సంపాదకీయం

రక్షణకు ‘నిర్మల’ పటిమ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం నాడు జరిగిన కేంద్ర మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ ‘ఊహాగాన కళాకోవిదుల’కు నిరాశ కలిగించిందన్నది నిరాకరింపజాలని నిజం! ఈ ఊహాగాన కుశలులెవ్వరూ ముందుగా కనిపెట్టలేని విధంగా ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గంలో చేయగలిగిన ప్రధాన మార్పులు ఇందుకు కారణం! తమ ఊహలు నిజమైనట్టు ఈ ‘అంచనాల నిపుణులు’ ఇప్పుడు ప్రచారం చేసుకుంటున్నప్పటికీ, వీరు ఊహించని ప్రధానమైన పరిణామం నిర్మలా సీతారామన్ రక్షణశాఖ మంత్రి కావడం! ఇంతవరకూ వాణిజ్యశాఖ సహాయమంత్రిగా ఉండిన నిర్మలమ్మకు పూర్తిస్థాయి- క్యాబినెట్- మంత్రిపదవి లభిస్తుందన్నది కూడ ఊహాగానవేత్తలు ముందుగా నిర్ధారించని పరిణామం! కొంతమంది ప్రచారవేత్తలు ఆమెకు పదోన్నతి లభించవచ్చని జోస్యం చెప్పినప్పటికీ, నిర్థారణ అయిందని మాత్రం ఎవ్వరూ చెప్పలేదు! అం దువల్ల నిర్మలా సీతారామన్‌కు ఇలా రక్షణశాఖ లభించడం తెలుగు రాష్ట్రాలకు, కర్నాటకకు మాత్రమే కాక యావత్ దక్షిణ భారత దేశానికి ప్రాధాన్నాన్ని పెంచిన పరిణామం! నిర్మలా సీతారామన్ పరిపాలన నైపుణ్యం, అనుభవం, సామర్ధ్యం, విషయ పరిజ్ఞానం రక్షణమంత్రిత్వ శాఖ నిర్వహణకు తగిన స్థాయిగా ఉన్నాయన్నది రాజకీయ పండితులు, ఊహాగానవేత్తలు ఇంతవరకూ కనిపెట్టని మహావిషయం. నిర్మల రక్షణమంత్రి కావడం ఆదివారం జరిగిన మంత్రివర్గ విస్తరణలో ప్రస్ఫుటించిన అత్యంత ఆశ్చర్యకరమైన పరిణామం! 2022 నాటికి నరేంద్ర మోదీ ప్రభుత్వం అవతరింపచేయనున్న ‘నవ భారతం’- న్యూ ఇండియా- నిర్మాణ ప్రక్రియ వేగవంతం కావడానికి ఆదివారం జరిగిన మంత్రివర్గ విస్తరణ దోహదం చేయనున్నదట! అలా చేయనున్నదని పదోన్నతులను పొంది క్యాబినెట్ స్థాయి మంత్రులైనవారు, కొత్తగా మంత్రివర్గంలో చేరినవారిలో అత్యధికు లు చెప్పినమాట, చెబుతున్నమాట! ఈ ‘నవ భారత నిర్మాణాన్ని’ వేగవంతం చేసే ప్రక్రియలో తెలుగు రాష్ట్రాల నుంచి కొత్తగా ఎవ్వరినీ భాగస్వాములుగా చేర్చుకొనక పోవడం తెలుగు ప్రజలకు కొంత నిరాశను మిగిల్చిన పరిణామం! ప్రధానంగా ఈ రాష్ట్రాలకు చెం దిన భాజపా కార్యకర్తలకు ఆగ్రహం కూడా కలిగి ఉండవచ్చు! తెలంగాణకు చెందిన మురళీధరరావుకు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన హరిబాబుకు మంత్రివర్గంలో చోటు లభిస్తుందన్న ఊహాగానాలు నాలుగురోజులపాటు ఊపందుకున్నాయి. మురళీధరరావుకు మంత్రిపదవి విషయంలో ‘స్పష్టత’ లభించలేదని శనివారం ఊహాగాన ధురీణులు చేసిన నిర్ధారణ. ఈ ‘స్పష్టత’ అంటే ఏమిటో కూడా తెలియని ప్రచార మాధ్యమవేత్తల ఊహాగాన పటిమకు ఇది నిదర్శనం. అసలు మురళీధరరావు మంత్రిపదవిని చేపట్టాలని భావిస్తున్నాడా? లేదా? అన్న విషయమై ఈ ఊహాగాన కోవిదులకు ధ్యాస ఉన్నట్టు లేదని స్పష్టమైంది! హరిబాబుకు పదవి లభించనున్నట్టు, పూర్తిస్థాయి క్యాబినెట్- మంత్రిగా ఆయన ప్రమాణం చేయనున్నట్టు మాత్రం ఈ ఊహాగాన విశారదులకు స్పష్టమైందట! హరిబాబు హుటాహుటిగా దిల్లీకి బయలుదేరి వెళ్లినట్టు కూడ వీరు కనిపెట్టారు...
