సంపాదకీయం

అఫ్గాన్‌కు వెన్నుదన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అఫ్గాన్‌లో సరికొత్త శకం ప్రారంభం కానుంది. ఏళ్ల తరబడి సాగిన అమెరికా సంకీర్ణ దళాల యుద్ధం వల్ల ఛిద్రమైన ఈ కల్లోల దేశాన్ని ఆదుకునే దిశగా భౌగోళిక రాజకీయ పరిస్థితులు బలపడుతున్నాయి. పొరుగున ఉన్న పాకిస్తాన్ వాదనలు, ఆలోచనలతో నిమిత్తం లేకుండా తనదైన శైలిలో ఈ చిరు దేశాన్ని ఆదుకునేందుకు, భద్రతాపరంగా వెన్నుదన్నుగా నిలిచేందుకు భారత్ శక్తివంచన లేకుండా కృషి చేస్తోందని చెప్పడానికి ఎన్నో దృష్టాంతాలున్నాయి. దశాబ్దాల పాటు రాజకీయ అనిశ్చితి, కల్లోల ఉగ్రవాదం కారణంగా అన్ని విధాలుగా చితికిపోయిన అఫ్గాన్‌ను అన్ని దేశాలు ఆదుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. అల్‌ఖైదాను తుదముట్టించేందుకు అమెరికా సారథ్యంలోని సంకీర్ణ దళాల యుద్ధం ముగిసినప్పటికీ అఫ్గాన్ పరిస్థితిలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. సొంతంగా పౌరుల్ని రక్షించుకోగలిగే బలమైన పోలీసు వ్యవస్థ కూడా ఇప్పటికీ లేకపోవడం విచారకరం. సుస్థిర రాజకీయ పరిస్థితుల్ని పాదుగొల్పేందుకు భారత్ వంటి దేశాలు ఇతోధికంగా సహాయ సహకారాలు అందిస్తున్నప్పటికీ అఫ్గాన్ ప్రస్తుతావసరాలు తీరాలంటే అన్ని దేశాల నుంచి బలమైన రాజకీయ, ఆర్థిక పరమైన వెన్నుదన్ను ఎంతైనా అవసరం. అఫ్గాన్‌కు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా తీసుకున్న నిర్ణయంతో సరికొత్త రీతిలో భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో భిన్నమైన మార్పులకు ఆస్కారం ఏర్పడింది. దేశంలో భద్రతాపరమైన సుస్థిర పరిస్థితుల్ని కల్పించేందుకు అఫ్గాన్ భద్రతా దళాలకు శిక్షణ ఇవ్వడంలో దీని వల్ల భారత్‌కు మరింతగా వెసులుబాటు కలుగుతుంది. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగానే భారత్ ఈ రకమైన సాయాన్ని అఫ్గాన్‌కు అందించడం ఇతరత్రా ఎలాంటి అపోహలకు ఆస్కారం ఇవ్వ ని పరిణామం. ఇప్పటికే అఫ్గాన్ పునరుద్ధరణ విషయంలో భారత్ ఎంతో కృషి చేసింది. అక్కడి దళాలకు శిక్షణ ఇవ్వడం ద్వారా, అభివృద్ధి కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరించడం ద్వారా నూతన సయోధ్యకు శ్రీకారం చుట్టింది. ముఖ్యం గా అఫ్గాన్‌ను మధ్యలో వదిలేయకుండా నిబద్ధతాయుతమైన రీతిలో ఆదుకునేందుకు ఇది దోహదం చేస్తుంది.
ప్రతికూల పరిస్థితులు తీవ్రమవుతున్న నేపథ్యంలో ఎదురవుతున్న భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు అఫ్గాన్ తన సొంత కాళ్లపై నిలబడాల్సిన అవసరం ఎంతో ఉంది. 2001 అమెరికా దాడి తర్వాత ఎన్నడూ లేని రీతిలో గత ఏడాది అఫ్గాన్ హింసాకాండలో అత్యధిక సంఖ్యలో పౌరులు మరణించడాన్నిబట్టి చూస్తే అక్కడి భద్రతా పరిస్థితులు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో స్పష్టమవుతుంది. ఈ మరణాలన్నీ దేశ సరిహద్దుల్లో కాకుండా ప్రధాన నగరాల్లోనే సంభవించడం అన్నది ఆందోళనకలిగించే పరిణామం. పట్టణాల్లో శాంతి భద్రతలను పరిరక్షించాలన్నా, పౌరులకు తగిన భద్రత ఇవ్వాలన్నా పోలీసు బలగాలను సుశిక్షితం చేయడం ఎంతైనా అవసరం. భారత్ వంటి దేశాలు ఈ విషయంలో మరింతగా ప్రమేయం కల్పించుకోవడానికి తాజా పరిస్థితులు వీలు కల్పిస్తున్నాయి.
