సంపాదకీయం

పులుల ‘ భోజనం’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పులులు సంచరించడానికి అవసరమైన అటవీ వైశా ల్యం క్రమంగా తగ్గిపోతోంది, ఏనుగులు తిరుగాడే ప్రాంతాలు ఎప్పుడో ధ్వంసమయ్యాయి. అందువల్ల దిక్కుతోచని ఏనుగులు పల్లెలలోని, పల్లెల చుట్టూ ఉన్న పొలాలలోకి చొరబడి బీభత్సం సృష్టిస్తున్నాయి. సగటున ప్రతి వారం దేశంలో ఎక్కడో అక్కడ ఊపిరాడని ఏనుగులు ఉసిరేగుతుండడం దశాబ్దుల కథ. పులులు ఇలా చొరబడుతున్న ఘటనలు తక్కువ. ఎందుకంటే వ్యాపార హంతకులు అడవులలోనే పులులను చంపేస్తున్నారు. పులుల గోళ్లను, చర్మాలను, ఎముకలను విదేశాలకు ప్రధానంగా చైనాకు తరలిస్తున్నారు. పులుల ‘అసహజ మరణాలు’ పెరుగుతుండడం పట్ల ఆందోళన అధికవౌతున్న కొద్దీ ఈ అసహజ మరణాలు మరింతగా పెరుగుతున్నాయి. ఈ సంవత్సరం ఇంతవరకూ దేశంలో ఇరవై తొమ్మిది పులులను చంపేశారట! పదునాలుగు పులుల శరీర భాగాలను, చర్మాలను అధికారులు హంతకుల నుంచి స్వాధీనం చేసుకున్నారట. జూలై 29న ‘శార్దూల దినోత్సవం’ జరిగింది. అడవుల విధ్వంసం అన్ని ప్రాంతాలలోనూ జరిగిపోతున్న ప్రక్రియ. అడవులు అంటే కేవలం వృక్షజాలం కాదు, జంతుజాలం కూడ. మన దేశంలోని పెద్ద అడవి జంతువులైన ఏనుగులు, పులులు నశించిపోతుండడం దశాబ్దులుగా కొనసాగుతున్న ఘోరం. ‘ప్రపంచీకరణ’ వ్యవస్థీకృతమైన తరువాత ఈ ఘోరం మరింత తీవ్రతరం అయింది. ప్రపంచాన్ని మొత్తం ఒక పల్లెగా ‘పుడమి పల్లె’- గ్లోబల్ విలేజ్-గా మార్చడం ప్రపంచీకరణ లక్ష్యమన్నది రెండున్నర దశాబ్దులుగా జరుగుతున్న ప్రచారం. అందువల్ల సార్వభౌమ దేశాల సరిహద్దులు చెరిగిపోవాలన్నది జరిగిన ప్రచారం. అంటే ఒక దేశం నుంచి మరో దేశంలోకి వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు నిర్నిరోధంగా ప్రవేశించడానికి వీలుగా సరిహద్దులు సహజంగా చెరిగిపోవాలట! ప్రవేశ అనుమతి పత్రం- వీసా- వంటి నిరోధకాలు తొలగిపోయి జనం పడమర నుంచి తూర్పు వరకూ -అంటార్కిటిక్- దక్షిణ ధ్రువం- నుంచి ఆర్కిటిక్- ఉత్తర ధ్రువం- వరకూ యథేచ్ఛగా విహరించాలన్నది ‘పుడమి తల్లి’ ఆదర్శం. అందుకు వీలుగా సంపన్న దేశాల బహుళజాతి సంస్థలు విమానాలను నడుపుతాయి, అన్ని దేశాలను కలుపుతూ రైళ్లను వేస్తాయి. చైనావారు ఇప్పుడు ఇలాంటి అంతర్జాతీయ రైలు మార్గాలను నిర్మించడంలో అగ్రగాములై ఉన్నారు. మరోవైపు మన దేశపు సరిహద్దులను చెరిపివేయడానికి కూడ చైనా యత్నిస్తోంది. దేశాల సరిహద్దులను గుర్తించని ‘అంతర్జాతీయ’ బృందాలు ‘వీసా’లు లేకుండా మన దేశంలోకి విరివిగా చొరబడిపోతున్నాయి. ఇదంతా ‘ప్రపంచీకరణ’- గ్లోబలైజేషన్-లో భాగం. ఇలా చొరబడుతున్న అంతర్జాతీయ బృందాలు మన అటవీ సంపదను కొల్లగొట్టి విదేశాలకు తరలిస్తున్నాయి. ఆఫ్రికా నుంచి, పశ్చిమ ఆసియా నుంచి, ఐరోపా నుంచి, చైనా నుంచి ఇలాంటి ‘వాణిజ్య బీభత్సకారులు’ మన దేశంలోకి చొరబడిపోతున్నారు. మన పులులను, ఏనుగులను, గంధం చెట్లను హత్య చేస్తున్నారు.. అటవీ హననం జరిగిపోతోంది.
