సంపాదకీయం

‘ప్లాస్టిక్’ ప్రతాపం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్లాస్టిక్ కాలుష్యంపై తెలంగాణ ప్రభుత్వం యుద్ధం ప్రకటించడం ప్రశంసనీయం. 2022 నాటికి రాజధాని నగరాన్ని ‘ప్లాస్టిక్’ రహిత ప్రాంగణంగా మార్చడం తెలంగాణ ప్రభుత్వం లక్ష్యమట. ప్లాస్టిక్ వ్యర్థాల నుండి దేశాన్ని విముక్తం చేయడానికి దేశవ్యాప్తంగా దశాబ్దుల తరబడి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక ప్రభుత్వాలు చర్యలను ప్రకటించాయి. కాని ఈ ప్రకటనలు ప్రచారానికి మాత్రమే పరిమితం కావడం నడుస్తున్న కథ. విస్తృత హైదరాబాద్ మహానగర పాలిక- గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్- జిహెచ్‌ఎమ్‌సి-వారు గతంలో అనేకసార్లు ‘ప్లాస్టిక్’ను నిషేధించారు. కానీ ‘మందం’పై స్పష్టత లేని కారణంగా జంట నగరాలలో యథావిధిగా ప్లాస్టిక్ సంచుల చెలామణి కొనసాగుతోంది. యాబయి ‘మైక్రాన్ల’ కంటె తక్కువ మందం ఉన్న ‘ప్లాస్టిక్’ సంచులు వాడరాదన్నది ఏళ్లక్రితం ‘జిహెచ్‌ఎమ్‌సి’ వారు విధించిన నిబంధన. ఇది అమలు జరిగిన దాఖలా లేదు. ఈ నేపథ్యంలో ‘మందం’తో సంబంధం లేకుండా ఎలాంటి ‘ప్లాస్టిక్’ సంచులను కూడ వాడరాదని ‘జిహెచ్‌ఎమ్‌సి’ వారు ఆదేశించారట! జంట నగరాలలోని కొన్ని ప్రాంతాలలో దుకాణాలవారు ‘ప్లాస్టిక్’ సంచులలో సామగ్రిని పెట్టి అమ్మడం లేదు. కొనుగోలుదారులే సంచులు తెచ్చుకోవాలని నిబంధనలను విధిస్తున్నారు. కానీ కూరగాయలు, పండ్లు అమ్మేవారు యథావిధిగా ‘ప్లాస్టిక్’ సంచులను ‘బట్వాడా’ చేస్తున్నారు. ఈ గందరగోళం మధ్యలో స్థానిక సంస్థల కార్యాలయాలన్నింటిలోను ‘ప్లాస్టిక్’ వాడకాన్ని నిషేధించిన తెలంగాణ ప్రభుత్వం చర్య అభినందనీయం. ఇది అమలు జరుగుతుందా? అన్నది సహజమైన అనుమానం. ఒకసారి వాడి పడవేసే ప్లాస్టిక్ సీసాలను, కప్పులను, సంచులను, పానీయాలను పీల్చే గొట్టాల- స్ట్రాస్-ను పురపాలక, నగర పాలక కార్యాలయాలలో వాడరాదని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించిందట! తెలంగాణ పురపాలన, పట్టణాభివృద్ధి మంత్రి కె.తారకరామారావు ‘ప్లాస్టిక్’ సీసాలలోని నీరు తాగడాన్ని ఇదివరకే నిలిపివేశాడట. ఆయన మంత్రిత్వశాఖ కార్యాలయంలో మంచినీరు ‘స్టీల్’ గ్లాసులలో సరఫరా చేస్తున్నారట.
