సంపాదకీయం

సంస్కార సమాహారం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయ యోగ దినోత్సవం- అంతర్ రాష్ట్రీయ యోగ్ దివస్- ఇంటర్ నేషనల్ డే ఆఫ్ యోగ- హైందవ జాతీయ విశ్వ గురుత్వానికి లభిస్తున్న సమకాల ప్రపంచ పరిగణనకు నిదర్శనం. సుదీర్ఘ మానవ చరిత్రలో ఒక ప్రధానమైన పునరావృత్తికి ఇది ధ్రువీకరణ! నరేంద్ర మోదీ ప్రధానమంత్రిత్వంలోని కేంద్ర ప్రభుత్వం సాధించిన అంతర్జాతీయ విజయం ‘యోగ విద్య’కు దాదాపు ప్రతి దేశంలోను ఆచరణ సిద్ధించడం! ‘యోగం’ భారతీయుల సనాతన సంస్కారం. ఈ సంస్కారం మాత్రమే కాదు అనేక మానవీయ సంస్కారాల సమష్టి స్వభావం హైందవ జాతీయ సంస్కృతి.. ‘యోగం’ అంటే కలయిక! ఇద్దరి కలయిక, ఎక్కువమంది కలయిక! రెండు వైవిధ్యాల మధ్య కలయిక ‘యోగం’, అనేక వైవిధ్యాల మధ్య వైరుధ్యం లేని సమన్వయం సృష్టినిహిత సహజ యోగం! ఈ సృష్టి నిహిత వాస్తవం సమాజస్థిత జీవనంగా వికసించడం అనాదిగా హైందవ జాతీయ తత్త్వం, భారత జాతీయ స్వభావం! ఒక్కటే అయిన సత్యం- అద్వితీయ బ్రహ్మం- అసంఖ్యాక రూపాలుగా వైవిధ్య స్వరూపాలుగా కనిపిస్తుండడం సృష్టి వ్యవహారం. ఈ వైవిధ్యాల స్వరూపాల మధ్య నిహితమై ఉన్న అద్వితీయ స్వభావం ‘యోగం’! ఈ యోగాన్ని- కలయికను- సంఘటనను- సమైక్యాన్ని- సాధించే ఎనిమిది రకాల పద్ధతులను వేదద్రష్టలు అనాదిగా దర్శించారు, ఆవిష్కరించారు, వివరించారు, ఆచరించారు, ప్రచారం చేశారు. కలియుగం పంతొమ్మిదవ శతాబ్ది- క్రీస్తునకు పూర్వం పదమూడవ శతాబ్ది-నాటి పతంజలి మహర్షి ఈ ‘అష్టాంగ యోగాన్ని’ మరోసారి వివరించి మానవుల మానసిక స్వచ్ఛతకు దోహదం చేశాడు. ‘‘యోగేన చిత్తస్య’’- యోగంతో మనస్సుకు, బుద్ధికి- ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి పాటుపడిన ఉత్తమ మానవుడు పతంజలి! రాజయోగం, హఠయోగం యోగ సాధనలోని రెండు పద్ధతులు! ‘యోగః కర్మ సుకౌశలమ్’- యోగం అంటే చేస్తున్న పనియందు నైపుణ్యాన్ని సాధించడం అన్నది వ్యవహార వాస్తవం. ఈ జీవన వ్యవహారాన్ని వివరించిన ‘మహాభారతకారుడు’ కలియుగంలో ప్రపంచానికి తొలి సంస్కార ప్రదాత! భారతదేశం కలియుగంలో ప్రపంచ మానవులకు చెప్పిన తొలి సంస్కార పాఠం ఇది! కలియుగంలో యాబయి ఒక్క శతాబ్దులు గడచిపోయాయి. యాబయి రెండవ శతాబ్ది నడుస్తోంది! ప్రస్తుతం కలియుగంలో ఐదువేల నూట ఇరవై ఒకటవ సంవత్సరం నడుస్తోంది. ఈ సుదీర్ఘ చరిత్రలో భారత జాతీయ ‘విశ్వగురుత్వం’ ధ్యాస వెలిగిన రోజులున్నాయి, మలగిన రోజులున్నాయి. ఈ భారతీయ సంస్కారాల ధ్యాస కొడిగట్టినప్పుడల్లా ‘వెలుగు’ను పునఃప్రసరింపచేసే ప్రయత్నాలు జరగడం చరిత్ర. నూట యాబయి ఆరేళ్ల క్రితం జన్మించిన నరేంద్ర నాథుడు వివేకానందస్వామిగా వినుతికెక్కడం ఇలాంటి సంస్కార విస్తరణ చరిత్రలో భాగం. పాశ్చాత్య దేశాలలో ‘రాజయోగాన్ని’ ప్రచారం చేసిన వివేకానందుడు భారతమాతృ విశ్వగురుత్వాన్ని మరోసారి స్ఫురణకు తెచ్చాడు! అంకురించిన ఆ ‘స్ఫురణ’కు ఆధునిక విస్తరణ మన ప్రభుత్వం సాధించగలిగిన ‘‘అంతర్జాతీయ యోగ దినోత్సవం’’! నాలుగేళ్లుగా ఈ ఉత్సవం జరుగుతోంది. నేడు ఐదవ ఉత్సవం జరుగుతోంది..
