సంపాదకీయం

నిగ్గు తేలిన హక్కు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైయక్తిక గోపనీయత-ఇండివిడ్యువల్ ప్రైవసీ- ప్రాథమికమైన హక్కు అని సర్వోన్నత న్యాయస్థానం గురువారం తీర్పు చెప్పడం రాజ్యాంగ స్ఫూర్తికి సరికొత్త ధ్రువీకరణ. రాజ్యాంగంలోని ఇరవై ఒకటవ అధికరణం నిర్దేశిస్తున్న ‘జీవించే హక్కు’లో ‘వ్యక్తిగత గోప్యత’ భాగమన్నది తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనం చేసిన నిర్ణయంలోని సారాంశం. అందువల్ల మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న రాజ్యాంగం ప్రసాదిస్తున్న హక్కునకు సర్వోన్నత న్యాయ నిర్ణయం అద్దం. ‘ఏ వ్యక్తి ప్రాణానికి కాని వైయక్తిక స్వేచ్ఛకు కాని- చట్టం నిర్దేశిస్తున్న పద్ధతిలో తప్ప-్భంగం కలిగించరాదు..’ అని రాజ్యాంగంలోని ఇరవై ఒకటవ అధికరణం నిర్దేశిస్తున్నది. అందువల్ల స్వేచ్ఛగా జీవించే వౌలిక అధికారం ప్రజాస్వామ్య దేశమైన మన వ్యవస్థలో ప్రజలందరికీ ఉంది. ఇందులో భాగం వైయక్తిక గోపనీయతకు లభిస్తున్న రక్షణ. గురువారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చేసిన స్పష్టీకరణ ఇది. నిజానికి స్వేచ్ఛగా జీవించడం, వ్యక్తిగత సమాచారాన్ని వ్యక్తిగత జీవన రీతికి, గోప్యతను పరిరక్షించుకోవడం అనాదిగా మానవులకు లభిస్తున్న సహజ న్యాయసూత్రాలకు అనుగుణమైన అధికారం. ఈ సహజ న్యాయ సూత్రాల-ప్రిన్సిపుల్స్ ఆఫ్ నాచురల్ జస్టిస్‌కు రాజ్యాంగంలోని ప్రాథమిక అధికారాలు-్ఫండమెంటల్ రైట్స్-ధ్రువీకరణ మాత్రమే. శతాబ్దుల విదేశీయుల దురాక్రమణ సమయంలో మన దేశ ప్రజల, స్వజాతీయుల ఈ సహజ అధికారాలు, వౌలికమైన హక్కులు ఘోరంగా భంగపడ్డాయి. వ్యక్తిగత జీవన పరిధిలోకి విదేశీయ నియంతృత్వ, నిరంకుశ, దౌర్జన్య స్వభావం చొరబడి బీభత్సకాండను సృష్టించడం చరిత్ర! అందువల్ల స్వతంత్ర భారత దేశం ప్రిన్సిపుల్స్ ఆఫ్ నాచురల్ జస్టిస్- సహజ న్యాయ సూత్రాలను పునరుద్ధరించుకోవాల్సి వచ్చింది. ఈ ‘పునరుద్ధరణ’ రాజ్యాంగం ప్రసాదిస్తున్న ప్రాథమిక అధికారాలు. అందువల్ల ‘వ్యక్తిగత గోపనీయత’ జీవించే స్వేచ్ఛలో సహజంగా నిహితమై ఉన్న వౌలిక అధికారం అన్నది అనాది వాస్తవం. మనదేశంలో ఈ వాస్తవం వ్యక్తిగత, సామాజిక, రాజ్యాంగ, సాంస్కృతిక రంగాలలో జీవన రీతి అయింది. దీన్ని రాజ్యాంగం వివరించింది, వివరిస్తోంది. ఈ వాస్తవం సర్వోన్నత న్యాయ నిర్ణయం ద్వారా మరింతగా ప్రస్ఫుటమైంది. అందువల్ల సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఈ రాజ్యాంగ వాస్తవానికి, సహజ న్యాయ సూత్రానికి మరో ధ్రువీకరణ. ప్రధాన న్యాయమూర్తి జెఎస్ కేహర్ న్యాయమూర్తులు జె.అచలమేశ్వర్, ఎస్‌ఏ బాబ్డే, ఆర్‌కె అగర్వాల్, ఆర్‌ఎఫ్ నారీమన్, ఏఎమ్ సాప్రే, డివై చంద్రచూడ్, సంజయ్ కె.కౌల్, ఎస్.అబ్దుల్‌నజీర్ చెప్పిన తీర్పువల్ల అధికార యంత్రాంగం కాని, ప్రభుత్వేతర స్వచ్ఛంద, వాణిజ్య, సేవా, అధ్యయన, పరిశోధక సంస్థలు కాని పౌరుల వ్యక్తిగత విషయాలను అక్రమంగా బహిర్గతం చేయడాన్ని శాశ్వతంగా నిరోధించినట్టయింది. ఈ మొత్తం న్యాయ ప్రక్రియలో ప్రస్ఫుటించిన ప్రధాన అంశం ‘సమాచార సేకరణ’ పేరుతో వ్యక్తిగత జీవితాల గోపనీయత పరిధిలోకి అక్రమంగా ఎవ్వరూ చొరబడరాదన్నది... ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వేతరులు కావచ్చు! 2009లో మొదలైన ‘ఆధార్’ గుర్తింపు పత్రాల జారీ చేసే ప్రక్రియ ఈ గోపనీయత పరిరక్షణ వ్యవస్థకు విఘాతకరంగా మారిందన్న ప్రచారం ‘వౌలిక అధికార’ మీమాంసకు ప్రాతిపదిక. ‘ఆధార్’ కార్డులను రూపొందించి జారీ చేయడానికి వీలుగా సమాచారాన్ని సేకరించడానికి ప్రాతిపదిక అయిన చట్టం ఏదీ 2016 వరకు రూపొందించకపోవడం ఈ అంశాన్ని వివాదగ్రస్తం చేసింది. ఆధార్ కోసం సేకరిస్తున్న సమాచారం ఆయా వ్యక్తుల నిజ జీవన గోప్యతకు భంగం వాటిల్ల చేస్తుందన్నది జరిగిన ప్రచారం. ఆధార్‌ను వ్యతిరేకిస్తున్న అనేక సంస్థలు, అనేకమంది వ్యక్తులు సుప్రీం కోర్టులో ‘న్యాయ యాచికల’ను దాఖలు చేయడానికి ఇదీ నేపథ్యం.
