సంపాదకీయం

రహదారి భద్రత ఎలా??

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జిల్లా స్థాయిలో ‘రహదారి భద్రత మండలి’ని ఏర్పాటు చేయాలని సర్వోన్నత న్యాయస్థానం గురువారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించడం దశాబ్దులుగా కొనసాగుతున్న భద్రతావైఫల్యానికి నిదర్శనం! ఇంతవరకు ఇలాంటి ‘భద్రతామండలి’ అనేక రాష్ట్రాలలోను జిల్లాలలోను ఏర్పడలేదన్నది సర్వోన్నత న్యాయ నిర్ణయం వల్ల బయటపడిన వైపరీత్యం. ఉన్నత న్యాయస్థానాలు కాని సర్వోన్నత న్యాయస్థానం కాని ఆదేశించే వరకు రహదారి భద్రతాధ్యాస ప్రభుత్వాలకు కలుగకపోవడం పరిపాలన వ్యవస్థలో నిహితమై ఉన్న వైఫల్యం! రహదారుల అభివృద్ధి కొరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేకానేక చర్యలు తీసుకొంటున్నాయి. రహదారులు వాహనాలతో క్రిక్కిరిసిపోయి ఉండడం ఎదురు ఎదురుగా వాహనాలు రావడం వల్ల ప్రమాదాలు జరిగాయన్నది జరుగుతున్నాయన్నది జరిగిన ప్రచారం, జరుగుతున్న ప్రచారం! ఈ సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు నగరాలలోను పట్టణాలలోను నిరంతరం రహదారులను వెడల్పు చేస్తున్నాయి. ప్రతి నగరంలోను ఎక్కడో అక్కడ ఈ వెడల్పు చేసే కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. ‘ప్రధానమంత్రి సడక్ యోజన’లో భాగంగా గ్రామగ్రామానికి తారు రోడ్డులను సిమెంటు రోడ్డులను వేశారు, వేస్తున్నారు. ‘ఆరు వరుసల మహా వేగ పథాలు’-సిక్స్ లేన్ ఎక్స్‌ప్రెస్ వేస్-గా ‘జాతీయ రాజపథాలు’ - నేషనల్ హైవేస్ - రూపాంతరం చెందుతున్నాయి. అందువల్ల రహదారి ప్రమాదాలు జరుగవన్నది జరుగరాదన్నది ప్రభుత్వాల విశ్వాసం, ప్రజల విశ్వాసం. కానీ ఈ విశ్వాసం ఎప్పటికప్పుడు వమ్ముయిపోతోంది. ప్రమాదాలు జరుగుతున్న తీరు గురించి, ప్రమాదాల సంఖ్య గురించి ‘కూలంకష’మైన అధ్యయనాలు పరిశోధనలు జరిగిపోయాయి. రకాల రకాల ‘సర్వేక్షణ’లలో రకరకాల వాస్తవాలు కొన్ని అతిశయోక్తులు కూడ ఆవిష్కృతమైపోతున్నాయి. దేశంలో ప్రతి ఇరవై సెకండ్లకో ముప్పయి సెకండ్లకో ఒక ప్రమాదం జరిగిపోతోందన్నది ఈ ఆవిష్కరణలవల్ల స్పష్టవౌతున్న వ్యవహారం. ఈ గణాంకాలు నిర్దుష్టమైనవా? లేక ఊహాగానాలా? అన్నది ఎప్పటికీ తేలదు! దేశంలో రహదారి ప్రమాదాల ఫలితంగా సగటున మూడు నిముషాలకు ఒకరిని మృత్యువు కబళిస్తూ ఉందని గత సంవత్సరం నవంబర్‌లో నిర్ధారణ జరిగిందట! ఈ నిర్ధారణ గురించి ‘రహదారి భద్రత’పై ఆందోళన వ్యక్తం చేసిన డాక్టర్ ఎస్.రాజశేఖరన్ అనే ఉద్యమకారుడు సర్వోన్నత న్యాయస్థానానికి నివేదించాడట! ఈ వైద్యుడు తమిళనాడులోని కోయంబత్తూరు ‘గంగ’ వైద్యశాలకు చెందినవాడు. రాజశేఖరన్ దాఖలు చేసిన ‘ప్రజాప్రయోజన న్యాయ యాచిక’ - పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ - పిల్ - ప్రాతిపదికగా సర్వోన్నత న్యాయమూర్తులు మదన్ బి లోకుర్, దీపక్ గుప్తా గురువారం ఈ తీర్పు చెప్పారు. ప్రతి జిల్లా కేంద్రంలోను ‘రహదారి భద్రతా వ్యవహారాల నిర్వహణ పర్యవేక్షణ మండలి’ - రోడ్ సేఫ్టీ ప్యానల్ - ఏర్పడాలన్నది తీర్పులోని ప్రధాన ఆదేశం...!
