సంపాదకీయం

‘పోపు’ డబ్బుపై ఆరా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్రప్రభుత్వ నిర్వాహకులకు అకస్మాత్తుగా మతిభ్రమించిందేమోనన్న అనుమానం కలగడం అతార్కికం కాదు! రద్దయిన పాత కరెన్సీ నోట్లను బ్యాంకులలో జమ చేసే ప్రక్రియను గందరగోళగ్రస్తం చేయడానికి ప్రభుత్వం పూనుకోవడం ఈ మతిభ్రమించిందన్న అనుమానానికి ప్రాతిపదిక! మతిభ్రమించడం నిజం కాకపోతే, దుర్బుద్ధి పూర్వకంగానే కేంద్ర ప్రభుత్వం వారు ప్రజలను కడగండ్లపాలు చేయడానికి, వేధించడానికి పూనుకున్నట్లు భావించవలసి వస్తుంది! నవంబర్ ఎనిమిదవ తేదీన ఐదువందల, వెయ్యి రూపాయల నోట్లు రద్దయినప్పటి నుంచి కూడ నల్ల డబ్బులేని సామాన్య ప్రజలు ప్రభుత్వాన్ని ఈ ‘రద్దు’ విషయంలో సమర్థించారు. ‘ఏటిఎమ్’ల వద్ద, బ్యాంకుల వద్ద తెల్లవారుజాము నుండి అర్థరాత్రి వరకు బారులు తీరి ఓపికతో వేచి ఉన్నారు! ఎందుకంటే నల్లడబ్బును వెలికితీయడానికి ప్రభుత్వం మొదలుపెట్టిన ‘నోట్ల రద్దు’ కార్యక్రమం దేశానికి మంచి చేయగలదన్న విశ్వాసం వారిలో వెల్లివిరిసింది! కానీ, ఇలాంటి సామాన్య జనాలను ఇబ్బంది పెట్టడానికి ప్రభుత్వం ఇప్పుడు నడుం బిగించిందని సోమవారం నాటి విచిత్ర నిర్ణయం వల్ల స్పష్టమైపోయింది! కేంద్రప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేసింది. డిసెంబర్ 30వ తేదీ వరకు బ్యాంకులలో పాత రద్దయిన నోట్లను జమ చేయడానికి ప్రభుత్వం మొదట వీలు కల్పించింది. ప్రతి ఖాతాలోను రెండున్నర లక్షల రూపాయల వరకు జమ చేసేవారు ఆ నోట్ల వివరాల గురించి ఎలాంటి సమాచారం వెల్లడి చేయవలసిన అవసరం లేదని ప్రభుత్వం ప్రకటించింది. కానీ సోమవారం రిజర్వుబ్యాంక్‌వారి అధికారిక ప్రకటన ప్రకారం ఈ రెండున్నర లక్షల రూపాయల గరిష్ఠ పరిమితిని ఐదువేల రూపాయలకు కుదించేశారు. అందువల్ల ఐదువేల రూపాయల విలువకంటే ఎక్కువ పాతనోట్లను బ్యాంకులో జమ చేసేవారు ఆ నోట్లు తమ వద్ద ఎందుకున్నాయో, అవి తమకు ఎలా లభించాయో బ్యాంక్ అధికారులకు వివరించాల్సి ఉంటుందట! ‘‘అదేమయ్యా ప్రధానమంత్రీ! మధ్యలో ఇలా మాట మార్చావు??’’ అని అడుగుతున్న మధ్య తరగతి సామాన్య ప్రజలకు ఎవరు సమాధానం చెబుతారు. ఇలా ఐదువేల రూపాయల విలువకంటే ఎక్కువ మొత్తంలో జమ చేసేవారు ఇద్దరు బ్యాంక్ అధికారుల సమక్షంలో తమ వాంగ్మూలాలను ‘నమోదు’ చేయవలసి ఉంటుందట! ఆ బ్యాంక్ అధికారులు అడిగే ‘యక్ష’ ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పినప్పుడు మాత్రమే ఆ ‘జమ’లను బ్యాంక్‌వారు స్వీకరిస్తారట. ఇలా ఐదువేల రూపాయల విలువకంటే అధికంగా జమ అయ్యే ఖాతాలను ‘‘మీ ఖాతాలను తెలుసుకోండి’’- నో యువర్ కస్టమర్-కెవైసి అన్న ప్రత్యేక తరగతిగా గుర్తించనున్నారట! ఈ ప్రహసనం మొత్తం పెద్దగా డబ్బులేని మధ్య తరగతివారిని భయ విభ్రాంతికి గురి చేసేస్తుంది. నిరక్షరాస్యుల సంగతి, నిరుపేదల సంగతి చెప్పనక్కరలేదు....