సరికొత్తగా కర్నాటక ప్రభుత్వం నడుం బిగించింది. కాళీనది పుట్టి ప్రవహిస్తున్న ఉత్తర కన్నడ జిల్లాలో ‘కాళీ శార్దూల పరిరక్షణ ప్రాంగం’- కాళీ టైగర్ రిజర్వ్- ఏర్పడి ఉంది. దీని అటవీ ప్రాంత విస్తీర్ణం దాదాపు పదమూడు వందల చదరపు కిలోమీటర్లు. కానీ ఇటీవల ఈ అటవీ ప్రాంగణ విస్తీర్ణాన్ని మూడు వందల పద్నాలుగు చదరపుకిలోమీటర్లకు పరిమితం చేసింది. ఈ మేరకు ‘పర్యావరణ పరిరక్షణ మండలం’ పరిధిని కుదించివేయాలని కేంద్ర ప్రభుత్వానికి కర్నాటక ప్రతిపాదనలు పంపిందట! ‘పర్యావరణ పరిరక్షణ మండలం’- ఎకో సెన్సిటివ్ జోన్- ఇఎస్‌జెడ్- పరిధిలో పులులు యథేచ్ఛగా విహరించగలవు. ఆహారం లభించే ప్రాంతం విస్తీర్ణం ఇలా నాలుగింట మూడు వంతులకు పైగా తగ్గిపోవడం వల్ల ‘ఊపిరాడని’ పులులు క్రమంగా నశించిపోయాయి. పులులు విహరించే అటవీ ప్రాంతం పరిధి చిన్నదై పోవడం వల్ల ‘హంతకులు’ మరింత సులభంగా పులులను పట్టి పరిమార్చగలరు. ఇప్పుడు ‘ఇఎస్‌జెడ్’ పరిధి నుంచి విముక్తమైన ప్రాంతం అభయారణ్యం కాదు కనుక చెట్లను సక్రమంగాను, అక్రమంగాను మన వ్యాపారులు ధ్వంసం చేయడానికి చక్కని అవకాశం లభిస్తుంది. దేశంలోని మొత్తం భూభాగంలోని కనీసం ముప్పయి మూడు శాతం మేర అడవులు పెరగాలన్నది ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్న ఆదర్శం. ప్రస్తుతం ఇరవై నాలుగు శాతం భూభాగంలో మాత్రం అడవులు పెరుగుతున్నాయి. అయినప్పటికీ అడవులను హననం చేస్తున్న ప్రపంచీకరణ విధానం కొనసాగుతూనే ఉంది.
