సంపాదకీయం

తీరని దప్పి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉభయ గోదావరి జిల్లాల్లోని నీరు కాలుష్యగ్రస్తమైపోయిందన్నది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా చెప్పిన మాట. కృష్ణానదిలో స్నానం చేసి విజయవాడలో కనకదుర్గమ్మను పూజించడానికి వస్తున్న భక్తులు ప్రకాశం ఆనకట్ట సమీపంలో స్నానయోగ్యం కాని జలాలను, పరిసరాలను దర్శిస్తుండడం ముఖ్యమంత్రి చెప్పని మాట.. అవిరళ-ఎడతెగని-ప్రవాహాలు అడుగంటిపోవడం కృష్ణా గోదావరీ జలాలు మురికిపట్టిపోతుండడానికి ఒక ప్రధాన కారణం. అక్కడక్కడ మాత్రమే ‘అస్తినాస్తివిచికిత్సా హేతువులైన’- ఉన్నాయో లేదో అన్న అనుమానం కలిగిస్తున్న- నీళ్లు అనేక జీవనదులలో కనిపిస్తుండడం దేశమంతటా నెలకొని ఉండడం దశాబ్దుల వైపరీత్యం. ‘ఎప్పుడు ఎగతెగక పారు..’ ఏఱు ప్రతి పల్లెలోను ఊరి సమీపంలోను ఉండాలన్నది సుమతీ శతకకారుడు సంభావించిన భారతదేశం. ఇలాంటి అవిరళ-ఎడతెగని-జల వాహనులు ప్రధాన నదులు మాత్రమే కాదు, దేశమంతటా పొంగులెత్తి ప్రవహించిన లక్షల చిట్టినదులు, కొండవాగులు, నీటి బుగ్గలు, సెలఏఱులు కూడ! అవన్నీ ఇప్పుడు లేవు, ఎప్పుడో ఇంకిపోయాయి. గంగానదికి సైతం ‘అవిరళత్వం’- ఎడతెగని ప్రవాహగతి- లేని దుస్థితి దాపురిస్తోందన్న భయాందోళనలు వ్యాపిస్తున్నాయి. ఇక ఇతర మహానదులకు, లక్షల పిల్లకాలువలకు ఇలాంటి దుర్గతి పట్టడంలో ఆశ్చర్యం ఏముంది? గంగానదిలో గంగోత్రి నుంచి సముద్రం వరకూ గ్రీష్మ ఋతువులో- ఎండకాలంలో కూడ- ప్రతిచోట కనీసం ఇరవైఐదు శాతం నీరు దిగువకు ప్రవహించాలన్నది కేంద్ర ప్రభుత్వం నిర్దేశిస్తున్న విధానం. ఇదే జల విధానాన్ని కృష్ణా గోదావరీ తదితర జీవనదులకు వర్తింపచేసినట్టయితే ఈ నదులకు కూడ ‘అవిరళత్వం’ సిద్ధిస్తుంది. కృష్ణా గోదావరీ నదులలోనైనా ప్రతిచోటా ఇలా జల ప్రవాహం కొనసాగినట్టయితే జలకాలుష్యం కొంత తగ్గుతుంది.- నదీ వేగేన శుద్ధ్యతే’’- నది నీరు ప్రవహించడంవల్ల సహజంగా శుభ్రమవుతుంది-! అందువల్ల ఎండకాలంలో సైతం నదులలో కనీసం ఇరవై శాతం నీరైనా దిగువకు ప్రవహించే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి!
