సంపాదకీయం

పరపతి ‘మాయ’..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశపు ‘పరపతి స్థాయి’ని యథాతథంగా కొనసాగించాలని ‘స్టాండర్డ్ అండ్ పూర్స్’ -ఎస్‌పి- సంస్థ నిర్ణయించడం మన దేశపు ఆర్థిక వ్యవహారాలలో సంపన్న దేశాల అక్రమ ప్రమేయం కొనసాగుతోందనడానికి నిదర్శనం. గత వారం ‘మూడీస్’ అన్న మరో ‘దళారీ’ సంస్థ మన దేశపు ఆర్థిక పరపతి స్థాయి - సావరిన్ రేటింగ్ - కొద్దిగా పెరిగినట్లు ప్రకటించింది! ఇలా ‘ప్రశంసాపత్రం’ జారీ చేయడం కూడా ఆర్థిక అక్రమ ప్రమేయంలో భాగం!! గతంలో ‘ఈ రెండు’ ‘దళారీ బృందాలు’ వారు కూడా మన దేశం ‘పరపతి’ ‘దివాలా’ స్థాయికి చేరిందని తాము నిర్ణయించగలమని హెచ్చరించాయి. ‘‘ఆర్థిక సంస్కరణల’’ను వేగవంతం చేసి వ్యవస్థను మెరుగుపరచకపోతే ఈ ‘తీవ్ర నిర్ణయం’’ తప్పదని 2014వ సంవత్సరానికి ముందు ఈ ‘సంస్థలు’’ మన్‌మోహన్‌సింగ్ ప్రధానమంత్రిత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించి ఉన్నాయి!! మన చిల్లర వ్యాపారంలో అమెరికా తదితర విదేశీయ వాణిజ్య సంస్థలు ప్రవేశించడానికి మన్‌మోహన్‌సింగ్ ప్రభుత్వం అనుమతించడానికి పూర్వం ఈ హెచ్చరికలు కొనసాగాయి. 2012లో అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగడానికి... మన ప్రభుత్వం ‘విదేశీయ వాణిజ్య సంస్థలు’ మన చిల్లర వ్యాపారంలోకి చొరబడి కొల్లగొట్టడానికి అనుమతినిచ్చింది! అమెరికా వారి ‘వాల్‌మార్ట్’ సంస్థ వెంటనే మన దేశంలో చిల్లర దుకాణాలను ప్రారంభించింది!! మన దేశానికి చెందిన ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు’ - మల్టీ నేషనల్ కంపెనీలు - ఇతర ‘ఘరానా వాణిజ్య సంస్థలు’ ‘చిల్లర’ దుకాణాలు తెరచిన ప్రతిచోట వందలాది చిన్న వ్యాపారులు తమ దుకాణాలను మూసుకోవలసి వచ్చింది!! విదేశీయ ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థల’ రంగప్రవేశంతో భారతీయులైన చిన్న వ్యాపారులు, సంచాల వర్తకులు తమ వ్యాపారాన్ని మానుకోవలసి వస్తోంది! ఇలా మానుకున్న చిట్టి వ్యాపారులు, సంచార వర్తకులు ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థల’ ‘మెగా’ దగా దుకాణాలలో ‘యూనిఫారమ్’ ధరించిన కూలీలుగా మారడానికి రంగం సిద్ధమయిపోయింది!! ‘అయితే స్టాండర్డ్ అండ్ పూర్స్’ అంతటితో ఊరుకోలేదు. ఆర్థిక సంస్కరణలు వేగవంతం కాకపోయినట్టయితే ‘్భరత్‌ను దివాలా తీయనున్న దేశాల స్థాయి’ - జంక్ స్టేటస్ -కి దిగజార్చగలమని ‘స్టాండర్డ్ అండ్ పూర్స్’ 2012 అక్టోబర్‌లో హెచ్చరించింది!! అప్పటికే మన దేశపు ఆర్థిక వాణిజ్య పరపతి స్థాయి ‘‘బిబిబి’’ అని ‘ఎస్‌పి’ నిర్థారించి ఉంది. ‘బిబిబి’ అని అంటే ‘మందకొడి’ - నెగిటివ్ - స్థాయి అని అప్పట్లో ప్రచారమైంది! అంటే పెట్టుబడులు పెట్టడానికి మన దేశం అనువైనది కాదు అని అర్థం! దీనికంటె కింద రెండు స్థాయిలున్నాయి. అవి అనుమానాస్పద స్థాయి - స్పెక్యులేటివ్ స్టేటస్ -, ‘జంక్ స్టేటస్’ - దివాలాకోరు స్థాయి!!
