సంపాదకీయం

కర్నాటక ‘రగడ’..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోడేళ్లకు నక్కలతో
తుది సమరం జరుగువేళ
తదుపరి ఘట్టం కోసం
తహతహలాడుట మేలా?
అధికారం అవధి అయిన
పదవీ స్వామ్య ‘ప్రయోక్త’ల
గెలుపుఓటముల మధ్య
విలువల విచికిత్స ఏల?
రాజ్యాంగ నియమాలను రాజకీయపు అవకాశవాద ‘నికషం’పై నిగ్గుతేల్చడానికి జరుగుతున్న ప్రహసనం కర్నాటక జనజీవనాన్ని స్తంభింప చేసింది. ఈ నికషం-గీటురాయి- జేబులు మారుతోంది, రంగులు మార్చుకొంటోంది. అయినప్పటికీ ‘తొండ’ ముదిరిపోతోంది కానీ ‘ఊసరవెల్లి’ మాత్రం ఇంకా ఊడిపడలేదు. శుక్రవారం సాయంకాలం వరకూ కుతూహలగ్రస్తులు ఊపిరాడని ఉత్కంఠతో ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. నిజానికి ఈ ‘ఉత్కంఠ’ గత ఆరవ తేదీన తొమ్మిది మంది కాంగ్రెస్ శాసనసభ్యులు, ముగ్గురు ‘సర్వమత సమభావ’- సెక్యులర్- జనతాదళ్ విధాయకులు తమ పదవులకు రాజీనామా చేసినప్పటినుంచి అంకురించింది, మహావృక్ష సమూహంగా మారి మహాప్రభంజనాన్ని సృష్టిస్తోంది! కుతూహలగ్రస్తులకు ఈ పదహైదు రోజులుగా ఉత్కంఠ ఉపశమించక పోవడానికి కారణం ‘కర్నాటకలో అధికారం పోతుందని బెంబేలెత్తుతున్నవారు’, ‘‘అధికారం అందుకోవడానికి ఆత్రపడుతున్నవారు’ ఎత్తులకు పై ఎత్తులతో రాజకీయ చదరంగాన్ని రక్తికట్టిస్తుండడం. పదిహేను రోజులకు పైగా కర్నాటకలో పరిపాలన స్తంభించిపోయిందన్నది ప్రచారానికి నోచుకోని విషయం. రాజకీయ రక్తితో పరిపాలన విధుల పట్ల విరక్తిని పెంచుకున్న ప్రభుత్వ యంత్రాంగం వారు ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి నాయకత్వంలోని ప్రభుత్వం కూలిపోతుందా? లేక నిలదొక్కుకుంటుందా? అన్న మీమాంసా తత్పరులై ఉన్నారట. అందువల్ల పరిపాలన ధ్యాస అడుగంటిపోయింది. కుమారస్వామి పట్ల స్వీయపక్షమైన ‘సర్వమత సమభావ జనతాదళ్’లోనే అసంతృప్తి రాజుకొని ఉంది. కాంగ్రెస్‌తో కుమారస్వామి జట్టుకట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసినప్పటి నుంచి కాంగ్రెస్‌లోని ప్రముఖ నాయకులకు సైతం కుమారస్వామి పట్ల కనె్నర్రగానే ఉంది. అంతర్గత వైరుధ్యాల కారణంగా కాంగ్రెస్-జనతాదళ్ కూటమి ప్రభుత్వం అర్ధాంతరంగా కూలిపోక తప్పదు. అలా సహజంగా ‘కూటమి’ ప్రభుత్వం కుప్పకూలేవరకు వేచి ఉండినట్టయితే భారతీయ జనతాపార్టీ కీర్తిప్రతిష్టలు పెరిగి ఉండేవి! కానీ మళ్లీ ముఖ్యమంత్రి కావడం జీవన చరమలక్ష్యమైన ‘్భజపా’నాయకుడు యెడియూరప్పకు ‘పదవీ విరహం’తో నిద్రపట్టడం లేదు. అందువల్ల ఆయన రంగమెక్కి అకాండ తాండవం చేశాడు, చేస్తున్నాడు. రాజ్యాంగబద్ధంగా ఏర్పడి ఉన్న ప్రభుత్వాలను కూల్చివేయడానికి కుట్ర చేస్తోందన్న అపకీర్తిని ‘్భజపా’కు సంపాదించిపెట్టాడు.. యెడియూరప్ప వంటి అవకాశవాది, పదవీ నిబద్ధ అనైతిక వర్తనుడు ‘్భజపా’లో ఉండడం ఈ విలక్షణ సంస్థకు, విలువలకు ప్రాధాన్యం ఇస్తున్న ఈ జాతీయ రాజకీయ పక్షానికి వౌలికమైన అపకీర్తి! యెడియూరప్ప ముఖ్యమంత్రి పదవిలో కొనసాగడం కోసం గతంలో స్వీయపక్ష అధిష్ఠానంపై తిరుగుబాటు చేసినవాడు. ముఖ్యమంత్రి పదవిని కోల్పోయిన తరువాత, తన మాట చెల్లనందుకు కర్నాటకలో ‘్భజపా’ను చీల్చినవాడు, కొత్త ‘పార్టీ’పెట్టినవాడు, మళ్లీ ‘్భజపా’లోకి- నందనవనంలోకి వన వరాహం వలె- చొరబడినవాడు..