ఇలా తీసుకున్నట్టయితే ‘గలగలా గోదారి కదలిపోతుంటేను.. బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, బంగారు పంటలే పండుతాయి!’ అన్న మహాకవి మాటలకు సార్థకత ఏర్పడుతుంది. నీటి స్వచ్ఛత పెరుగుతుంది. ‘అవిరళత్వం’ అందువల్ల ప్రధానమైన సమస్య. ‘కృష్ణాతరంగ పంక్తిన్ తొక్కి తుళ్లింత ఆంధ్ర నౌకలు నాట్యమాడునాడు..’, ‘గోదావరీ పావనో దారవాః పూరమఖిల భారతము మాదన్ననాడు..’’ అని మహాకవులు దర్శించిననాటి నదులు ‘అవిరళ’ప్రవాహాలు. ఈ జీవజల ధారలు క్రమంగా ఇంకిపోవడానికి కారణం అడవులను నిర్మూలించడం. ‘లావాసా’అన్న బహుళ జాతీయ సంస్థవారు వినోద విహార యాత్రలను అభివృద్ధి చేయడం పేరుతో మహారాష్టల్రోని పూణె నగరం సమీపంలోని పడమటి కనుమలకు కన్నాలు పెట్టేశారు. ఫలితంగా వందలాది కొండవాగులు ఎండిపోయాయట. ఒడిశాలోని నియోంగిరి అడవులలో నీటిధారలను కూడ ఇలా తవ్విన విదేశీయ సంస్థలు నిర్మూలించాయి. ఫలితంగా వేల వనవాసీ కుటుంబాలు ఇతర ప్రాంతాలకు తరలిపోవలసి వచ్చిందట! ‘స్వచ్ఛ భారతం’ ‘స్వచ్ఛ ప్రాంతం’ ‘స్వచ్ఛ నగరం’ ‘స్వచ్ఛ గ్రామం’ వంటివి ఏర్పడాలని నిజంగా భావిస్తున్నవారు కనీసం పదేళ్లపాటు అటవీ భూమిని ఒక అంగుళం కూడ పరిశ్రమలకు కేటాయించరాదు. దేశంలో కనీసం ముప్పయి మూడు శాతం విస్తీర్ణం అటవీ మయమైన తరువాతనే కాలుష్యం పెంచుతున్న పరిశ్రమలకు అటవీ భూమిని కేటాయించాలన్న విధానాన్ని ప్రభుత్వాలు అమలు జరపాలి. అవిరళ ప్రవాహాలకు మాత్రమే కాదు, అవిరళ వర్షాధారాలకు కూడ సతతహరిత అరణ్యాలు దోహదం చేస్తాయన్న ప్రాకృతిక వాస్తవాన్ని ఎఱుగనివారు లేరు. ప్రభుత్వాలు మాత్రం ఎఱగనట్టు నటిస్తుండడం నీటికొరతకు, నీటి కాలుష్యానికి కారణం...
ఏడాదికేడాది సగటు వర్షపాతం తగ్గిపోతుండడానికి సైతం ఇదే కారణం... అటవీ హననం! ఈ సంవత్సరం నైరృతి ఋతుపవనాలు రావడమే ఆలస్యమైంది. మృగశిర కార్తెలో తెలుగు రాష్ట్రాలను పలుకరించవలసిన ‘తొలకరి’ ఆర్ద్రకార్తె అరుదెంచిన తరువాత మాత్రమే తొంగిచూసింది. ఫలితంగా గత ఏడాది కంటె ఈ సంవత్సరం ఇప్పటివరకూ ముప్పయి ఎనిమిది శాతం తక్కువగా వర్షం కురిసిందట! ఇలా మందకొడిగా ఋతుపవనాలు రావడం, మందకొడిగా వర్షం కురుస్తుండడంవల్ల ‘కార్తికం కారు’- ఖరీఫ్- పంటలను విత్తడంలో జాప్యం అవుతోందట! ప్రతి ఏడాది ఇలా వర్షపాతం గురించి, దుర్భిక్షం గురించి, జలాశయాలు నిండకపోవడం గురించి విశే్లషణలు, ఊహాగానాలు జరిగినందువల్ల వర్షపాతం పెరగదు. దీర్ఘకాల చర్యల గురించి పట్టించుకోవాలి. ముప్పయి మూడు శాతం విస్తీర్ణంలో అడవులు పెరగడం మాత్రమే దీర్ఘకాల చర్య. 2029నాటికి ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణంలో సగం అటవీ ప్రాంతం అవుతుందన్న ప్రచారం గతంలో జరిగింది. కానీ వేల లక్షల ఎకరాలలో అటవీ భూమిని ‘ప్రత్యేక ఆర్థిక మండలాలు’గా మార్చి, ఆకుపచ్చదనాన్ని హత్యచేయడానికే ఐదేళ్లపాటు అవశేష ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషిచేసింది. ఫలితంగా రాజధాని అమరావతి ప్రాంతంలో కాలుష్యం కొలువుతీరుతోందట. అవిరళ నీటిప్రవాహాలు లేకపోవడం, పరిశ్రమల వ్యర్థాలు మాత్రం అవిరళంగా నదులలో కలుస్తుండడం కాలుష్యం కొలువుతీరడానికి కారణం. హైదరాబాద్‌లో ఇప్పుడు గాలి కాలుష్యం భయంకరంగా పెరగడానికి కారణం ‘ముచికుంద’ నీరు ‘మూసీ’ మురుగుగా మారడం, జంటనగరాలలోను పరిసరాలలోను ఉన్న చెఱువులు మురికినీటి గుంటలుగా మారడం.. మన దేశంలోని నాలుగు మహానగరాలు తీవ్రమైన మంచినీటి కొరతకు గురై ఉన్నాయన్నది ఇటీవల జరిగిన ఒక అంతర్జాతీయ అధ్యయనంలో వెల్లడైన మహావిషయం. ప్రపంచంలోని నాలుగువందల నగరాలలో మంచినీటి కాలుష్యం, కొరత ఏర్పడి ఉండడం ఈ అధ్యయనంలో తేలిన ప్రధానాంశం. అతి భయంకరమైన మంచినీటి సమస్యను ఎదుర్కొంటున్న ఇరవై నగరాల జాబితాలో మన ఈ నాలుగు నగరాలు కూడ ఉన్నాయట. ఢిల్లీ పదహైదవ స్థానంలోను, ముంబయి పదకొండవ స్థానంలోను కలకత్తా రెండవ స్థానంలోను ఉన్నాయట. ఇలా భయంకర నీటి కొరతకు గురై ఉన్న ఇరవై నగరాలలో మొదటిస్థానం కూడ మనకే దక్కింది. ‘చెన్నయి’ అందు మొదటి స్థానాన్ని దక్కించుకొంది. ఇలా నీటి కొరతకు గురవుతున్న ‘మదరాసు’ మహానగరాన్ని తరచు వరదలు ముంచెత్తుతున్నాయి. ‘‘నలువైపులా నీరు...తాగడానికి చుక్క కూడ లేదు’’ అన్న సముద్ర మధ్యలో చిక్కుకున్నవారు ఆక్రోశించే తీరు... అది మదరాసు విషయంలోనే కాదు మన దేశంలోని అనేక నగరాల పట్టణాల విషయంలో వాస్తవం. వర్షం కురిస్తేచాలు వీధులలో పడవ లెక్కి ప్రయాణించవలసి దుస్థితి అనేకచోట్ల దాపురించి ఉంది. ఇది అతిశయోక్తికాదు. కానీ ఈ బురద నీటిప్రవాహాలు దప్పికను తీర్చవు రోగాలను కలిగిస్తున్నాయి...
మదరాసు-చెన్నయి-నగరానికి ఇరవై లక్షల లీటర్ల మంచినీటిని పంపించడానికి కేరళ ప్రభుత్వం సంసిద్ధతను వ్యక్తం చేయడం ఇరుగుపొరుగు ప్రాంతాల మధ్య స్నేహానికి, ఔదార్యానికి నిదర్శనం కావచ్చు! కానీ ఇలాంటి స్థితి తమిళనాడు రాజధానికి ఎందుకని దాపురించింది? దశాబ్దులుగా మదరాసుకు తరలివెడుతున్న ‘తెలుగు గంగ’కూడ చెన్నయి వాసుల దాహార్తిని తీర్చలేకపోతోంది. నీటి కొరత- కావేరీ నదిలో అవిరళ ప్రవాహం లేకపోవడం- కర్నాటక,తమళనాడు ప్రాంతాల మధ్య దశాబ్దుల వైరుధ్యాలకు కారణం. విద్వేషాగ్నిని కావేరీ జలాలు ఆర్పివేయలేకపోతున్నాయి. తమిళనాడుకు దాదాపు తొమ్మిది శతకోటి ఘనపుటడుగుల నీటిని కర్నాటక జూన్‌లో విడుదల చేయాలట. కానీ కావేరీ నది ఎగువన ఎండిపోయింది. అందువల్ల లేని నీటిని కర్నాటక ఎలా విడుదల చేయగలదు? ఇది ఉదాహరణ మాత్రమే. దేశమంతటా ఇదే స్థితి.... గొంతులెండిపోతున్నాయి!