సంపాదకీయం

సల్మాన్‌కు ‘శాస్తి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లజింకల హంతకుడు, హిందీ చలనచిత్ర నటుడు సల్మాన్ ఖాన్‌కు రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ న్యాయస్థానం ఐదేళ్ల జైలుశిక్షను విధించడం సహజ న్యాయసూత్రాలకు సంభవించిన విజయం, ప్రకృతి గాయాలకు ఉపశమనం! సల్మాన్ ఖాన్ వంటి నటులు చలనచిత్రాల్లో ఉదాత్తమైన పాత్రలను పోషించడం, నిజ జీవితంలో నికృష్టమైన కలాపాలకు పాల్పడడం దశాబ్దుల క్రితం నాటి చరిత్ర. ఉదాత్తమైన ఇతివృత్తాలతో చలనచిత్రాలు నిర్మాణం జరిగినప్పటి చరిత్ర. గత మూడు దశాబ్దులకు పైగా నికృష్టమైన భావాలను ప్రకృష్టమైన భావాలుగా ప్రచారం చేస్తున్న ఇతివృత్తాలతో చలనచిత్రాలు నిర్మించడం ఆరంభమైపోయింది. ఇలాంటి చిత్రాలు- సినిమాలు- జనాన్ని తప్పుదారి పట్టించి భౌతిక బౌద్ధిక బీభత్సకారులు రూపొందడానికి దోహదం చేస్తున్నాయి. నిర్మాత, దర్శకుడు, రచయిత, నటుడు- ఈ దుష్టచతుష్టయం సమాజంలో ఈ వికృత ప్రవృత్తి, విపరీత ధోరణులు విస్తరించడానికి కారకులు.. ఇలాంటి ‘సినీ’ ఖల నాయకులకు- సల్మాన్ ఖాన్‌కు పడిన జైలుశిక్ష గొప్ప చెంపపెట్టు. సల్మాన్ వంటివారు, సంజయ్ దత్ వంటివారు ఇతర భారతీయ భాషా చలన చిత్రాలకు సంబంధించిన ఇలాంటి వారు జనానికి ఆరాధ్యులుగా మారి ఉండడం జాతీయ వైపరీత్యం. ఈ సినీ ప్రముఖులు తప్పతాగి కార్లను నడిపి గుద్దుతున్నవారు, పోలీస్ స్టేషన్లలోకి ప్రభుత్వ కార్యాలయాల్లోకి చొరబడి దౌర్జన్యకాండ సృష్టిస్తున్న వారు, సహచరులను, పొటీదారులను, తమవద్ద పని చేస్తున్న చోదకుల- డ్రైవర్స్-ను ఉద్యోగులను చంపిస్తున్నవారు, చంపడానికి ప్రయత్నించిన వారు ఎందరో ఉన్నారు. పెళ్లి కాకుండానే భార్య కాని మహిళతో ఏళ్ల తరబడి లైంగిక సహజీవనం జరుపవచ్చునన్నది సినీజీవులు తమ అభిమానులకు నేర్పుతున్న ఆదర్శం. మహాకవి అల్లసాని పెద్దన తన ‘స్వారోచిష మనుసంభవం’ అన్న కావ్యంలో ఇలాంటి దుర్మార్గపు అభినయ వేత్తల ‘నట విట గాయక గణికా కుటిల’ రీతులను నిరసించాడు. కానీ ఇలాంటి కుటిల అభినయ వేత్తలు నేటి యువజనులకు ఆరాధ్యులు కావడం దేశానికి దాపురించిన దౌర్భాగ్యం. సల్మాన్‌కు జైలుశిక్ష ప్రాప్తించడం వల్ల ఇలాంటి అభినయవేత్తల గురించి అమాయకులైన అభిమానులు పెంచుకున్న భ్రమలు తొలగడానికి కొంతైనా వీలుకలుగుతుంది. మంచి చిత్రాలకు కారకులైన ‘సజ్జన చతుష్టయం’- నిర్మాత, దర్శకుడు, రచయిత, నటుడు- ఇప్పటికీ లేకపోలేదు. అలాంటివారు వందలలో ఒకరు..