సర్వోన్నత న్యాయస్థానం వారి అధికార పరిధి గురించి, ‘రాజ్యపాల్’- గవర్నర్-కున్న విచక్షణ అధికారం గురించి కర్నాటకలోని రాజకీయవేత్తలు తమ ఇష్టం వచ్చిన రీతిలో వ్యాఖ్యానాలు చేస్తుండడం గందరగోళాన్ని మరింతగా పెంచిన విపరిణామం! సర్వోన్నత న్యాయస్థానం ఈ అధికార పరిధి గురించి చేసిన స్పష్టీకరణ కర్నాటకకు మాత్రమేకాక అన్ని రాష్ట్రాలకూ వర్తిస్తోంది. శాసనసభ అధ్యక్షుడికి ఆదేశాలను జారీచేసే అధికారం సర్వోన్నత న్యాయస్థానానికి ఉందని పదహారవ తేదీన స్పష్టమైంది. తమకు అనుకూలంగా సర్వోన్నత న్యాయాదేశాలు వెలువడితే రాజకీయ పక్షాలవారు ‘అధికారం ఉందని’ అంటున్నారు. సర్వోన్నత న్యాయాదేశాలు తమకు వ్యతిరేకమైతే ‘సుప్రీం కోర్టుకు అధికారం లేదని’ చెప్పడం ఈ రాజకీయ పక్షాలకు పరిపాటి అయింది. రాజకీయ పక్షాల-ప్రస్తుత కర్నాటక ‘కాండ’విషయంలో కాంగ్రెస్-జనతాదళ్ కూటమివారి ఈ ద్వంద్వ వైఖరిని సర్వోన్నత న్యాయస్థానం తప్పుపట్టింది. గుర్తుపెట్టుకొంది. ఈ న్యాయస్థానం అధికార పరిధి విస్తృతి గురించి ఎలాంటి నిబంధన లేదు. తమ సౌలభ్య పరిమితులకు అనుగుణంగా ఈ న్యాయస్థాన పరిధులను నిర్ణయించే యత్నాలు రాజ్యాంగానికి పూర్తిగా విరుద్ధం అన్నది సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గగోయి పదహారవ తేదీన చెప్పిన మాట. రాజ్యాంగంలోని 142వ అధికరణం ప్రకారం సర్వోన్నత న్యాయస్థానానికి అపరిమిత అధికారాలు ఉన్నాయి. ఈ సంగతిని కూడ సర్వోన్నత న్యాయస్థానం ఇదివరకే పలుమార్లు స్పష్టం చేసింది. రాజ్యాంగపరమైన సందేహాలను నివృత్తిచేసి స్పష్టీకరణ ఇవ్వవలసిన బాధ్యత కూడ 143వ అధికరణం ప్రకారం సర్వోన్నత న్యాయస్థానానిది..!
