సంపాదకీయం

నాగా ‘సంక్షోభం’..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగాలాండ్ శాసనసభకు ఫిబ్రవరి 27వ తేదీన జరుగుతున్న ఎన్నికలను బహిష్కరించనున్నట్టు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ వంటి జాతీయ రాజకీయ పక్షాలు ప్రకటించడం విస్మయకరమైన విపరిణామం.. భారతీయ జనతా పార్టీ నాగాలాండ్ ప్రాంతీయ విభాగానికి చెందిన కొందరు తీసుకున్న ఈ ‘నిర్ణయానికి’’ కేంద్ర నాయకత్వం ఆమోదం కాని ప్రాంతీయ విభాగం అధ్యక్షుని ఆమోదం కాని లేదని ఆ తరువాత వెల్లడి కావడం మరో విచిత్రం.. ‘‘ఎన్నికల బహిష్కరణ’’ను గురించి చర్చించడానికి ‘భాజపా’ తరఫున హాజరైన నాగాలాండ్ విభాగం ఉపాధ్యక్షుడు ఖేటో సీమాను, మరో ఉపాధ్యక్షుడు ఠసేపీ సంగ్ఠమ్‌ను పార్టీ నుంచి తాత్కాలికంగా తొలగించి - సస్పెండ్ చేసి -నట్టు అధిష్ఠానం ఆ తరువాత ప్రకటించింది. అందువల్ల బహిష్కరించాలన్న ‘‘నిర్ణయాన్ని ‘్భజపా’ ఆధికారికంగా ప్రకటించలేదు. కానీ ‘అఖిలపక్షం’’ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్టు ఎన్నికలలో పోటీ చేస్తున్నట్టు స్పష్టీకరణను భాజపా ఇంకా ఆవిష్కరించవలసి ఉంది. బుధవారం నాగాలాండ్‌లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో సోమవారం సమావేశమైన నాగాలాండ్ అఖిలపక్షం ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించిందట! కాంగ్రెస్ పార్టీ కూడా ‘‘బహిష్కరించాలన్న’’ నిర్ణయాన్ని ఆమోదించింది. ‘భాజపా’ అధిష్ఠానం వలె కాంగ్రెస్ అధిష్ఠానం ‘‘విభేదించలేదు’’ కనుక బహిష్కరణ నిర్ణయానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది! ఎన్నికలను బహిష్కరించడమేకాక ఎన్నికలను నిరసిస్తూ గురువారం రాష్టవ్య్రాప్తంగా ‘బంద్’ జరపాలని కూడా అఖిలపక్షం నిర్ణయించిందట! ప్రస్తుతం ‘నాగాలాండ్ పీపుల్స్ ఫ్రంట్’ - ఎన్‌పిఎఫ్ - పేరుతో చెలామణి అవుతున్న అధికార కూటమికి ‘భాజపా’ మిత్రపక్షం! ఈ అధికార కూటమి నాయకత్వంలో జరిగిన సమావేశానికి హాజరయిన పదకొండు రాజకీయపక్షాలు ‘బహిష్కరణ’కు నిర్ణయించాయి! తథాకథిత నాగాలాండ్ సమస్య పరిష్కారం అయ్యేవరకు ఎన్నికలను జరుపరాదని, నిరవధికంగా వాయిదా వేయాలని ఈ అఖిలపక్షం నిర్ధారించిందట! అంటే ఈ తథాకథిత నాగాలాండ్ సమస్య, దశాబ్దుల తరబడి పరిష్కారం కాకుండా ‘‘పేరుకుపోయినప్పటికీ’’ అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం లభించేవరకూ ఆ రాష్ట్రంలో ప్రజాస్వామ్య రాజ్యాంగ ప్రక్రియ స్తంభించిపోవాలన్నది అఖిలపక్షం గైకొన్న ‘‘గొప్ప’’ నిర్ణయం! ఇలాంటి నిర్ణయాన్ని తీసుకొనడం రాజకీయ పక్షాల వౌలిక రాజ్యాంగ నిబద్ధతకు పూర్తి వ్యతిరేకం! ఒక సంస్థ రాజకీయ పార్టీగా గుర్తింపు పొందడానికి వౌలికమైన ప్రాతిపదిక ఆ సంస్థ దేశ సర్వసత్తాక సార్వభౌమ ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థపట్ల నిబద్ధతను ప్రకటించడం! ప్రజాస్వామ్య ప్రక్రియ కొనసాగడానికి మాధ్యమం ప్రజలు భాగస్వామ్యం వహించే ఎన్నికలు. అందువల్ల ఎన్నికలను ఇలా బహిష్కరించాలని నిర్లజ్జగా నిర్భయంగా ప్రకటించడం రాజ్యాంగ ధిక్కారం..
