సంపాదకీయం

ఉభయతారక ధోరణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికా ఉభయ సభలను ఉద్దేశించి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రసంగం ఏ విధంగా చూసినా ఏకపక్షం కానే కాదు. గంటకుపైగా సాగిన ఆ ప్రసంగంలో ట్రంప్ సామరస్యాన్ని, కలసి పనిచేయాలన్న భావనను బలంగా చాటిచెప్పారు. పరుష వ్యాఖ్యలతో, విపరీత ధోరణులతో తీవ్ర స్థాయిలో విమర్శలకు గురైన ట్రంప్‌కే ప్రజలు అధికారం అప్పగించడంతో అమెరికా ఏమైపోతుందోనన్న భయం పెరిగిందన్నది వాస్తవం. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇదే రకమైన తీరును ఆయన కొనసాగించడంతో పరిస్థితి మరీ తీవ్రమైంది. అమెరికాను అగ్రగామిగా మార్చాలన్నదే తన ధ్యేయమని ట్రంప్ చెప్పడం తప్పేమీ కాదు. ఏ దేశాధినేత అయినా తన దేశం గురించి ఇలాగే ఆలోచిస్తాడు. ప్రజల భద్రత, రక్షణ విషయంలో తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటాడు. ఈ విషయంలో ట్రంప్ ధోరణి సమంజసమే అయినా అందుకు ఆయన అనుసరించిన విధానాలపైనే విమర్శలు చెలరేగాయి. ఏడు ముస్లిం దేశాలకు చెందిన వలసదారులు, శరణార్థులపై నిషేధం విధించడం, గ్రీన్‌కార్డు ఉన్నవారిలో సైతం భయం పుట్టించడం వంటివి ట్రంప్ తీరు పట్ల ఆందోళన కలిగించాయి. ఆయన ఉద్దేశం మంచిదే అయినా అందుకు అనుసరించిన మార్గం మాత్రం కఠినతరంగా, విమర్శలను రాజేసేదిగా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. అమెరికాకు వలసదారుల నుంచే ముప్పు ఉందంటూ చెప్పుకొచ్చిన ట్రంప్ వారిపైనే గురిపెట్టి తొలి వలసల నిషేధ ఉత్తర్వు జారీ చేశారు. అది మరింతగా వలసదారుల్లో ముఖ్యంగా అత్యధిక సంఖ్యలో నివసిస్తున్న ప్రవాస భారతీయుల్లో అలజడి రేపింది. అధ్యక్ష హోదాలో ఉన్న వ్యక్తి ఎంత సమత, సామరస్యాన్ని పాటిస్తే అంతగానూ పౌరులూ అదే మార్గంలో ముందుకెళతారు. తన ఇమిగ్రేషన్ ఆదేశం ఉద్దేశం ఏదైనా అది ప్రతికూల పరిణామాలకు దారితీయడం తో దేశంలో కల్లోలం మొదలైంది. అటు ప్రతిపక్ష డెమొక్రాట్ల నుంచే కాదు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న అధికార రిపబ్లికన్ల నుంచీ విమర్శలకు దారితీసింది. దాంతో తొలి వలసల నిరోధక ఉత్తర్వుకు కోర్టులు బ్రేకు వేశాయి. మొదటి నుంచీ అమెరికాలో ఇతర దేశీయుల పట్ల విద్వేష భావం ఉంటూనే ఉంది.
ముఖ్యంగా తమ ఉద్యోగాలను ఇతర దేశీయులు తన్నుకు పోతున్నారన్న బాధ అమెరికన్లలో ఉంది. నిజానికి మొదటిసారి ఒబామా అధికారంలోకి రావడానికి కారణం కూడా అమెరికా ఉద్యోగాలను పరిరక్షిస్తానన్న నినాదంతోనే..! ఔట్‌సోర్సింగ్‌ను కట్టడి చేస్తానని ఒబామా తన ప్రతి ప్రసంగంలోనూ స్పష్టం చేస్తూ వచ్చారు. ఇప్పుడు ట్రంప్ రావడంతో పరిస్థితి మరింత వేడెక్కిందనే చెప్పాలి. ముఖ్యంగా ఆయన మాట తీరు ఇందుకు ప్రధానంగా కారణమైంది. కాన్సస్‌లో తెలుగు ఉద్యోగి శ్రీనివాస్ దారణ హత్య, అలాగే యూదులకు చెందిన స్థావరాలపై దాడులు వలసదారుల పట్ల అమెరికన్లలో ఎంత వ్యతిరేకత ఉందో స్పష్టం చేసేవే! ఈ నేపథ్యంలోనే వెల్లువెత్తిన విమర్శలు ట్రంప్ ఆలోచనల్లో మార్పు తెచ్చాయి. అమెరికా సంయుక్త సభల్లో ఆయన మాట్లాడిన తీరు సామరస్యానికి అద్దం పట్టింది. మొదటి నుంచీ పనిగట్టుకుని మరీ మీడియా తనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చిన ట్రంప్ తన ప్రసంగంలో ఎక్కడా మీడియాపై విమర్శలు చేయలేదు. ‘కలసి పనిచేద్దాం రండి..’ అంటూ డెమొక్రాట్లకూ పిలుపునిచ్చారు. అన్నింటి కంటే ముఖ్యం ట్రంప్ మాట తీరు పూర్తిగా మారిపోవడం. గత కొనే్నళ్లుగా వలసల నిరోధక చట్టం విషయంలో అమెరికాలో చర్చోపచర్చలు జరుగుతూనే ఉన్నాయి. దేశ సమస్యలను దృష్టిలో పెట్టుకుని గుణాత్మక రీతిలో ఈ విధానాన్ని సంస్కరించాలన్న వాదనా గతంలో వ్యక్తమైంది. ఇప్పుడు ట్రంప్ కూడా ఇదే ఆలోచనను బయట పెట్టారు. ప్రతిభను ప్రామాణికంగా తీసుకుని ఇమిగ్రేషన్ విధానాన్ని రూపొందించాలని పిలుపునిచ్చారు. తన రెండో ఉత్తర్వు విషయంలో భయాందోళనలు నెలకొన్న నేపథ్యంలో ట్రంప్ ఈ రకంగా మాట్లాడటం అందరికీ ఊరట కలిగించింది. అలాగే అమెరికాలో ఉంటున్న ఇతర దేశస్థులు ఏ విధంగానూ భయపడాల్సిన అవసరం లేదన్న ఆయన మాటలు కూడా అనేక దేశాల పౌరులకు ధీమాను ఇచ్చేవే! అయితే శ్రీనివాస్ హత్య విద్వేష దాడేనని అధ్యక్షుడే స్వయంగా చెప్పడం ఈ రకమైన దాడులను నిరోధించేందుకు, సమత, సామరస్యాలను అన్ని వర్గాల్లోనూ పెంపొందించేందుకు అధికారులను ఉద్యుక్తం చేయాలి. దేశంలోకి అక్రమంగా, ఎలాంటి అధికారిక పత్రాలూ లేకుండా ప్రవేశించిన వారి వల్లే నేరాలు జరుగుతున్నాయన్నని ట్రంప్ వాదన.
