సంపాదకీయం

నదులకు జీవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నదీజలాల పరిరక్షణ కోసం, నీటి స్వచ్ఛతను పునరుద్ధరించడం కోసం అఖిల భారత మహాయాత్ర ఆరంభం కావడం మరో భగీరథ యజ్ఞం. ఆదివారం నాడు కలియుగం 5119వ సంవత్సర భాద్రపద శుక్ల త్రయోదశి నాడు ఆరంభమైన ఈనదీ జల రక్షణ జైత్రయాత్ర- ర్యాలీ ఫర్ రివర్స్-నెలరోజులపాటు కన్యాకుమారి నుంచి ఇంద్రప్రస్థం-దిల్లీ-వరకూ, పంజాబ్‌లోని అమృతసర్ వరకూ, హిమాలయాలలోని హరిద్వారం వరకూ కొనసాగనుండడం చారిత్రక మహా శుభ పరిణామం! జల స్వచ్ఛతతోపాటు జన సమైక్యం కూడ లక్ష్యమైన ఈ యజ్ఞం నదుల అనుసంధాన ధ్యాసను మరింత పెంచడానికి దోహదం చేయగలదు. ‘ఈశ’ స్వచ్ఛంద సంస్థ సంస్థాపక నిర్వాహకుడు జగ్గివాసుదేవ సద్గురువు సంకల్పించిన ఈ ‘నీటి పరుగు’ తమిళనాడులోని కోయంబత్తూరులో ప్రారంభమైన సందర్భంగా దాదాపు పదివేల మంది ఉద్యమకారులు నదులను రక్షించగలమని, నదీజలాల స్వచ్ఛతను పునరుద్ధరించగలమని ప్రతిజ్ఞ చేయడం గురించి దేశవ్యాప్తంగా ధ్యాస కలిగింది. ముప్పయి రోజులపాటు వివిధ స్థలాలకు ఈ యాత్రికులు చేరనున్న సందర్భంగా లక్షలాది నీటి రక్షకులు కూడ ఇలా ప్రతిజ్ఞలు చేయనున్నారట! కోయంబత్తూరులో ఆదివారం జరిగిన ప్రారంభ ఉత్సవంలో పాల్గొన్న కేంద్రమంత్రి హర్షవర్ధన్ ఈ జల సంరక్షణ యజ్ఞ విజయం కోసం సైనికుడిలా శ్రమిస్తానని చెప్పడం కేంద్ర ప్రభుత్వ సహకారానికి నిదర్శనం! గంగా ప్రక్షాళన పథకంలో ‘నమామి గంగే..’ అంటూ నినదిస్తున్న కేంద్ర ప్రభు త్వం స్ఫూర్తితో వివిధ ప్రాంతాలలో నీటి రక్షణ, నీటి స్వచ్ఛత కోసం రాష్ట్ర ప్రభుత్వాలు కూడ అనేక పథకాలను అమలు చేస్తున్నాయి. భగీరథుడు పు ట్టిన ఈ దేశంలో ‘గంగ’కు కొదువ లేదు! ‘గంగ’ నదుల రూపంలో, చెఱువుల రూపంలో, బావుల రూపంలో, భూగర్భ జలాల రూపంలో, వర్ష బిందువుల రూపంలో దేశాన్ని సహజంగా అనుసంధానం చేస్తోంది! ఈ సహజమైన అనుసంధాన వ్యవస్థకు కొనసాగుతున్న సాక్ష్యం దేశంలోని వందల వేల జలధారల సంగమ క్షేత్రాలు! పెద్ద నదులు కావచ్చు, చిట్టి కాలువలు కావచ్చు, కొండ వాగులు కావచ్చు, భూగర్భాన్ని ఆర్ధ్రం చేస్తున్న అంతర్ వాహినులు కావచ్చు, ఒక దానితో మరొకటి సంగమించడం సహజమైన అనుసంధానం! భూగర్భాన్ని పెళ్లగించి, అడవులను హననం చేసి, కొండలను కుళ్లగించి విధ్వంసం సృష్టించిన, సృష్టిస్తున్న వారి చేష్టల పర్యవసానంగా ఈ సహజమైన అనుసంధానం అంతరించిపోయింది. నీటి కొరత ఏర్పడడానికి ఇదీ కారణం!
ఈ జల విధ్వంసకాండ కారణంగా నీటి వనరుల కొరత ఏర్పడింది! ఏనుగులు జలకమాడగలిగినంత పెద్దవైన లోతుండిన కొండ వాగులలో నేడు చేపపిల్లలు ఈదడానికి సైతం చాలిన నీరు లేకపోవడం మానవులు సృష్టించిన వైపరీత్యం! ఒకప్పుడు స్వచ్ఛమైన కొబ్బరిపాల వంటి తీయని నీళ్లుండిన పల్లెలలోని చేదబావులు ఇప్పుడు పూడిపోయాయి! కొండ వాగులు ఎండిపోయాయి! చెఱువులుండిన చోట ఇప్పుడు సిమెంటు కట్టడాలు కొలువు తీరి ఉన్నాయి. కాలుష్యాన్ని కొలువు తీర్చుతున్నాయి! గంగా నదిలో ముప్పయి ఏళ్ల క్రితం ఉండిన నీటి పరిమాణంలో ప్రస్తుతం యాబయి శాతం మిగిలి వుందట! గంగానదీ పరీవాహక ప్రాంతంలోని వృక్ష సంపదలో డెబ్బయి శాతానికి పైగా అంతరించిపోయిందట! ఇలా గంగానది కూడ దుర్గతికి గురి అయి ఉండడం ఘోరమైన మానవ కల్పిత విధ్వంసానికి నిదర్శనం. మిగిలిన నదుల సంగతి చెప్పే పనిలేదు. కొన్ని నదులు ఒకప్పుడు ఉన్నాయని చెప్పడానికి ఆనవాళ్లు సైతం మిగలడం లేదు! తెలంగాణలో అనంతగిరి అడవుల నుంచి వివిధ దివ్యోషధులను నింపుకున్న జలవాహినిగా నిర్గమించిన ముచికుంద నది ‘మూసీ’ మురుగుగా మారిపోయి ఉండడం దశాబ్దుల విధ్వంసానికి, కాలుష్యానికి ప్రత్యక్ష సాక్ష్యం! హైదరాబాద్ వంటి మహానగరాల ప్రాంగణాలలోని వందలాది మంచినీటి చెఱువులు మురికి గుంటలుగా మారి ఉండడం గురించి దశాబ్దుల తరబడి ప్రభుత్వాలు పట్టించుకున్న జాడ లేదు!