ప్రతి ఖాతాదారుడు ఒకేసారి తన వద్ద ఉన్న మొత్తం ‘రద్దయిన’ నోట్లను జమ చేయాలన్నది మరో నిబంధన! ముప్పయి తేదీలోగా విడతలు విడతలుగా ఐదువేల రూపాయల కంటే తక్కువ విలువ గల పాత నోట్లను జమ చేయవచ్చు. కానీ ఈ ‘విడతల మొత్తం’ ఐదు వేలను దాటితే జమ చేసిన ఖాతాదారుడు ‘వివరణ’ ఇచ్చుకోవాలట. వివరణ బ్యాంకు అధికారులకు సంతృప్తికరంగా లేకపోయినట్టయితే ఐదువేల రూపాయలకు మించిన మొత్తాన్ని తిరిగి ఖాతాదారుని ముఖాన కొట్టేస్తారట! ఒకవ్యక్తి దగ్గర ఐదువేల రూపాయలకంటె ఎక్కువ విలువైన పాత నోట్లు ఉన్నట్టయితే అవి ‘నల్లడబ్బు’ రూపాలు కావచ్చన్నది ఘతన వహించిన రిజర్వ్‌బ్యాంకు వారి, ప్రభుత్వంవారి అభిప్రాయమన్నమాట! వందల వేల కోట్ల రూపాయల నల్లడబ్బును నిలువచేసి ఉన్నవారు దాన్ని ‘తెల్ల’గా మార్చుకొనడానికి వీలైన కొత్తకొత్త పథకాలను ప్రభుత్వం ఇప్పటికీ ఆవిష్కరిస్తూనే ఉంది. నల్లడబ్బు కామందులకు ఇలా వెసులుబాటును ఇస్తున్న ప్రభుత్వం ‘పోపుల డబ్బాలలో పదివేలు దాచుకున్న’ మధ్య తరగతి గృహిణులను వేధించడానికి కొత్త నిబంధనను విధించడం అంతుపట్టని వ్యవహారం. పాతనోట్లను తిరిగి బ్యాంకులకు చేర్చే కార్యక్రమం దాదాపు పూర్తి అవుతోంది. నలబయి రోజులు గడిచిపోయాయి. అందువల్ల ‘బ్యాంకుల’ వద్ద ‘బారుల’-క్యూలైన్స్-పొడవు తగ్గింది. తగ్గిందని సంతోషిస్తున్న సమయంలో మళ్లీ వాటి పొడవు పెరగడానికి మాత్రమే ప్రభుత్వం వారి వినూతన విచిత్ర నిబంధన దోహదం చేయగలదు...
