సంపాదకీయం

పటిమకు పదును..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన సమర పటిమను పెంపొందించడానికి మన ప్రభుత్వం చేస్తున్న కృషికి కొనసాగుతున్న వైఫల్యాలు విచిత్రమైన నేపథ్యం! సరిహద్దులకు ప్రాణం పోస్తున్న ‘సమరుల’ సంఖ్యను పెంచడానికి బుధవారం ప్రభుత్వం నిర్ణయించడం ముదావహం! కొత్తగా నూట ఇరవై మూడు ‘సమర గగన శకటాల’ను సమకూర్చుకొనడానికి మన నౌకాదళం నిర్ణయించడం సముద్ర భద్రతను పెంపొందించే కార్యక్రమం! ఈ ‘నౌకాదళ బహుళ ప్రయోజన గగన శకటాల’-నావల్ మల్టీరోల్ హెలికాప్టర్స్-ఎన్‌ఎమ్‌ఆర్‌హెచ్-కొనుగోలు కోసం నౌకాదళం ‘టెండర్ల’ను జారీ చేసిందట! అయితే చైనా సరిహద్దులలో మన ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన నలబయి ఆరు ‘రక్షణ పథాలు’ ఇంతవరకు ఏర్పడకపోవడం భద్రతా కుడ్యంలో ఏర్పడి ఉన్న ‘కన్నా’లకు సాక్ష్యం! విచ్చలవిడిగా ‘సమాచార’ దూరవాణి రంగాలను ముంచెత్తుతున్న చైనా సామగ్రి మన నిర్లక్ష్యానికి నిదర్శనం. ఏమయినప్పటికీ ఇప్పుడు రక్షణ పాటవాన్ని పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం నడుం బిగిస్తోంది! సరిహద్దులలో మరింత మంది సైనికులను, అనుబంధ సైనికులను మోహరించడానికి రంగం సిద్ధం అవుతోంది. విశ్రాంత ఉన్నత సైనికాధికారి లెఫ్టినెంట్ జనరల్ డి.బి శేఖత్‌కర్ అధ్యక్షతన ఏర్పడిన రక్షణ వ్యవహారాల అధ్యయన సంఘం వారు సమర్పించిన నివేదికలోని అధికార ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం బుధవారం నాడు అంగీకరించడం మన దళాల పటిమకు పదును పెట్టడానికి దోహదం చేయగలదు. అ ధ్యయన సంఘం చేసిన తొంబయి తొమ్మిది ప్రతిపాదనలలో అరవై ఐదింటిని ప్రభుత్వం ఆమోదించిందట! సమరాంగణంలో నిలబడి పోరాడే యోధుల సంఖ్యను మరో యాబయి ఏడు వేల మేరకు పెంచాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించడం సరిహద్దుల చుట్టూ సమకూడుతున్న దురాక్రమణ శక్తులను ప్రతిఘటించే ‘పటిమ’ మరింత పదునెక్కడానికి దోహదకరం కాగలదు! ప్రస్తుతం కేంద్రం ఆమోదించిన ప్రతిపాదనలన్నీ ‘్ధరాతల దళాల’-ఆర్మీ-క్రమబద్ధీకరణకు, పునర్ వ్యవస్థీకరణకు, పటిష్ఠీకరణకు, విస్తరణకు సంబంధించినవి. ఈ ప్రతిపాదనలు మొత్తం 2019 నాటికి ఆచరణలోకి వస్తాయట. ప్రభుత్వం చెప్పిన మిగిలిన ముప్పయి నాలుగు ప్రతిపాదనలు నౌకాదళానికి-నేవీ-, వాయుసేన-ఎయిర్ ఫోర్స్-కు సంబంధించినవి. ఈ ప్రతిపాదనలను కూడ ప్రభుత్వం అతి త్వరలో ఆమోదిండం ఖాయమన్నది వ్యక్తవౌతున్న ఆశాభావం...
సముద్ర భద్రతకు మూడు వైపుల నుంచి ముప్పు ముంచుకుని వస్తున్న తరుణంలో కొత్తగా గగన శకటాలను కొనుగోలు చేయాలన్న నిర్ణయం అనివార్య పరిణామం! మాదక పదార్థాల ముఠా వారు ఆఫ్రికా తీరం నుండి, పశ్చిమ ఆసియా తీరం నుండి, పాకిస్తాన్ తీరం నుండి పెద్ద పడవలను, చిన్న ఓడలను ఎక్కి మన పడమటి సముద్ర జలాలలో నిరంతరం పచార్లు చేస్తున్నారు. పాకిస్తాన్ వైపునుండి, మాల్దీవుల వైపునుంచి వచ్చి పడుతున్న జిహాదీ బీభత్సకారులు మన లక్ష ద్వీపాలలోని ‘నిర్జన‘ ప్రాంతాలను స్థావరాలుగా చేసుకొనడానికి ఏళ్ల తరబడి యత్నిస్తున్నారు. ఆఫ్రికాలోని సోమలియా తీరంలో తిష్ఠ వేసి ఉన్న ఓడ దొంగలనూ, మాదకం ముఠాలను, జిహాదీ ఉగ్రవాదులను అనుసంధానం చేసి మన దేశంపైకి ఉసిగొల్పుతున్న పాకిస్తాన్ ప్రభుత్వ సంస్థ ‘ఇంటర్ సర్వీసెస్ ఇంటిలిజెన్స్’-ఐఎస్‌ఐ అరేబియా సముద్రాన్ని తన ప్రధాన స్థావరంగా మార్చుకుంటోంది! పాకిస్తాన్‌లోని గ్యాడార్ ఓడరేవులోను, మాల్‌దీవులలోని ఆఫ్రికా తీరంలోని ‘జిబౌటీ’ తీరంలోను తిష్ఠ వేసి ఉన్న చైన యుద్ధనౌకలు మన సముద్ర భద్రతను ఛిద్రం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మన ప్రభుత్వం జలాంతర్గాములను, యుద్ధనౌకలను, విమాన వాహక యుద్ధనౌకలను మరిన్నింటిని సమకూర్చుకోవలసిన అనివార్యం ఏర్పడింది. బహుళ ప్రయోజనాత్మక గగన సమర శకటాలను నూట ఇరవై మూడిండిని సమకూర్చుకోవాలన్న మన ప్రభుత్వ నిర్ణయానికి ఇదంతా నేపథ్యం. ఈ నావల్ మల్టీరోల్ హెలికాప్టర్-ఎన్‌ఎమ్‌ఆర్‌హెచ్-లో పనె్నండుమంది సాయుధ సమర వీరులు ప్రయాణం చేయవచ్చునట! ఈ నూట ఇరవై మూడు హెలికాప్టర్‌లకు తోడు మరో నూట పదకొండు ‘నౌకా సహాయక గగన శకటాల’-నావల్ యుటిలిటీ హెలికాప్టర్స్- ఎన్‌యుహెచ్‌లు-ను కూడ నౌకాదళం సమకూర్చుకోనున్నదట.. అయితే ఇవన్నీ ఎప్పుడు నౌకాదళంలో చేరనున్నాయి? దేశంలోని వాణిజ్య సంస్థలు ఉత్పత్తి చేస్తాయా? లేక విదేశాల నుంచి దిగుమతి అవుతాయా??