ఈ న్యాయ యాచికల విచారణ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలోనే వ్యక్తిత గోపనీయత ‘వౌలికమైన హక్కు’ అవునా కాదా అన్న మీమాంస మొదలైంది. ఈ వివాద పరిష్కారంకోసం ఏర్పడిన ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం మరింత విస్తృత ధర్మాసనం వారు ఈ రాజ్యాంగ మీమాంసను నిర్ధారించాలని జూలై పదిహేడవ తేదీన నిర్ణయించారు. గతంలో ఇదే అంశాన్ని ఆరుగురు న్యాయమూర్తుల ధర్మాసనం, ఎనిమిది మంది న్యాయమూర్తుల ధర్మాసనం విచారించి ఉండడం ఈ నిర్ణయానికి ప్రాతిపదిక కావచ్చు. 1954లో ఈ ‘చర్చ’ను సమీక్షించిన ఎనిమిదిమంది న్యాయమూర్తులు ‘వ్యక్తిగత గోపనీయత’ ప్రాథమిక రాజ్యాంగ హక్కు కాదని నిర్ణయించడం చరిత్ర! 1962లో మరోసారి ఆరుగురు న్యాయమూర్తుల ధర్మాసనం కూడ 1954 నాటి నిర్ణయాన్ని పునురుద్ఘాటించింది. అందువల్ల గురువారం తొమ్మండుగురు న్యాయమూర్తులు చెప్పిన తీర్పులను రద్దు చేసినట్టయింది. సుప్రీంకోర్టు తన నిర్ణయాలను తానే సమీక్షించినట్టయింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు గురువారం చెప్పిన తీర్పులోని ప్రధాన అంశం వ్యక్తిగత గోపనీయత ఇరవై ఒకటవ రాజ్యాంగ అధికరణం నిర్దేశిస్తున్న ‘జీవన స్వేచ్ఛ’ ప్రాథమిక అధికారంలో భాగమన్నది... అందువల్ల ‘గోపనీయత’ ప్రాథమికమైన హక్కు అని నిర్ధారణ జరిగినప్పటికీ ఇది ప్రత్యేకమైన హక్కు కాదన్నది మరో నిర్ధారణ, ‘గోపనీయత’ హక్కు జీవించే హక్కులో భాగం. అయితే ఈ ‘గోపనీయత’ అధికారం తిరుగులేని హక్కు మాత్రం కాదన్నది కూడ సుప్రీంకోర్టు తీర్పులోని సారాంశం! దేశ భద్రతకూ జాతీయ సమష్టి హితానికీ, ఈ ‘గోపనీయత’ హక్కునకు మధ్య ‘సంతులనం’ ‘సమన్వయం’ ఏర్పడి ఉండాలన్నది సర్వోన్నత న్యాయ నిర్ణయం. ఇరవై ఒకటవ అధికరణం కూడ దీనే్న నిర్దేశిస్తోంది. హంతకులుగా న్యాయ నిర్ధారణ జరిగిన వారికున్న ‘జీవించే హక్కు’ న్యాయస్థానాల తీర్పుపై ఆధారపడి ఉంది. అలాగే వివిధ నేరాలను చేసిన వారికి ఆయా అభియోగాల ప్రాతిపదికగా న్యాయస్థానాలు ‘నిర్బంధం’ శిక్షగా విధించవచ్చు. అందువల్లనే ‘గోపనీయత’- వ్యక్తిగత వ్యవహారాన్ని ఇతరులకు తెలియనీయని హక్కుపై చట్టాలు హేతుబద్ధమైన ఆంక్షలు విధించవచ్చు...
కేంద్ర ప్రభుత్వం 2016లో రూపొందించిన ‘ఆధార్’ చట్టంలో కూడ వ్యక్తిగత గోపనీయతను ‘ప్రాథమిక అధికారం’గా గుర్తించారు. హేతుబద్ధమైన ఆంక్షలు విధించడమన్నది ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానం కూడ అంగీకరించిన అంశం. ప్రజల వ్యవహారాలలో ప్రభుత్వాల ప్రమేయం ఎంత తగ్గితే జన జీవనంలో స్వేచ్ఛ అంతమేరకు పెరుగుతుంది. ఈ స్వేచ్ఛ సమష్టి సమాజ హితానికి, దేశ భద్రతకు సమగ్రతకు భంగం కారాదు. ఇదీ సమన్వయం.