సంపాదకీయం

బీభత్సంపై ‘బ్రిక్స్’ పోరు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘బ్రిక్స్’ దేశాల ప్రభుత్వాధినేతల సమావేశంలో ఆమోదించిన ‘ఉగ్రవాద వ్యతిరేక’ విధాన పత్రం మన దేశం చైనా, పాకిస్తాన్‌లపై సాధించగలిగిన వ్యూహాత్మక విజయం. పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత బీభత్సకాండను తుదముట్టించడంలో ఇది తుది విజయం కాదన్నది మాత్రం నిరాకరింపజాలని నిజం. చైనాలోని ‘ఝియామన్’ నగరంలో మంగళవారం ముగిసిన బ్రిక్స్- బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణ అమెరికా దేశాల శిఖర సభ సోమవారం ఆమోదించిన తీర్మానంలో పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ‘బీభత్స వ్యవస్థ’గా చిత్రీకరించక పోవడం, పరోక్షంగా కాని ప్రత్యక్షంగా కాని నిరసించకపోవడం ఇది ‘తుది విజయం’ కాదని చెప్పడానికి ప్రాతిపదిక. పాకిస్తాన్‌లో పుట్టి పెరిగి ఆ దేశం కేంద్రంగా జిహాదీ బీభత్స కృత్యాలను కొనసాగిస్తున్న ‘లష్కర్ ఏ తయ్యబా’, ‘జాయిష్- ఏ- మొహమ్మద్’ ముఠాలను ప్రపంచ ఉగ్రవాద సంస్థలుగా చిత్రీకరించడం ‘బ్రిక్స్’ తీర్మానంలోని ప్రధాన అంశం. ‘బ్రిక్స్’ సమావేశంలో పాకిస్తాన్ ప్రభుత్వపు బీభత్స చర్యలను, బీభత్స సమర్ధక చర్యలను ప్రస్తావించడానికి అనుమతించబోమని సమావేశానికి ముందే చైనా ప్రభుత్వం ప్రకటించింది. అందువల్ల బీభత్సకాండకు మద్దతుగా పాకిస్తాన్ ప్రభుత్వం నిర్వహిస్తున్న పాత్ర, పాకిస్తాన్ ప్రభుత్వ బీభత్సకాండ- ఈ రెండు అంశాలు ‘బ్రిక్స్’ శిఖర సభలో సభ్య దేశాల మధ్య వివాదాన్ని సృష్టించగలవన్నది జరిగిన ప్రచారం. కానీ ఎలాంటి వివాదం ఏర్పడలేదు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ రెండు జిహాదీ ముఠాలను ‘బీభత్స ముఠాలు’గా తీర్మానంలో చిత్రీకరించడానికి చైనా అభ్యంతరం తెలపకపోవడం ఇందుకు కారణం. లష్కర్ ఏ తయ్యబా, దా ని అనుబంధ సంస్థ జమాత్ ఉద్ దావాలను, వాటిలోని మొదటి బీభత్సకారుడు హఫీజ్ సరుూద్‌ను ఐక్యరాజ్యసమితి ఇదివరకే నిషేధించింది. కానీ జా యిష్ ఏ మొహమ్మద్ ముఠాలోని మొదటి హంతకుడు అఝార్ మసూద్ అనే ముష్కరుడిని అంతర్జాతీయ బీభత్సకారుడిగా ప్రకటించే తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితిలో చైనా అడ్డుకుంటోంది. గత నెల రెండవ తేదీన అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ ప్రతిపాదించిన ఈ తీర్మానాన్ని చైనా వ్యతిరేకించింది. గతంలో అనేకసార్లు చైనా ప్ర భుత్వం భారత వ్యతిరేక బీభత్సకారుడైన మసూద్‌ను సమర్థించింది. గత మార్చిలో భద్రతా మండలిలో మసూద్‌ను ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించే తీర్మానాన్ని అమెరికా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్ సహా పదునాలుగు దేశాలు సమర్థించాయి. కేవలం చైనా మాత్రమే వ్యతిరేకించింది. నిర్ణాయ నిరోధ- వీటో- అధికారం కలిగిన ఐదు దేశాలలో చైనా ఒకటి కనుక ‘మండలి’లో తీర్మానం వీగిపోయింది.
అందువల్ల చైనాలో ముగిసిన ‘బ్రిక్స్’ సభలో ‘జాయిష్ ఏ మొహమ్మద్’ ముఠాను బీభత్స సంస్థగా ప్రకటించడం వల్ల ఈ ముఠాకు చెందిన మొదటి హంతకుడు మసూద్ అఝార్ టెర్రరిస్టు అన్న వాస్తవాన్ని చైనా అంగీకరించినట్టయింది. అందువల్ల ‘సమితి’లోను, ‘సమితి’ భద్రతామండలిలోను ఇకపై ఈ ముఠాను కాని, మసూద్ ముష్కరుడిని కాని చైనా ప్రభుత్వం సమర్ధించజాలదు. ఇదీ మన ప్రభుత్వానికి లభించిన విజయం. కాని, చైనా ప్రభుత్వం మాటకు కట్టుబడి ఉంటుందన్న నమ్మకం లేదు. వాస్తవానికి వక్రభాష్యాలు చెప్పి మాటిమాటికీ మాట మార్చడం చైనా ప్రభుత్వ విధానంలో భాగం! ‘బ్రిక్స్’ ప్రకటించినందువల్ల ‘జాయిష్ ఏ మొహమ్మద్’ ముఠా కాని, అఝార్ మసూద్ కాని అంతర్జాతీయంగా ‘నిషిద్ధం’ కారు. ఐక్యరాజ్యసమితి ప్రకటించాలి. అందువల్ల ‘సమితి’లో చైనా మసూద్‌ను వ్యితిరేకిస్తుందా? అన్నది వేచి చూడదగిన అంశం.. ‘బిక్స్’ చైనా సొంత సంస్థ కాదు, ఐదు దేశాల ఉమ్మడి వేదిక. కాని పాకిస్తాన్ ప్రభుత్వ బీభత్సకాండ గురించి ఈ సమావేశంలో ప్రస్తావించరాదని చైనా ప్రభుత్వం సమావేశానికి ముందుగా షరతు విధించింది. ‘ఇది పాకిస్తాన్ బీభత్సం- ‘బ్రిక్స్’ సమావేశంలో చర్చించడానికి యోగ్యమైన అంశం కాదు’ అని ఆగస్టు 31వ తేదీన చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి హువాచున్నీ అంగీ ప్రకటించారు. ఏది చర్చించాలి? ఏది చర్చించరాదు? అన్నది ఐదు దేశాల వారు సమష్టిగా నిర్ణయించాలి. కానీ ఏకపక్షంగా చైనా నిర్ణయించడాన్ని ‘బ్రిక్స్’లోని ఇతర దేశాలు నిరసించకపోవడం విచిత్రం..
