సంపాదకీయం

నిర్బంధంలో నియంత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూడాన్ దేశపు అధ్యక్షుడుగా మూడు దశాబ్దులుగా చెలామణి అయిన జిహాదీ బీభత్సకారుడు, నిరంకుశ నరరూప రాక్షసుడు ఒమర్ అల్ బషీర్ పదవీచ్యుతుడు కావడం శుభపరిణామం. దాదాపు ఇరవై లక్షల మంది ఇస్లాం మతేతర ప్రజలను హత్యచేయించిన ఒమర్ అల్ బషీర్ ‘మానవ సమాజ వ్యతిరేకి’ అని 2008లో ‘అంతర్జాతీయ నేర విచారణ న్యాయస్థానం’ నిర్ధారించింది. కానీ ఈ నర రూప పిశాచాన్ని చైనా దశాబ్దులుగా సమర్ధించడం అంతర్జాతీయ వైపరీత్యం. ఒమర్ అల్ బషీర్‌ను నిర్బంధించి తమ ఎదుట హాజరుపరచాలని అంతర్జాతీయ నేర విచారణ న్యాయస్థానం - ఇంటర్ నేషనల్ క్రిమినల్ కోర్ట్- ఐసిసి- 2008 మార్చి నాలుగవ తేదీన ఆదేశించి అంతర్జాతీయ నిఘా సంస్థ ‘ఇంటర్ పోల్’ ఈ నిర్బంధపుటుత్తరువును పదకొండు ఏళ్లు గడిచినప్పటికీ అమలుచేయకపోవడానికి వివిధ దేశాల ప్రభుత్వాలు సహకరించకపోవడం. చైనా ప్రభుత్వం వివిధ దేశాల ప్రభుత్వాలను నియంత్రిస్తుండడం ఇందుకు ప్రధాన కారణం. 2010 జూలై పదవ తేదీన అంతర్జాతీయ న్యాయస్థానం మరోసారి బషీర్‌ను నిర్బంధించాలన్న ఆదేశం- వారెంట్- జారీచేసింది. ఇప్పుడు ఒమర్ అల్ బషీర్‌ను అతగాడి సైనికులే గద్దెనుంచి దిగలాగి నిర్బంధించడం ముప్పయి ఏళ్ల ఇతగాడి పెత్తనానికి తుది ఘట్టం. అల్ బషీర్ 1989లో సైనిక అధికారి. 1986లో దేశంలో తొలిసారిగా ఏర్పడిన ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని అల్ బషీర్ 1989లో కూలదోశాడు. అప్పటినుంచి ఇప్పటివరకు సూడాన్‌ను ‘‘పరిపాలన’’పేరుతో పెళ్లగించి వేసిన, కుళ్లగించి వేసిన ఈ దుర్మార్గుడిని ఇప్పుడు సైనిక దళాలవారే పదవీచ్యుతుడిని చేసి నిర్బంధించడం చారిత్రక పునరావృత్తి! 1956లో బ్రిటన్ నుంచి విముక్తమైన స్వతంత్ర దేశంగా ఏర్పడినప్పటి నుంచి సూడాన్‌లో నిరంకుశత్వమే రాజ్యమేలుతోంది. ఇందుకు ప్రధాన కారణం ఇస్లాం జిహాదీలు, క్రైస్తవ మిషనరీలు పరస్పరం కలహించుకుంటూ ఉండడం. ఈ ఉభయవర్గాల బీభత్సకారుల లక్ష్యం ప్రపంచంలో ఏకమత సమాజాన్ని ఏర్పాటుచేయడం. ‘జిహాదీలు’ ప్రపంచంలో ‘ఇస్లాం’తప్ప మరో మతం ఉండరాదని భావిస్తున్నారు. మతం మార్పిడి సంస్థలు- మిషనరీలు- ప్రపంచంలో క్రైస్తవ మతం మినహా మరో మతం మిగలరాదని భావిస్తున్నాయి. ఈ ఉభయ మతోన్మాదుల మధ్య సంఘర్షణ ఫలితంగా 2011లో దేశం రెండు ముక్కలైంది! ఈలోగా దశాబ్దులపాటు లక్షల మంది క్రైస్తవులను, సూడాన్‌లోని అనాది వనమతాలవారిని చంపించాడు. 2011లో సూడాన్ విభజన జరిగింది. క్రైస్తవులు, వనమతాలవారు- అధిక సంఖ్యలోఉన్న దక్షిణ ప్రాంతం ‘దక్షిణ సూడాన్’గా ఏర్పడింది. ఇస్లాం మతంవారు అధికంగా ఉన్న ఉత్తర ప్రాంతం ‘సూడాన్’- అవశేష సూడాన్-గా మిగిలి ఉంది. జిహాదీలు, మిషనరీలు ‘మత వైవిధ్య సమాజాన్ని’ వ్యతిరేకిస్తున్నాయన్న తరతరాల చరిత్రకు 2011లో జరిగిన సూడాన్ విభజన మరో ఉదాహరణ. దక్షిణ సూడాన్ ఏర్పడిన తరువాత కూడ ‘సూడాన్’లో కాని, దక్షిణ సూడాన్‌లో కాని ప్రశాంతి ఏర్పడడం లేదు. సూడాన్ జనాభాలో ఐదు శాతం ఉన్న క్రైస్తవులను మూడు శాతం ఉన్న గిరిజనులను నిర్మూలించడానికి జిహాదీలు యత్నిస్తున్నారు. జిహాదీల నేత ఒమర్ అల్ బషీర్.
