. ఎందుకంటే నేషనల్, స్టేట్ హైవేస్ పక్కన ఉన్న దుకాణం దారులు ఈ బాటలకు దూరంగా దుకాణాలను పునః ప్రారంభించడం ఖాయం. ఇలా ప్రారంభమయ్యే దుకాణాలు ప్రధాన రహదారుల మీద నుంచి కనపడవు. కానీ సాధ్యమైనంత చేరువలోనే దుకాణాలు నెలకొనడం ఖాయం. దారి భోజనశాలలు- డాబాలు- దారి విశ్రాంతి శాలలు- డార్మెటరీలు- ఉన్నచోట పెద్ద సంఖ్యలో వాహనాలు గంటల తరబడి గుమికూడి ఉంటున్నాయి. ఇవి ప్రధానంగా ట్రక్కులు, లారీలు. ఇవన్నీ వస్తువులను రవాణా చేసే వాణిజ్య వాహనాలు. అందువల్ల బస్సుల వలె, కార్లవలె తొందరగా ముందుకు వెళ్లాలన్న నిబంధన ఈ వాణిజ్య వాహనాలకు లేదు. అందువల్ల లారీల డ్రైవర్లు దాబాల వెనుక కొంతదూరంలో నెలకొనే మద్యం దుకాణాలకు తాపీగా వెళ్లి మద్యం సేవించగలరు. మత్తు దిగేవరకూ వారు విశ్రాంతి తీసుకోరు. మత్తు దిగిన వెంటనే మళ్లీ తాగడం ఈ వాణిజ్య వాహన చోదకులలో చాలామందికి అలవాటు. మద్యం సేవించిన యువజనులు ద్విచక్ర వాహనాలను అమిత వేగంగా నడపడం ప్రమాదాలకు మరో ప్రధాన కారణం. నగరాలలో, పట్టణాలలో, శివారు రహదారులలో ఈ ‘మాదక చోదనం’- డ్రంకన్ డ్రైవింగ్- మరీ ఎక్కువగా ఉంది.
నగరాలను వార చేసుకొని చుట్టివెళ్లే- బైపాస్- రహదారులు ఉన్నచోట మినహా అనేక స్థలాలలో జాతీయ పథాలు, ప్రాంతీయ మహాపథాలు పట్టణాల గుండాను, గ్రామాల గుండాను వెళుతున్నాయి. ఇలాంటిచోట్ల మరీ ఎక్కువగా మద్యం దుకాణాలు వెలసిఉన్నాయి. రాకపోకలతో సంబంధం లేకుండానే అవి ఆయా పట్టణాలలో, గ్రామాలలో ప్రధాన వీధులు. అందువల్ల సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ప్రకారం ఈ ప్రధాన వీధులలోని మద్యం దుకాణాలు మూతపడి వెనుక ఉన్న ‘గల్లీ’- సందు-లలోకి తరలిపోవలసి ఉంటుంది. ఏమైనప్పటికీ ప్రధాన వీధులలో మద్యం దుకాణాలు, మద్యాన్ని విక్రయించే దృశ్యాలు కనిపించకపోవడం మానసిక స్వచ్ఛతకు దోహదం చేయగల పరిణామం. ఈ దృశ్యాలు, దుకాణాలు తాగనివారికి ఏవగింపును కలిగిస్తున్నాయి. ఈ దుకాణాలను చూసి కుతూహలగ్రస్తులైపోతున్న యువజనులు ‘కొత్తదనం’ కోసం నలుగురితో కలిసి ఉండడం అన్న మిధ్యా అనుభూతికి గురై తాగడం నేర్చుకుంటున్నారు. డిసెంబర్ ముప్పయి ఒకటవ తేదీకి, జనవరి ఒకటవ తేదీకి మధ్యగల రాత్రి మద్యంలో స్నానం చేసి మత్తుగా ఉగిపోతుండడానికి ఈ ప్రధాన వీధులలోని మద్యం దుకాణాలు ప్రధాన ప్రేరణలు. ఇవన్నీ మూతపడడం మంచిది. హోటళ్లలోను, భోజనశాల- రెస్టారెంట్-లలోను మద్యం సరఫరా చేయరాదని, అమ్మరాదని, తాగరాదని కేరళ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను గత ఏడాది డిసెంబర్‌లో సర్వోన్నత న్యాయస్థానం ఆమోదించింది. కేవలం ఐదునక్షత్రాల హోటళ్లలో మాత్రమే తాగడానికి మినహాయింపునిచ్చారు. ఇది విదేశీయ యాత్రీకుల సౌకర్యం కోసమట! బిహార్ ప్రభుత్వం మద్యపానాన్ని పూర్తిగా నిషేధించింది.
