సంపాదకీయం

‘సమాంతరం’ సాధ్యమేనా?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోక్‌సభకు శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు జరపాలన్న ‘రాజకీయ’ ఆదర్శం గురించి మరోసారి చర్చ ఊపందుకుంటోంది. ఈ రాజకీయ ఆదర్శం ఆచరణకు రావడానికి రాజ్యాంగ ప్రక్రియ కూడ అనివార్యం అన్న ధ్యాస లేకపోవడం గందరగోళాన్ని సృష్టిస్తోంది. ప్రభుత్వం వారి ప్రతిపాదనలను వ్యతిరేకించడం ప్రతిఘటించడం ప్రభుత్వేతర పక్షాలకు సహజ స్వభావం! చివరికి ‘వందేమాతరం’’ అని ఆలపించడం గురించి ‘‘్భరత్ మాతాకీ జయ్’’ అని నినదించడం గురించి కూడ విరోధ విషాన్ని వెళ్లగక్కుతున్న రాజకీయ పక్షాలు కొన్ని మనుగడ సాగిస్తున్నాయి. అందువల్ల కొన్ని విపక్షాలు ఏకకాలంలో ఎన్నికలు జరిపించడమన్న ‘సమాంతర ప్రక్రియ’ను వ్యతిరేకించడం ఆశ్చర్యం కాదు. కానీ శాసనసభలకు లోక్‌సభకు నిరంతరం ఏకకాలంలో ఎన్నికలు జరిపించడం ప్రస్తుత రాజ్యాంగ నియమావళి పరిధిలో సాధ్యం అవుతుందా?? అన్నది వౌలికమైన ప్రశ్న. ఈ వౌలికమైన సందేహం కేంద్రప్రభుత్వ నిర్వాహకులకు కాని, ఎన్నికల సంఘం వారికి కాని ఎందుకు కలగలేదన్నది అంతుపట్టని అయోమయం! 2018 సెప్టెంబర్ తరువాత లోక్‌సభకు శాసనసభలకు ఒకేసారి ఎన్నికలను జరిపించగలమని బుధవారం ఎన్నికల సంఘం వారు ప్రకటించడం ‘రాజకీయ ఆదర్శానికి’ కొత్తబలం! ఇలా సమాంతరంగా చట్టసభలకు ఎన్నికలు జరిపించడానికి వీలుగా, ‘‘ఏటేటివి కావాలో అన్నీ అడగండి...’’ అని కేంద్ర ప్రభుత్వం వారు ఎన్నికల సంఘాన్ని కోరారట! ‘ఎలక్ట్రానిక్ వోటింగ్’ యంత్రాల సంఖ్యను పెంచాలని’’ ఎన్నికల సంఘం కోరిందట! వీటిని సమకూర్చుకున్నట్టయితే వచ్చే ఏడాది సెప్టెంబర్ తరువాత ఒకే సమయంలో ఈ చట్టసభలన్నింటికీ ఎన్నికలు జరిపించగలమన్నది ఎన్నికల సంఘంవారి విశ్వాసం. కానీ ఇలా అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి సమాంతరంగా ఎన్నికలు జరిపినంతమాత్రాన నియతంగా ప్రతి ఐదేళ్లకు ఒకసారి అన్ని శాసనసభలకు లోక్‌సభకు సమాంతరంగా ఎన్నికలు జరగడం సాధ్యమా?? పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశాలలో ఇది సాధ్యం కావడం లేదన్నది జగద్విదితం. పైగా మన దేశంలో ‘సమాఖ్య’ - ఫెడరల్ - రాజ్యాంగ వ్యవస్థ కూడ అమలులో ఉంది! అందువల్ల రాజ్యాంగంలోని వివిధ అధికరణాలను సవరిస్తే తప్ప ‘‘సమాంతర’’ రాజకీయ ఆదర్శం వాస్తవం కాజాలదు!!
చట్టసభలకు ఏకకాలంలో ఎన్నికలు జరిపించాలన్న కోరికలు ఆవిష్కృతం కావడం ఇది మొదటిసారి కాదు. దశాబ్దులుగా ఈ ఆకాంక్షలు అభివ్యక్తవౌతున్నాయి! ఐదేళ్లకోసారి అన్ని రాష్ట్రాల శాసనసభలకు లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు జరిపించినట్టయితే ఐదేళ్లపాటు ప్రభుత్వాలు ‘‘ఎన్నికల భయం’’ లేకుండా అవిచ్ఛిన్నంగా అభివృద్ధి పథకాలను సంక్షేమ కార్యక్రమాలను రూపొందించి అమలు జరుపవచ్చునట! ఇది మొదటి ప్రయోజనం! ఏకకాలంలో ఎన్నికల వల్ల ఎన్నికల ఖర్చును తగ్గించవచ్చు. ఇది రెండవ ప్రయోజనం! లోక్‌సభ, శాసనసభలతోపాటు స్థానిక సంస్థల పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికలను కూడ జరిపించవచ్చు! దానివల్ల ప్రజాధనం, సమయం మరింతగా ఆదా అవుతాయి! అమెరికాలో ప్రతి రెండేళ్లకొకసారి ‘కాంగ్రెస్’లోని ప్రతినిధుల సభకు ‘సెనేట్’లోని మూడు వంతుల స్థానాలకు వివిధ రాష్ట్రాల శాసనసభలకు, స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతున్నాయి. గవర్నర్ పదవులకు, అధ్యక్ష పదవికీ కూడ ఇదే రీతిలో నియతంగా ఏకకాలంలో ఎన్నికలు జరుగుతున్నాయి! వివిధ సభల, పదవుల కాల పరిమితి విభిన్నంగా ఉన్నప్పటికీ ఎన్నికలు మాత్రం ప్రతి రెండేళ్లకొకసారి నవంబర్‌లోనే జరుగుతున్నాయి. కానీ అమెరికాది అధ్యక్ష ప్రజాస్వామ్యం. మనది పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ! అందువల్ల మన దేశానికి అమెరికాకు మధ్య ‘పోలిక’ లేదు... బ్రిటన్ జపాన్ వంటి పార్లమెంటరీ వ్యవస్థలలో మధ్యంతరంగా ఎన్నికలు జరిగే ప్రమాదం నిరంతరం పొంచి ఉంది! మన దేశంలో కూడ వివిధ శాసనసభలు అర్ధాంతరంగా రద్దుకావడం, రాష్టప్రతి పాలన ఏర్పడడం వంటి వైపరీత్యాలు కొనసాగుతున్నాయి... ‘సమాంతరం’ ఎలా సాధ్యం??
