సంపాదకీయం

‘మెజారిటీ’ మీమాంస..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నికల పద్ధతిలో పరివర్తన జరగాలన్న అభిప్రాయంలోని సామంజస్యానికి ఇది మరో ఉదాహరణ. పదకొండవ తేదీతో ముగిసిన ఐదు ప్రాంతాల శాసనసభల ఎన్నికల ప్రక్రియ ఈ ఉదాహరణ. ‘వోట్ల’ నిష్పత్తికి అనుగుణంగా ‘సీట్ల’ నిష్పత్తి ఉండడానికి వీలుగా ఎన్నికల పద్ధతిని సంస్కరించాలన్నది అవసరమైన అనేక పరివర్తనలలో ఒకటి మాత్రమే! కానీ ఇది అతి ప్రధానమైనది! మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు ఇందుకు సరికొత్త నిదర్శనం. మధ్యప్రదేశ్‌లో ‘‘గెలిచిన’’ కాంగ్రెస్ కంటె ‘‘ఓడిన’’ భారతీయ జనతాపార్టీకి ఎక్కువ ‘వోట్లు’ లభించాయి. రెండు పార్టీలలో దేనికి కూడ మూడువందల ముప్పయి స్థానాల ‘సభ’లో ‘సంఖ్యాధిక్యం’- మెజారిటీ- లభించకపోవడం వేఱు కథ. కానీ నూటపదునాలుగు స్థానాలు లభించిన కాంగ్రెస్ కంటె నూట ఎనిమిది స్థానాలు మాత్రమే పొందగలిగిన భారతీయ జనతాపార్టీకి ఎక్కువ ‘వోట్లు’ లభించినట్టు ఆధికారికంగా ధ్రువపడింది. ఇలా ఓడిన పక్షాని కంటె గెలిచిన పక్షానికి తక్కువ వోట్లు లభించడానికి కొనసాగుతున్న ఎన్నికల పద్ధతి కారణం. ఏకసభ్య నియోజకవర్గం- సింగిల్‌మాన్ కాన్‌స్టిట్యూయెన్సీ- పద్ధతి ఇందుకు ప్రధాన కారణం. ‘తక్కువ’, ‘ఎక్కువ’ వ్యవహారం ‘స్థానాల’- సీట్ల-కు మాత్రమే పరిమితం కావడం, ‘వోట్ల’స్థాయికి విస్తరించకపోవడం 1952 నుంచి కొనసాగుతున్న ఈ పద్ధతి స్వభావం! ఒకే పార్టీ ప్రాబల్యం కొనసాగినంత కాలం, ప్రధాన పక్షం తప్ప మిగిలిన పక్షాలు ‘మరుగుజ్జుల’ స్థాయిలో ఉన్నంత కాలం గెలిచిన పార్టీకి ఓడిన పార్టీల కంటె సహజంగానే అధిక శాతం వోట్లు లభించాయి. బహుధా విభక్తం అయి ఉన్న- మల్టీ పోలార్ - రాజకీయ వ్యవస్థ ఇందుకు కారణం. కానీ రాజకీయ వ్యవస్థ ద్విధావిభక్త- బై పోలార్- స్వరూపాన్ని సంతరించుకుంటున్నకొద్దీ ‘వోట్ల-సీట్ల’ నిష్పత్తిలో అనేక వైపరీత్యాలు పొడసూపుతున్నాయి. ఒక విధంగా రాజకీయ వ్యవస్ధ ‘ద్విధావిభక్తం’ కావడం మేలు. రెండు ప్రధాన పార్టీలు మాత్రమే ఉంటాయి కనుక ఏదో ఒక పార్టీకి కొన్ని సందర్భాలలోనైనా ‘వోట్ల’లో సైతం ‘సంఖ్యాధిక్యం’ లభించే అవకాశం ఏర్పడుతుంది. బహుళ పక్షాలు పోటీచేయడం వల్ల కేవలం ముప్పయి, ఇరవై తొమ్మిది, ఇంకా తక్కువ శాతం ‘వోట్ల’తో ప్రధాన పక్షం లోక్‌సభలో కాని శాసనసభలో కాని మెజారిటీ స్థానాలు పొందగల అవకాశం ఉంది. దశాబ్దుల చరిత్ర నిరూపించిన రాజకీయ వైపరీత్యం ఇది.
