సంపాదకీయం

అవినీతి ‘బాటలు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రహదారులు క్రుంగిపోతుండడం గురించి జనానికి ఆశ్చర్యం కలగడంలేదు. రహదారులు ఏర్పడుతున్నది క్రుంగిపోవడానికి మాత్రమేనన్నది జనానికి అర్ధమైన ‘ప్రగతి’ స్వరూపం. హైదరాబాద్‌లో ప్రధానమైన రహదారులు ఎక్కడో అక్కడ లోపలికి విరిగిపోయి పెద్ద పెద్ద గుంతలు, గోతులు ఏర్పడడం ‘ప్రతీక’ మాత్రమే! ఉభయ తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాదు, దేశంలోని ప్రతి పట్టణంలోను, నగరంలో, ప్రధాన రహదారులలో గోతులు ఏర్పడడం వాహనాల రాకపోకలకు అంతరాయం కలగడం దశాబ్దులుగా మారని చరిత్ర.. ఇలా ‘గోతులు ఏర్పడిన రోడ్ల’పై వెళ్లవలసిన వాహన సముదాయాన్ని మళ్లించి మరో దారి వెంట పంపిస్తున్నారు. ఈ దారిపై గోతులు పూడేలోగా లేదా స్థానిక పాలకులు నడుములను బిగించి పూడ్చేలోగా ‘మళ్లిన దారి’పై మరింత పెద్ద గోతులు ఏర్పడుతున్నాయి. వాహనాల తాకిడిని ఏమాత్రం తట్టుకొనలేని ‘సున్నితమైన‘ రహదారులు ఏర్పడుతుండడం ఇందుకు కారణం! బలమైన రోడ్లను సైతం బద్దలుకొట్టగల స్థాయిలో వాహనాల సంఖ్య, వాహనాల రాకపోకలు, అడ్డదిడ్డంగా వాహనాలను నడిపే వారి సంఖ్య పెరిగిపోతుండడం రోడ్లు క్రుంగిపోవడానికి మరో కారణం! హైదరాబాద్‌లోని జయనగర్-కూకట్‌పల్లి- ప్రాంతంలో ఆదివారం ఒక ప్రధాన రహదారి కింద ఉన్న మంచినీటి గొట్టం, మురుగునీటి గొట్టం పగిలిపోయి రోడ్డు క్రుంగిపోయి పెద్ద గుంత ఏర్పడిందట! గత రెండు వారాలలో హైదరాబాద్‌లో ఇలా ‘గుంతలు’ ఏర్పడడం వాహనాల రాకపోకలు స్తంభించిపోవడం ఇది రెండవసారి అన్నది ప్రచారం. గత రెండేళ్లలో భాగ్యనగర ప్రాంగణంలో ఇలా ‘రోడ్లు’ లోపలికి విరిగిపోవడం ఇది ఏడవసారి అన్నది కూడ ప్రచారం! కాని ప్రచార మాధ్యమాలకు ప్రభుత్వ యంత్రాంగానికి తెలియని గుంతలు, గోతులు, క్రుంగిపోవడాలు హైదరాబాద్‌లో ప్రతిరోజు ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉన్నాయి! బస్తీలలోని గల్లీలో మాత్రమే కాక, నవ నిర్మిత జనావాసాల-కాలనీల-లోని రహదారులు సైతం క్రుంగిపోతుండడం జనానికి నిత్యం ఎదురౌతున్న అనుభవాలు! మురికి నీటి గొట్టాల ‘గవాక్షాలు’ - మాన్‌హోల్స్ -మానవ రంధ్రాలు తెరుచుకుని ఉండడం, తెరుచుకున్న ఈ రంధ్రాలనుంచి ఉప్పొంగే దుర్గంధ జలాలు, వర్షపు నీటితో కలిసి రహదారిని నదిగా మార్చడం క్రుంగిపోతున్న మహా నగరానికి కొన్ని సాక్ష్యాలు! మూసి ఉన్న ‘మానవ రంధ్రాల’నుండి సైతం మురికి నీరు పైకి తోసుకుని వస్తున్న దృశ్యాలు సైతం నిరంతరం ఆవిష్కృతమవుతున్నాయి..
భాగ్యనగరపురహదారులను చక్కబరచడానికి తెలంగాణ ప్రభుత్వం, ‘విస్తృత హైదరాబాద్ మహనగర పాలక సంస్థ’- జిహెచ్‌ఎంసి- భారీగా నిధులను కేటాయించారు, వర్షాలు తగ్గగానే ఈ రహదారులను తీర్చిదిద్దడం ఆరంభం కానున్నదట! వర్షాలు తగ్గేలోగా మహా నాగరికులు నిరంతరం ‘వైతరణీ’ నదుల వంటి రహదారుల గుండా ప్రయాణం చేయడం తప్పదు మరి! నడిచిపోతున్న వారిపై బురద నీటిని చిమ్మి, తడిపేసి దురుసుగా వెళ్లిపోగలగుతున్న కార్లను, బస్సులను, ఆటోలను, స్కూటర్లను ఇతరేతర వాహనాలను నియంత్రించడం ఎవరి పని? ప్రభుత్వ యంత్రాంగాల నిర్లక్ష్యాన్ని అవినీతిని విమర్శిస్తున్నవారు ఇలా బాటసారులపై మురికి నీరు చిమ్ముతూ వాహనాలను నడుపుతుండడం అన్ని పట్టణాలలోను, నగరాలలోను సర్వసాధారణం. వీరి క్రూరమైన నిర్లక్ష్యం ప్రచారం కాని మహావైపరీత్యం! తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించి రహదారులను బాగుచేయడంకోసం నిధులను కేటాయించింది. కానీ దశాబ్దులుగా వివిధ ప్రభుత్వాలు కేటాయించిన నిధులు నిర్లక్ష్యపు గుంతలలోను, అవినీతి కాలువలలోను పడిపోవడం ‘రోడ్ల’ చరిత్రలో భాగం! 2004వ సంవత్సరానికి పూర్వమే హైదరబాద్ మహానగరం ‘నమూనా నగరం’-మోడల్ సిటీ-గా అవతరించినట్టు పెద్దఎత్తున ప్రచారమైంది. కాని అప్పటికీ ఇప్పటికీ ‘రోడ్లు’ పగిలిపోతూనే ఉన్నాయి. వర్షం కురిస్తే దుర్గంధపు జలదారులుగా మారిపోతూనే ఉన్నాయి! స్వచ్ఛ భారత్ పునర్‌నిర్మాణ ‘పథం’లో అవినీతి గోతులు దేశమంతటా ఏర్పడి ఉన్నాయి..