ఆ తరువాత కూడ ‘స్టాండర్డ్ పూర్స్’ ముఠావారు మన ప్రభుత్వాన్ని అనేకసార్లు హెచ్చరించారు!! సంస్కరణలను వేగవంతం చేయవలసిందని హెచ్చరించారు! నీటి వనరులను, ఇంధనం వనరులను, ఇతర సహజ సంపదను వాణిజ్య సంస్థలకు అప్పగించడం, రైతులకు ఇతర నిరుపేద వర్గాలకు ప్రభుత్వం అందజేస్తున్న రాయితీలను తగ్గించడం, చివరకి రద్దు చేయడం ‘సంస్కరణ’లలో భాగం! ఇలాంటి సంస్కరణల ద్వారా ‘సంపన్న బహుళ జాతీయ సంస్థలు’ సాధించదలచిన లక్ష్యం మనదేశం వంటి ప్రవర్థమాన దేశాల ఆర్థిక వ్యవస్థను తమ కబంధంలో ఇరికించుకొనడం. తమ దేశపు ఉత్పత్తులను ప్రవర్థమాన దేశాలలో అమ్ముకొని లాభాలను తరలించుకొనిపోవడం. ప్రస్తుతం పెట్రోలును, ఇంధన వాయువును కొంటున్నట్టుగా వినియోగదారులు సేద్యపు నీటిని, మంచినీటిని కొనుగోలు చేయాలి! ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు రద్దయినట్టయితే వ్యవసాయ ఉత్పత్తులు, గ్రామీణ, అటవీ ఉత్పత్తుల ఉత్పాదక వ్యయం పెరుగుతుంది! ఫలితంగా సంపన్న దేశాల ఉత్పత్తుల ధరలకంటె మన దేశం వంటి వర్థమాన దేశాల ఉత్పత్తుల ధరలు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల అంతర్గతంగాను అంతర్జాతీయ విపణిలోను మనదేశం ఉత్పత్తులకు ‘గిరాకీ’ తగ్గిపోతుంది. సంపన్న దేశాలు తమ ఉత్పత్తులను అమ్ముకోవచ్చు! స్టాండర్డ్ అండ్ పూర్స్, మూడీస్ వంటి దళారీ సంస్థలు కోరుతున్న రెండవ సంస్కరణ మన దేశంలో పెట్టుబడులను పెట్టే విదేశీయ సంస్థలకు ప్రభుత్వాలు భారీగా రాయితీలు సమకూర్చడం. ప్రత్యేక ఆర్థిక మండలాల - స్పెషల్ ఎకనమిక్ జోన్స్ - సెజ్-ల పేరుతో ఇప్పటికే ప్రభుత్వాలు విదేశీయ సంస్థలకు భారీగా రాయితీలను ప్రకటించాయి. చౌక విద్యుత్తు, చౌకనీరు, పదిహేనేళ్లు పన్నులు లేకపోవడం వంటివి రాయితీలలో కొన్ని మాత్రమే...
