సంపాదకీయం

‘డేరా’ బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక లైంగిక బీభత్సకారుడిని శిక్షించే ప్రక్రియకు ఇంతటి ఘోరమైన పైశాచికమైన ప్రతిఘటన దాపురించడం మన ప్రజాస్వామ్య వ్యవస్థకు తీరని కళంకం. ‘డేరా సచ్ఛా, సౌదా’ అన్న ‘తెగ’కు చెందిన గుర్‌మీత్ రామ్హ్రీమ్‌సింగ్ అనే వాడిని హరియాణాలోని ‘పంచకుల’ పట్టణంలోని ప్రత్యేక న్యాయస్థానం దోషిగా నిర్ధారించిన వెంటనే అతగాడి అనుచరులు హరియాణా, పంజాబ్ రాష్ట్రాలలో సృష్టించిన భయంకర బీభత్సకాండ అభూతపూర్వం. ‘పంచకుల‘ ప్రాంగణం పిశాచ మానవ రక్తదాహ రాక్షసుల వికృత విన్యాసాలకు నిలయమైపోవడం ప్రభుత్వ యంత్రాంగపు దారుణ వైఫల్యానికి చిహ్నం! ఈ ‘డేరా సచ్ఛా సౌదా’ ప్రధాన కేంద్రం నెలకొని ఉన్న హరియాణాలోని ‘సిర్సా’ పట్టణంలో సైతం చెలరేగిన గుర్‌మీత్‌సింగ్ అనుచర నర మృగాలు సృష్టించిన రక్తపాతం మానవత్వానికి చెరగని మాలిన్యం. పోలీసులు భద్రతా దళాలవారు హరియాణాలోను పంజాబ్‌లోను హింసాకాండను నిరోధించలేకపోవడం ప్రభుత్వాల వైఫల్యానికి పరాకాష్ఠ. ఈ వైఫల్యం ఈ నిర్లక్ష్యం హరియాణా ప్రభుత్వానిదని, కేంద్ర ప్రభుత్వానిదని ‘పంజాబ్, హరియాణా ఉన్నత న్యాయస్థానం’ నిర్ధారించడం ఈ ప్రభుత్వ రాజకీయ నిర్వాహకులకు న్యాయాభిశంసన! ఈ ‘డేరా’ తెగ అధిపతిగా చెలామణి అవుతున్న గురుమీత్ రామ్హ్రీమ్ సింగ్ అనే విచిత్ర నామధేయుడు పదిహేను ఏళ్ల క్రితం తన ఆశ్రమంలోని ఇద్దరు ‘సాధ్వీ’ శిష్యురాండ్రను లైంగిక బీభత్స కాండకు గురి చేశాడన్నది ‘పంచకుల’లోని ప్రత్యేక న్యాయస్తానం చేసిన నిర్ధారణ! ఈ నిర్ధారణ జరగగానే ఈ ‘తెగ’కు చెందిన అసాంఘిక శక్తులు సామాన్య జనంపై దాడులు చేయడం వారి సమష్టి నేర ప్రవృత్తికి నిదర్శనం. అనేకమంది ప్రాణాలు బలైపోవడానికి, వందలాదిమంది క్షతగాత్రులు కావడానికి దోహదం చేసిన ఈ బీభత్స కాండ ఈ ‘డేరా’ అధిపతిపట్ల ఈ బీభత్సకారులకున్న ఉన్మాదపు మత్తునకు నిదర్శనం. ఏళ్ల తరబడి ఈ దురభిమానపు మత్తెక్కిన ఉన్మాదులు గురుమీత్‌సింగ్ నేరస్థుడన్న వాస్తవాన్ని అంగీకరించకపోవడం ఈ హింసకు కారణం! గురుమీత్‌సింగ్ ప్రవృత్తిని, ఇతగాడి అనుచరుల చిత్తవృత్తిని చక్కగా ఎరిగి ఉన్న ప్రభుత్వ యంత్రాంగం హింసను నిరోధించడానికి ముందు జాగ్రత్త చర్యలను తీసుకొనకపోవడం క్రూరమైన నిర్లక్ష్యం! హరియాణా ప్రభుత్వం ప్రదర్శించిన ఈ క్రూర నిర్లక్షం ‘వోట్లు సీట్లు‘ రాజకీయాలకు మరో నిదర్శనమని హైకోర్టు వ్యాఖ్యానించడం అధికార పార్టీకి సిగ్గుచేటైన వ్యవహారం. ‘డేరా’ అధిపతిగా చెలామణి అవుతున్న ఈ లైంగిక బీభత్సకారుడి పట్ల హరియాణా ప్రభుత్వం వహించిన ‘మెతక వైఖరి’ ఈ హింసాకాండకు కారణమన్నది హైకోర్టు నిర్ధారణ!
