సంపాదకీయం

ముగాభే పదవీచ్యుతి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోడేళ్లూ గుంటనక్కలూ
తలపడి పోరిన వేళ,
ధర్మాత్ములు ఎవరన్నది
దగుల్బాజి ప్రశ్నన్నా...
తోడేళ్లు ఎవరు? గుంటనక్కలు ఎవరు అన్నది కాదు ప్రశ్న... ఆవుల మందలకు ఎవరివల్ల ‘మేలు’ జరుగుతుందన్న ‘మీమాంస’కు కూడ ఇప్పుడు తావులేదు! ముప్పయి ఏడు ఏళ్లపాటు ‘జింబాబ్వే’లో అపరిమిత, నిరంకుశ అధికారం అనుభవించిన తొంబయి మూడేళ్ల రాబర్ట్ ముగాబే నక్కల గుంపునకు చెందినవాడా లేక తోడేళ్ల తండాకు చెందిన వాడా అన్న ప్రశ్నకు సమాధానం కూడా లభించదు. దక్షిణ ఆఫ్రికాకు చెందిన నెల్సన్ మండేలా వలె మరో మహాత్ముని వలె ముగాబే అభినయించడం దశాబ్దుల క్రితం నాటి మాట! నిర్లజ్జగా నిర్భయంగా నియంతవలె ముగాబే వ్యవహరించడం ఆ తరువాతి కథ, బుధవారం వరకూ నడచిన జింబాబ్వే వ్యథ.. దాదాపు నాలుగు దశాబ్దులపాటు ముగాబే అభినయించిన ‘‘ప్రజాస్వామ్య’’ నియంతృత్వ నాటకానికి సైనిక దళాలవారు హఠాత్తుగా తెరదించడం బుధవారం నాటి నాటకీయ విపరిణామం! అందువల్ల ప్రత్యర్థులను భౌతికంగాను రాజకీయంగాను మట్టుపెట్టించి ముగాబే సాగించిన ‘కుటుంబ నియంతృత్వం’ మంచిదా? ముగాబేను, తొంబయి మూడేళ్ల ముగాబేను, గద్దెదింపిన సైనిక దళాల ‘చర్య’ మంచిదా? అన్నవి సమాధానం లేని ప్రశ్నలు! జింబాబ్వే జనం అందువల్ల వినూతన ఉత్కంఠకు గురి అయి ఉన్నారు. వ్వయసాయం విచ్ఛిన్నమైపోయింది, ‘ద్రవ్యోల్బణం’ అంచనాలకు గణాంకాలకు అందనంతగా పెరిగింది. నిరుద్యోగం, అధిక ధరలు, ముగాబే వ్యక్తిగత అభిమానుల అనుయాయుల దౌర్జన్యకాండ, వర్ణవర్గాల మధ్య ఆకాశం అంటుతున్న విద్వేషం, నిరంతర రక్తపాతం - ఇవీ ముప్పయి ఏడేళ్ల ముగాబే ‘పరిపాలన’ స్వరూపం, స్వభావం... ఆఫ్రికా ఖండంలో ఐరోపావారి జాతి దురహంకారానికి, శే్వతవర్ణ పైశాచిక ప్రవృత్తికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో జింబాబ్వే - అప్పటి రొడీషియా - స్థానిక అస్తిత్వానికి ప్రతీకగా నిలిచింది! బ్రిటన్ దురాక్రమణకు వ్యతిరేకంగా దశాబ్దులపాటు సాయుధ, సత్యాగ్రహ సమరాలు జరిపింది. అలా జరిగిన సమయంలో ముగాబే మరో నెల్సన్ మండేలా వలె ‘‘పరిక్రమించాడు’’. కీర్తి తెచ్చుకున్నాడు. దక్షిణాఫ్రికా స్వాతంత్య్ర సరమయోధుడైన నెల్సన్ మండేలాతో ముగాబే పోలిక అంతవరకే.. క్రీస్తుశకం 1980లో దేశం స్వాతంత్య్రం సాధించుకొనే వరకే! ఆ తరువాత ‘ముగాబే’ను అడాల్ఫ్ హిట్లర్ అని ఐరోపా దేశాల వారు అభివర్ణించారు. హిట్లర్ వలె అధికారగ్రస్తుడైన ముగాబే కూడ రక్తపాతం సృష్టించడం ఇందుకు కారణం!!
ముప్పయి ఏడేళ్లు ప్రధానమంత్రిగా అధ్యక్షుడిగా ఆధిపత్యం వహించిన ముగాబే మరొక ‘నాయకుడు’ ఏర్పడకుండా జాగ్రత్తపడ్డాడు. ఇందుకు ఆయన ‘సామదానభేదదండోపాయా’లన్నింటినీ సమయానుకూలంగా సందర్భానుసారంగా ఉపయోగించడం చరిత్ర. స్వపక్షంలో ఆయనకు ‘ప్రత్యర్థులు’ పొటమరించనేలేదు, విపక్షంలోని ప్రత్యర్థులను సైతం ఆయన ‘‘అస్మదీయులు’’గా మార్చుకొని ఆ తరువాత వారిని అణగదొక్కగలిగాడు. 2008లో తనకు వ్యతిరేకంగా అధ్యక్ష పదవికి పోటీ చేసిన మోర్గాన్ సువాంగిరాయ్ అన్న ప్రధాన ప్రత్యర్థికి ముగాబే అధికారంలో భాగస్వామ్యం కల్పించాడు. అలా భాగస్వామ్యం పొంది అధికారం లేని ప్రధానమంత్రి పదవిని పొందిన మోర్గాన్ సువాంగిరాయ్ క్రమంగా రాజకీయ ప్రాధాన్యం కోల్పోయాడు. ఇలా ముప్పయి ఏడేళ్లపాటు విజయవంతమైన ముగాబే రాజకీయ తంత్రం ఇప్పుడు బెడిసికొట్టింది. వచ్చే ఏడు ఆరంభంలో జరుగనున్న అధ్యక్షుని ఎన్నికలో మళ్లీ పోటీ చేస్తున్న ఈ అతి వృద్ధనేతను సైనిక దళాల అధిపతి జనరల్ ‘కాన్‌స్టాంటినో ఛివ్వెంగా’ బుధవారం గద్దె దింపి గృహ నిర్బంధానికి గురి చేశాడు...