ఇలా రాజ్యాంగ నియమ నిబంధనల స్పష్టీకరణకు కర్నాటక ‘రచ్చ’ దోహ దం చేసింది. ఇదీ ప్రధానం. ముఖ్యమంత్రి పదవిలో కుమారస్వామి కొనసాగుతాడా? లేక యెడుయూరప్ప జీవనవాంఛ నెరవేరుతుందా? అన్నది దేశ ప్రజలకు,ప్రత్యేకించి కర్నాటక ప్రజలకు ప్రధానం కాదు. ఈ ఇద్దరూ ‘దొన్నూదొనే్న’. గతంలో కుమారస్వామి యెడుయూరప్పతో జట్టుకట్టాడు. 2005 వరకూ కాంగ్రెస్‌తో జట్టుకట్టిన కుమారస్వామి పార్టీ 2006 జనవరిలో కాంగ్రెస్‌తో తెగతెంపులు చేసుకుంది. కాంగ్రెస్ నాయకుడు ధర్మసింగ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. 2004నుంచి కొనసాగిన ధర్మసింగ్ ప్రభుత్వంలో సిద్ధరామయ్య ఉప ముఖ్యమంత్రి. ఇతగాడు అప్పుడు ‘సర్వమత సమభావ జనతాదళ’లోనే ఉండేవాడు. కేవలం తాను ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా కుమారస్వామి ధర్మసింగ్ ప్రభుత్వాన్ని పడగొట్టడం చరిత్ర. 2006 జనవరిలో కుమారస్వామి ముఖ్యమంత్రిగా యెడుయూరప్ప ఉప ముఖ్యమంత్రిగా జనతాదళ్- భాజపా కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ‘్భజపా’వ్రతం చెడింది. ఇరవై నెలలు కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉండాలని, తరువాత ఇరవై నెలలు యెడుయూరప్ప ముఖ్యమంత్రి కావాలని ఒప్పందం కుదిరింది. ఇరవై నెలలపాటు ముఖ్యమంత్రిగా ఉండిన కుమారస్వామి మాట తప్పాడు. ఫలితంగా 2007లో యెడుయూరప్ప ముఖ్యమంత్రి పదవి మూన్నాళ్లముచ్చటగా ముగిసింది. కానీ ఇలా వంచనకు గురైందన్న సానుభూతి కారణంగా, 2008నాటి శాసనసభ ఎన్నికలలో ‘్భజపా’ విజయం సాధించింది. యెడుయూరప్ప ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ ఐదేళ్లలోగా ఆయన తాను భ్రష్టుపట్టి పార్టీని భ్రష్టుపట్టించడం చరిత్ర. 2013నాటి ఎన్నికలలో ‘్భజపా’ఓడింది. యెడుయూరప్ప ప్రాంతీయ పార్టీ ఓడింది. మళ్లీ ‘్భజపా’లో చేరిన యెడుయూరప్పను కర్నాటక ప్రజలు మన్నించలేదు. 2018నాటి ఎన్నికలలో కర్నాటక శాసనసభలో ‘్భజపా’కు స్పష్టమైన సంఖ్యాధిక్యం లభించలేదు. 224 స్థానాలున్న శాసనసభలో 105 స్థానాల దక్కాయి. ఇలా ‘విజయం’ చేజారడానికి కారణం ‘్భజపా’ పాలిట యెడుయూరప్ప గుదిబండగా మారడం.. ఈ ‘గుదిబండప్ప’ను కాక సదానంద గౌడనో అనంతకుమార్‌నో మరొకరినో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారం చేసి ఉంటే 2018నాటి శాసనసభ ఎన్నికలలో ‘్భజపా’ ఘన విజయం సాధించి ఉండేది. ‘సర్వమత సమభావ జనతాదళ్’ నుంచి ఫిరాయించి కాంగ్రెస్‌లో చేరిన సిద్ధరామయ్య 2013లో ముఖ్యమంత్రి కావడానికి కారణం కూడ యెడుయూరప్ప నిర్వాకమే!
కర్నాటకలో ఎవరు ముఖ్యమంత్రి అయ్యారన్నది, అవుతారన్నది ప్రధానం కాదు. కుమారస్వామి అవకాశవాది, యెడుయూరప్ప అవకాశవాది. ‘్భజపా’ అధిష్ఠానం ఇప్పటికైనా గ్రహించి, యెడుయూరప్పను తొలగించి పార్టీ శాసనసభా నాయకుడిగా మరొకరిని నియమించాలి! శుక్రవారం రాత్రివరకూ కొనసాగిన కర్నాటక అరాజకీయ ప్రహసనం ఎప్పుడో అప్పుడు ముగుస్తుంది. కానీ ఆలోగా భాజపావారు ఈ గుదిబండప్ప నాయకత్వాన్ని తొలగించుకుంటే ప్రజాస్వామ్యం సంతోషిస్తుంది...