రహదారి ప్రమాదాలకు గురి అయిన వారిలో సగం మందికి మాత్రమే ‘బీమా’ ద్వారా పరిహారం లభించిందన్నది సర్వోన్నత న్యాయస్థానం విచారణలో బహిర్గతమైన మరో వైపరీత్యం. గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు పదకొండున్నర వేల కోట్ల రూపాయల పరిహారం బీమా సంస్థలద్వారా ప్రమాదగ్రస్తులకు లభించిందట! అమితవేగంగా నడపడం వల్ల ‘చోదకులు’ - డ్రైవర్‌లు - వాహనాలను బోల్తా కొట్టిస్తున్నారన్నది ప్రధానంగా వినబడుతున్న ఆరోపణ. ‘ఏకోన్ముఖ’ ప్రయాణ మార్గాలు - వన్ వే లేన్స్ - ఏర్పడిన తరువాత కూడ ప్రమాదాలు తగ్గుముఖం పట్టకపోగా పెరుగుతుండడానికి ఇవి ప్రధాన కారణం. గతంలో జాతీయ మహా పథాలపై వాహనాలు పరస్పరం ఎదురయ్యేవి. క్రమంగా ‘వన్‌వే’ రోడ్లు ఏర్పడినాయి. ఒక దిశగా వెడుతున్న వాహనాలను ఎదురుగా వచ్చే వాహనాలు ఢీకొట్టే ప్రమాదం లేదు. వెనుకనుంచి వేగంగా వచ్చే వాహనాలు ముందు వెడుతున్న వాహనాను అతిగమించి వెళ్లడానికి వీలుగా మూడు వరుసల రోడ్డు ఏర్పడి ఉంది. ఇలా రహదారులు సురక్షితమైన తరువాత ‘చోదకుల’లో నిర్లక్ష్యం పెరగడం సమాంతర విపరిణామం. ‘చోదకుడు’ వాహనాన్ని నియంత్రించగలిగినప్పుడు అమితవేగంగా వాహనాన్ని నడిపినప్పటికీ ప్రమాదం సంభవించదు. కానీ చోదకులు ప్రధానంగా రాత్రిపూట నడిపేవారు, వాహనం వేగం విపరీతంగా పెంచి నిద్రపోతున్నారు. ఫలితంగా వాహనం ముందు వెడుతున్న వాహనాన్ని ఢీకొట్టడం లేదా ‘రోడ్డు’ బయటకి దూసుకొనిపోవడం ప్రమాదాలకు కారణం!
మద్యం తాగడం ‘చట్ట’బద్ధం అయిపోయిన తరువాత నిర్లక్ష్యం మరింత పెరిగింది. హైదరాబాద్ శివార్లలోను ఇతర నగరాల శివార్లలోను ‘ఔటర్ రింగ్’ రోడ్ వంటి సువిశాలమైన రోడ్ల మీద నిరంతరం ప్రమాదాలు జరుగుతుండడానికి తాగుబోతులైన చోదకులు కారణం! మద్యం సేవించి వాహనాలను నడుపరాదన్న విధానాన్ని ప్రభుత్వాలు పరోక్షంగా నీరుకార్చుతుండడం నడుస్తున్న చరిత్ర! జాతీయ మహాపథాల -నేషనల్ హైవేస్ -కు ప్రాంతీయ రాజమార్గాల - స్టేట్ హైవేస్ -కు ఇరువైపులా ఐదు వందల మీటర్ల పరిధిలో మద్యం దుకాణాలు ఉండరాదని సర్వోన్నత న్యాయస్థానం గత ఏడాది డిసెంబర్‌లో నిర్దేశించిం ది. ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి ఈ నిబంధనలు అమలు జరిపి తీరాలని మార్చి 31వ తేదీన మరోసారి స్పష్టం చేసిం ది. కానీ రాష్ట్ర ప్రభుత్వా లు అతి తెలివిగా ఈ నిబంధనను వమ్ము చేయగలిగాయి. ప్రాంతీయ మహాపథాలు - స్టేట్ హైవేస్ - ను ‘స్థానిక పథాలు’గా ‘నగర పథాలు’గా ప్రకటించి నిబంధనలను మార్పు చేశాయి. ఫలితంగా సర్వోన్నత న్యాయస్థానం వారి ఉత్తరువు అనేకమైన ‘రహదారుల’ విషయంలో వమ్మయిపోయింది. ఆంధ్రప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలు ఇలా ‘మహాపథాల’ను మామూలు బాటలుగా మార్చడంలో అగ్రగాములయ్యాయి. ఇలా మహాపథాలలోని కొన్ని భాగాలను స్థానిక పథాలుగా మార్పు చేయగల ‘విచక్షణ’ ఆదివారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని గత జూలైలో సర్వోన్నత న్యాయస్థానం వారు వ్యాఖ్యానించడం విస్మయం కలిగించింది! మద్యం దుకాణాలలో తొంబయి శాతం వరకు యాథావిధిగా కొనసాగించడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు గొప్ప అవకాశం లభించింది... తమ డిసెంబరు నాటి ఉత్తరువు పట్టణాలలోని నగరాలలోని పల్లెలలోని మద్యం దుకాణాలకు వర్తించదని కేవలం పట్టణానికి పట్టణానికి మధ్య గల రహదారులకు మాత్రమే వర్తిస్తుందని ఆగస్టులో మరోసారి సర్వోన్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది.
మద్యం దుకాణాలు ఉన్నది పట్టణాలలోను పల్లెలలోను నగరాలలోను మాత్రమే!! మార్గమధ్యంలో జనావాసాలు లేనిచోట మద్యం దుకాణాలు ఉండవు. ‘డాబా’లు ఉన్నచోట వెలసిన మద్యం దుకాణాలు ఒకశాతం కూడా ఉండవు. అవి మూతపడినా పడకపోయనా ఒకటే! అందువల్ల వాహన చోదకులు యాథాపూర్వంగా దారిపొడవునా మద్యం కొనుగోలు చేస్తున్నారు. తప్పతాగి ఊగితూగి వాహనాలను బోల్తా కొట్టిస్తున్నారు. భద్రతామండలులు ఏమి చేయగలవు?? ‘భద్రత’ రహదారులపైని గుంతలలో, గొయ్యిలలో కూరుకొనిపోయి ఉంది...