దేశంలో రెండువేల రెండువందల ఇరవై ఆరు పులులు మాత్రమే ఉన్నట్టు 2014లో సేకరించిన గణాంకాల వల్ల ఆధికారికంగా వెల్లడైందట! పులుల సంరక్షణ ప్రాంగణాలలో పులులు పుడుతున్నాయి. సహజంగా మరణిస్తున్నాయి. కానీ అభయారణ్యాలకు వెలుపల కూడ పులులను రహస్యంగా చంపుతున్న ముఠాలు పనిచేస్తున్నాయి. ఫలితంగా దశాబ్దుల తరబడి మన పులుల సంఖ్య తగ్గిపోయింది. ప్రధానంగా చైనాలో జరుగుతున్న ఔషధాల ఉత్పత్తి కోసం పులిగోళ్లను, పులిచర్మాలను తరలించుకొనిపోతున్నారు. ఈ ముఠాలను చైనా ప్రభుత్వం ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ప్రోత్సహిస్తోంది. ఇటీవలి కాలంలో ఎఱ్ఱ చందనం కలపను అక్రమంగా తరలించుకొనిపోతున్న అనేకమంది చైనా పౌరులు మన దేశంలో పట్టుబడ్డారు. ఈ దొంగలు పులుల శరీర అవయవాలను దొంగరవాణా చేస్తున్న ముఠాలతో అనుసంధానమై ఉన్నారు. మన సిక్కింలోని ‘నాథులా’ కనుమ మార్గం గుండా టిబెట్‌లో సీమాంతర వ్యాపారం 2004లో మొదలైన తరువాత మన పులుల హననం మరీ ఎక్కువైంది. పులుల అవయవాలను, గోళ్లను దొంగరవాణా చేస్తున్న ముఠాలను నిరోధించాలని ఈ పదమూడు ఏళ్లలో మన ప్రభుత్వం చైనా ప్రభుత్వానికి అనేకసార్లు విజ్ఞప్తి చేసింది. అయినప్పటికీ ‘చైనా వైద్యం’ కోసం మన పులులను చంపేస్తున్న ముఠాల ఆట కట్టుబడడం లేదు. చైనాలో పులుల శరీర అవయవాలను, చర్మాలను, గోళ్లను శుద్ధి చేసే కేంద్రాలు- టైగర్ హార్వెస్టింగ్ సెంటర్స్- ఏర్పడి ఉన్నాయి. ఈ కేంద్రాలకు విదేశాల నుంచి పులులను, పులిగోళ్లను, చర్మాలను తరలించుకొనిపోతున్నారు. చైనా ప్రభుత్వం తమ దేశంలోని పులులను రక్షించుకొంటోంది. ఇతర దేశాలలోని ప్రధానంగా మన దేశంలోని పులులను హత్య చేయిస్తోంది. అందువల్లనే మన పులులు అదృశ్యమైపోతున్నాయి.
తెలంగాణలోని పాలమూరు, నల్గొండ ప్రాంతాల్లో విస్తరించి ఉన్న ‘ఆమ్రాబాద్ శార్దూల రక్షణ ప్రాంగణం’లో యురేనియం అనే్వషణలకు గత ఏడాది అనుమతి లభించింది. ఈ ‘అనే్వషకుల’ వల్ల పులులకు ప్రమాదం ఏర్పడిపోయింది. మంచిర్యాల, ఆదిలాబాద్ ప్రాంతాలలో విస్తరించి ఉన్న ‘కవాల్’ పులుల రక్షణ ప్రాంగణం గుండా భారీ వాహనాలు పయనించరాదని ప్రభుత్వం 2013లో నిర్దేశించింది. ఈ నిషేధాన్ని గత ఏడాది తొలగించినప్పటి నుంచి పులుల ప్రాణాలకు మరింత ముప్పు ఏర్పడింది. ఈ అభయారణ్యం నుంచి పది పులులు అదృశ్యమైనట్టు ఇటీవల ప్రచారమైంది. ఆ పులులు ఏమైపోయినట్టు? అభయారణ్యాలు వన్యమృగాలు భుజించే ప్రాంగణాలు కా దు, వన్యమృగాలను భుజించే ప్రాంగణాలు!