అందుకే ఆయన ఏడు ముస్లిం దేశాలకు చెందిన పౌరుల రాకపోకలమైనా, శరణార్థులపైనా నిషేధం విధించారు. అయితే వాస్తవం ఇందుకు భిన్నంగా ఉందని ఇటీవల జరిగిన సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. వలసదారులకు, దేశంలో జరుగుతున్న దాడులకు ఏ కోశానా సంబంధం లేదంటూ నిపుణులు లెక్కలతో సహా చెప్పడం ఇమిగ్రేషన్ విధానాలను ఉభయతారక రీతిలో రూపొందించడానికి దోహదం చేసేది కావాలి. ము ఖ్యంగా తన మాటల స్ఫూర్తిని అర్థం చేసుకోకుండా విద్వేషాన్ని రెచ్చగొడుతున్నవారిపైనా ట్రంప్ గురిపెట్టారు. అమెరికా స్ఫూర్తిని పరిరక్షించడమే ధ్యేయమని చెప్పిన ఆయన ఇందుకు విభేదాలు పక్కన పెట్టి అందరూ ముం దుకు వెళ్లాల్సిన అవసరం ఉందనడం కూడా అరమరికల్లేని ఆ యన స్నేహ హస్తానికి నిదర్శనం. ఉన్నతంగా ఆలోచించడం, వాటిని సా కారం చేసుకునేందుకు కలసి పనిచేయడమే అమెరికా స్ఫూర్తిలో ఉన్న అంతరార్థమన్న భావన ట్రంప్ ప్రసంగంలో ప్రస్ఫుటమైంది. దీన్ని ఆసరా చేసుకుని రెండు రాజకీయ పక్షాలు చేతులు కలిపి ఇమిగ్రేషన్ సమస్యను ఉభయతారక రీతిలో పరిష్కరించేందుకు నడుం బిగించాలి. అమెరికా నేడీ స్థితిని చేరిందంటే.. ఆర్థికంగా, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఆరితేరిందంటే అందుకు కారణం కేవలం అమెరికనే్ల కాదు.. ఈ ఆధునిక ఆర్థిక సౌధం నిర్మాణం వెనుక భారత్ సహా ఇతర దేశాలకు చెందిన ఎందరి కష్టమో ఉందన్న వాస్తవాన్ని విస్మరించకూడదు. అదే జరిగితే అది అమెరికా స్ఫూర్తికే విరుద్ధమవుతుంది. ఇదే వాస్తవాన్ని కొంచె ఆలస్యంగానైనా ట్రంప్ చెప్పడం ముదావహం. ఏ దేశంలోనైనా నేరాలన్నీ ఇతర దేశాలకు చెందిన వారి వల్లే జరుగుతాయనడం అవివేకం. ఇందుకు కారణాలు శోధించాలి. ముఖ్యంగా అమెరికా యువతలో ఉన్న నైరాశ్యాన్ని తొలగించాలి. మెరిట్ ఆధారంగానే వలస విధానం ఉండాలన్న ట్రంప్ ఆలోచన ఇందుకు దోహదం చేస్తుంది. ఇటు దేశ పౌరులకూ, ఇతర దేశాల నుంచి అమెరికా వచ్చే వారికీ ప్రయోజనం కలిగించే రీతిలో దీన్ని తీర్చిదిద్దాలి. ట్రంప్ ఉత్తర్వు అంటే సామరస్య సంకేతమే కావాలి తప్ప ఇతర దేశీయుల్లో గుబులు పుట్టించేది కాకూడదు. సెనేట్, ప్రతినిధుల సభనుద్దేశించి చేసిన ప్రసంగం ఎంత సామరస్య పూర్వకంగా సాగిందో అదే తరహాలో తన తదుపరి నిర్ణయాలూ ఉంటాయన్న నమ్మకాన్ని, విశ్వాసాన్నీ కొత్త పాలనా యంత్రాంగం కలిగించాలి. ట్రంప్ ప్రసంగ స్ఫూర్తి సామరస్యానికి, విద్వేష రహిత శాంతియుత వాతావరణానికి దీప్తి కావాలని ఆశిద్దాం.