చైనా ప్రభుత్వపు ఈ ఆధిపత్యం పరోక్షంగా ధ్రువపడడం ప్రచారం కాని వాస్తవం. ఎందుకంటే ‘బ్రిక్స్’ తీర్మానంలో ప్రపంచంలోని అనేక ఇతర జిహాదీ ముఠాలతో పాటు పాకిస్తాన్‌లోని ఈ రెండు ‘తండా’లను నిరసించారు. తాలిబన్, అల్ ఖాయిదా వంటి అనేక ఇతర సంస్థలను కూడ నిరసించారు. ఇలా నిరసించడం ఆయా ముఠాలు పుట్టుకొచ్చిన దేశాలను నిరసించినట్టు కాదు. కొన్ని ప్రభుత్వాలు ప్రస్తుతం తమ దేశాలలోని జిహాదీ ముఠాలను అణచి వేయడానికి యత్నిస్తున్నాయి. మరికొన్ని దేశాలు పరోక్షంగాను, ఇంకొన్ని దేశాలు ప్రత్యక్షంగాను టెర్రరిస్టులను ప్రోత్సహిస్తున్నాయి. మరికొన్ని దేశాలలో ప్రభుత్వాలే బీభత్స వ్యవస్థలు! గతంలో ఇలా బీభత్స వ్యవస్థలైన ఇరాక్ ప్రభుత్వాన్ని, అఫ్ఘానిస్తాన్ ప్రభుత్వాన్ని అమెరికా ప్రభుత్వం నిర్మూలించింది. ప్రస్తుతం పాకిస్తాన్ ప్రభుత్వం ఇలాంటి బీభత్స వ్యవస్థ, పాకిస్తాన్ సైన్యం ప్రచ్ఛన్న జిహాదీ హంతక దళం.. అందువల్ల కేవలం పాకిస్తాన్‌లోని ప్రభుత్వేతర జిహా దీ ముఠాలను నిరసించడం సమస్యకు పా క్షిక పరిష్కారం మాత్ర మే. పాకిస్తాన్ ప్రభుత్వాన్ని బీభత్స వ్యవస్థగా ప్రకటింపజేసి దాన్ని తొలగింపజేయడం, పాకిస్తాన్‌లో కూడ ఇరాక్‌లో వలె అఫ్ఘానిస్తాన్‌లో వలె కొత్త రాజ్యాంగ వ్యవస్థను ఏర్పాటు చేయించడం సమగ్ర పరిష్కారం. ఈ దిశగా ‘బ్రిక్స్’ సమావేశంలో ప్రగతి జరుగలేదు. ‘అవును.. జిహాదీ ఉగ్రవాద హంతక ముఠాలు మా దేశంలో కూడ జిహాదీ హత్యాకాండ సాగిస్తున్నాయి. భారత్‌తో పాటు మా దేశంలో కూడ బీభత్సకాండ జరుపుతున్నాయి. భారత్‌తో పాటు మాది కూడ ఉగ్రవాద పీడిత దేశం..’ అని పాకిస్తానీ పౌర ప్రభుత్వం వారు ఇప్పటికే అనేకసార్లు ప్రకటించారు. ఇప్పుడు మరోసారి ప్రకటించగలరు! తోడేళ్లతో కలసి తరుముతున్న పాకిస్తాన్ ప్రభుత్వం కుందేలు వలె అభినయించగలగడం చైనా విస్తృత వ్యూహంలోని ఇతివృత్తం. ‘బ్రిక్స్’ తీర్మానం అందువల్ల ఈ విస్తృత విష వ్యూహానికి విరుగుడు కాలేదు!
‘బ్రిక్స్’ సమావేశంలో పాల్గొన్న మన ప్రధాని నరేంద్ర మోదీ చైనా అధినియంత ఝీజింగ్ పింగ్‌తో జరిపిన చర్చలలో పాకిస్తానీ టెర్రరిస్టులకు చైనా మద్దతు ఇస్తుండడం గురించి ప్రస్తావన చేసినట్టు సమాచారం లేదు. పాకిస్తాన్ దురాక్రమిత కశ్మీర్‌లో చైనా ఏర్పాటు చేస్తున్న ఆర్థిక ప్రాంగణం గురించి ప్రస్తావించలేదు. వివాదాంశాలు కాక ‘స్పష్టంగా అర్థం కాని’ సహకారం, సరిహద్దులలో శాంతి పరిరక్షణ వంటివి ప్రస్తావనకు వచ్చాయి. అందువల్ల ఈ చర్చలు లాంఛన ప్రాయంగా ముగిసిపోవడం ప్రస్ఫుటించిన ప్రధాన అంశం..