రాజ్యాంగంలోని డెబ్బయి ఐదవ అధికరణంలోని మూడవ ఉప అధికరణం ప్రకారం కేంద్రమంత్రి వర్గం ‘సమష్టి’గా లోక్‌సభ విశ్వాసం పరిధికి లోబడి అధికారంలో కొనసాగుతుంది! రాష్ట్ర మంత్రివర్గం శాసనసభ విశ్వాసం పరిధికి లోబడి పనిచేయాలన్నది రాజ్యాంగంలోని నూట అరవై నాలుగవ అధికరణంలోని రెండవ ఉప అధికరణం నిర్దేశిస్తోంది. అన్ని రాష్ట్రాల శాసనసభలకు, లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు జరిగిన తరువాత, కేంద్ర మంత్రివర్గానికి లోక్‌సభలోను, అన్ని రాష్ట్రాల మంత్రివర్గాలకూ ఆయా రాష్ట్ర శాసనసభలలోను ఐదేళ్లపాటు ‘మెజారిటీ’ ఉన్నట్టయితే పేచీ లేదు. మళ్లీ ఐదేళ్లకు లోక్‌సభకు, అన్ని శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. కానీ ఒక రాష్ట్రంలోనో వివిధ రాష్ట్రాలలోనో వివిధ సమయాలలో మంత్రివర్గాలు ‘మెజారిటీ’ని కోల్పోయినప్పుడు ఏమవుతుంది?? ఆయా రాష్ట్రాలలో ‘సభ’ను రద్దు చేసి మూడు వందల యాబయి ఆరవ అధికరణం కింద రాష్టప్రతి పాలన విధిస్తారు. ఏడాది తరువాత ఎన్నికలు జరగాలి! అలాంటప్పుడు ఆ ‘శాసనసభ’ల ఎన్నికలు లోక్‌సభ ఎన్నికలతోకాని, ఇతర రాష్ట్రాల శాసనసభల ఎన్నికలతోకాని సమాంతరంగా జరపడం ఎలా సంభవం? అలాగే ఐదేళ్లు గడవక ముందే లోక్‌సభలో కేంద్ర మంత్రివర్గం ‘మెజారిటీ’ని కోల్పోతే, మరో మంత్రివర్గం ఏర్పడే పరిస్థితి లేకపోయినట్టయితే లోక్‌సభకు మధ్యంతరం ఎన్నికలు జరిపించడం అనివార్యం! అలాంటి సందర్భాలలో లోక్‌సభతోపాటు రాష్ట్ర శాసనసభలకు ఎన్నికలు జరిపించాలా? జరిపిస్తారా??
అందువల్ల ఈ వైపరీత్యాన్ని నిరోధించడానికి వీలుగా, మంత్రివర్గాలు మధ్యలో కూలిపోయినప్పటికీ ‘లోక్‌సభ’ ‘శాసనసభలు’ నియతంగా ఐదేళ్లపాటు కొనసాగడానికి వీలుగా సంబంధిత రాజ్యాంగ అధికరణాలకు సవరణలు చేయాలి! అలాచేసినప్పుడు మాత్రమే ‘ఏకకాలం’ ఎన్నికలు జరగడం వ్యవస్థీకృతం కాగలదు. క్రీస్తుశకం 1975లో ‘ఎమర్జెన్సీ’ విధించిన తరువాత అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ నాయకత్వంలోని ప్రభుత్వం రాజ్యాంగ సవరణ జరిపింది. లోక్‌సభ, శాసనసభల కాలవ్యవధి ఆరేళ్లకు పెంచింది. అప్పటి జమ్మూకశ్మీర్ ప్రభుత్వం కూడ ప్రాంతీయ రాజ్యాంగాన్ని సవరించి, తమ శాసనసభ కాల వ్యవధిని ఆరేళ్లకు పెంచింది. ఆ తరువాత, మురార్జీదేశాయ్ ప్రభుత్వం లోక్‌సభ శాసనసభల ‘గడువు’ను మళ్లీ ఐదేళ్లకు కుదించింది. కానీ జమ్మూకశ్మీర్‌లో మాత్రం శాసనసభ ‘గడువు’ ఆరేళ్లు నుంచి ఐదేళ్లకు తగ్గలేదు... ‘సమాంతరం’ ప్రక్రియ ఎలా సాధ్యం??