‘వంచన’ ప్రాతిపదికగా విస్తరించిన ‘వాణిజ్య ప్రపంచీకరణ’- గ్లోబలైజేషన్- ప్రపంచ ప్రజలను భావసమైక్య సూత్రబద్ధం చేయడంలో ఘోరంగా విఫలం కావడం నడుస్తున్న చరిత్ర. ‘పుడమి పల్లె’- గ్లోబల్ విలేజ్- పేరుతో జరిగిన తతంగం ‘సార్వభౌమ దేశాల’ సరిహద్దుల గోడలను కూల్చివేయాలన్నది వాణిజ్య ప్రపంచీకరణ లక్ష్యం.. కానీ ‘పుడమి పల్లె’ ఏర్పడలేదు. ‘పుడమి సంత’ మాత్రమే ఏర్పడింది. ఈ ‘సంత’లో ఐరోపా సమాఖ్య దేశాలు, అమెరికా, చైనా, దక్షిణ కొరియా వంటి సంపన్న దళారీ దేశాలు వస్తువులను విక్రయించి భారీగా లాభాలను మూటలు కట్టుకొని మోసుకొనిపోయాయి, మోసుకొని పోతున్నాయి. మన దేశం వంటి ప్రవర్ధమాన దేశాలు ప్రజా శ్రమజీవన స్వేదాన్ని వెచ్చించి ‘‘సంత’’లో నిరంతరం కొనుగోలు చేస్తున్నాయి. ఫలితంగా దాదాపు వంద దేశాల ‘ఆర్థిక వ్యవస్థ’లు దివాలా తీశాయి. జన జీవనం గుల్లయిపోయి ఈ దేశాలు ‘ఆర్థిక దాస్యం’తో అలమటిస్తున్నాయి. ‘‘అమ్మిన’’ సంపన్న దేశాలు- అమెరికా, చైనా వంటివి- ఇప్పుడు వాణిజ్య ఆధిపత్యం కోసం కీచులాడుకుంటున్నాయి, తోడేళ్లలా పరస్పరం ఢీకొంటున్నాయి. ‘వాణిజ్య ప్రపంచీకరణ’ సంత అమెరికా కూటమికి, చైనా బృందానికీ మధ్య యుద్ధవేదికగా మారింది. ఈ ‘ఆధిపత్యపు’పోరు గత శతాబ్దినాటి ‘ఐరోపా యుద్ధాలకు’- ప్రపంచ యుద్ధాలకు-, అమెరికా రష్యాల మధ్య నడచిన ప్రచ్ఛన్నయుద్ధానికి విస్తరణ! ‘ప్రపంచ విజేత’కావాలన్న దురాక్రమణ లక్ష్యం ఈ చరిత్రకు ప్రాతిపదిక! అలెగ్జాండర్ అనే గ్రీసు దేశపు బీభత్సకారుడు క్రీస్తునకు పూర్వం నాలుగవ శతాబ్ది- కలియుగం ఇరవై ఎనిమిదవ శతాబ్ది-లో ‘విశ్వ విజేత’కావాలని కలలుకనడం ఈ చరిత్రలో ఒక పూర్వ ఉదాహరణ. రవి అస్తమించని రాజకీయ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నట్టు బ్రిటన్ విర్రవీగడం మరో దుష్ట ఉదాహరణ. ఆ గ్రీసు బీభత్సకారుడు విశ్వవిజేత కాలేదు.. ఈ బ్రిటన్ సామ్రాజ్యం నిలవలేదు!