రక్షణ మంత్రిత్వశాఖ అతి ప్రధానమైన అయిదు శాఖలలో ఒకటి. కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో ఇవి నాలుగు మాత్రమే! దేశ వ్యవహారాలు, ఆర్థికం, విదేశీ వ్యవహారాలు, రక్షణ- ఈ నాలుగు ప్రధాన శాఖలు. భాజపా కేంద్ర ప్రభుత్వాన్ని నిర్వహించిన, నిర్వహిస్తున్న సమయంలో మానవశక్తి వనరుల శాఖ కూడ ఈ నాలుగింటితో సమానంగా ప్రాధాన్యం సంతరించుకుంది! విదేశీ దురాక్రమణ కాలం నాటి భావదాస్యం నుంచి విద్యావ్యవస్థను విముక్తం చేయడానికి భాజపా యత్నిస్తుండడం ఇందుకు కారణం. ఇలా ప్రధానమైన, కీలకమైన శాఖలలో ఒకటైన రక్షణశాఖకు మంత్రి లేకపోవడం అనేక నెలలుగా కొనసాగుతున్న వైపరీత్యం! రక్షణశాఖను సమర్ధవంతంగా నిర్వహించిన మనోహరి పారికర్‌ను అతిచిన్న రాష్టమ్రైన గోవాకు ముఖ్యమంత్రిని చేయడం అంతుపట్టని విచిత్రం! రక్షణశాఖను నిర్వహించడానికి పూర్వం కూడా ఆయన గోవా ముఖ్యమంత్రి. క్రీస్తుశకం 1950వ దశకంలో రక్షణమంత్రిగా పనిచేసిన కైలాసనాథ కట్జూ ఆ తర్వాత మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాడట! ఏమైనప్పటికీ రక్షణమంత్రి పదవీ బాధ్యత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి కంటె విస్తృతమైనది, ఉన్నతమైనది.. సరిహద్దుల భద్రతతో, దేశ ప్రజల రక్షణతో, జాతీయ గరిమతో, ప్రాదేశిక సమగ్రతతో ముడివడి ఉంది.. అలాంటి అతి కీలకమైన రక్షణ మంత్రిత్వశాఖను నిర్వహించనున్న తొలి మహిళ నిర్మలా సీతారామన్!