అఫ్గాన్‌ను ఆర్థికంగా, అభివృద్ధి పరంగా ఎంతగా ఆదుకున్నా అక్కడ నిర్మించే ప్రాజెక్టులకు తగిన భద్రత చేకూరాలంటే రక్షణ దళాలను పటిష్ఠ పరచడం ఎంతైనా అవసరం. ఇప్పటికే భారత్ వందకు పైగా చిన్నస్థాయి అభివృద్ధి ప్రాజెక్టులను అఫ్గాన్‌లో చేపట్టింది. తాలిబన్, ఇతర మిలింటెంట్ల నుంచి అభివృద్ధి ప్రాజెక్టులకు రక్షణ కల్పించడం అన్నది అత్యవసరం. లేని పక్షంలో అది వృధా ప్రయాసే అవుతుంది. ఇందుకు ఏకైక మార్గం అఫ్గాన్ పోలీసులకు అన్ని విధాలుగా శిక్షణ ఇచ్చి మిలిటెంట్లను ఎదుర్కొనే సామర్థ్యాన్ని కల్పించడమే. అఫ్గాన్‌కు భద్రత కల్పించే విషయంలో భారత్‌ను ఎవరూ నిరోధించలేరన్న వాస్తవాన్ని తాజా భౌగోళిక రాజకీయ పరిస్థితులు పాక్ సహా అనేక దేశాలకు కళ్లకు కట్టాయి. అఫ్గాన్‌లో ఎంతగా కల్లోల పరిస్థితులు తాండవిస్తే అంతగానూ దానిపై పట్టు సాధించవచ్చునన్నది మొదటి నుంచి పాకిస్తాన్ ఆలోచన. దానికి అనుగుణంగానే ఎప్పటికప్పుడు రాజకీయ పాచికలు కదుపుతూ వచ్చింది. భారత్ ఎలాంటి అభివృద్ధి కార్యకలాపాలు చేపట్టినా.. పోలీసులు దళాలకు శిక్షణ ఇచ్చే చర్యలు చేపట్టినా పాక్ నుంచి తీవ్రస్థాయి వ్యతిరేకత వస్తూనే ఉంది. అఫ్గాన్‌లో సైనికపరంగా గానీ, రాజకీయంగా గానీ జోక్యం చేసుకునే అవకాశం భారత్‌కు ఏ కోశానా లేదంటూ పాకిస్తాన్ అధ్యక్షుడు అబ్బాసీ ఇటీవల చేసిన ప్రకటనే ఇందుకు నిదర్శనం. అయినా కూడా భారత్ తన బాధ్యతను ఎన్నడూ విస్మరించలేదు. మరింత పట్టుదలగానే అఫ్గాన్‌ను ఆదుకునే చర్యలు చేపట్టింది. అఫ్గాన్ వద్ద ఉన్న విమానాలు, హెలికాప్టర్ల మరమ్మతు కోసం ఏకంగా ఇంజనీర్లనే పంపి తన చిత్తశుద్ధిని చాటుకుంది.
ఒక దేశ అభివృద్ధి అన్నది ఇరుగుపొరుగు దేశాల్లో ఉండే పరిస్థితుల్ని బట్టే ఉంటుంది. ఈ వాస్తవాన్ని గుర్తించిన భారత్ మొదటి నుంచి చుట్టుపక్కలి దేశాల్లో రాజకీయ, ఆర్థిక పరమైన సుస్థిరతకే ప్రాధాన్యతనిచ్చింది. నేపాల్, భూటాన్, శ్రీలంక, బంగ్లా తదితర దేశాలతో బలమైన రాజకీయ సంబంధాలను పాదుగొల్పుకుంటూనే తనదైన రీతిలో ఈ దేశాలను ఆదుకుంటూ వస్తోంది. దక్షిణాసియాలో అతిపెద్ద దేశంగా ఉన్న భారత్‌కు ఇరుగు పొరుగు దేశా ల్లో రాజకీయ సుస్థిరత ఎంతైనా అవసరం. నేటి సంక్లిష్ట అంతర్జాతీయ పరిస్థితుల్లో ఒక దేశ ప్రయోజనాలు సురక్షితంగా ఉండాలంటే అందుకు అవసరమైన రీతిలో పావులు కదపాల్సిందే. అఫ్గాన్ విషయంలో భారత్ చేస్తున్నది ఇదే. ఈ దేశం తన అవసరాలను సొంతంగా తీర్చుకోగలగడం అన్నది భారత భౌగోళిక, రాజకీయ ప్రయోజనాలకు ఎంతో అవసరం. అమెరికా దేశాల మేరకో లేదా ఇతర దేశాల సూచనల మేరకో కాకుండా అఫ్గాన్‌తో రాజకీ య, వ్యాపార, వాణిజ్య సంబంధాలను పెంపొందించుకోవడానికి భారత్ సొంత ఆలోచనతోనే ముందుకు సాగుతోందని చెప్పడానికి ఇటీవలి పరిణామాలే నిదర్శనం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించిన అఫ్గానిస్తాన్ విధానం అనేక రకాలుగా భౌగోళికంగా, రాజకీయపరంగా కూడా భిన్నమైన మార్గాలకు దారులు తీసింది. అఫ్గాన్‌లో కల్లోలాన్ని రాజేయడం ద్వారానే తన మనుగడను కాపాడుకునే ప్రయత్నం పాకిస్తాన్‌ది అయితే ఈ దేశాన్ని అన్ని విధాలుగా శక్తివంతం చేయాలన్న సంకల్పం భారత్‌ది. రెండు దేశాలది భిన్నమైన మార్గమే అయినా తన బాధ్యత, సంకల్పం విషయంలో భారత్ ఏ మాత్రం వెనక్కి తగ్గకపోవడం పాక్ ఆగ్రహానికి కారణం. అఫ్గాన్ -ఇరాన్‌లతో భారత్ సంయుక్తంగా చేపట్టిన త్రిముఖ ప్రాజెక్టు సకాలంలో పూర్తయితే వీటి మధ్య మరింతగా సహకారం పెంపొందే అవకాశం ఉంటుంది. చబహార్ రేవు అభివృద్ధి ప్రాజెక్టు పూర్తయితే దక్షిణాసియా నుంచి మధ్య ఆసియాకూ వ్యాపార, వాణిజ్యపరమైన అవకాశాలు మెరుగవుతాయి. ఇప్పటికే ఈ కీలక ప్రాజెక్టులకు సంబంధించి తీవ్రజాప్యమే జరిగినప్పటికీ తాజా అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటే భారత్-అఫ్గాన్ బంధం మరింత బలపడుతుంది.