భారతీయులు ఇలాంటి దురాక్రమణకు పూనుకోలేదు, ‘విశ్వవిజేత’ కావాలన్న దురహంకారాన్ని ప్రదర్శించలేదు. అనాదిగా హైందవ జాతీయులు మానవీయ సంస్కారాల ప్రాతిపదికగా ప్రపంచ మానవులను కలపడానికి యత్నించారు. ఈ ‘కలయిక’ యోగం! ఒకరిని మరి ఒకరితో, కుటుంబాన్ని సమాజంతో, సమాజాన్ని జాతీయ సాంస్కృతిక మహాజనంతో, జాతిని ప్రపంచంతో, ప్రపంచాన్ని సమస్త జీవజాలంతో, సమస్త జీవజాలాన్ని ఆద్యంత రహితమైన-తుది, మొదలులేని- విశ్వచైతన్యంతో ‘యోగించడం’-కలపడం- సనాతన హైందవ సంస్కార పరంపరగా మారింది. ఈ సంస్కారాల సామ్రాజ్యం ‘పుడమి’ని పల్లెగా మాత్రమే కాదు, పుడమిని ఒకే ‘ఇల్లు’గా ఒకే కుటుంబంగా సంభావించింది. ఈ భావం కేవలం తాత్కాలిక అనుభూతి కాదు, సృష్టిగతమైన శాశ్వత తత్త్వం! ఈ శాశ్వత తత్త్వం జీవన సత్యంగా మారడం భారతీయులు సాధించిన ‘యోగం’! ఈ ‘యోగం’ మొత్తం విశ్వాన్ని ఒక కుటుంబం, ఒక ఇల్లు- వసుధైవ కుటుంబంగా, వసుధైక కుటుంబంగా- తీర్చిదిద్దింది. ఈ సంస్కార సామ్రాజ్యాన్ని భారతీయులు ఆయుధ ప్రయోగంతో కాని, బలవంతంగా కాని, వంచనతో కాని విస్తరింపచేయలేదు. పువ్వుల తోటలోని పరిమళం అతి సహజంగా దశదిశలకూ విస్తరించినట్టు, భారతీయ సంస్కారాల సామ్రాజ్య సుగంధం ప్రపంచాన్ని ముంచెత్తింది, మానవీయ సంస్కరాలతో కలిపింది. ఇదీ కలయిక.. ఇదీ ‘యోగం’. ఇదే వాస్తవాన్ని నాలుగేళ్లక్రితం మన ప్రధానమంత్రి మోదీ ‘ప్రపంచ ప్రజలను కలపడంలో ‘యోగం’ అతి ప్రధాన భూమికను నిర్వహించింది!’ అని పునరుద్ఘాటించాడు. ఐక్యరాజ్యసమితి ఆమోదించింది. ‘సమితి’లోని నూట తొంబయి నాలుగు సభ్య దేశాలు ‘నిజమే’అని తల ఊపాయి. నూట డెబ్బయి ఏడు దేశాల ప్రతినిధులు యోగ విద్యాప్రాధాన్యాన్ని ప్రస్తుతిస్తూ ప్రకటనలు చేశారు...
ఇదీ భారతీయుల ప్రాధాన్యం. భారత్ ‘విశ్వవిజేత’కావాలని కోరలేదు, ప్రయత్నించలేదు, కాలేదు కూడ! భారత జాతీయ నందనవన సంస్కారపు పరిమళాలు ఎలాంటి ప్రయత్నం లేకుండానే ప్రపంచ ప్రజల జీవన ప్రవృత్తిని సహస్రాబ్దులపాటు ప్రభావితం చేశాయి. ఫలితంగా ‘‘ఈ దేశంలో పుట్టిన సౌశీల్యవంతులవద్ద తాము ఎలా జీవించాలన్న సంస్కారాన్ని ప్రపంచంలోని సర్వమానవులూ నేర్చకున్నారు...’’- ఏతత్ దేశ ప్రసూతస్య సకాశాత్ అగ్రజన్మనః, స్వం స్వం చరిత్రం. శిక్షేరన్ పృథివ్యాం సర్వ మానవాః..-అన్న అంతర్జాతీయ వాస్తవం ప్రచారమైంది. కొందరు భారత్‌కు వచ్చి నేర్చుకొని వెళ్లారు. మరికొందరు ఇలా నేర్చుకుని వెళ్లిన వారివద్ద నేర్చుకున్నారు!! ఇదీ తరతరాల యోగం. పతంజలి మహర్షి వివరించిన ‘‘యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి’’అన్నవి యోగాభ్యాసంలోని ఎనిమిది అంశాలు! ఇవి ఎనిమిది విలక్షణ సంస్కారాలు!