విదేశాల నుంచి ఇన్ని హెలికాప్టర్లను దిగుమతి చేసుకొనడం ‘్భరత్‌లో నిర్మించండి’ అన్న స్ఫూర్తికి విరుద్ధం. ఏడు దశాబ్దుల స్వతంత్ర భారత్ ఇప్పటికీ తనకు అవసరమైన ‘రక్షణ సామగ్రి’లో అరవై ఐదు శాతానికి పైగా విదేశాల నుంచి కొనుగోలు చేస్తుండడం ‘స్వయం సమృద్ధి’కి, స్వావలంబన స్ఫూర్తికి విఘాతకరమైన వాస్తవం! సైనికులు ఉపయోగించే ట్రక్కులను, ప్రముఖులు పయనించగల హెలికాప్టర్లను సైతం మనం విదేశాల నుంచి తెచ్చుకుంటున్నాము. విమాన వాహక యుద్ధనౌకలను, అత్యాధునిక యుద్ధ విమానాలను దిగుమతి చేసుకోవడం వేరే సంగతి. కానీ మన సైనికులకు అవసరమైన ట్రక్కు ల-లారీల-ను సైతం దిగుమతి చేసుకోవాలా? ‘అగ్ని’ ‘ఆకాశ్’ ‘పృధ్వి’ ‘బ్రహ్మ’ వంటి దూర లక్ష్య చ్ఛేదక క్షిపణులను స్వదేశీయ పరిజ్ఞానంతో రూపొందిస్తున్న మన రక్షణోత్పత్తుల, పరిశోధక విభాగాలవారు హెలికాప్టర్‌లను ఎందుకు తయారు చేయలేరు? మన రక్షణకు కేటాయిస్తున్న వార్షిక నిధులలో అధిక శాతం ఇలా ‘దిగుమతు’లకు వినియోగం అవుతున్నాయి. అందువల్ల వౌలిక వ్యవస్థల నిర్మాణానికి నిధులు కొరవరడుతున్నాయి! హైదరాబాద్ నగరం శివారులో ‘క్షిపణి ప్రయోగ పరీక్షా ప్రాంగణం’ నిర్మాణం కానుండడం వౌలిక రక్షణ సదుపాయాల విస్తృతికి జరుగుతున్న కృషిలో భాగం. మధ్యంతర లక్ష్య చ్ఛేదక, ఉపరితల క్షిపణుల ప్రయోగాలను ఈ ప్రాంగణంలో పరీక్షిస్తారట, నెలకొల్పుతారట! రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ ఈ ఆరువందల ముప్పయి రెండు ఎకరాల ప్రాంగణ అభివృద్ధికి ఇటీవల శంకుస్థాపన చేసాడు! కానీ మన ‘పటిమ’ పదునెక్కాలంటే మన రక్షణ వ్యయాన్ని తక్షణం కనీసం రెట్టింపు చేయాల్సి ఉంది...
చైనా సరిహద్దు సమీపంలోని నలబయి ఆరు రోడ్ల నిర్మాణం పదిహేను ఏళ్లుగా పూర్తికాకపోవడానికి నిర్లక్ష్యం ఒక ప్రధాన కారణం కాగా నిధుల కొరత మరో ప్రధాన కారణం! మన రక్షణ వార్షిక వ్యయం దాదాపు రెండున్నర లక్షల కోట్ల రూపాయలు కాగా చైనా ఆధికారికంగా దాదాపు పది లక్షల కోట్ల రూపాయలను సాలీనా సైనిక వ్యయానికి కేటాయిస్తోంది. చైనా రహస్యంగా మరో ఐదు లక్షల కోట్లరూపాయల సైనిక వ్యయం చేస్తోందన్నది పాశ్చాత్య దేశాలలో జరుగుతున్న ప్రచారం. అందువల్ల చైనా, పాకిస్తాన్‌ల ఉమ్మడి దురాక్రమణ ప్రమాదాన్ని ప్రతిఘటించడానికి వీలుగా మన సాలుసరి రక్షణ వ్యయం భారీగా పెరగవలసి ఉంది.