జమ్మూకశ్మీర్‌లోను, ఈశాన్య ప్రాంతాలలోను ప్రాంతీయ, స్థానిక రాజకీయ పక్షాలు ఇలాంటి ‘‘్ధక్కారానికి’’ పాలపడుతుండడం ఏళ్లతరబడి కొనసాగుతున్న ప్రహసనం! తథాకథిత - సోకాల్డ్ - కశ్మీర్ సమస్యకాని, ‘తథాకథిత’ ‘ఈశాన్య’ సమస్యలు కాని ఉత్పన్నం కావడానికి దారితీసిన వౌలిక వైపరీత్యం విచ్ఛిన్న ధోరణులు! నాగాలాండ్‌ను, మిజోరమ్‌ను మనదేశంనుంచి విడగొట్టి స్వతంత్ర దేశాలుగా ఏర్పాటు చేయాలన్నది ఈ విచ్ఛిన్నకారుల విద్రోహ లక్ష్యం. ఈ లక్ష్యంలోనే ‘వివిధ ముఠాలు’ దశాబ్దుల తరబడి బీభత్సకాండ సాగించాయి, సాగిస్తున్నాయి. కొన్ని ముఠాలు బీభత్సకాండను సాయుధ విద్రోహకాండను విడనాడి ‘‘రాజ్యాంగ’’ పద్ధతులలో చర్చల ద్వారా తమ కోర్కెలను నెరవేర్చుకొనడానికి యత్నిస్తున్నాయి. ఇలాంటి పూర్వపు బీభత్స ముఠాలు రాజకీయ పక్షాలుగా నమోదయి ఎన్నికలలో పోటీ చేస్తున్నాయి కూడ! అందువల్ల ఇలాంటి స్థానిక రాజకీయ పక్షాలలో కొన్ని ‘‘రాజ్యాంగ నిబద్ధత’’ను పాటిస్తున్నాయి. ‘మరికొన్ని పక్షాలు’ ‘రాజ్యాంగ నిబద్ధత’ను పాటిస్తున్నట్టు అభినయిస్తున్నాయి, విచ్ఛిన్న ముఠాలను పరోక్షంగా ప్రోత్సహిస్తున్నాయి. ఇలాంటి రాజకీయ పక్షాలు సందు దొరికినప్పుడల్లా ఇలా ఎన్నికల ప్రక్రియను బహిష్కరించడం సహజం! కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను బహిష్కరించడం ఏమిటి?? కేవలం కేంద్రప్రభుత్వం నిర్వాహక రాజకీయపక్షం పట్లకల వ్యతిరేకతతో మాత్రమే కాంగ్రెస్ ఈ వైపరీత్యానికి పాలపడింది..!
