సంపాదకీయం

కశ్మీర్ ‘సభ’లో కొట్లాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూ కశ్మీర్ శాసనసభలో మరోసారి కొట్లాట జరిగింది. ఇలా కొట్లాటలు జరగడం జమ్మూ కశ్మీర్ చరిత్రలో కొత్తకాదు. సభ్యులు పరస్పరం కొట్టుకోవడం ఆశ్చర్యం కాదు. బుధవారం సభలో జరిగిన ఈ కొట్లాటలో ఒక సభ్యుడు గాయపడ్డాడట. పరిస్థితిని అదుపు చేసేందుకు స్పీకర్ కవీందర్ గుప్తా శాసనసభను నిరవధికంగా వాయిదా వేసాడు. సభను కొద్దిసేపు కానీ, మరుసటిరోజుకు కానీ వాయిదా వేయడం వల్ల పరిస్థితిని అదుపుచేసి వుండవచ్చును. కానీ స్పీకర్ నిరవధికంగా వాయిదా వేయడం ద్వారా అదుపు చేసే పద్ధతికి పదునుపెట్టాడు. ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీని సభ్యులు నిలదీయకుండా తప్పించడానికి వీలుగా మాత్రమే స్పీకర్ సభను నిరవధికంగా వాయిదా వేసినట్టు మాజీ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా వాక్రుచ్చడం కూడ ఆశ్చర్యకరం కాదు. ముఖ్యమంత్రి మెహబూబా మంగళవారం సభలో చేసిన వ్యాఖ్యలు దేశ సమైక్యతకు జాతీయ సమగ్రతకు సార్వభౌమాధికారానికి విఘాతకరమైనవి. ఈ విఘాతకరమైన వ్యాఖ్యలు చేసినందుకు ఆమె భారతీయ జనతాపార్టీ సభ్యులకు మాత్రమే కాక దేశ ప్రజలకు క్షమార్పణ చెప్పి ఉండాలి! ఈ అనివార్యం ఏర్పడుతుందన్న అనుమానంతో కాబోలు ఆమె బుధ వారం సభకు రాకుండా ముఖం చాటేసింది! కానీ ఆమె సభకు రావాలని, సంజాయిషీ ఇవ్వాలని పట్టుపట్టవలసిన భాజపా సభ్యులు ఆమె ‘అనుపస్థితి’ గురించి పట్టించుకోలేదు! కానీ నేషనల్ కాన్ఫరెన్స్-ఎన్‌సి- నాయకుడు, మాజీ సిఎం ఉమర్ అబ్దుల్లా మాత్రం పట్టించుకున్నాడు. మెహబూబా సభకు రావాలసిందేనని పట్టుపట్టాడు! ఆమెను సభకు రప్పించి వివరణ ఇప్పించి భాజపా సభ్యులకు క్షమార్పణ చెప్పించడానికై ఉమర్ అబ్దుల్లాకు ఎందుకంత శ్రద్ధ పుట్టుకొచ్చిందన్నది ప్రశ్న. భాజపా, మెహబూబా నాయకత్వంలోని పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ-పిడిపి- సంయుక్తంగా జమ్మూ కశ్మీర్ ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్నాయి. కానీ ఉభయ పార్టీల విధానాలలో తీవ్రమైన వైరుధ్యాలు కొనసాగుతున్నాయి. మంగళవారం సభలో మెహబూబా భాజపాకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడానికి ఈ విధాన వైరుధ్యాలు కారణం! అధికార భాగస్వామ్యం వహస్తున్న భాజపా ముఫ్తీ వ్యాఖ్యలతో గొప్ప ఇరకాటంలో పడింది.
మెహబూబా వ్యాఖ్యలను నిరసించినప్పటికీ ఆమె సభకు వచ్చి వివరణ ఇవ్వాలని భాజపా సభ్యులు బుధవారం పట్టుపట్టకపోవడానికి ఈ అధికార భాగస్వామ్యం కారణం. అధికారపక్షాల మధ్య నెలకొని ఉన్న విధాన వైరుధ్యాలను భాజపా మరింత రచ్చకెక్కించదలచుకోవడం లేదన్నది స్పష్టం. కానీ ఈ విధాన వైరుధ్యాలు సభలో మరింతగా స్పష్టం కావాలన్నది ఉమర్ అబ్దుల్ల వ్యూహం! అందువల్ల మెహబూబా మంగళవారం సభలో భాజపాకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యల గురించి వివరణ, స్పష్టీకరణ ఇవ్వాలని ఉమర్ మహాశయుడు బుధవారం పట్టుపట్టాడు! అలా జరిగినట్టయితే అధికార కూటమిలోని ఉభయ పక్షాలు సభలోనే బహిరంగంగా పరస్పరం తిట్టిపోసుకోగలవన్నది ఉమర్‌కు, ఆయన పార్టీ సభ్యులకు కలిగిన ఉత్కంఠ. ఈ కుతూహలగ్రస్తులైన ఎన్‌సి సభ్యులు మెహబూబా సభకు వచ్చి సమాధానం చెప్పాలని పట్టుపట్టారు. అయితే వారి కోరిక నెరవేరలేదు. సభాపతి కవీందర్ ముఖ్యమంత్రికి గొప్ప వెసులుబాటు కల్పించాడు. ‘ఆమె చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తాను, ఆమె భాజపాను జాతివ్యతిరేక శక్తిగా చిత్రీకరించలేదు, కొన్ని దుష్టశక్తులు కశ్మీర్ లోయ ప్రాంతంలో చిచ్చుపెట్టి మంటలను చెలరేపడానికి యత్నిస్తున్నాయి..’ అంటూ స్పీకర్ వ్యాఖ్యానించాడు. ఆ విధంగా ఆయన అధికార కూటమిలోని ఉభయ పక్షాల మధ్య వైరుధ్యాలు మరింతగా ప్రజ్వరిల్లకుండా నిరోధించాడు. ఉత్కంఠతో ఉవ్విళ్లూరిన ప్రతిపక్ష ఎన్‌సి సభ్యులకు గొప్ప నిరాశ కలిగించాడు..