పంచకుల ప్రాంగణంలోకి చొరబడిన దౌర్జన్యకారులను, అసాంఘిక శక్తులను, బీభత్స మూకలను హరియాణా ప్రభుత్వ నిఘా యంత్రాంగం కనిపెట్టి నిరోధించకపోవడం ఇలా క్రూరమైన నిర్లక్ష్యానికి చిహ్నం! ఈ ‘డేరా’ గురుమీత్ వంటి మారీచులు యోగం, సంప్రదాయం వంటి ముసుగులను ధరించి ఉన్న మేక వనె్నల మెకాలు! ఏళ్ల తరబడి ఇతగాడి వికృత విన్యాస ప్రదర్శనలను తిలకిస్తున్న సామాన్యులకు సైతం ఈ సంగతి తెలిసిపోయింది. కానీ రాజకీయ పక్షాలకు తెలియకపోవడం, ప్రభుత్వాలకు తెలియకపోవడం నిదురపోనివారు నిద్రను నటించడంతో సమానం. ఇరవై ఏళ్లకు పైగా దాదాపు అన్ని రాజకీయ పక్షాలవారు హరియాణాలో ఈ ‘డేరా’ గురుమిత్‌సింగ్ రామ్ రహీమ్ సింగ్ ప్రత్యక్ష పరోక్ష సమర్ధన కోసం పాటుపడినవారే! ప్రస్తుతం హరియాణాలో అధికారంలో ఉన్న రాజకీయ పక్షం ‘ప్రతీక’ మాత్రమే! ‘పంచకుల’లో సిబిఐ ఫిర్యాదులను విచారిస్తున్న న్యాయస్థానం గురుమిత్ నేరస్థుడని ధ్రువీకరించింది, సోమవారం శిక్షను ప్రకటించనుంది, ఈలోగా హింస చెలరేగింది. అందువల్ల గురుమిత్‌ను నిర్బంధించిన ‘రోహతక్’లోని ‘సునేథీ’ జైలు ప్రాంగణంలోనే సోమవారం న్యాయస్థానాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ‘పంచకుల’లో న్యాయస్థానం కూడ పని చేయలేని పరిస్థితి ఏర్పడడం ఎవరి వైఫల్యం? బీభత్సపు మూకల ముందు ప్రభుత్వాలు మోకరిల్లిపోతుండడానికి ఈ న్యాయస్థానాల తరలింపు మరో నిదర్శనం కాదా? పంచకుల హరియాణా ఉత్తర ‘కొస’లో చండీగఢ్ సమీపంలో ఉంది. ‘రోహతక్’ దక్షిణ హరియాణాలో ఢిల్లీకి సమీపంలో ఉంది! మామూలు ప్రక్రియ ప్రకారం సోమవారం రోహతక్ జైలునుంచి నేరుస్థడ్ని పోలీసులు తరలించుకొని వచ్చి పంచకులలోని ప్రత్యేక న్యాయస్థానంలో నిలబెట్టాలి! కాని దీని వల్ల ‘పంచకుల’లో బీభత్సకారులను అదుపు చేయడం సాధ్యం కాదన్నది ప్రభుత్వాల భయం! అందువల్ల న్యాయస్థానాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించుకొని వెళ్లాలట...