నల్లజింక- కృష్ణసార మృగం-లను రక్షిత అటవీ ప్రాంతంలోకి చొరబడి హత్య చేయడం మాత్రమే కాదు ఇతరేతర అసాంఘిక కలాపాలకు సైతం సల్మాన్ పాల్పడడం చరిత్ర. న్యాయ ప్రక్రియలో జరిగిపోతున్న విపరీతమైన విలంబనం వల్ల సాక్ష్యాధారాలు పాతబడిపోతున్నాయి. అందువల్ల ఇతరేతర అభియోగాల విషయంలో, మొదట విచారించిన న్యాయస్థానాలు సల్మాన్‌ను నేరస్థుడిగా నిర్థారించినప్పటికీ ఉన్నత న్యాయస్థానాలు నిర్దోషిగా నిగ్గుతేల్చాయి. అందువల్ల సర్వోన్నత న్యాయస్థానంలో నిజాలు నిగ్గుతేలేవరకూ సల్మాన్ ‘నిర్దోషి’గా అభినయించడం, ఈ అభినయ విన్యాసాలను జనం తిలకించడం అనివార్యమైపోయింది. ఈ ‘అనివార్యాన్ని’ ఇప్పుడు జోధ్‌పూర్ కోర్టు నిరోధించడం హర్షణీయ పరిణామం. వన్యమృగ హననానికి పాల్పడిన వ్యవహారంలో సల్మాన్‌పై 1998 నుంచి మూడు అభియోగాలు దాఖలయ్యాయి. రెండు అభియోగాలను విచారించిన మొదటి న్యాయస్థానం ఇదివరకే నేరాన్ని ధ్రువపరచింది. సల్మాన్‌కు జైలుశిక్ష విధించింది. కానీ రాజస్థాన్ హైకోర్టు ఇతగాడిని ఆ రెండు ‘వన్యమృగ హనన’ అభియోగాల్లోను నిర్దోషి అని తీర్పు చెప్పింది. ఉన్నత న్యాయస్థానంలో నేరాన్ని పుష్టీకరించడంలో ప్రభుత్వం తరఫు న్యాయవాదులు విఫలం కావడం ఇందుకు కారణం. ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల వేలమంది నేరస్థులు నిర్దోషులుగా చెలామణి అవుతుండడం దశాబ్దుల దారుణం. సల్మాన్ విషయంలో ఈ దారుణం మరింతగా విస్తరించింది. ముంబయిలోని బాంద్రా ప్రాంతంలో 2002లో సల్మాన్ తప్పతాగి కారు నడిపినట్టు, కారును ఢీకొట్టి ‘పాదచారుల నడవ’లో నిద్రిస్తుండిన ఒక వ్యక్తి మరణానికి కారణమైనట్టు, మరో నలుగురిని గాయపరచినట్టు 2015 మే ఆరవ తేదీన ముంబయిలోని కోర్టు నిర్ధారించింది, సల్మాన్‌కు ఐదేళ్ల జైలుశిక్షను విధించింది. అయితే, సల్మాన్ తప్ప తాగలేదని, అసలు ఆ కారును అతగాడు నడపనే లేదని 2015 డిసెంబర్ పదవ తేదీన ముంబయి హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ అభియోగం గురించి కూడ సర్వోన్నత న్యాయస్థానం నిర్ధారించవలసి ఉంది.
