సంపాదకీయం

నదులకు జీవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నమామి గంగే!- పేరుతో కేంద్ర ప్రభుత్వం అమలు జరుపుతున్న నీటిశుద్ధి మహా ప్రణాళిక వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రేరణ కలిగిస్తుండడం హర్షణీయం. నర్మదా నదిని కాలుష్య రహితంగా తీర్చి దిద్దడానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇ ప్పుడు కంకణం కట్టుకుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడ ప్రభుత్వాలు జల సంబంధ ప్రగతిని సాధించడానికి రెండేళ్లకు పైగా పథకాలను అమలు చేస్తున్నాయి. ‘కాకతీయ ఉద్యమం’ ద్వారా సేద్యపునీటిని, ‘్భగీరథ ఉద్యమం’ ద్వారా మంచినీటిని పల్లెపల్లెకూ ఇంటింటికీ తరలించడానికి తెలంగాణ ప్రభుత్వం శ్రమిస్తోంది. కృష్ణా గోదావరీ నదులను అనుసంధానం చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుజల స్రవంతిని సృష్టించింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆరంభించిన ‘నమామి నర్మదే’ పథకం ఈ జల పరంపరకు కొనసాగింపు. నర్మదా నదీ జలాలను ప్రక్షాళన చేయడానికి నడుం బిగించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రధాని మోదీ ప్రశంసించడం సహజం. గంగానదీ ప్రక్షాళన కోసం కేంద్రం ఇదివరకే నడుం బిగించింది. ‘నమామి గంగే’- గంగానదీ నమస్కరిస్తున్నాను- అన్నది సంప్రదాయ సిద్ధమైన సాంస్కృతిక నినాదం. ఈ నినాదాన్ని ఆచరణగా అనువదించడానికై కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. గంగను ‘స్వచ్ఛ గంగ’గా మార్చే బృహత్ పథకానికి ‘నమామి గంగే’ అన్న పేరు పెట్టడం ఔచిత్యవంతం. నీరు స్వచ్ఛతకు ప్రతీక. నీరు స్వచ్ఛతను సాధించడానికి మార్గం, నీటి స్వభావం స్వచ్ఛత, భూ మిని కాని ఆకాశాన్ని కాని స్వచ్ఛంగా ఉంచడం నీటికే సా ధ్యం. నీటి స్వచ్ఛత సనాతనం అంటే శా శ్వతం. నీరు కాలుష్యగ్రస్తం కావడం ‘అపవాదం’ లేదా తాత్కాలికం. కానీ, ఈ ‘తా త్కాలిక దుస్థితి’ దశాబ్దుల తరబడి శాశ్వతమైపోయి ఉండడం నడుస్తున్న వైపరీత్యం. దేశంలో దాదాపు అన్ని నదులూ కాలుష్యగ్రస్తమై ఉన్నాయి. ప్రధాన నదులకు జీవజలాన్ని అందిస్తున్న హిమాలయ పర్వత శ్రేణి కూడ కాలుష్యమై పోయింది. ఆకాశంలోని నీరు పరమ స్వచ్ఛంగా ఉంటుందని ప్రతీతి. ఇది ప్రాకృతిక వాస్తవం. వర్షరుతువు తర్వాత ఆకాశం నిర్మలంగా కాలుష్య రహితంగా మారడం ప్రాకృతిక ధర్మం. అందువల్లనే వర్షరుతువు తర్వాత వచ్చే శరత్‌రుతువులో పగటిపూట సూర్యకాంతి, రాత్రిపూట చంద్రకాంతి మరింత తెల్లగా ఉంటాయన్నది తరతరాల అనుభవం. ఈ సహజమైన తత్త్వం కూడ దశాబ్దులుగా కాలుష్యవంతమై పోయింది. వాననీరు కూడ కాలుష్యంతో నిండి పోయింది. పరిశ్రమల నుంచి పైపైకి ఎగసిపోతున్న విష రసాయన కాలుష్యపుపొగలు ఆకాశంలోని నీటి ఆవిరులలో చేరి కాలుష్య వర్షాన్ని కురిపిస్తున్నాయి. భూమిని ప్రకృతిని పరిశుభ్రం చేసే నీరు ఇలా మురికిపట్టి ఉండడం స్వచ్ఛ్భారత పునరుద్ధరణకు నేపథ్యం. జల ప్రక్షాళన కొనసాగుతున్న సమయంలోనే జల కాలుష్యాన్ని మరింతగా పెంచగల కేంద్రీకృత పారిశ్రామిక ప్రగతి వాటికలు విస్తరించిపోతుండడం సమాంతర వైపరీత్యం..
ఈ సమాంతర వైపరీత్యం వాణిజ్య ప్రపంచీకరణ ఫలితం. ప్రపంచీకరణను ప్రవర్ధమాన దేశాల నెత్తికెత్తిన సంపన్న దేశాలు ప్రస్తుతం తమ దేశాలను మాత్రం ప్రపంచీకరణ పరిధి నుంచి విముక్తం చేయడంలో నిమగ్నమై ఉన్నాయి. నదుల నీటి స్వచ్ఛత మాత్రమే కాదు భూగర్భ జలాలు సైతం విషమెక్కి ఉండడానికి ఏకైక కారణం గత ఇరవై ఏళ్లుగా ప్రపంచీకరణ దళారీలు భూగర్భాన్ని తవ్వి పారేయడం. ఈ వాస్తవాన్ని మన ప్రభుత్వాలు ఇప్పటికీ గుర్తించకపోవడం ప్రపంచీకరణ మాయాజాలం. మనం ప్రపంచీకరణ ఊబిలో ఇంకా ఇంకా కూరుకొని పోతున్నాము. విదేశీయ శీతల పానీయాల ఉత్పత్తిదారులు ఆంధ్రప్రదేశ్‌లోని ‘శ్రీనగరం’- సిరిసిటీ- ప్రాంగణంలో అతి పెద్ద కర్మాగారాన్ని ఆరంభించడం జల కాలుష్య విస్తరణకు ఒక ఉదాహరణ మాత్రమే. మూసీ నది ఒకప్పుడు అనంతగిరి అడవులలోని ఓషధీ రసాలు నిండిన అమృతవాహిని. అలాంటి ముచికుందా నది నేడు పారిశ్రామిక కాలుష్య భరిత విషవాహిని ‘మూసీ మురుగు’గా మారింది. మురికినీటి ‘మూసీ’ మళ్లీ మధుర జలాల ముచికుందగా మారినప్పుడు నదులు జీవవంతం కావాలన్న మోదీ పిలుపునకు సార్థకత ఏర్పడుతుంది.
మధ్యప్రదేశ్‌లోని ‘అమరకంటక’లో జరిగిన ‘నర్మదా సేవాయాత్ర’ విజయోత్సవ సభలో ప్రసంగించిన సందర్భంగా మోదీ ఈ పిలుపునిచ్చారు. గత ఏడాది డిసెంబర్ పదకొండవ తేదీన మొదలైన ఈ సేవాయాత్ర నర్మదా నది పరీవాహక ప్రాంతమంతటా కొనసాగిందట. నర్మదా నదిని పునర్జీవవంతం చేయడానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆరంభించిన పథకాన్ని అన్ని ప్రాంతాల వారు, ప్రభుత్వాలు ఆదర్శంగా స్వీకరించి అన్ని నదులనూ స్వచ్ఛమైన నీటితో జీవవంతం చేయాలన్నది ప్రధాని ఇచ్చిన పిలుపు. ‘అమరకంటక’లో జన్మించిన న ర్మదా నది మధ్యప్రదేశ్‌లో దా దాపు పదకొండు వందల కిలోమీటర్లు ప్రవహిస్తోంది. ఆ తర్వాత నూట అరవై ఎనిమిది కిలోమీటర్లు గుజరాత్‌లో సాగి పశ్చిమ సాగరంతో సంగమిస్తోం ది. తూర్పుగా ప్రవహించేవి నదులు, పడమటి ప్రస్థానం సాగించేవి ‘నదములు’. అందువల్ల నర్మద నదమైంది. ఈ నదం ప్రవహించే తటం పొడవునా ఆరు కోట్ల మొక్కలను జూలై రెండవ తేదీన నాటనున్నారట! నదికి ఇరువైపులా తమ పొలాలలో మొక్కలు నాటి అడవులను పెంచే రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుందట. నదీ తీరంలోని పట్టణాలలో మురికినీటిని శుభ్రపరచడానికి యంత్ర వ్యవస్థను ఏర్పాటు చేస్తారట. గంగానది నీటిని శుభ్రం చేయడంలో భాగంగా ఐదు రాష్ట్రాల్లోని నూట నాలుగు నగరాల్లో రెండు వందల ముప్పయి ఒక్క క్షాళన యాంత్రిక వ్యవస్థలను కేంద్ర ప్రభుత్వం గత జూలైలో ప్రారంభించింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇలాంటి పథకాన్ని ఇప్పుడు ఆరంభించింది.
నర్మదా నదీ తీరం పొడవునా ఉన్న అన్ని గ్రామాలలోను సేంద్రియ వ్యవసాయాన్ని పునరుద్ధరించడం ఈ పథకంలోని అతి ప్రధానమైన అంశం. సేంద్రియ వ్యవసాయాన్ని పునరుద్ధరించే పథకాన్ని అన్ని రాష్ట్రాలు అనుసరించ వలసి ఉంది. ఎందుకంటే రసాయన విషాలు నిండిన ఎరువులను వాడడం ద్వారా జరుగుతున్న కృత్రిమ వ్యవసాయం వల్ల భూగర్భం, భూగర్భ జలాలు విషమెక్కి పోతున్నాయి. అందువల్ల ఆవు పేడ, పశువుల పేడ, పచ్చి ఆకులు తదితర ప్రాకృతిక పదార్థాలను వాడడం ద్వారా జరిగే సేంద్రియ వ్యవసాయం వల్ల భూగర్భ జలాలు శుద్ధమవుతాయి.