సర్వోన్నత న్యాయస్థానం ఇపుడు విధించిన నిబంధన వల్ల తాగి వాహనాలను నడిపేవారి సంఖ్య తగ్గవచ్చు. కానీ తాగుబోతుల సంఖ్య మాత్రం పెద్దగా తగ్గదు. కేరళ ప్రభుత్వం ఉత్తరువువల్ల హోటళ్లలోను, భోజనశాలలలోను మద్యం తాగడం నిలిచిపోయి ఉండవచ్చు. ఇరవై ఐదు శాతం మద్యం హోటళ్లలో, భోజనశాలల్లో విక్రయించేవారట. మిగిలిన డెబ్బయి శాతం దుకాణాలలో అమ్ముడుపోతోం ది. అందువల్ల గతంలో హోటళ్లలో, భోజనశాలల్లో తాగిన వారు ఇపుడు దుకాణాలలో కొని ఇళ్లకు వెళ్లి తాగవలసి వస్తోంది. తాగుబోతుల సంఖ్య తగ్గడం లేదు. కానీ కేరళ ప్రభుత్వ చర్య వల్ల తాగి హోటళ్లలో తిని మత్తెక్కి వాహనాలను నడుపుకుంటూ ఇళ్లకు వెళ్లే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందట! అందువల్ల గురువారం నాటి సర్వోన్నత న్యాయస్థానం ఆదేశం కూడా మత్తు ప్రయాణాలను బాగా తగ్గించి వేయగలదు. కానీ చట్టాన్ని ఉల్లంఘించి తాగి బస్సులను, ఇతర వాహనాలను నడిపేవారు, వారిని పట్టుకొని లంచం తీసుకొని వదిలిపెట్టే అధికారులు ఎలా తగ్గిపోతారు? ఇదీ అసలు సమస్య! చట్టాన్ని, జాతీయ సమష్టి హితాన్ని గౌరవించి నిబద్ధతతో నిజాయితీతో వ్యవహరించే చోదకులు-డ్రైవర్లు- అధికారులు ఏర్పడడం మాత్రమే సమస్యకు పరిష్కారం. ప్రభుత్వాల ఉత్తరువుల వల్ల, న్యాయ నిర్ణయాల వల్ల మాత్రమే ఈ నిజాయితీ, నిబద్ధత పెరగవు, అలవడవు. సామాజిక సమష్టి జీవన రీతిలోను, ప్రధానంగా విద్యా విధానంలోను మరో విప్లవం వస్తే తప్ప అది జరగదు. ఇలాంటి జాతీయ విప్లవం ఎప్పుడు సంభవిస్తుంది? సమీప భవిష్యత్‌లో సంభవించగల సూచనలు లేవు. అందువల్ల రాజ్యాంగ నిర్మాతలు ఆకాంక్షించినట్టు సమగ్ర మద్యపాన నిషేధం మాత్రమే నిజమైన పరిష్కారం. మద్యపాన నిషేధాన్ని ప్రభుత్వాలు అమలు జరపాలని రాజ్యాంగంలోని నలబయి ఏడవ అధికరణం స్పష్టంగా నిర్దేశిస్తోంది. అమలు జరుపవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది.
ఎందుకంటే నలబయి ఏడవ అధికరణం కేవలం మార్గదర్శక సూత్రం. ఈ ఆదేశ సూత్రాన్ని -డైరెక్టివ్ ప్రిన్సిపుల్- రాష్ట్ర ప్రభుత్వాలు పాటించవచ్చు.. కానీ పాటించకపోతే సర్వోన్నత న్యాయస్థానం వారు సైతం పాటించమని ఆదేశించలేరు. అందువల్లనే సుప్రీం కోర్టు ‘తాగి వాహనాలను నడపడం’పై మాత్రమే ఆంక్షలను విధించింది. రాజ్యాంగాన్ని సవరించడం ద్వారా కాని లేదా సమగ్ర మద్యనిషేధం కోసం చట్టం చేయడం ద్వారా కాని ప్రజల మానసిక, శారీరక స్వచ్ఛతను పెంపొందింప చేయడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత, పార్లమెంటు బాధ్యత! ‘స్వచ్ఛ భారత్’ కేవలం భౌతిక వ్యవస్థ కాజాలదు, సాంస్కృతక స్వభావం కూడా!!