మన దేశపు రాజ్యాంగంలోని మూడు వందల డెబ్బయ్యవ అధికరణాన్ని రద్దు చేయాలని భాజపా ఏళ్ల తరబడి కోరుతోంది. కానీ మెహబూబా నాయకత్వంలోని పిడిపి ఈ అధికరణం శాశ్వతంగా కొనసాగాలని కలలు కంటోంది. జమ్మూ కశ్మీర్ ప్రాంతం దశాబ్దుల తరబడి కల్లోలగ్రస్తం కావడానికి, జిహాదీ బీభత్సకాండకు బలికావడానికి, దేశవిద్రోహపు మూకలకు ఆలవాలం కావడానికి వౌలిక కారణం ఈ మూడు వందల డెబ్బయ్యవ అధికరణం! ఈ అధికరణం జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కట్టబెట్టింది. ఈ ప్రత్యేక ప్రతిపత్తిని ప్రసాదిస్తున్న ఈ అధికరణం తాత్కాలికమైన మధ్యంతరమైన ఏర్పాటు మాత్రమేనని మన రాజ్యాంగంలో స్పష్టంగా పే ర్కొన్నారు. ఈ మూ డువందల డెబ్బయ్య వ అధికరణం ఎప్పటికైనా రద్దు కాక త ప్పదు! కానీ ఈ అధికరణం ప్రాతిపదికగా ప్రత్యేకమైన మరో రాజ్యాంగాన్ని, మరో పతాకాన్ని జమ్మూ కశ్మీర్‌కు కట్టబెట్టడం జాతీయ వైపరీత్యం. దేశంలోని అ న్ని ప్రాంతాలకు జాతీయ రాజ్యాంగం, జాతీయ ప తాకం మాత్రమే ఉన్నాయి. ఇలా జమ్మూ కశ్మీర్‌కు మాత్రం జాతీయ పతాకంతోపాటు ప్రాంతీయ ప తాకం, జాతీయ రాజ్యాంగంతోపాటు మరో ప్రాం తీయ రాజ్యాంగం ఉం డడం దేశంలోని మిగిలిన ప్రాంతాల ప్రజలు నిరసిస్తున్న వైపరీత్యం. భాజపా ఈ మూడు వందల డెబ్బయ్యవ అధికరణాన్ని వ్యతిరేకించడం దేశప్రజల మనోభీష్టానికి అనుగుణం! పార్లమెంటు చేస్తున్న చట్టాలు మిగిలిన ప్రాంతాలకు వర్తించినట్టుగా సహజంగా జమ్మూ కశ్మీర్‌కు కూడ వర్తించాలి! కానీ వర్తించవు. ఆ రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించిన తరువాత రాష్టప్రతి మళ్లీ అధ్యాదేశం జారీ చేసినప్పుడు మాత్రమే పార్లమెంటు చేసిన చట్టాలు జమ్మూ కశ్మీర్‌కు వర్తిస్తున్నాయి. లోక్‌సభ కాలవ్యవధి, శాసనసభల కాలవ్యవధి ఐదేళ్లు. జమ్మూ కశ్మీర్ శాసనసభ కాలవ్యవధి ఆరేళ్లు కావడం ఈ ప్రత్యేకతలోని మరో ప్రధాన వైపరీత్యం! ఈ ప్రత్యేకత కారణంగానే కశ్మీర్ లోయలో విచ్ఛిన్నకారులు, దేశవిద్రోహులు వికృత తాండవం చేయగలగడం దశాబ్దుల చరిత్ర. కశ్మీర్ లోయలో యుగాలుగా నివసించిన హిందువులను పాకిస్తాన్ ప్రేరిత జిహాదీలు నిర్మూలించగలగడానికి ప్రేరకం మూడువందల డెబ్బయ్యవ అధికరణం!
అందువల్ల జాతీయతాతత్త్వ నిష్ఠ కల భాజపా, ఈ అధికరణాన్ని వ్యతిరేకించడం సహజం. కానీ మెహబూబా మంగళవారం అసందర్భంగా ఈ అధికరణాన్ని సమర్ధించింది. జమ్మూ కశ్మీర్‌కు మూడు వందల డెబ్బయ్యవ అధికరణం ప్రత్యేక ప్రతిపత్తిని ప్రసాదిస్తోంది! ఈ ప్రత్యేక ప్రతిపత్తిని ర ద్దు చేయాలని కోరడం జాతి విద్రోహం. దీనికి మించిన జాతి విద్రోహ చర్య మరొకటి లేదు!-అని మెహబూబా వ్యాఖ్యానించింది! దీన్ని భాజపా సభ్యులు వెంటనే నిరసించారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యను స్పీకర్ రికార్డుల నుంచి తొలగించారా? లేదా? అన్నది బుధవారం కూడ స్పష్టం కాలేదు. సభను నిరవధికంగా వాయిదా వేయడం మెహబూబాను ఇరకాటం నుంచి తప్పించడానికి కావచ్చు! కానీ సభలో భాజపా సభ్యులు, ఎన్‌సి సభ్యులు పరస్పరం ఎందుకు కొట్టుకున్నారన్నది అంతుపట్టని వ్యవహారం.