రాబర్ట్ ముగాబే భార్య యాబయి రెండేళ్ల గ్రేస్ ముగాబే ఆయన అనంతరం అధికారాన్ని హస్తగతం చేసుకొనడానికై ముస్తాబవుతుండడం జింబాబ్వేలో ప్రస్తుతం నెలకొన్న దుస్థితికి తక్షణ కారణం! వచ్చే ఏడు జరుగనున్న ఎన్నికల తరువాత కాని, ఈ లోగానేకానీ ముగాబే పదవీత్యాగం చేసి పదవిని తనకంటె నలబయి ఒక్క ఏళ్లు చిన్నదైన భార్యకు కట్టబెడతాడన్నది జరిగిన ప్రచారం. ఈ కుటుంబ రాజకీయ వారసత్వం పదిలం కావడానికి వీలుగా వారం రోజుల క్రితం ముగాబే ఉపాధ్యక్షుడైన ‘ఎమర్సన్ నంగాగ్వా’ను పదవినుంచి తొలగించాడు. నగంగ్వా సైనిక దళాల అధిపతి ఛివ్వెంగాకు అత్యంత సన్నిహితుడట! అందువల్లనే ‘గ్రేసమ్మ’ అధికారాన్ని దురాక్రమించకుండా నిరోధించడానికే సైనికులు అధికారాన్ని హస్తగతం చేసుకున్నట్లు ప్రచారమైంది. ఉపాధ్యక్ష పదవిని కోల్పోయిన తరువాత నిరాశానిస్పృహలకు గురి అయి ఉన్న డెబ్బయి ఐదేళ్ల నంగాగ్వాను అధ్యక్ష పీఠంపై ప్రతిష్ఠించడమే సైనిక దళాల తిరుగుబాటునకు లక్ష్యమట. ప్రజల అభిప్రాయంతో మద్దతుతో నిమిత్తం లేకుండా భయపెట్టి, బెదిరించి బీభత్సం సృష్టించి ముగాబే ‘‘పాలించాడు’’... సైనిక దళాల వారు కూడ ఇదే బీభత్స వ్యూహం ద్వారా అధికార పరివర్తనకు పూనుకున్నారు! దశాబ్దుల స్వాతంత్య్రం తరువాత కూడ జింబాబ్వేలో ప్రజాస్వామ్య రాజ్యాంగ పద్ధతులు పాదుకొనకపోవడం అసలు సమస్య...
దాదాపు నాలుగు లక్షల చదరపుకిలోమీటర్ల వైశాల్యం కోటిన్నరకు పైగా జనాభా కలిగిన జింబాబ్వే ఆఫ్రికా ఖండంలో, దక్షిణ ఆఫ్రికా దేశానికి ఉత్తరంగా నెలకొని ఉంది. స్థానిక వనవాసీ ప్రజలపై పశ్చిమ ఆసియా జిహాదీలు, ఐరోపా మతమార్పిడి ముఠాలు దాడులు చేయడం శతాబ్దుల చరిత్ర! ప్రకృతి ఆరాధకులైన వనమతాలవారికి అనాది భారతీయ సంస్కృతి స్ఫూర్తినిచ్చింది! ప్రకృతి అరాధన వేద విజ్ఞాన నిబద్ధమైన జీవనరీతి. ఇలాంటి వనమతాలవారిని ఐరోపా ‘మతం మార్పిడి బృందాలు’ మభ్యపెట్టి క్రైస్తవంలోకి మార్చడం చరిత్ర. అయినప్పటికీ జింబాబ్వేలో ఇప్పటికి ’బంటూ’ భాషలను మాట్లాడే వనవాసీలు అధిక సంఖ్యలోనే ఉన్నారు. క్రీస్తుశకం 1889 నుంచి బ్రిటన్ ఈ ప్రాంతాన్ని ‘రొడీషియా’ అని పిలిచింది, జింబాబ్వేను దక్షిణ రొడీషియాగాను, ఇప్పటి ‘జాంబియా’ను ఉత్తర రొడీషియాగాను 1923లో ఏర్పాటు చేసింది. 1965లో దక్షిణ ‘రొడీషియా’ ఉద్యమకారులు తమ దేశాన్ని స్వతంత్ర జింబాబ్వేగా ప్రకటించుకున్నారు. బ్రిటన్ ఈ స్వాతంత్య్రాన్ని తిరస్కరించింది. కానీ పదిహైదేళ్ల సంఘర్షణ తరువాత బ్రిటన్ ‘జింబాబ్వే’కు స్వాతంత్య్రం ప్రసాదించవలసి వచ్చింది. బ్రిటన్‌తోపాటు, శే్వతజాతీయ దురంహకార పాలన కూడ నిష్క్రమించింది. కానీ స్వాతంత్య్రం పొందిన జింబాబ్వే ప్రజలు ముగాబే పాలనలో మళ్లీ ‘దమనకాండ’కు గురయ్యారు..