భూగర్భ జలాలతోపాటు నదుల నీరు, జలాశయాలు, చివరికి ప్రకృతి పచ్చదనాల కొండలలోని అడవులలోని ‘మడుగు’లు, ‘గడుగు’లు, ‘చెలమ’లు, ‘పడియ’లు, ‘దొన’లు కూడ కలుషితం కావడానికి, ఎండిపోవడానికి కారణం దశాబ్దులుగా వ్యవసాయ సీమలను ముంచెత్తుతున్న రసాయనపు ఎఱువులు, క్రిమిసంహారకాలు! ఇవన్నీ భూమిలోనికి నీటితోపాటు ఇంకడం వల్ల భూగర్భ జలాలు కలుషితమయ్యాయి! నగరాలలో, పట్టణాలలో పారిశ్రామిక రసాయన కాలుష్యాలు భూమిలోనికి ఇంకిపోయి భూగర్భాన్ని విషపూరితం చేసాయి! నదులను రక్షించడానికి, స్వచ్ఛతను పునరుద్ధరించడానికి పథకాలను వేస్తున్న ప్రభుత్వాలు ఈ సమస్యలను తీవ్రంగా పట్టించుకొనడం లేదు. మొదటిది కాలుష్యాన్ని కేంద్రీకరిస్తున్న పారిశ్రామిక వి ధానం, రెండవది వ్యవసాయ సీమలను విషపూరితం చేస్తున్న కృత్రిమమైన ఎఱువులు, పురుగు మందులు. ఈ రెండు స మస్యల కంటే మరింత తీవ్రమైనది ప్లాస్టిక్ పదార్థాల వాడకం! నదులు ‘కర్దమ దుర్గంధ కూపా లు’గా మారి ఉండడానికి ఈ మూడింటితోపాటు తీ ర ప్రాంతపు వృక్షజాలం వధకు గురి అవుతుండడం నాలుగవ కారణం. ప్రపంచీకరణ పేరుతో ఏర్పడుతున్న ‘ప్రత్యేక ఆర్థిక మండలాలు’-సెజ్‌లు-నీటి వనరులు ఇంకిపోవడానికి కారణం అవుతున్నాయి. వ్యవసాయాన్ని ‘వాణిజ్యం’ ఆవహించిన తరువాత వందల వేల అడుగుల వరకు తవ్వి గొట్టపు బావులను నిర్మిస్తున్నారు. ఫలితంగా ఊట అడుగంటి చెఱువులు, బావులు అస్తిత్వాన్ని కోల్పోయాయి! గ్రామీణులు ఈత నేర్చుకొనడానికి, ఈత కొట్టడానికి జలాశయాలు లేని దుస్థితి దేశమంతటా ఏర్పడి ఉంది!
ఈ నేపథ్యంలో నదుల పునరుద్ధరణ కోసం, నదుల స్వచ్ఛతను పునరుద్ధరించడం కోసం ‘ఈశ’ స్వచ్ఛంద సంస్థ వారి ఉద్యమం ఆరంభం కావడం హర్షణీయం! నదుల పరిరక్షణ కోసం నడుం బిగిస్తున్నట్టు దేశ వ్యాప్తంగా లక్షల మంది సెప్టెంబర్ ఒకటవ తేదీన ప్రతిజ్ఞలు చేసారట! ఇలా ‘నిష్ఠ’ను పునరుద్ధరించడం నీటిని పునరుద్ధరించడానికి మొదటి మెట్టు! ‘్భగీరథ’, ‘కాకతీయ’ ఉద్యమాలను యుద్ధ ప్రాతిపదికపై అమలు జరుపుతున్న తెలంగాణ ప్రభుత్వం, నదుల అనుసంధానాన్ని సాధిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాలుష్యాన్ని నిరోధించేందుకు కూడ పూనుకోవాలి! ఆపః పునన్తు పృథివీం-నీరు నేలను పరిశుభ్రం చేయాలి-అన్నది భారతీయుని సనాతన ఆకాంక్ష, వేద ద్రష్టల ఆకాంక్ష..కానీ పుడమిని పునీతం చేయగల నీరు స్వయంగా పంకిలమయం అయిపోయింది. నీటిని శుభ్రం చేయడం అందువల్ల ‘స్వచ్ఛ భారత్’కు అనివార్యం.