2012 అక్టోబర్ నాటి ‘బిబిబి’ పరపతి స్థాయిని ‘ఎస్‌పి’ ఇప్పుడు మార్చలేదన్నది శుక్రవారం బహిష్కృతమైన గొప్ప ఆవిష్కరణ! కానీ ‘ఎస్‌పి’ మనదేశం పట్ల ‘సానుకూలత’ను ప్రదర్శిస్తోందని ఇప్పుడు ప్రచారవౌతోంది! 2012లోను, ఇప్పుడు కూడ ‘ఎస్‌పి’ నిర్ధారణ ప్రకారం మనది ‘‘ఒకటే స్థాయి’’... కానీ విభిన్నమైన పరస్పర విరుద్ధమైన విశే్లషణలు కొనసాగడం ప్రపంచీకరణ ‘మాయాజాలం’, ‘స్వేచ్ఛావిపణి’ - మార్కెట్ ఎకానమీ - మారీచజాలం!! మన ఆర్థిక వాణిజ్యాల పరపతి పెరిగినట్టు గత పదిహేడవ తేదీన ‘మూడీస్’ నిర్ధారించింది! మన ‘పరపతి’ అంతర్జాతీయంగా ‘బా’ -బిఏఏ-3 స్థాయి నుంచి ‘బా’ -బిఏఏ-2 స్థాయికి ఎగబాకినట్లు ‘మూడీస్’ నిర్ధారించింది. వారం తిరగకముందే ఇరవై నాలుగవ తేదీన ‘ఎస్‌పి’ విరుద్ధ స్వరం వినిపించింది! ‘‘అబ్బే మీ పరపతి స్థాయి పెరగలేదు...’’ అని మన ప్రభుత్వానికి చెప్పింది. 2012 నాటి ‘బిబిబి’ స్థాయి అలాగే ఉందట! మనం ఎవరిని నమ్మాలి??
‘మూడీస్’ ‘ఎస్‌పి’ దళారీ ముఠాలు ఇలా విభిన్నమైన నిర్ధారణలు జరుపడానికి తార్కిక ప్రాతిపదిక ఏమిటి?? నిజం చెప్పగల వందమంది అయినా ఒకటే విధంగా చెబుతారు. అబద్ధం చెప్పే ఇద్దరి మధ్య కూడా పొంతన కుదరదు. అంతర్జాతీయ స్వచ్ఛంద ఆర్థిక సంస్థలుగా పరపతి నిర్ధారణవేత్తలుగా పేరుమోసిన ఈ ‘ఎస్‌పి’, ‘మూడీస్’ ఇంకా మరికొన్ని సంస్థలు నిజానికి సంపన్న దేశాల బహుళ జాతీయ వాణిజ్య సంస్థల ప్రచ్ఛన్న ప్రతినిధులు. ‘స్వచ్ఛందం’ ముసుగులోని ఈ ‘దళారీ ముఠాల’ ‘పరిశోధనల’కు ‘పరిశోధకుల’కు నిధులను సమకూర్చుతున్నది ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు’! నిజానికి ఇదంతా మన దేశం వంటి ప్రవర్థమాన దేశాలలో గందరగోళం సృష్టించడానికి జరుపుతున్న వాణిజ్య సామ్రాజ్యవాద షడ్యంత్రంలో భాగం... హైదరాబాద్‌లో జరుగనున్న ప్రపంచ పెట్టుబడిదారుల శిఖర సభకు ముందుగా ఇలా విభిన్నమైన రెండు ‘పరపతి’ నిర్ధారణలను బహిర్గతం చేయడం ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థల’ దుస్తంత్రం! విదేశాల పెట్టుబడుల ‘వ్యామోహ కుండం’లో సుడులు తిరుగుతున్న మన ప్రభుత్వాలు ఈ కుట్రను నిరసించకపోవడం జాతీయ వైపరీత్యం... దిగుమతి అవుతున్న పెట్టుబడుల విలువకంటె ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు’ తరలించుకుపోతున్న లాభాల విలువ చాలా ఎక్కువ...