అల్ బషీర్‌ను ఇప్పుడు తొలగించినవారు కూడ సైనికులే, సైనిక నియంతలే, అందువల్ల ప్రజాస్వామ్య వ్యవస్థకాని సర్వమత సమభావ వ్యవస్థ కాని సూడాన్‌లో ఏర్పడగల అవకాశాలు లేవు. రెండేళ్లవరకు తమ పరిపాలన కొనసాగనున్నట్టు బషీర్‌ను తొలగించిన సైనిక అధికారులు పదమూడవ తేదీన స్పష్టంచేయడం ఇందుకు కారణం. ముప్పయి ఏళ్లపాటు సూడాన్‌పై పెత్తనం వహించిన ఒమర్ అల్ బషీర్ బీభత్సకారుడు ఇప్పుడు నిర్బంధంలో ఉన్నాడు. సైనికులు శత్రు సైనికలతో యుద్ధం చేయడం శత్రుదేశాల నిరాయుధ ప్రజలను హత్యచేయకపోవడం ‘‘్ధర్మయుద్ధ’’ లక్షణం! పారిపోతున్న శత్రుదేశాల సైనికులను చంపడం, శత్రు సైనికులు నిద్రిస్తున్నప్పుడు సిద్ధంగాలేనప్పుడు యుద్ధంచేయడం బందీలుగా చిక్కిన శత్రు సైనికులను చంపడం ‘‘అధర్మయుద్ధం...’’ సైనికులు శత్రు దేశాలకు చెందిన నిరాయుధులను, సామాన్య ప్రజలను చంపడం బీభత్సకాండ. అలా చంపెడి సైనికులు వీరులు కాదు, బీభత్సకారులు, ఆతతాయిలు- టెర్రరిస్టులు-! అలాంటి బీభత్సకాండను ప్రోత్సహించే ప్రభుత్వం ‘బీభత్స రాజ్యాంగ వ్యవస్థ’- టెర్రరిస్టు రిజీమ్-! అల్ బషీర్ అనేవాడు మరింత ముందుకెళ్లాడు. స్వదేశ ప్రజలనే సైనికులతో హత్య చేయించాడు, స్వదేశ ప్రజలనే చంపించే ‘‘పాలకులు’’అరుదు. అలాంటి అరుదైన బీభత్సకారుల జాబితాలో అల్ బషీర్ ఒమర్ అగ్రగణ్యుడు. చివరికి నియంతలను నరరూప రాక్షసులను అనుచరులే హత్యచేయడం చరిత్ర.... లేదా గద్దెదించడం చరిత్ర! ఈ చరిత్ర అల్ బషీర్ ఒమర్ విషయంలో ఇప్పుడు పునరావృత్తిని పొందింది... క్రీస్తుశకం పనె్నండవ శతాబ్దిలో భక్తియార్ ఖిల్లజీ అన్న జిహాదీ బీభత్సకారుడు మన దేశాన్ని కొన్ని ఏళ్లపాటు భయంకర రక్తపాతానికి గురిచేశాడు. వేలమంది ఇస్లామేతర మతస్థులను చంపాడు, లక్షల మందిని బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చాడు. గ్రామాలను తగులబెట్టాడు, మందిరాలను నేలమట్టం చేశాడు. ‘నలంద’ విశ్వవిద్యాలయంలోని గ్రంథాలయాలలోని పుస్తకాలను మొత్తం కాల్చివేశాడు, విశ్వవిద్యాలయాన్ని నేలమట్టంచేశాడు. చివరి రోజులలో టిబెట్‌లోకి చొరబడిపోయి వనవాసీ, గిరిజన ప్రజలకు చిక్కి పరాజయం పాలయి పారిపోయాడు. ఇలా పారిపోతూ ఉండిన సమయంలో ఒక గుడారంలో విడిదిచేశాడు. తీవ్ర అస్వస్థుడై పడి ఉండిన భక్తియార్ ఖిల్జీని అతనికి అత్యంత విశ్వాసపాత్రుడైన సేనాని ఒకడు పెద్ద కత్తిని గుండెలలో గుచ్చి హత్యచేశాడు. ఈ చరిత్రకు పునరావృత్తి ఒమర్ అల్ బషీర్ పదవీచ్యుతి. పదవిని పోగొట్టుకున్న నియంత జీవచ్ఛవం! నిర్బంధంలో ఉన్న సూడానీ అల్ బషీర్ జీవచ్ఛవం....