మహిళా సాధికారత సాధనలో, మహిళా ప్రాధాన్య విస్తరణలో ఇది సరికొత్త విజయం! విదేశీ వ్యవహారాలను, రక్షణ వ్యవహారాలను మహిళలే నిర్వహించడం విశిష్ఠమైన, విలక్షణమైన పరిణామం! ఈ యుగంలో కాకతీయ రుద్రమదేవి వంటివారు, పూర్వ యుగాలలో సత్యభామ, సుభద్ర వంటివారు సమరాంగణ విజయ విన్యాసాలను జరిపిన మాతృమూర్తులు. బ్రిటన్ దురాక్రమణ ముక్త భారత్‌లో మహిళలు త్రివిధ రక్షణ బలాల్లో చేరి దేశరక్షణ దీక్ష వహిస్తుండడం మహిళా చైతన్య ప్రభావ విస్తృతికి నిదర్శనం. ఇప్పుడు రక్షణశాఖను మహిళ నిర్వహించడం ఈ మహిళా జాగృతి చరిత్రలో వినూతన శుభఘట్టం! చైనా దురాక్రమణ ప్రమాదం, పాకిస్తాన్ చైనాల ఉమ్మడి బీభత్స వ్యూహం విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో, చైనా నుండి దిగుమతి అవుతున్న వస్తువులపై ఇటీవల ఆంక్షలు విధించిన వాణిజ్య మంత్రి సీతారామన్ రక్షణశాఖ బాధ్యతలను స్వీకరించడం సందర్భోచిత పరిణామం! ఒక మహిళ రక్షణమంత్రి కానున్నట్టు 2014 మే నెలలోనే ప్రచారం జరిగింది. తనకు రక్షణ మంత్రిత్వ శాఖ బాధ్యతలను అప్పగించాలని సుష్మా స్వరాజ్ కోరిందట! విదేశాంగ మంత్రిత్వ శాఖను నిర్వహించడం సుష్మాకు ఇష్టం లేదన్న ప్రచారం కూడా జరిగింది. కాని ఆమెకు రక్షణశాఖ దక్కలేదు. విదేశాంగ మంత్రిత్వశాఖను ఆమె అంటీ ముట్టనట్టు నిర్వహిస్తోందన్న అపప్రధ కూడ ఉంది. అందువల్ల భాజపాలో వరిష్ఠ నాయకురాలైన సుష్మాకు ‘రక్షణ’ను అప్పగించవచ్చునన్నది కొన్ని వర్గాలలో జరిగిన ధ్రువపడని ప్రచారం. కాని మోదీ ఈ ప్రాధాన్యశాఖను నిర్మలమ్మకు అప్పగించడం ద్వారా అందరినీ ‘హర్షచకితుల’ను చేశాడు.. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉండిన సమయంలో ఆమె స్వయంగా రక్షణమంత్రిత్వ శాఖను నిర్వహించిన చరిత్ర ఉంది. కాని అది ‘తాత్కాలిక’ నిర్వహణ మాత్రమే! ఆమె తొలి మహిళా ప్రధాని అయినప్పటికీ తొలి మహిళా రక్షణమంత్రి మాత్రం కాదు! ఈ విశిష్ట గౌరవం సీతారామన్‌దే. మహిళలు అబలలు కారు, వారు శత సహస్ర శస్త్రాస్త్ర ధరులైన సబలలు.. భరత మాతృశక్తి స్వరూపిణులు!
ఈ వాస్తవాన్ని ఆవిష్కరించగలిగిన మోదీ పరిపాలనా స్వరూప స్వభావాలకు కొత్త మెరుగులు దిద్దగలిగాడు. వైయక్తిక పటిమ, పని చేయాలన్న తపన, కార్యనిర్వహణ కౌశలం, విధాన నిష్ఠ- అన్న నాలుగు గుణగణాల ప్రాతిపదికగా మోదీ మంత్రుల ‘ప్రగతి’ని సమీక్షించాడట! ఈ సమీక్ష ప్రాతిపదికగా ఆదివారం తన ‘సహచర బృందం’లో మార్పులు చేశాడు, పదోన్నతులు కల్పించాడు! పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, ముక్తాస్ అబ్బాస్ నక్వీ వంటివారు ఈ ‘గీటురాయి’పై నిగ్గుతేలారు. కొత్తగా చేరిన తొమ్మిదిమంది సహాయ మంత్రులలో రాజకీయ వేత్తలు మాత్రమే కాక ఉన్నతోన్నత అధికారులుగా, దౌత్యవేత్తలుగా పనిచేసిన ‘అఖిల భారతీయ సేవా విభాగాల’కు చెందినవారు ఉండడం మోదీ వైవిధ్య కార్యశైలికి నిదర్శనం. మోదీ చెప్పినట్టు ఇలాంటివారి అనుభవం, పరిజ్ఞానం, పాలనా ప్రక్రియ సరికొత్త బలం..!