అందువల్ల ‘ప్రాంత’స్థాయిలోను, జాతీయ స్థాయిలోను రాజకీయ వ్యవస్థ ద్విధావిభక్తం కావడం మేలు. అనేక చిన్న, పెద్ద ప్రజాస్వామ్య దేశాలలో రాజకీయ వ్యవస్థ ఇలా ద్విధావిభక్తమై ఉంది. దీనివల్ల గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల పార్టీకి ‘మెజారిటీ’ వోట్లుకూడ లభించే అవకాశాలు కూడ పెరిగాయి- ఇందుకు కారణం ఆయా దేశాలలో ఎన్నికల పద్ధతులలో జరిగిన ప్రధాన కారణం. ‘ఏకసభ్య నియోజకాలు’ ఉన్న చోట్ల ‘సంఖ్యా బాహుళ్యం’-మిగిలిన అభ్యర్థుల కంటె ఎక్కువ వోట్లువచ్చిన అభ్యర్థి విజేత కావడం- ప్రాతిపదికగా ఎన్నికలు జరిగే పద్ధతి రద్దు అయింది. గెలిచిన అభ్యర్థికి ‘పోల్’ అయిన ‘వోట్ల’లో కనీసం యాబయి శాతం కంటె ఒక వోటు ఎక్కువ- సంఖ్యాధిక్యం- మెజారిటీ- రావాలన్న ‘నిబంధన’ను వివిధ దేశాలలో విధించారు. ఒక నియోజకవర్గంలో ఇద్దరి కంటె ఎక్కువ మంది పోటీచేసే సందర్భాలలో ఇలా గెలిచిన అభ్యర్థికి యాబయి శాతం కంటె అధిక సంఖ్యలో ‘వోట్లు’రావడం అనేక సందర్భాలలో సంభవం కాదు. అందువల్ల ‘విజేత’కు మెజారిటీ- సంఖ్యాధిక్యం- వోట్లు లభించడానికి వీలుగా ‘ఏకసభ్య’ నియోజకవర్గాల పద్ధతి అమలులోఉన్న అనేక దేశాలలో ‘ఆవృత్తి’- రౌండ్- పద్ధతిని ప్రవేశపెట్టారు. మొదటి ‘ఆవృత్తి’ ఎన్నికల పోలింగ్‌లో ఎవరికి కూడ ‘మెజారిటీ వోట్లు’రాని సందర్భాలలో అంటే ఏ అభ్యర్థికి కూడ యాబయి శాతం కంటె ఎక్కువ వోట్లు రాని సందర్భాలలో ‘రెండవ ఆవృత్తి’- సెకండ్ రౌండ్- ఎన్నికల పోలింగ్‌ను నిర్వహిస్తున్నారు. మొదటి ‘ఆవృత్తి’లో మొదటి రెండు స్థానాలు దక్కించుకున్న ఇద్దరు అభ్యర్థులు మాత్రమే ‘రెండవ ఆవృత్తి’ ఎన్నికలలో పోటీచేయాలి. రెండవ ఆవృత్తి ‘పోలింగ్’లో ఇద్దరు అభ్యర్థుల మధ్య మాత్రమే పోటీ జరుగుతుంది. అందువల్ల విజేతకు తప్పనిసరిగా ‘పోలయిన వోట్ల’లో యాబయి కంటె ఎక్కువ శాతం లభిస్తాయి.
మన దేశంలో ఇలాంటి ‘ఆవృత్తి’ పద్ధతి- రౌండ్ సిస్టమ్- అమలు జరగడం లేదు! సంఖ్యాధిక సూత్రం- మెజారిటీ ఫార్ములా- ఆధారంగా కాక ‘సంఖ్యా బాహుళ్య సూత్రం’ - ఫ్లూరాలిటీ ఫార్ములా- ప్రాతిపదికగా మాత్రమే మన దేశపు ‘ఏక సభ్య నియోజకవర్గాల’ ఎన్నికల పద్ధతిలో విజేతను నిర్ణయిస్తున్నారు. ఇలా ఒకే ‘ఆవృత్తి’లో ఎన్నికల ప్రక్రియ పూర్తయిపోవడం వల్ల అత్యధిక నియోజకవర్గాలలో విజేతలకు ‘సంఖ్యా బాహుళ్యం- సమీప ప్రత్యర్థికంటె ఎక్కువ వోట్లు- మాత్రమే లభిస్తోంది, సంఖ్యాధిక్యం- యాబయి కంటె ఎక్కువ శాతం వోట్లు- లభించడం లేదు. ఒక శాసనసభలో కాని లోక్‌సభలో కాని ‘సంఖ్యాధిక్యం’- మెజారిటీ స్థానాలు- పొందుతున్న రాజకీయ పార్టీకి శాసనసభ ఎన్నికలో కాని లోక్‌సభ ఎన్నికలో కాని ‘పోలయిన’ వోట్లలో ఆధిక్యం- మెజారిటీ రాకపోవడానికి ఇదీ కారణం. వోటర్లు ‘ద్విధా’విభక్తమైనచోట్ల గెలిచిన పార్టీకి నలబయి శాతం కంటె ఎక్కువ వోట్లు వస్తున్నాయి. కానీ ప్రతి నియోజకవర్గంలోను ప్రధానమైన ఇద్దరు అభ్యర్థులు కాక అధిక సంఖ్యలో ప్రత్యర్థులు ఉండడంవల్ల మొత్తం రాష్టస్థ్రాయిలో కాని, జాతీయ స్థాయిలో కాని గెలిచిన పార్టీకి మెజారిటీ వోట్లు రావడం లేదు. ‘ద్విధావిభక్త’ విభక్తం కావడం వల్ల ‘ఏక సభ్య నియోజకవర్గాల’ కారణంగా సంభవిస్తున్న మరో విపరిణామం విజయం సాధించిన పక్షం కంటె ప్రధాన ప్రతిపక్షానికి ఎక్కువ ‘వోట్లు’ రావడం. మధ్యప్రదేశ్ ఎన్నికలలో ఇప్పుడు ఈ రెండు వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. మొదట గెలిచిన పార్టీకి యాబయి శాతం కంటె ఎక్కువ ‘వోట్లు’ రాకపోవడం. రెండవది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న ‘కాంగ్రెస్’ కంటె, పరాజయం పాలయి గద్దెదిగిన భాజపాకు ఎక్కువ వోట్లు రావడం!!