కారుతో గుద్ది పారిపోయిన అభియోగంలో సల్మాన్‌ను నిర్దోషిగా 2015లో హైకోర్టు నిర్థారించిన తర్వాత- ‘పెద్దవాళ్లు ఎన్ని నేరాలు చేసినా వారికి శిక్షలు పడవు’అని ఒక క్యాబ్- టాక్సీ- చోదకుడు వ్యాఖ్యానించాడని భారతీయ జనతాపార్టీ నాయకుడు డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి వెల్లడించి ఉన్నాడు. అనేక మంది ఘరానా నేరస్థులు దేశవ్యాప్తంగా శిక్షలను తప్పించుకుంటున్నారు మరి. ‘ఇతరులెరుగకున్న ఈశ్వరుడెరుగడా?’ అన్నది శతాబ్దుల క్రితం వేమన యోగి సంధించిన ప్రశ్న. ఈ ప్రశ్నకు అన్ని సందర్భాల్లో కాకపోయినా కొన్ని సందర్భాల్లోనైనా తగిన సమాధానం లభిస్తుంది. ‘కృష్ణ హరిణం’ హత్య అభియోగంలో గురువారం జోధ్‌పూర్ కోర్టు ఇచ్చిన తీర్పు ఇలాంటి సమాధానమే. నేరం ధ్రువపడింది, నేరస్థుడైన సల్మాన్ జోధ్‌పూర్ జైలులో కటకటాలను లెక్కపెడుతున్నాడు. నల్లజింకలు నశించిపోయాయి, నశించి పోతున్నాయి. కొన్ని జింకలైనా కొన ఊపిరితో మిగలడానికి వీలుగా ప్రభుత్వాలు వాటికోసం అభయారణ్యాలను, రక్షిత ప్రాంగణాలను ఏర్పాటు చేశాయి. సినీ నటులుగా లభించిన ప్రసిద్ధితో మదమెక్కిన వారు ఇలాంటి అభయారణ్యాల్లోని కృష్ణసార మృగాలను, నెమళ్లను, ఇతర అపురూప జీవజాలాన్ని చంపి భోంచేయాలన్న వికృత వాంఛతో ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారు. అడవులను ధ్వంసం చేయడం భారతీయ జీవన పద్ధతి కాదు. అడవి అంటే వృక్షజాలం మాత్రమే కాదు, జంతుజాలం కూడ! ఈ జీవజాలాన్ని పరిరక్షించడం భారతీయుల యుగయుగాల ప్రకృతి ఆరాధనలో భాగం. ‘నితాంత అపార భూతదయ’ ఈ ఆరాధనకు ప్రాతిపదిక. అందుకే అహింస పరమ ధర్మమైంది. మానవుడు ‘సప్త వ్యసనాల’కు లోనుకారాదన్నది హైందవ జాతీయ జీవన ఆదర్శం. ‘వేట’ ఈ ఏడు వ్యసనాలలో ఒకటి. ‘వెలది, జూదంబు, పానంబు, వేట..’ అన్నది మహాకవి తిక్కన సోమయాజి వివరించిన తీరు.
సల్మాన్ ఖాన్ రక్షిత వనంలోని పులులు, సింహాలు, తోడేళ్ల వంటి వన్యమృగాలను చంపి ఉండినా అది నేరమే. నిరపాయకరమైన కృష్ణమృగాలను అతడు హతమార్చాడు. అనివార్యమైనప్పుడు మాత్రమే గ్రామాల్లోకి చొరబడిన క్రూరమృగాలను పాలకులు వధించడం యుగాలుగా సాగిన భారతీయ పద్ధతి. ఈ జీవన పద్ధతిని బ్రిటన్ దొరలు హతమార్చారు. వికృత పైశాచిక వినోదం కోసం కస్తూరి జింకలు, నల్లజింకలు, నెమళ్లు, చిలుకలు వంటి సాధుప్రాణుల ఉసురు తీయడం వారు నేర్పిపోయారు. వ్యసనమైన ‘వేట’ విలాసం- ఫాషన్-గా మారడం కొనసాగుతున్న బ్రిటన్ బౌద్ధిక బీభత్స వారసత్వానికి నిదర్శనం..