తిరుమలలో ప్లాస్టిక్ వస్తువుల నిషేధం అమలు జరుగుతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాలలో మరెక్కడా కూడ ఇలా సమగ్రంగా ‘ప్లాస్టిక్’ వాడకాన్ని నిలిపివేసిన గుర్తులేదు. 2016లో యాబయి మైక్రాన్ల కంటె తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ సంచులను నిషేధించిన ‘జిహెచ్‌ఎమ్‌సి’ వారు రెండేళ్లుగా ఈ నిబంధనను అమలు జరిపిన జాడలేదు. నిషేధం విధించిన కొత్తలో భాగ్యనగరంలోని దుకాణాలవారు ‘ప్లాస్టిక్ సంచులను ఇవ్వం.. మీరే మీ వస్తువులను తీసుకొనిపోవడానికి సంచులు తెచ్చుకోండి..’ అని వినియోగదారులకు హెచ్చరికలు చేశారు. ఆ తరువాత రెండు, మూడు, ఐదు, ఆరు రూపాయలను అదనంగా పుచ్చుకొని ‘ప్లాస్టిక్’ సంచులు ఇవ్వడం ఆరంభించారు! అదనంగా డబ్బు ఇస్తే ‘ప్లాస్టిక్’ సంచులు చెల్లుబాటు అయ్యాయి. ఇలాంటి అదనపు సంచులు యాబయి ‘మైక్రాన్ల’కంటె ఎక్కువ మందం ఉన్నవట! ఆ తరువాత ఈ నిషేధం సంగతిని అందరూ మరచిపోయారు. జంటనగరాలలోను తెలుగు రాష్ట్రాలలోని ఇతరచోట్ల వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ఉద్యమకారులు అప్పుడప్పుడు ‘ప్లాస్టిక్’ వ్యతిరేక ప్రదర్శనలను నిర్వహిస్తున్నారు. ప్లాస్టిక్ సంచులకు బదులు జనుపనార సంచులు, నూలు బట్టతో తయారైన సంచులు, వివిధ రకాల చెట్ల బెరడుతోను, నారతోను తయారైన సంచులు వాడాలని ఈ ఉద్యమకారులు ఉద్భోధిస్తున్నారు కూడ. కాని ఈ ‘ప్లాస్టిక్’ కాని వస్తువుల పట్ల ప్రజలలో అవగాహన లేదు, వాటిని వాడాలన్న ధ్యాస లేదు. ముంబయి, కలకత్తా వంటి మహానగరాలలో సైతం ‘ప్లాస్టిక్’ను నిషేధించడం, అధికారులు దుకాణాలపై దాడులుచేసి ‘ప్లాస్టిక్’ను స్వాధీనం చేసుకోవడం- ఆ తరువాత నిషేధం గురించి మరచిపోవడం... ‘పునరపి మరణం, పునరపి జననం..’, ‘మళ్లీ నశించడం, మళ్లీ పుట్టడం’ అన్నది మానవాళికి, జీవజాలానికి వర్తించే సృష్టిగతమైన నియమం. కానీ సృష్టిస్థిత నియమం ‘ప్లాస్టిక్’ పదార్థాలకు వర్తిస్తూ ఉండడం సామాజిక వైపరీత్యం. ఎన్నిసార్లు నిషేధించినప్పటికీ మళ్లీ మళ్లీ ‘ప్లాస్టిక్’ చెలామణిలోకి వస్తోంది. ‘ప్లాస్టిక్’ వాడకాలను నిషేధిస్తున్న ప్రభుత్వాలు అలాంటి ‘ప్లాస్టిక్’ సంచుల పాత్రల సీసాల గొట్టాల ఉత్పత్తులను మాత్రం నిషేధించిన దాఖలాలు లేవు. దేశమంతటా ‘ప్లాస్టిక్’ ఉత్పత్తులను, దిగుమతులను నిషేధించినట్టయితే ఈ వస్తువులు దేశంలో లభ్యం కావు. లభ్యం కాక పోవడంవల్ల జనం వాటిని ఉపయోగించరు. ఇలా ఉత్పత్తులను