అఖిలపక్ష సమావేశానికి హాజరైన ‘భాజపా’ ప్రతినిధులలో రాష్ట్ర అధ్యక్షుడు లేడు. ఉపాధ్యక్షులు వెళ్లి ఈ ‘‘నిర్వాకం’’ చేశారు. వారు అఖిలపక్ష సమావేశానికి వెళ్లడానికి పార్టీ అనుమతి ఇచ్చిందట! కానీ ఉమ్మడి నిర్ణయపత్రంపై సంతకాలు చేయడానికి వారికి అనుమతి లేదట! వెళ్లినవారైనా సంతకాలు చేసేముందు అధిష్ఠానంతో కాని రాష్ట్ర అధ్యక్షునితోకాని ‘టెలిఫోన్’లో మాట్లాడి ఉండవచ్చు! కానీ రాజకీయ, రాజ్యాంగ వాస్తవాల ‘స్పృహ’ లేకుండా వారు సర్వస్వతంత్రంగా వ్యవహరించి సంతకాలు చేసి పార్టీకి చెడ్డపేరు తెచ్చారు. ఈ బహిష్కరణ సమస్యను పరిష్కరించడానికై ‘ఎన్నికల సంఘం’ వారు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నారట! ఈ బహిష్కరించిన పార్టీలకు చెందిన కార్యకర్తల వేషంలోని విచ్ఛిన్నకారులు ప్రచార ప్రక్రియను పోలింగ్ ప్రక్రియను రక్తసిక్తం చేయడానికి యత్నించవచ్చు నన్నది ‘ఎన్నికల కమిషన్’ భయం కావచ్చు. అందువల్ల ఎన్నికలలో పాల్గొనవలసిందిగా ఈ ‘‘బహిష్కరించిన’’ పక్షాలను ఒప్పించడానికి ‘కమిషన్’ యత్నించడం సహజం. కానీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమక్షంలో భారత్‌తో కుదిరిన ఒప్పందంలోని హామీలను తక్షణం నెరవేర్చాలన్నది అఖిలపక్షం వారి పట్టుదల! నాగాలాండ్ జాతీయతా సమాజ్‌వాదీ మండలి - నేషనలిస్ట్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ - ఎన్‌ఎస్‌సిఎన్ - అన్న ముఠా ‘నాగాలాండ్’ను దేశం నుండి విడగొట్టే లక్ష్యంతో దశాబ్దులపాటు విద్రోహకాండ సాగించింది, అంతర్గత ఆధిపత్యం కోసం కుమ్ములాటలు మొదలైన ఈ ముఠా ముక్కలు చెక్కలైంది. ‘ఇసాక్ మూయివాహ్’ వర్గానికి చెందిన ‘ఎన్‌ఎస్‌సిఎన్’ వారు బీభత్సకాండకు స్వస్తి చెప్పినట్టు ప్రకటించారు, కేంద్రప్రభుత్వంతో చర్చలు జరిపారు. ఈ చర్యల ఫలితంగా 2015 జూలైలో కేంద్రప్రభుత్వం ‘ఎన్‌ఎస్‌సిఎన్’ - ఇసాక్ మూరుూవాహ్ - వర్గంతో శాంతిఒప్పందం కుదుర్చుకుంది. ఈ వర్గం ప్రధాన కార్యదర్శి తూయింగ్ గాలెంగ్ మూరుూవాహ్ ఒప్పందంపై సంతకం చేశాడు!!
కానీ ఎస్.ఎస్.కప్లాంగ్ అనేవాడి నాయకత్వంలోని మరో ‘ఎన్‌ఎస్‌సిఎన్’ ముఠా ఈ ఒప్పందాన్ని తిరస్కరించింది, ‘ఖోలేకిటోవీ’ అన్నవర్గం, ‘రిఫర్మేషన్’ అన్న మరో ‘ఎన్‌ఎస్‌సిఎన్’ ముఠా కూడా ‘ఒప్పందం’లో భాగస్వాములు కాలేదు. ‘కప్లాంగ్ ముఠా’ వారు ఈ ఒప్పందంపట్ల నిరసనగా భయంకర బీభత్సకాండ సాగించారు. తాము కూడా నాగాలాండ్‌కు ‘సార్వభౌమ అధికార ప్రతిపత్తి’ని ఇవ్వాలన్న కోరికను పరిత్యజించలేదని తూయింగ్ గాలెంగ్ మూరుూవాహ్ సరిగ్గా సంవత్సరం తరువాత 2016 జూలైలో ‘స్పష్టీకరణ’ ఇచ్చాడు..! ఇలాంటి ముఠాలతో చర్చలు ఏమిటి?? విద్రోహాన్ని నిర్మూలించడానికై కొనసాగిస్తున్న చర్యలు కొనసాగాలి..