మొదటి వైపరీత్యం 1952నుంచి కూడ జాతీయ స్థాయిలోను, ప్రాంతీయ స్థాయిలోను కొనసాగుతోంది! 1952వ 1957వ 1962వ సంవత్సరాల నాటి లోక్‌సభ ఎన్నికలలో అరవై ఏడు శాతం కంటె ఎక్కువ ‘స్థానాలు’ గెలిచిన కాంగ్రెస్‌కు ఏ ఎన్నికలో కూడ నలబయి ఎనిమిది శాతానికి మించి వోట్లు రాలేదు. 1971లోను, 1980లోను, 1984లోను కూడ కాంగ్రెస్‌కు లోక్‌సభలో మూడింట రెండువంతుల స్థానాలు లభించినప్పటికీ ‘వోట్ల’ స్థాయి మాత్రం యాబయి శాతానికి చేరలేదు. 1984లో మాత్రమే నలబయి తొమ్మిదిన్నర శాతం వోట్లు రావడం చరిత్ర. మిగిలిన సందర్భాలలో నలబయి ఎనిమిది శాతం కంటె తక్కువ వోట్లు కాంగ్రెస్‌కు లభించాయి. బొటాబొటి ‘మెజారిటీ’తో కేంద్రంలో ప్రభుత్వాలు ఏర్పడిన సందర్భాలలో అధికార కూటమికి కాని అధికార పక్షానికి కాని నలబయి శాతం వోట్లు కూడ లభించలేదు. ఇప్పుడు తెలంగాణ శాసనసభ ఎన్నికలలో ఘన విజయం సాధించి డెబ్బయి మూడు శాతం కంటె ఎక్కువ ‘సీట్ల’ను పొందగలిగిన ‘తెలంగాణ రాష్ట్ర సమితి’కి లభించిన ‘వోట్లు’మాత్రం నలబయి ఏడు శాతం! నలబయి ఏడు శాతం వోట్లు సాధించడం అద్భుత విజయం, కానీ అది మొత్తం పోలయిన వంద శాతం ‘వోట్ల’లో మెజారిటీ కాదు. గెలిచిన పక్షాలకు లభించే ‘సీట్ల’శాతం ‘వోట్ల’శాతం కంటె చాలా ఎక్కువ ఉండడం నడుస్తున్న చరిత్ర. ఓటమి పాలవుతున్న ప్రధాన ప్రతిపక్షానికి లభించే ‘సీట్ల’శాతం ‘వోట్ల’శాతం కంటె చాలా తక్కువగా ఉండడం ప్రస్తుత ఎన్నికల పద్ధతి వల్ల ప్రస్ఫుటిస్తున్న మరో విపరిణామం. ఇప్పుడు జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఇరవై ఎనిమిది శాతం ‘వోట్లు’ లభించగా ‘సీట్ల’ సంఖ్య మాత్రం పదహారున్నర శాతం మాత్రమే! ఇలాంటి వైపరీత్యాలను చాలావరకు నిరోధించడానికి ‘ఆవృత్త’ పద్ధతి లేదా ‘వర్తుల పద్ధతి’- రౌండ్ సిస్టమ్-లో ఎన్నికల నిర్వహణ దోహదం చేయగలదా? దీనిపై చర్చ జరగాలి, మేధామథనం జరగాలి..