ఎందుకంటే రెండున్నర లక్షల, అంతకంటే ఎక్కువ మోతాదులో పాత నోట్ల ను బ్యాంకులలో జమ చేసేవారి సంఖ్య తక్కువ. అలాంటివారి నుంచి మాత్రమే వివరణ రాబట్టడానికి ‘బ్యాంకుల’ అధికారులకు శ్రమతో కూడిన ప్రహసనమైంది! ఇప్పుడు ఐదువేలకంటె ఎక్కువ రూపాయలను చెల్లించే వారందరినీ ప్రశ్నించి సమాధానాలు రాబట్టే కార్యక్రమం మరింత దీర్ఘంగా కొనసాగుతుంది. అందువల్ల ‘జమ’ చేయడానికి వచ్చిన వారు బారులు తీరి నిలబడక తప్పదు. బహుశా ఇలా బ్యాంకులవద్ద రద్దీని పెంచాలన్నది కూడ ప్రభుత్వం వారి ‘కొత్త నిబంధన’ లక్ష్యం కావచ్చు! ‘నోట్లు’ రద్దయిన వెంటనే ‘జమ’ కట్టేవారితో ‘బ్యాంకుల’ ప్రాంగణాలు కిటకిటలాడిపోయాయి. పెద్దపెద్ద వరుసలలో గంటల సేపు నిలబడడం వయోవృద్ధులకు, గృహిణులకు కష్టం. అందువల్ల రద్దీ తగ్గిన తరువాత తమ పాతనోట్లను బ్యాంకులలో జమ చేయవచ్చునన్న తలంపుతో వారంతా ఇంతకాలం బ్యాంకులకు వెళ్లి ఉండరు. ఇప్పుడు రద్దీ తగ్గింది కాబట్టి రద్దయిన నోట్లను జమ చేద్దామనుకున్న ఇలాంటివారికి, మరికొందరికి ప్రశ్నల వర్షం ఎదురుకానుంది! ఇంతవరకు ఎందుకని జమ చేయలేదన్నది మొదటి ప్రశ్న కాబోతోంది! పదివేల రూపాయలు పోపుల డబ్బాలలో ఎందుకని దాచావు?? ఎక్కడిది ఆ డబ్బు? వంటివి తరువాత ఎదురుకానున్న ప్రశ్నల పరంపర! ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ సోమవారం అర్థరాత్రి చేసిన ప్రకటన ఈ గందరగోళాన్ని మరింత పెంచుతోంది! ఒకేసారి ఉన్న పాతనోట్లన్నింటినీ బ్యాంకు ఖాతాలో జమ చేసేవారు ఎంత మొత్తం జమచేసినప్పటికీ వివరణ ఇచ్చుకోనక్కరలేదని అరుణ్‌జైట్లి చెప్పుకొచ్చారు. ఒకటికంటె ఎక్కువసార్లు ఒకే ఖాతాలో జమ చేయడానికి వీలులేదని ‘రిజర్వ్‌బ్యాంక్’ సెలవిస్తుండగా మంత్రిగారి వివరణకు అర్థం ఏమిటి??
రద్దయిన పాతనోట్ల విలువ పదిహేను లక్షల నలబయి నాలుగు వేల కోట్ల రూపాయలట! ఇందులో పనె్నండు లక్షల నలబయి నాలుగు వేల కోట్ల రూపాయల విలువైన పాత నోట్లు ఈ పాటికే బ్యాంకులలో జమ అయ్యాయి! అందువల్ల మిగిలిన మూడు లక్షల కోట్ల రూపాయలు నల్లడబ్బని ప్రభుత్వం పసికట్టిందట! ఈ డబ్బును ‘ఘరానా’లు చిన్నాచితక జనాలకు పంచిపెట్టి వారి ఖాతాలలోకి జమ చేయిస్తారన్నది ప్రభుత్వం వారి నిర్ధారణ అట! కానీ అలా చేయించే ‘నల్ల’ కుబేరులు ఇదివరకు ఆ పని పూర్తి చేసి ఉంటారు. ‘జనధన్’ ఖాతాలలో భారీ ‘జమ’లకు ఇదే ప్రాతిపదిక! అందువల్ల ఇప్పటికీ జమకాని పెద్దనోట్లు ‘నల్లడబ్బు’నకు సంబంధించినవని అనుమానించడం అంత తార్కికంగా లేదు. అందువల్ల ప్రభుత్వం ఈ కొత్త నిబంధనను రద్దు చేయడం ‘తెల్లడబ్బు’న్న సాధారణ జనానికి మేలు.