గ్రామీణ ప్రాంతాల్లో సైతం రహదారుల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం విరివిగా నిధులను కేటాయిస్తోంది! జాతీయ పథాల-నేషనల్ హైవేస్- నిడివిని ఇబ్బడి ముబ్బడిగా పెంచడానికి కృషి జరుగుతోంది. జాతీయ పథాలను ‘ఎక్స్‌ప్రెస్ వేస్’- మహా వేగపథాలు-గా విస్తరింప చేస్తున్నారు.. ఇరువైపులా పచ్చని చెట్లతో కళకళలాడే ‘హరిత పథాల’-గ్రీన్ హైవేస్- నిర్మాణం కోసం కూడ కేంద్రప్రభుత్వం పథకాలను సిద్ధం చేసింది. కానీ ‘వ్యవస్థ’లో నిహితమై ఉన్న అవినీతి రహదారులకు నిరంతరం కన్నాలను పొడుస్తోంది! ఈ అవినీతి సహజమైన ప్రక్రియగా ఏర్పడి ఉండడం మన దేశమంతటా జనానికి తెలిసిన రహస్యం.. నిర్మించే పారిశ్రామిక వేత్తలు- కాంట్రాక్టర్‌లు- నిర్మాణ వ్యయం కంటె ఇబ్బడి ముబ్బడిగా ప్రభుత్వ ధనాన్ని, ప్రజాధనాన్ని కాజేస్తున్నారన్నది సర్వజన విదితం. అయితే వారు ఇలా కాజేస్తున్న ‘అవినీతి నిర్మాణ నిధులు’ అన్నీ వారికే దక్కడం లేదన్నది కూడ బహిరంగ రహస్యం! అధికార యంత్రాంగాలకు, ప్రభుత్వ నిర్వాహక రాజకీయ వేత్తలకు, స్థానిక రాజకీయ వేత్తలకు, వీరందరి మధ్య ‘సయోధ్య’ను ‘అనుసంధానాన్ని’ ఏర్పాటు చేస్తున్న దళారీలకు ఈ ‘అవినీతి నిర్మాణ నిధుల’లో దామాషా ప్రకారం వాటాలను పంచుతున్నారట ‘కాంట్రాక్టర్’లు. ఇలా అవినీతి వ్యవస్థీకృతం కావడం రహదారుల రంగానికి మాత్రమే కాదు, అన్ని జీవన రంగాలకు విస్తరించి ఉన్న వైపరీత్యం! అందువల్లనే ‘నిర్మాణోంకీ పావన యుగ్‌మే హమ్ చరిత్ర నిర్మాణ్ కరే..’ అని అన్నాడు ఒక హిందీకవి. దేశంలో నిర్మాణాలు జరుగుతున్న కాలంలో మనుషులలో ‘సౌశీల్యం’ నిర్మాణం కావడం వౌలికమైన అనివార్యం.. ‘నిజాయితీ’కి దూరమైన విద్యావంతులు, అధికారులు, రాజకీయ వేత్తలు, వ్యాపారులు అవినీతి బాటలను నిర్మిస్తున్నారు.
ఇలా అవినీతి పరులు అన్ని కార్యాలయాలలోను, అన్ని రంగాలలోను నిహితమై ఉండడానికి కారణం ‘నిజాయితీ’ గురించి నేర్పని విద్యావ్యవస్థ! ఈ విద్యావ్యవస్థ విదేశీయుల పాలన నాటి వారసత్వం! దేశంపట్ల సమాజం పట్ల మక్కువ లేని విద్యావంతులను, మేధావులను తయారు చేస్తున్న విద్యావిధానంలో విప్లవాత్మకమైన పరివర్తన రానంత వరకూ రహదారులపై గోతులు మాయం కావు! అవినీతి కట్టడాలకు పునాదులు నిజాయితీని నేర్చుకోని విద్యావంతుల మనస్సులలో ఏర్పడి ఉన్నాయి! ఈ విద్యావంతులు, ఉద్యోగులు, అధికారులు, రాజకీయ వేత్తలు, వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు మాత్రమే కాదు మేధావులు కూడ! అవినీతి బురద గుంతలు రోడ్లపై తొలగకపోవడానికి కారణం ఈ వర్గాల మనసులలోని మురికి భావాలు...