నిషేధించకుండా బహుళ జాతీయ వాణిజ్య సంస్థల- మల్టీ నేషనల్ కంపెనీస్- ప్రయోజనాలు అడ్డుపడుతున్నాయి. వాణిజ్య ప్రపంచీకరణ మొదలైన తరువాత ‘బహుళజాతీయ వాణిజ్య సంస్థలు’ ప్రభుత్వాల విధానాల రూపకల్పనను నియంత్రిస్తున్నాయి. సంప్రదాయ పద్ధతిలో వికేంద్రీకృతమైన చిన్న పరిశ్రమలలో మట్టి పిడతలు, మట్టి కుండలు, మట్టి ఉపకరణాలు, మట్టి పళ్లాలు- మూకుడులు- తయారవుతున్నాయి. ప్లాస్టిక్ వస్తువులు కేంద్రీకృత పద్ధతిలో విస్తరించిన భారీ పరిశ్రమలలో తయారవుతున్నాయి. అందువల్ల ‘ప్లాస్టిక్’ దళారీలతో మట్టి పిడతల ఉత్పత్తిదారులు పోటీపడలేక పోతున్నారు. రైలుపెట్టెలలోను, రైలుస్టేషన్లలోను చాయ్, కాఫీ, మజ్జిగ, పాలు వంటి పానీయాలను విధిగా మట్టిపాత్రలలో సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వం వారు దాదాపు పదిహేను ఏళ్లక్రితమే ఆదేశించారు. ఈ పానీయాలను ‘ప్లాస్టిక్’ చిప్పలలోను డిప్పలలోను సరఫరా చేయరాదన్నది నిర్దేశం... కానీ ఈ ఆదేశం అమలు జరుగలేదు. మట్టి పిడతల ఉత్పత్తివల్ల లక్షల మంది గ్రామీణ పరిశ్రమల వారికి ఉపాధి ఏర్పడుతుంది. ప్లాస్టిక్ ‘డిప్పల’ ఉత్పత్తివల్ల పట్టణాలలోని వందల పెద్ద పరిశ్రమల వారికి లాభం సమకూడుతుంది. అందువల్లనే ‘పలుకుబడికల వారి’ ప్లాస్టిక్ పరిశ్రమలు ‘మూడు సీసాలుగా ముప్పయి ఆరు గొట్టాలుగా’ వికసించింది. నానాటికీ విస్తరిస్తోంది. పలుకుబడి లేని మట్టి పిడతల ఉత్పత్తిదారులు ఉపాధిని కోల్పోతున్నారు.
భారతీయతను దిగమింగుతున్న ‘ప్రపంచీకరణ’కు ‘ప్లాస్టిక్’ సంచులు విజయ పతాకలు! గతంలో భోజనం దుకాణాలలో అరిటాకులు ఉపయోగించేవారు. ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు’ పారిశ్రామిక ప్రాంగణాల ఏర్పాటు కోసం అరటి తోటలను నిర్మూలించారు. అందువల్ల చిన్న భోజనం దుకాణం -టిఫిన్ సెంటర్- మొదలు పెద్ద ‘హోటల్’వరకు గల అన్నిచోట్ల ‘ప్లాస్టిక్’ను వాడుతున్నారు. మనం ప్లాస్టిక్ ఆకులలో భోజనం చేస్తున్నాము. ప్లాస్టిక్ నీరు తాగుతున్నాము. ‘మోదుగ’ ఆకులు, ‘బాదం’ ఆకులు ఇళ్ల వంటశాలలలో కనిపించడం లేదు. ‘ప్లాస్టిక్’ కాటుకు సముద్రాలు విషపూరితమయ్యాయి, నదులు కాలుష్యగ్రస్తమయ్యాయి, హిమాలయాలు కరగిపోతున్నాయి, అంతరిక్షం సైతం ‘ప్లాస్టిక్’ను జీర్ణం చేసుకోలేక పోతోంది. ‘నైనం చిన్దన్తి శస్త్రాణి, నైనం దహతి పావకః’- శస్త్రాలు ఛేదించలేవు, అగ్ని దహించలేదు-!! ఇలాంటి ‘ప్లాస్టిక్’ నిరంతరం మనలను ముంచెత్తుతోంది...!! జనం ఆలోచించాలి!