ఐరోపా జాతుల ఆర్థిక, భౌతిక, సాంస్కృతిక దురాక్రమణ, ఆరబ్ జిహాదీల తురుష్క జిహాదీల భయంకర బీభత్సకాండ ప్రపంచాన్ని అతలాకుతలం చేయడం దాదాపు రెండువేల సంవత్సరాల చరిత్ర. ఈ రెండు దురాక్రమణలూ విడివిడిగా సాగడం చరిత్ర. అందువల్ల గ్రీసు, రోము నాగరికతలను అమెరికాలోని అనాది నాగరిక వ్యవస్థలను క్రైస్తవ ‘మిషనరీలు’ ధ్వంసంచేశారు. ఐరోపాలోను అమెరికాలోను క్రైస్తవం ఏకైక మతంగా స్థిరపడింది. ఉత్తర ఆఫ్రికాలోను ఆసియాలోని అనేక ప్రాంతాలలోను ఇస్లాం జిహాదీలు ఇదే రీతిలో అనాది మతాలను ధ్వంసం చేశారు. ఆ దేశాలలో ఇస్లాం ఏకైక మతంగా స్థిరపడింది. కానీ ఐరోపా, ఆఫ్రికా ఆసియా ఖండాలు కలసినచోట ఇస్లాం, క్రైస్తవం పరస్పరం ఢీకొన్నాయి. ఇలా ఢీకొన్న దేశాలలో ఏదోఒకటి మాత్రమే మిగిలింది! ఇలాంటి ‘ఘర్షణ’ అతి దీర్ఘకాలం జరిగిన దేశాలలో సూడాన్ ఒకటి! ఎఱ్ఱ సముద్రానికి పశ్చిమంగా వ్యాపించి ఉన్న ఆఫ్రికా ఈశాన్య భాగంలోని దేశాలలో సూడాన్ అతి పెద్దది. తొమ్మిది లక్షల అరవైఏడు వేల చదరపు మైళ్ల- ఇరవై అయిదు లక్షల చదరపు కిలోమీటర్ల- సూడాన్ ఆఫ్రికాలోని అతిపెద్ద విస్తీర్ణంకల దేశాలలో ఒకటి. ఇస్లాం, క్రైస్తవ మతాల మధ్య సంఘర్షణ 2011లో విభజన జరిగేవరకు దీర్ఘకాలం కొనసాగడానికి ఇది ఒక కారణం. కానీ అత్యంత ప్రధాన కారణం ‘మతంమార్పిడి మూకల’- మిషనరీలు-ను, జిహాదీలను అనాదిగా సూడాన్‌లో నివసిస్తున్న ప్రకృతి ఆరాధక మతాలవారు ప్రతిఘటించడం! ఈ ప్రతిఘటన ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇస్లాం బాహుళ్యంకల సూడాన్‌లో ఇప్పుడు కేవలం మూడుశాతం ప్రజలు మాత్రమే అనాది వనమతాలవారు. తొంబయి రెండు శాతం ప్రజలు ఇస్లాం మతస్థులు. 2011లో ఏర్పడిన దక్షిణ సూడాన్‌లో- సూడాన్ మతప్రాతిపదికగా విభాజితమైన తరువాత ఏర్పడిన దక్షిణ సూడాన్‌లో- అరవై శాతం క్రైస్తవులు, ముప్పయిమూడు శాతం ప్రజలు అనాది సంప్రదాయ మతాలవారు, ప్రకృతి ఆరాధక వనమతాలవారు.
విభజన తరువాత కూడ ఉభయ దేశాలలోను ప్రశాంతి నెలకొనడంలేదు. దక్షిణ సూడాన్‌లోని వనవాసీ మతాలవారిని నిర్మూలించడానికి ‘మిషనరీ’లలోని సాయుధ తీవ్రవాదులు యత్నిస్తున్నారు. ఇదీ అశాంతికి కారణం. సూడాన్‌లో పేదరిక విలయతాండవం చేస్తోంది. దేశ విభజన జరిగేవరకు జనాన్ని మతోన్మాదంతో అల్ బషీర్ ఒమర్ నాయకత్వంలోని జిహాదీలు మత్తెక్కించారు. ఇప్పుడు పేదరికం ప్రధాన శత్రువైంది. ప్రజలు బషీర్‌పై తిరగబడుతున్నారు. అందువల్ల బషీర్‌ను తొలగించడం సైనికులకు సులభమైంది! చైనాకు సూడాన్, అమెరికా, ఐరోపా సంస్థలకు దక్షిణ సూడాన్ వాణిజ్య స్థావరాలుగా మారి ఉండడం రెండు దేశాల దారిద్య్రానికి కారణం..