శాంతి భద్రతల దుస్థితికి ఇది అద్దం. ఈ కఠోర వాస్తవం ప్రాతిపదికగానే రోహతక్ జైలులోనే న్యాయస్థానం ఏర్పాటయినట్టు హైకోర్టు నిర్ధారించింది. సిబిఐ ఫిర్యాదులను విచారించే ప్రత్యేక న్యాయమూర్తి జగదీప్‌సింగ్ అక్కడే సోమవారం నేరస్థునికి శిక్షను విధిస్తాడట! పంచకులలో న్యాయమూర్తి ఈ డేరా అధిపతిని నేరస్థుడిగా నిర్ధారించిన తరువాత గురుమీత్‌ను గగన శకటం ఎక్కించి రోహతక్ జైలుకు తరలించుకునిపోయారు. కానీ బంధితుని కుమార్తె హనీప్రీత్ ఇన్‌సాన్ అనే ఆమె కూడ గురుమీత్‌తోపాటు హెలికాప్టర్‌లో ఎక్కి కూచుందట, రోహ్‌తక్‌లో దిగిపోయింది! నిఘా, భద్రతలు నీరుకారిపోయాయనడానికి ఇది మరో నిదర్శనం! హనీప్రీత్ అనే ఈ కుమార్తెను గురుమీత్‌సింగ్ పెంచుకున్నాడట! ఆమె భర్త కూడ ఈ డేరా తెగకు చెందినవాడే! కానీ తన భార్య హనీప్రీత్‌ను ఈ గురుమీత్ లైంగిక వేధింపులకు గురి చేసాడని ఆమె భర్త 2011లో ఆరోపించాడు, ఆ మేరకు న్యాయస్థానంలో ఫిర్యాదు కూడ దాఖలు చేశాడు, ఆ తరువాత ఈ వివాదం కోర్టు వెలుపల పరిష్కారం అయిందట! ఇంతటి జగుత్సాకరమైన వ్యవహారం ఇదొక్కటే కాదు సిర్సాలోని డేరా ప్రాంగణంలో క్రీస్తుశకం 1997వ 2007వ సంవత్సరాల మధ్య ఇరవై నలుగురు యువతులు, మహిళలు లైంగిక అత్యాచారానికి గురి అయ్యారట! వీరందరూ గురుమీత్ బాధితులన్నది ధ్రువపడని ఆరోపణ! వీరిలో తొమ్మిదిమందిని సిబిఐ విచారించి ఫిర్యాదు పత్రంలో వారి ఆరోపణలను నమోదు చేసింది. కాని చివరికి ఇద్దరు సాధ్వులకు జరిగిన ఘోర అన్యాయం మాత్రమే ధ్రువపడింది. ఒక పత్రికా రచయితను హత్య చేయించినట్టు కూడ ఇతగాడిపై ఆరోపణ నమోదయి ఉందట..
ఇలాంటి దుర్మార్గ వర్తనులు..గురువులుగా బాబాలుగా ధర్మాచార్యులుగా మహనీయులుగా చెలామణిలో ఉండడానికి కారణం సమాజ సమష్టి స్వభావానికి దాపురించిన వికృతి! నిరంతర శ్రమ జీవన సౌందర్య శోభలు సభలుతీరిన ఈ సనాతన భూమి కర్మయోగానికి ప్రతీక! కానీ ఎలాంటి శారీరక, బౌద్ధిక, ధార్మిక, ఆధ్యాత్మిక ప్రయత్నం లేకుండానే ఇహపర లాభాలను పొందాలన్న ప్రవృత్తి పెరిగిపోవడంవల్ల అద్భుతాల స్వాములు పేట్రేగిపోతున్నారు. అద్భుతం మహిమ కావచ్చు, మాయ కావచ్చు! అందువల్ల నిజమైన ధర్మాచార్యులు అద్భుతాలను చూపించరు. కానీ అద్భుతాలపట్ల సామాన్యులకున్న ఆకర్షణ ప్రాతిపదికగా ఇలా డేరాలు తయారవుతున్నారు! వౌలిక ధార్మిక తత్వం మరుగున పడి ఆర్భాటపు విన్యాసాలకు ప్రాధాన్యం పెరిగింది. ఈ ఆర్భాటం ఉన్మాదంగా మారింది, మారుతోంది! ఎవరు నిరోధించాలి?